వీసాలపై ట్రంప్‌ పిడుగు

25 Apr, 2020 00:37 IST|Sakshi

కరోనా వైరస్‌ మహమ్మారి కట్టడి మాటున సొంత ఎజెండాలను అమలు చేయడానికి దేశదేశాల పాలకులు తహతహలాడుతున్నారు. వలసలన్నిటిపైనా రెండు నెలలపాటు నిషేధం విధిస్తూగురు వారం అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ తీసుకున్న నిర్ణయం ఆ బాపతే. వాస్తవానికి ఆయన అన్ని రకాల వీసాలనూ తాత్కాలికంగా నిలిపేస్తామని నాలుగురోజుల క్రితం ప్రకటించారు. ఆ ప్రతిపాదన అమలైతే గెస్ట్‌ వర్కర్‌ వీసా మొదలుకొని గ్రీన్‌ కార్డుల వరకూ అన్నీ నిలిచిపోయేవి. ఐటీ నిపుణులు మొదలుకొని వ్యవసాయ కార్మికుల వరకూ అందరిపైనా తీవ్ర ప్రభావం చూపేది. కానీ ఆ విష యంలో వ్యాపార సంస్థలన్నీ ఆగ్రహావేశాలు వ్యక్తం చేయడంతో ఆయన వెనక్కి తగ్గారు.

తాజా ఉత్తర్వుల ప్రకారం రెండునెలలపాటు కొత్తగా వీసాలు లేదా గ్రీన్‌ కార్డులు జారీ చేసే ప్రక్రియ నిలిచిపోతుంది. అయితే ప్రస్తుతం అమెరికాలో వున్నవారికి ఈ నిషేధ ఉత్తర్వులు వర్తించవు. విదే శాల్లో వుంటూ వీసా పొడిగింపునకు, గ్రీన్‌ కార్డు కోసం ప్రయత్నిస్తున్నవారికి మాత్రం కొన్నాళ్లపాటు సమస్యే. ఇతర రకాల వలసలపై ఇప్పటికే ట్రంప్‌ ఆంక్షలు విధించారు. మెక్సికో, కెనడాల నుంచి వచ్చే ‘అనవసర వలస’లను పూర్తిగా నిలిపివేశారు. వీసాల జారీ ప్రక్రియ ఆపేయాలని గత నెలలోనే అన్ని దేశాల్లోని కాన్సులేట్లకూ ఆదేశాలు జారీ చేశారు. చైనా, యూరప్‌ల నుంచి ఎవరూ అమెరికాలో ప్రవేశించకుండా నిషేధం విధించారు. 

 వలసలపై ట్రంప్‌కున్న వ్యతిరేకత ఎవరికీ తెలియనిది కాదు. అమెరికాలోని ఉపాధి అవకాశా లన్నిటినీ వలసదారులు తన్నుకుపోతున్నారని, స్థానికులకు ఇందువల్ల తీరని అన్యాయం జరుగు తున్నదని ఆయన మొదటినుంచీ ఆరోపిస్తున్నారు. 2016 అధ్యక్ష ఎన్నికల్లో సైతం ఆయన దీనిపైనే ప్రధానంగా ఆధారపడ్డారు. అది వృధా పోలేదు. శ్వేతజాతి అమెరికన్ల ఓట్లన్నీ ఆయన ఖాతాలోనే పడి ఘన విజయం సాధించారు. అధికారంలోకొచ్చాక వివిధ రకాల వీసాలపై అడపా దడపా ఆంక్షలు విధించడం, నిబంధనలు కఠినం చేయడం, అందరూ గగ్గోలు పెట్టాక కొన్ని సడలింపు లివ్వడం కొనసాగిస్తూవచ్చారు. మళ్లీ ఇప్పుడు అధ్యక్ష ఎన్నికలు ముంగిట్లో వున్నాయి. కనుక ఆ ఎజెండాను మరోసారి ఆయన బయటకు తీశారు. కరోనా మహమ్మారి కాటుతో అమెరికా ఆర్థిక వ్యవస్థ కకావికలైంది.

కనీవినీ ఎరుగని రీతిలో 2 కోట్ల 20 లక్షలమంది అమెరికన్లు ఉద్యోగాలు కోల్పో యారు. ఈ సంఖ్య మున్ముందు రెట్టింపు కావొచ్చునన్న అంచనాలున్నాయి. ఇదంతా తన పాలనపై అసంతృప్తిగా పరిణమిస్తుందన్న భయాందోళనలు ఆయన్ను పీడిస్తున్నాయి. వలసలపై తన ప్రభు త్వం కఠినంగా వ్యవహరించి, పరిస్థితిని చక్కదిద్దడానికి ప్రయత్నిస్తున్నట్టు అందరూ అనుకోవాలని ఆయన తాపత్రయపడుతున్నారు. అందులో భాగంగానే నిషేధం బాంబు పేల్చారు. ఈ తాత్కాలిక నిషేధం గడువు ముగిశాక దాన్ని పొడిగించాలో లేదో నిర్ణయిస్తామని కూడా ట్రంప్‌ చెప్పారు. అప్పటి కింకా తనపై అసంతృప్తి పోలేదన్న సంశయం కలిగితే దాన్ని పొడిగించడానికి కూడా ఆయన వెనకాడరు. 

ప్రస్తుతం గ్రీన్‌ కార్డు దరఖాస్తులు దాదాపు 3,58,000 పెండింగ్‌లో వున్నాయి. ఇవన్నీ ఇప్పుడు నిలిచిపోతాయి. అమెరికాలో వైద్య ఉపకరణాల కొరత, టెస్టింగ్‌ల సమస్య వగైరాలతో ప్రభుత్వం ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఆ సమస్యలపై దృష్టి పెట్టవలసి రావడం వల్ల వలసల విషయంలో కేంద్రీకరించడం ఇన్నాళ్లూ ఆయనకు సాధ్యం కాలేదు. ఇప్పుడు కూడా ఏదో ఒకటి చేయకపోతే తన విజయావకాశాలు దెబ్బతింటాయని ట్రంప్‌ భావిస్తున్నారు. అయితే వైద్య, వ్యవసాయ రంగాలు కార్మికుల కొరతను ఎదుర్కొంటున్నాయి. ఒకపక్క కరోనా వైరస్‌ వల్ల దేశవ్యాప్తంగా రోగుల సంఖ్య పెరుగుతుండగా, వారికి వైద్య సేవలందించేందుకు తగినంతమంది సిబ్బంది లేరు.

కరోనా సోకడం వల్ల, క్వారంటైన్‌లో వుండటం వల్ల చాలామంది విధులకు హాజరుకాకపోవడంతో ఆసుపత్రులన్నీ సిబ్బంది లేక ఇబ్బందిపడుతున్నాయి. అమెరికా వైద్య, ఆరోగ్య రంగంలో వలస కార్మికులు 17 శాతం వుంటారు. వైద్యుల్లో 25 శాతం వలసవచ్చినవారే. కొన్ని రాష్ట్రాలైతే విదేశాల్లో పట్టభద్రులైనవారికి లైసెన్స్‌లివ్వడానికి వుండే లాంఛనాలను సడలించమని కోరుతున్నాయి. ఇప్పుడున్న సంక్షోభ పరిస్థితుల్లో అది అవసరమని కోరుతున్నాయి. వ్యవసాయరంగానిదీ ఇదే సమస్య. కార్మికుల కొరత వల్ల పనులు సాగడం లేదని, ఇది ఆహార కొరతకు దారితీసే ప్రమాదం వున్నదని రైతులు హెచ్చరి స్తున్నారు. అమెరికా వ్యవసాయరంగంలో మెక్సికో నుంచి హెచ్‌–2ఏ వీసాలతో వచ్చే కార్మికులే అధికం. 

ఇంతక్రితమైనా, ఇప్పుడైనా ట్రంప్‌ అమల్లోకి తెచ్చిన ఆంక్షలన్నీ గత నాలుగేళ్లుగా ఆయన అమలు చేయడానికి తహతహలాడినవే. ఇందులో కొన్నిటిని పాక్షికంగా అమలు చేసిన సందర్భా లున్నాయి కూడా. కాంగ్రెస్‌ అనుమతి వుంటే తప్ప అమలు చేయడం సాధ్యంకాని ఆంక్షలను ఆయన కరోనా పేరు చెప్పి ఏకపక్షంగా అమలులో పెట్టగలిగారు. పైగా 1980 నుంచీ శరణార్థులకు ఆశ్రయ మివ్వడానికి తోడ్పడుతున్న కీలకమైన నిబంధనను పక్కనపెట్టగలిగారు. తమ తమ దేశాల్లో వేధిం పులను ఎదుర్కొనే ప్రమాదం వున్నదని భావించే వ్యక్తులకు ఆ నిబంధన కింద ఆశ్రయం కల్పిం చేవారు.

ట్రంప్‌ తాజా ఉత్తర్వులతో అది నిలిచిపోయింది. కరోనా వైరస్‌ బెడద తొలగిపోయాక తన తాజా నిర్ణయం వల్ల అమెరికన్లకు భారీయెత్తున ఉపాధి అవకాశాలొస్తాయని ఆయన ఊరిస్తున్నారు. ఆ మాటెలావున్నా అమెరికన్ల కోసం పాటుపడుతున్నట్టు ప్రచారం చేసుకోవడానికి తోడ్పడుతుంది. కానీ కరోనా మహమ్మారివల్ల కలిగే ప్రమాదాన్ని ట్రంప్‌ మొదట్లో తేలిగ్గా కొట్టిపారేయడం వల్లే దేశానికి ఈ దుర్గతి పట్టిందని అనేకులు భావిస్తున్నందువల్ల తాజా చర్యలు రాజకీయంగా ఆయనకు ఎంతవరకూ మేలుచేస్తాయో చెప్పలేం. అయితే సంక్షోభాలను పాలకులు ఎలా అవకాశాలుగా మలు చుకుంటారనడానికి ట్రంప్‌ ఉత్తర్వులు తాజా ఉదాహరణ. 

>
మరిన్ని వార్తలు