డర్టీ ఛాట్‌

7 May, 2020 00:03 IST|Sakshi

ఎప్పటినుంచో అనుకుంటున్నదే. పిల్లల పెంపకంలో తల్లిదండ్రులు, వారిని ఉన్నత పౌరులుగా తీర్చి దిద్దే బాధ్యతలో మన విద్యా వ్యవస్థ వైఫల్యం పొందుతున్న తీరు బహిరంగ రహస్యమే. ఇప్పుడు దేశ రాజధాని నగరంలోని బడా పాఠశాలల్లో చదువుకుంటున్న మగపిల్లలు ఒక సామాజిక మాధ్యమంలో గ్రూపు ఏర్పాటు చేసుకుని వికృతమైన పోకడలకు పోతున్నారని వెల్లడైన ఉదంతం ఈ వైఫల్యాలనే మరోసారి ఎత్తిచూపింది. ఈ గ్రూపు గురించి దేశమంతా చర్చించుకుంటుండగా బాలికలమధ్య కూడా ఇదే మాదిరి గ్రూపు ట్విటర్‌లో నడుస్తోందన్న వార్త అందరినీ ఆశ్చర్యపరిచింది. ఒక బాలుడు లేదా బాలిక సంపూర్ణమైన, బాధ్యతాయుతమైన పౌరులుగా రూపుదిద్దుకోవాలంటే అటు తల్లిదం డ్రుల ప్రమేయం, ఇటు విద్యా వ్యవస్థ ప్రమేయం తప్పనిసరి. ఆ రెండూ సాధ్యం కానప్పుడు పర్య వసానాలు ఇలాగే వుంటాయి. సామాజిక మాధ్యమం ‘ఇన్‌స్టాగ్రామ్‌’లో కొందరు మగపిల్లలు ‘బాయ్స్‌ లాకర్‌ రూం’ పేరిట గ్రూపు కట్టి, అందులో తమ సహ విద్యార్థినులను కించపరుస్తూ వ్యాఖ్యలు చేయడం, వారి ఫొటోలను అసభ్యకరంగా మార్ఫింగ్‌ చేయడం వంటివి యధేచ్ఛగా సాగించడమే కాదు... కొందరు బాలికల పేర్లు చెప్పి, వారిపై సామూహిక అత్యాచారం చేద్దామంటూ మాట్లాడుకోవడం దిగ్భ్రాంతి కలిగిస్తుంది.

ఇలా మాట్లాడుకుంటున్నవారిలో చాలామంది మైనర్లు. ఆ పనులు చేస్తే తాము నేరస్తులుగా మారతామన్న కనీస అవగాహన కూడా లేనివారు. ఇందులో 50మంది విద్యార్థులున్నారని, వారిలో 26మందిని గుర్తించామని పోలీసులు చెబుతున్నారు. ఒకరిద్దరిని అరెస్టు చేసి జువెనైల్‌ హోంకు తరలించారు కూడా. ఇదంతా చూసి గ్రూపులోని ఒక బాలుడు ఆందోళనలో పడి ఆత్మహత్య చేసుకున్నాడు. పద్నాలుగేళ్లు కూడా లేని ఒక బాలుడిని యాదృచ్ఛికంగా ఈ గ్రూపులో చేర్చడం, అతను తన సహ విద్యార్థిని మార్ఫింగ్‌ ఫొటోను గమనించి కలవరపడి ఆమెకు స్క్రీన్‌ షాట్‌లు పంపడం, ఆమెనుంచి మరికొందరు బాలికలకు అవి చేరడంతో ఈ వ్యవహారం వెలుగు చూసింది. ఇదంతా చూసి కొందరు ఆడపిల్లలు హడలెత్తి అసలు స్కూల్‌కే వెళ్లబోమనడం, ఒకరిద్దరు తల్లిదండ్రులు పిల్లల్ని స్కూల్‌ మాన్పించాలని చూడటం గమనిస్తే పరిస్థితి ఎంతగా దిగజారిందో అర్థమవుతుంది.  

సమాచార సాంకేతికత రోజురోజుకీ వృద్ధి చెందుతోంది. ఒకప్పుడు కంప్యూటర్‌ లేదా ల్యాప్‌టాప్‌ వుంటే మాత్రమే చూడగలిగేవి అరచేతుల్లో ఇమిడే స్మార్ట్‌ఫోన్‌లలో లభ్యమవుతున్నాయి. ఆ ఫోన్‌ ద్వారా తమ పిల్లలు ఎటువెళ్లారో, ఎక్కడున్నారో స్పష్టంగా తెలుసుకోగలిగే సాంకేతికత అందుబాటులోకొచ్చింది. కానీ ఆ ఫోన్‌లో వాళ్లేం చూస్తున్నారో, ఎలాంటి విష సంస్కృతిని ఒంట బట్టించుకుంటున్నారో, ఏ రకమైన వీడియో గేమ్‌లు ఆడుతున్నారో మాత్రం తల్లిదండ్రులకు తెలియదు. టీచర్లకు తెలియదు. కార్పొరేట్‌ స్కూళ్లు పుట్టుకొచ్చాక విద్యార్థులు వినియోగదారులయ్యారు. ఉపాధ్యాయులు సర్వీస్‌ ప్రొవైడర్లయ్యారు. కార్పొరేట్‌ స్కూళ్లు అడిగినట్టుగా లక్షలకు లక్షలు చెల్లి స్తున్నాం గనుక, అంతా వారిదే బాధ్యతన్నట్టు తల్లిదండ్రులు ప్రవర్తిస్తున్నారు. ఆఖరికి ఈ లాక్‌డౌన్‌ సమయంలో కూడా పిల్లలపై తల్లిదండ్రుల పర్యవేక్షణ లేకుండాపోయిందని, వారు ఏ ప్రభావాల్లో పడుతున్నారో తెలియకుండాపోయిందని తాజా ఉదంతం వెల్లడిస్తోంది.

లాక్‌డౌన్‌తో బయటికెళ్లే అవకాశం లేకపోవడంతోనే ఇలాంటి వికృతపోకడలు పుట్టుకొచ్చాయని కొందరంటున్నది నిజం కాదు. నిరుడే ఈ మాదిరి కేసులు బయటికొచ్చాయని, ‘బాయ్స్‌ లాకర్‌ రూం’ వంటి గ్రూపులు అసంఖ్యా కంగా వున్నాయని డిజిటల్‌ మీడియా నిపుణులు చెబుతున్న మాట. ఎక్కడో ఏదో జరిగిందని మీడియా ద్వారా తెలుసుకుని, సమాజం ధ్వంసమవుతున్నదని ఆవేదనపడే తల్లిదండ్రులు తమ ఇంట్లోనే ఒక నేరస్తుడు మొగ్గ తొడుగుతున్నాడని, తమ పెంపకంలో వున్న బాలిక క్రమేపీ ఒక ఊబిలో కూరుకుపోతున్నదని గుర్తించకపోవడం ప్రమాదకరమైన స్థితి. తల్లిదండ్రులకూ, సంతానానికీ... టీచ ర్‌కూ, విద్యార్థికీ మధ్య వుండాల్సిన మానవీయ సంబంధాలు పూర్తిగా తెగిపోయిన జాడలు ఈ తాజా ఉదంతంలో బయటపడుతున్నాయి. నిత్యం తమతో సంభాషించే పిల్లల్లో తమకు తెలియని మరొక రున్నారని... ఆ మరొకరు క్షణక్షణానికీ పెరిగి పెనుభూతమై, స్వీయవిధ్వంసం దిశగా అడుగులేస్తు న్నారని, సమాజానికి ముప్పుగా మారబోతున్నారని తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు గుర్తించవలసిన తరుణం ఆసన్నమైంది.

ఇంట్లోనూ, పాఠశాలలోనూ మాత్రమే కాదు...వెలుపలి సమాజంలో కూడా సర్వ అవలక్షణాలూ రాజ్యమేలుతున్నాయి. ఢిల్లీలోని షహీన్‌బాగ్‌లో జరిగిన నిరసనల్లో పాల్గొన్న ఒక యువతిని మూడు నెలల గర్భిణి అని కూడా చూడకుండా రాజద్రోహ నేరంకింద అరెస్టు చేశారని ఆమె సహచరులు ట్వీట్‌ చేస్తే, ఆ యువతిని కించపరుస్తూ కొందరు పెట్టిన ట్వీట్లు మనం ఎలాంటి సమాజంలో బతుకు తున్నామన్న కలవరం కలిగిస్తాయి. నోటితో ఉచ్చరించడానికి కూడా వీల్లేని భాషలో వ్యాఖ్యలు చేసి, మార్ఫింగ్‌ ఫొటోలు పెట్టిన తీరు సరే... 48 గంటలు గడుస్తున్నా ఇలాంటి ఉన్మాదులను ప్రశ్నించేవారు లేకపోవడం దిగ్భ్రాంతిగొలుపుతుంది. పరిస్థితి ఇలావున్నప్పుడు తమ సహ విద్యార్థి నుల గురించి తాము ఏమైనా అనొచ్చని, వారిపై ఎలాంటి నేరాలకు పాల్పడినా ఏం జరగదని ఢిల్లీ విద్యార్థులు అనుకోవడంలో వింతేముంది?  తమ పిల్లలు పెద్ద పెద్ద కార్పొరేట్‌ స్కూళ్లల్లో చేరి, పుస్త కాలు బట్టీపట్టి ఎదిగిపోవాలని కలలుగంటూ, నిరంతరం వేరే లోకంలో జీవిస్తున్న తల్లిదండ్రులు, తాము బ్రహ్మాండమైన శిక్షణ ఇస్తున్నామని మురిసిపోయే విద్యా సంస్థలు, టీచర్లు ఆత్మ పరిశీలన చేసుకోవాలి. పుస్తకజ్ఞానం ఒకటే కాక, చుట్టూవున్న సమాజం ఎలావుందో, అందులో ఎలాంటి ప్రమాదాలు పొంచివున్నాయో పిల్లలకు అర్థం చేయించాలి. అందుకు అనుగుణమైన పాఠ్యాంశాల రూపకల్పనకు ప్రభుత్వాలు కృషి చేయాలి.  

>
మరిన్ని వార్తలు