చైనాపై మళ్లీ కారాలు మిరియాలు

2 May, 2020 00:10 IST|Sakshi

కరోనా వైరస్‌ మహమ్మారి పుట్టుపూర్వోత్తరాల గురించి అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ ఏకరువు పెట్టినప్పుడల్లా ప్రభుత్వంలోని కీలక విభాగాలు అందుకు విరుద్ధమైన ప్రకటనలు చేసి ఆయన్ను నవ్వులపాలు చేస్తాయి. కనీసం కాస్త వ్యవధి తీసుకుందామని కూడా అనుకోవు. యధాప్రకారం కరోనా వైరస్‌ మూలాలు చైనాలోనే వున్నాయని, తాను మళ్లీ దేశాధ్యక్షుడు కాకూ డదన్న పట్టుదలతో ఆ దేశం కరోనాను అమెరికాపై గురిపెట్టిందని ఆయన గురువారం ఆరోపిం చారు. ఆయనలా చెప్పారో లేదో... జాతీయ ఇంటెలిజెన్స్‌ విభాగం డైరెక్టర్‌ కార్యాలయం ఆ వైరస్‌ అసలు మానవ సృష్టే కాదని ప్రకటించింది. ఈ విభాగం సాధారణమైనది కాదు. వివిధ గూఢచార విభాగాల నివేదికలను రోజూ తెప్పించుకుని, నిశితంగా పరిశీలించి వాటి ఆధారంగా అధ్యక్షుడికి సమగ్రమైన నివేదిక సమర్పించడం దీని పని.

ఈ వైరస్‌ బెడద తలెత్తక ముందు అమెరికాలో ట్రంప్‌ పరిస్థితి అంతో ఇంతో బాగున్న మాట వాస్తవం. ఆయన ఏలుబడిలో అమెరికా ఆర్థికంగా పుంజుకుంది. ఎగుమతులు పెరిగాయి. వాటిపై చైనా తదితర దేశాలు విధిస్తున్న టారిఫ్‌లు చాలా ఎక్కువుంటున్నాయని ట్రంప్‌ గొడవపెట్టి, తగ్గింపజేశారు. దేశంలో సగటు స్థూల వేతనాలు ఆయన వచ్చాక పెరిగాయి. జీడీపీ బాగుంది. ఉద్యోగిత మెరుగైంది. అంతా సవ్యంగా వుందనుకోవడంతో పాటు, తనపై పోటీచేయడానికి డెమొక్రాటిక్‌ అభ్యర్థిగా మాజీ ఉపాధ్యక్షుడు జో బిడెన్‌ ఖరారు కాబోతున్నారన్న వార్త కూడా ఆయనకు ఉత్సాహాన్నిచ్చింది. ఆయన రాజకీయంగా బలహీనుడని, తనపై గెలిచే సత్తా ఆయనకు లేదని ట్రంప్‌ నిశ్చితాభిప్రాయం. ఇలాంటి సమయంలో కరోనా వైరస్‌ వచ్చిపడింది. దీన్ని గురించి అమెరికా అధికార యంత్రాంగం ఆయన్ను చాలా ముందుగానే అప్ర మత్తం చేసింది. ఫిబ్రవరి 24న మన దేశంలో పర్యటించేనాటికే ఆయనకు నివేదికలందాయి. వాటిపై ఆయన తన అభిప్రాయమేమిటో చెప్పకపోవడంతో స్వదేశానికి రాగానే వివరించాలని కూడా అధికారులు నిర్ణయించారు. ఆ తర్వాత అది కూడా పూర్తయింది. కానీ ఎన్నికలపైనే పూర్తిగా దృష్టి కేంద్రీకరించిన ట్రంప్‌ వారి సలహాలను పక్కనబెట్టారు.

మార్చి 3నాటికే ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ వ్యాధి గురించి హెచ్చరించినా ఆయన పట్టించుకోలేదు. మరణాల రేటు పెద్దగా వుండబోదని, అతిగా చెప్పి జనాన్ని భయపెట్టొద్దని ఆ సంస్థను హెచ్చరించారు. ఇప్పుడు అమెరికాలో కరోనా బారిన పడిన వారి సంఖ్య 11 లక్షలు దాటింది. మృతుల సంఖ్య 64,108కి చేరింది. ఇంతటి విప త్కర పరిస్థితుల్లో కూడా ట్రంప్‌ అధ్యక్ష ఎన్నికల గురించే కలవరిస్తున్నారు. ఇక భౌతిక దూరం పాటించాలన్న నిబంధన  తొలగిస్తామని తెలిపారు. రాగల నెలల్లో ఎన్నికల ర్యాలీలకు అనుమతి స్తామన్నారు. జాతీయ ఇంటెలిజెన్స్‌ డైరెక్టర్‌ కరోనా వైరస్‌ గురించి కొత్తగా చెప్పిందేమీ లేదు. గత నెల్లాళ్లుగా శాస్త్రవేత్తలు ఆ సంగతే చెబుతున్నారు. అది జన్యుపరమైన మార్పులు చేసిందిగానీ, మానవ సృష్టిగానీ కాదని శాస్త్రవేత్తలు ఇంతక్రితమే అభిప్రాయపడ్డారు. జపాన్‌కు చెందిన శాస్త్రవేత్త ఒకరు అది వుహాన్‌లో రూపొందించిందేనని చెప్పినా, ఇతర శాస్త్రవేత్తలు దాన్ని కొట్టిపారేశారు. వీరెవరికీ చైనాపై ప్రత్యేకాభిమానం లేదు.

ఆ వ్యాధి బారిన పడిన రోగుల్లో వున్న వైరస్‌ జినోమ్‌ను పరిశీలించాక అది సహజసిద్ధంగా ఏర్పడిందనేనని శాస్త్రవేత్తలు తేల్చారు. ఏదో ఒక జంతువు ద్వారా మనుషుల్లోకి ప్రవేశించివుంటుందని, దానికి ముందు ఎన్నో మార్పులకు లోనయివుంటుందని వారి అంచనా. దీన్ని పూర్వపక్షం చేసిన శాస్త్రవేత్తలు ఎవరూ లేరు. దక్షిణ ఆస్ట్రేలియాలోని ఫ్లిండర్స్‌ యూనివర్సిటీకి చెందిన పరిశోధకుడొకరు గబ్బిలాల్లో వున్న వైరస్‌ను సేకరించి మనుషుల్లోని ఏస్‌2 రిసెప్టర్లను అది అతుక్కునేలా అభివృద్ధి చేయడానికి అవకాశం లేకపోలేదని, ఆ క్రమంలో అది జన్యుపరమైన మార్పులు చెందివుంటుందని అభిప్రాయపడ్డారు. వైరస్‌ను కొత్తగా అభివృద్ధి చేస్తున్నప్పుడే ఏ శాస్త్రవేత్తకో, సహాయకుడికో అనుకోకుండా అంటుకుని వుండొచ్చని, వారి ద్వారా చైనాలోని జంతు మార్కెట్లోకి ప్రవేశించివుంటుందని ఆయన వాదన.

కానీ ఇది కూడా రాజకీయ నాయకులు చేసే వూహాగానం వంటిదే. ప్రతి అంశాన్నీ శాస్త్రీయంగా నిర్ధారించే స్పష్టమైన ఆధారాలు లేకుండా ఏం చెప్పినా అవి కేవలం అభిప్రాయాలే అవుతాయి. నిజానికి తమ వాదనను బలపరిచే ఒక్క ఆధారమైనా సంపాదించి తీరాలని ట్రంప్‌ ప్రభుత్వం తెగ ఆరాటపడుతోంది. అమెరికాకు చెందిన ఎన్నో నిఘా సంస్థలు ఇదే పనిలో వున్నాయి. కానీ ఇంతవరకూ విజయం సాధిం చలేకపోయాయి. వుహాన్‌ ప్రయోగశాలలో భద్రతా ప్రమాణాలు చాలా నాసిరకంగా వున్నాయని తాము 2018లోనే చెప్పామని అమెరికా అంటున్నది. అందుకు సంబంధించిన రికార్డు బయట పెట్టింది. 

 కరోనా విపత్తును ట్రంప్‌ తేలిగ్గా తీసుకోవడం వల్ల, చైనాపై తప్పును నెట్టి ఆగ్రహాన్ని అటు మళ్లించాలనుకోవడం వల్ల ఇతరత్రా సమస్యలేర్పడే ప్రమాదం వుంది. ఇప్పటికే అమెరికాలో పలుచోట్ల లాక్‌డౌన్‌ వ్యతిరేక ఆందోళనలు మిన్నంటుతున్నాయి. వైరస్‌ వల్ల ముప్పు వాస్తవమే అయినా, జీవితాలతో ఆటలాడుకోవడం అంతకంటే ప్రమాదకరమని ఉద్యమకారుల వాదన. ఈ పరిస్థితుల్లో కరోనా వ్యతిరేక పోరాటంలో అందరినీ సమీకరించి, తగిన జాగ్రత్తలు తీసుకొనేలా ప్రోత్సహించాల్సిన ట్రంప్‌ బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్నారు. కరోనా వ్యాధిగ్రస్తులు, మృతులు నానాటికీ పెరగడం, ఆర్థిక వ్యవస్థ చతికిలబడటం ఈసారి ఎన్నికల్లో తన పదవికి ముప్పు తెస్తాయన్న సందేహం ఆయనకుంది. కనుకనే చైనాపై ఆయన మరోసారి గురిపెట్టారు. వైరస్‌ పుట్టు పూర్వోత్తరాలేమిటో, అందులో చైనా పాత్ర ఎటువంటిదో తేల్చడానికి ఇంకా సమయం వుంది. ఈ విపత్తును నియంత్రించడానికి శక్తియుక్తులు కేంద్రీకరించాల్సిన దశలో ప్రజల దృష్టిని మళ్లించాలని చూడటం వల్ల సమస్య మరింత ఉగ్రరూపం దాలుస్తుందని ఆయన గుర్తించాలి.  

మరిన్ని వార్తలు