రైతు ఉసురు తీసిందెవరు?

21 Feb, 2019 00:10 IST|Sakshi

చేనుకు చీడ పడితే రైతు కలత పడతాడు. నెత్తురును చెమటచుక్కలుగా మార్చి సాదుకుంటున్న పంట పొలాన్ని రక్షించుకోవడానికి తాపత్రయపడతాడు. ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లా కొత్త పాలెం గ్రామంలో తన పొలం మీదికి పోలీసులొచ్చారని విన్నప్పుడు రైతు కోటేశ్వరరావు అంతే కంగారుపడ్డాడు. ఆదరాబాదరాగా అక్కడికెళ్లిన ఆ రైతు కాసేపటికే తన కుమారుడికి ఫోన్‌ చేసి ‘పోలీసులు కొడుతున్నార’ంటూ ఆర్తనాదాలు చేశాడు. అటు తర్వాత కొద్దిసేపటికే విగతజీవుడిగా మారాడు. ల్యాండ్‌ పూలింగ్‌తో మొదలుపెట్టి గత నాలుగేళ్లుగా ఆంధ్రప్రదేశ్‌లో రైతులు ఎదుర్కొం టున్న వేధింపుల పరంపరలో ఈ ఉదంతం అత్యంత క్రూరమైనది. ముక్కారు పంటలతో, పచ్చని పరిసరాలతో మెరిసే ప్రాంతాన్ని రాజధాని అమరావతి పేరు చెప్పి కాంక్రీటు కీకారణ్యంగా మార్చ డానికి అంకురార్పణ చేసింది మొదలు ఆ రాష్ట్రంలో రైతు కంట కన్నీరు తప్పడం లేదు. ఇంతకూ రైతు కోటేశ్వరరావు చేసిన నేరమేమిటి? సోమవారం కొండవీడు కోటలో ముఖ్యమంత్రి చంద్ర బాబు నాయుడు పాల్గొన్న బహిరంగసభకు వాహనాల పార్కింగ్‌ కోసం పొలంలో కొంత భాగాన్ని దౌర్జన్యంగా తీసుకున్న పోలీసులు అందులోని బొప్పాయి తోటను నాశనం చేశారు. దీన్ని ప్రత్య క్షంగా చూసి తట్టుకోలేక ‘ఇదేం అన్యాయమ’ని నిలదీయడమే ఆ రైతు చేసిన నేరం. 

దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి రాజకీయ జీవితంలో అతి ముఖ్య ఘట్టమైన ప్రజాప్రస్థానాన్ని ఇతివృత్తంగా తీసుకుని నిర్మించిన ‘యాత్ర’ చిత్రంలో ఒక దృశ్యం అందరినీ కదిలించింది. పంటకు గిట్టుబాటు ధర లభించక నిరాశ చెందిన ఒక రైతు తన కంఠానికి ఉరి బిగించుకున్నప్పుడు అక్కడున్నవారంతా అతడిని ఆదరా బాదరాగా ఆసుపత్రికి చేరుస్తారు. అతడి ప్రాణాలు నిలబడినా మాట పడిపోతుంది. ఏదో చెప్పాలని తాపత్రయపడి చెప్పలేకపోతున్న ఆ రైతుకు వైఎస్‌ పాత్రధారి ఆత్మవిశ్వాసాన్ని కల్పిస్తూ ‘నేను విన్నాను... నేను ఉన్నాను’ అని భరో సాగా మాట్లాడతాడు. కానీ చంద్రబాబు రాజ్యంలో రైతు కోటేశ్వరరావుకు ఆ అదృష్టం లేక పోయింది. నిక్షేపంలా ఎంతో ఆరోగ్యంతో ఉన్న కోటేశ్వరరావు పోలీసుల చేతుల్లో దెబ్బలు తినడమే కాదు... అయినవారు వచ్చేసరికి కొన ఊపిరితో మిగిలాడు. ఆయన్ను వాహనంలో ఆసుపత్రికి తర లించడానికి చేసిన ప్రయత్నాన్ని కూడా పోలీసులు వమ్ము చేశారు. సకాలంలో వైద్యం అందివుంటే ఆయన జీవితం నిలబడేదేమో! కానీ అందుకు ప్రభుత్వమే అవరోధంగా నిలబడింది. తండ్రికి వైద్యం చేయించేందుకు తీసుకెళ్తామని ప్రాధేయపడిన అతడి కుమారుడితో ‘సీఎం వచ్చే సమ యమైంది కనుక ఇప్పుడు కుదరద’ని పోలీసులు నిర్దాక్షిణ్యంగా చెప్పారు. అంతా అయ్యాక కోటేశ్వ రరావు ఆత్మహత్య చేసుకున్నాడని బహిరంగసభ వేదికపై నుంచి చంద్రబాబు ప్రకటించడమే కాదు... అందుకు పోలీసుల వైఖరో, కుటుంబసమస్యలో కారణం కావొచ్చునని కూడా చెప్పారు. పనిలో పనిగా– సమస్యలుంటే పరిష్కరించుకోవాలి తప్ప ప్రాణాలు తీసుకోవద్దని హితవు కూడా పలికారు! ఆయన ఎంతో ఉదారంగా రూ. 5 లక్షలు పరిహారం ప్రకటించడానికి చాలాముందే అధి కారులు రూ. 3 లక్షలిస్తామని కుటుంబంతో బేరసారాలకు దిగారు. 

ఈ సందర్భంగా పోలీసులు చేస్తున్న తర్కం వింతగా ఉంది. ఆయన పురుగుల మందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నిస్తే భుజంపై మోసుకెళ్లి రక్షించేందుకు ప్రయత్నించామని, ఇందుకు తమపైనే అభాండాలు వేస్తున్నారని వారు వాపోతున్నారు. వారికి ఉద్యోగం చేయాలంటేనే భయంగా ఉందట! పోలీసుల నైతిక సై్థర్యం దెబ్బతింటే సమాజమే కుప్పకూలుతుందని కూడా వారు సెల విస్తున్నారు. కానీ ఏది చెప్పినా అతికినట్టుండాలి. 14 ఎకరాల పొలాన్ని కౌలుకు తీసుకుని అందులో బొప్పాయి, మునగ, కనకాంబరం తోటల్ని సాగుచేస్తూ అప్పులే లేని కోటేశ్వరరావుకు ఉన్నట్టుండి జీవితంపై ఎందుకు విరక్తి కలిగింది? తన పొలం పాడుచేస్తున్నారన్న కబురందుకుని వెళ్లినవాడు పోలీసులు కొడుతున్నారంటూ ఎందుకు ఫోన్‌ చేయాల్సివచ్చింది? పురుగుమందు తాగినవారి నోటివెంబడి నురుగలొస్తాయి. కానీ కోటేశ్వరరావు భౌతికకాయంపై నోటివద్ద పురుగుమందు పోసి నట్టుగా ఎందుకుంది? కోటేశ్వరరావు ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడని ఆయనతోపాటున్న జీత గాడు పున్నారావు వెంటనే కుటుంబసభ్యులకు ఫోన్‌లో సమాచారం ఎందుకీయలేకపోయాడు? అతడిని పోలీసులు తమ వాహనంలో ఎందుకు బంధించాల్సివచ్చింది? అసలు చావుబతుకుల్లో ఉన్న కోటేశ్వరరావును ఆసుపత్రి వరకూ తరలించకుండా మధ్యలోనే ఒక చెక్‌పోస్టు దగ్గర పోలీ సులు ఎందుకు విడిచిపెట్టారు? పక్కనే ఉన్న హెలిపాడ్‌ సమీపంలో అంబులెన్స్‌లు, వైద్య సిబ్బంది ఉండగా... దూరంగా ఉన్న ఆసుపత్రికి తీసుకెళ్లాలని పోలీసులు ఎందుకునుకున్నారు? ఇంతకూ బాధితుడి సెల్‌ఫోన్‌ ఏమైంది? ఇవన్నీ జవాబు లేని ప్రశ్నలు. అడిగితే ‘మా ఆత్మసై్థర్యం దెబ్బతిం టుందిసుమా’ అని పోలీసులు హెచ్చరిస్తున్నారు. 

గుంటూరు, కృష్ణా జిల్లాల రైతులకు కొత్త కావొచ్చుగానీ...ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు  నాయుడి తొమ్మిదేళ్ల పాలనలో తెలంగాణ ప్రాంత పల్లెలు అనునిత్యం ఇలాంటి దౌర్జన్యాలనే చవిచూశాయి. పీపుల్స్‌వార్‌ పార్టీని అణిచివేసే పేరిట పోలీసులు, వారి మద్దతుతో నయీముద్దీన్‌ వంటి ప్రైవేటు గూండాలు ఆరోజుల్లో సాగించిన అరాచకం అంతా ఇంతా కాదు. గత నాలుగేళ్లుగా ఏపీలో ఈ పోకడలే కనిపిస్తున్నాయి. అందుకే ‘గుర్తు తెలియని వ్యక్తులు’ అరటి తోటలకు నిప్పు పెట్టడం మొదలుకొని అన్ని రకాల వింతలూ అక్కడ చోటుచేసుకుంటున్నాయి. ఇప్పుడు రైతు ఉసురు తీసిన ఉదంతంలో సిట్టింగ్‌ హైకోర్టు న్యాయమూర్తితో విచారణ చేయిస్తే తప్ప వాస్తవాలు బయటికి రావు. అది నిష్పాక్షికంగా సాగాలంటే ఆరోపణలొచ్చినవారందరినీ సస్పెన్షన్‌లో ఉంచాలి. రైతు మరణంపై మర్కట తర్కం చేస్తున్న ప్రభుత్వం తన నిజాయితీని నిరూపించుకోవడానికి ఇంతకుమించిన దోవ లేదు.

Read latest Editorial News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు