గల్ఫ్‌ కార్మికులకు తీపి కబురు

29 Apr, 2020 00:04 IST|Sakshi

కరోనా వైరస్‌ మహమ్మారి సకల జీవితాలనూ మార్చేసింది. అది కాటేయడం మొదలెట్టినప్పటి నుంచీ సమాజంలోని అన్ని వర్గాలూ ఏదో మేరకు ఇబ్బందులు ఎదుర్కొంటూనే వున్నాయి. పొట్ట గడవడానికి గ్రామసీమల నుంచి నగరాలకూ, పట్టణాలకూ వెళ్లిన లక్షలాదిమంది వలస జీవులు ఈ కరోనా దెబ్బతో ఉపాధి కోల్పోయి, గూడు సైతం కరువై, పూట గడవడం అసాధ్యమై స్వస్థలాలకు వెళ్తుండటం ఇప్పటికీ నిత్యం కనబడే దృశ్యం. స్వదేశంలోని వలస జీవుల స్థితే ఇంత అధ్వాన్నంగా వుంటే గల్ఫ్‌ దేశాలకెళ్లినవారి వెతలేమిటో చెప్పనవసరమే లేదు.

తమ ఉపాధి పోయిందని, యజమానులు తమను వీధుల్లోకి నెట్టారని, అర్ధాకలితో బతుకీడుస్తున్నామని కనీసం నెలరోజులనుంచి వలస జీవులు ఆక్రోశిస్తున్నారు. అక్కడ దాదాపు కోటిమంది భారతీయులున్నారని అంచనా. ఇప్పుడున్న పరిస్థితుల్లో వీరిలో 2 లక్షలమందిని తరలించవలసి రావొచ్చునని మూడు రోజులక్రితం కేంద్ర ప్రభుత్వం అంచనా వేసింది. వెనక్కి తిరిగి రాదల్చుకున్న కార్మికులెందరో డేటా రూపొందించాలని అక్కడి మన దౌత్య కార్యాలయాలను మంగళవారం కోరింది. గల్ఫ్‌ యుద్ధ సమయంలో ఆ దేశాల నుంచి విమానాల ద్వారా, నౌకలద్వారా లక్షలాదిమంది భారతీయుల్ని తరలించిన అనుభవం మన దేశానికుంది. కనుక ఈ విషయంలో పెద్దగా సమస్యలుండకపోవచ్చు. 

భారతీయ వలస కార్మికుల స్వేదం చమురు దేశాల ఆర్థిక వ్యవస్థలకు ఇంధనంగా ఉపయోగ పడుతోంది. వారివల్ల లాభపడుతున్నది ఆ దేశాలు మాత్రమే కాదు... వారు తమ కుటుంబాలకు ఏటా పంపే వందల కోట్ల డాలర్లు మన ఆర్థిక వ్యవస్థకు కూడా జవసత్వాలనిస్తున్నాయి. అయితే కరోనా మహమ్మారి విజృంభించడం మొదలెట్టాక గల్ఫ్‌ దేశాలతోపాటు... భారత ప్రభుత్వం కూడా తమను విస్మరిస్తున్నదన్న ఆవేదన అక్కడి వలస కార్మికుల్లో ఏర్పడింది. గల్ఫ్‌ దేశాలకు పయనమయ్యే సగటు భారతీయుల స్థితిగతులేమిటో ఎవరికీ తెలియంది కాదు. అమెరికా, బ్రిటన్, సింగ పూర్‌ తదితర దేశాలకు మధ్యతరగతి, ఎగువమధ్య తరగతి వర్గాలవారు చదువుకోసమో, ఆకర్షణీ యమైన జీతాలతో దొరికే కొలువు కోసమో వెళ్తుంటారు. కానీ గల్ఫ్‌ దేశాలకెళ్లే కార్మికుల్లో అత్యధికులు పూట గడవని స్థితిలోవుండేవారే. చదువు తక్కువగా వుండి, ఉన్నచోట ఉపాధి అవకాశాలు కొరవడి,  ఎటువంటి కష్టాన్నయినా ఓర్చుకోవడానికి సిద్ధపడేవారే గల్ఫ్‌ దేశాలకెళ్లే విమానాల్లో కనబడతారు.

వీరంతా భారీ వడ్డీలకు లక్షల రూపాయలు అప్పో సప్పో చేసి తమ బతుకులు బాగుపడతాయని వెళ్తారు. అక్కడ కూలీలుగా, కార్మికులుగా, డ్రైవర్లుగా, ఇళ్లల్లో పనివారుగా కుదురుకుంటారు. ఆమాత్రం ఉపాధి అయినా ఇక్కడ దొరకని స్థితి వుండటం వల్ల ఇది తప్పడం లేదు. ఆ వచ్చిన డబ్బులో కొంత భాగాన్ని తమ కుటుంబాలకు పంపుతూ, ఇరుకిరుకు గదుల్లో దుర్భరమైన జీవితాలు గడుపుతుంటారు. సహ కార్మికులతో ఆవాసాలను పంచుకుంటారు. ఇలాంటి పరిస్థితుల్లో మహ మ్మారి విరుచుకుపడితే ఇక చెప్పేదేముంటుంది? కరోనా వైరస్‌ దాడి తర్వాత గల్ఫ్‌ దేశాలు హడలెత్తు తున్నాయి. లాక్‌డౌన్‌ కారణంగా అన్నీ మూతబడిన నేపథ్యంలో వలస కార్మికులు వారికి కంట్లో నలు సులవుతున్నారు. వారి బాధ్యతను వదిలించుకోవడానికి దాదాపు అన్ని సంస్థలూ ప్రయత్నిస్తు న్నాయి.

పర్యవసానంగా ఎందరో ఉపాధి కోల్పోయి రోడ్డునపడ్డారు. దాచుకున్న డబ్బులు హరిం చుకుపోతుండగా ఎన్నాళ్లు అర్థాకలితో బతుకీడ్వాలో తెలియక  కుమిలిపోతున్నారు. ఈ నెల మొదటి వారంలో కేరళ ౖహె కోర్టులో గల్ఫ్‌లో చిక్కుకున్న భారతీయులను వెనక్కిరప్పించాలంటూ దాఖలైన పిటిషన్‌ వారి వెతలకు అద్దంపట్టింది. ఆ కార్మికుల కుటుంబసభ్యులు కొందరు తమవారిని చూడ టానికి వెళ్లి చిక్కుకున్నారని, వారిలో చాలామంది వైద్య సాయం అవసరమైనవారేనని పిటిషన్‌ తెల్పింది. సరిగ్గా ఈ సమయంలోనే సుప్రీంకోర్టులో కూడా గల్ఫ్‌ కార్మికుల కష్టాలపై పిటిషన్‌ దాఖలైంది. 

వాస్తవానికి అంతర్జాతీయ కార్మిక సంస్థ(ఐఎల్‌ఓ) మార్గదర్శకాల ప్రకారం వలస కార్మికులకు ఉపాధి కల్పించిన దేశమే వారి బాగోగులకు ప్రధానంగా పూచీపడాలి. వారికి, వారి కుటుంబాలకు తగిన ఆవాసం, వైద్య సదుపాయాలు కల్పించడం దాని బాధ్యతే. ఈ రెండు అంశాల్లోనూ తమ పౌరులను ప్రభుత్వాలు ఎలా చూసుకుంటాయో, వలస కార్మికులను కూడా అలాగే చూసుకోవాలి. కానీ ఇవన్నీ కాగితాలకే పరిమితం. గల్ఫ్‌ దేశాల్లోని చట్టాలన్నీ యజమానులకు అనుకూలంగా, కార్మికులకు ప్రతికూలంగా వుంటాయి. పైగా కరోనా వంటి మహమ్మారి చుట్టుముట్టినప్పుడు వలస కార్మికులను అక్కడి ప్రభుత్వాలు పెను భారంగా భావిస్తాయి. కనుకనే కొన్ని దేశాలు ‘ మీ కార్మికుల్ని మీరు తీసుకెళ్లండ’ంటూ మన ప్రభుత్వాన్ని కోరాయి. తమ వినతిని పెడచెవిన పెడితే తగిన చర్య తప్పదని కొన్ని దేశాలు హెచ్చరించాయి కూడా. 

గల్ఫ్‌ దేశాల్లో ఎలాంటి సంక్షోభాలు తలెత్తినా, అక్కడ ఏ సమస్య ముసురుకున్నా మన దేశంలో తల్లి పేగు కదలాడుతుంది. తమ వాళ్లెలావున్నారోనన్న బెంగ అన్ని కుటుంబాల్లోనూ అలు ముకుంటుంది. కనుక వీరి సమస్యలపై తక్షణం దృష్టిపెట్టాలి. ఈ కార్మికులను వెనక్కి తీసుకురావడానికి కనీసం మరో వారం పట్టే అవకాశం వుంది. ఈలోగా వారికి కనీసం కూడూ, గూడు దొరకడానికి, వైద్య సదుపాయం అందడానికి అవసరమైన ఆర్థిక సాయం అందిస్తే ఆ కుటుంబాల వారికి ఆందోళన తగ్గుతుంది. బ్రిటన్‌లో వున్న భారతీయ విద్యార్థులకు మన ప్రభుత్వం, అక్కడి ప్రభుత్వం కలిసి వివిధ రకాలుగా సాయపడుతున్నాయి. అదే రకమైన సాయం గల్ఫ్‌లో చిక్కుకున్న కార్మికులకు కూడా అందేలా చర్యలు తీసుకోవాలి. ఈ కష్టకాలంలో గల్ఫ్‌ కార్మికుల కన్నీరు తుడిస్తే, ఇన్నాళ్ల వారి శ్రమనూ, వారు దేశ ఆర్థిక వ్యవస్థకు అందించిన తోడ్పాటును గుర్తించినట్టవుతుంది. 

మరిన్ని వార్తలు