చైనాకు హెచ్చరిక

4 Jul, 2020 01:08 IST|Sakshi

ప్రధాని నరేంద్ర మోదీ చైనా దురాగతంపై మాట్లాడటం లేదంటూ విమర్శిస్తున్నవారు ఇక శాంతించవచ్చు. ఆయన శుక్రవారం లదాఖ్‌ ప్రాంతంలో ఆకస్మిక పర్యటన జరిపి సైన్యం, వైమానికదళం, ఇండో టిబెటిన్‌ సరిహద్దు పోలీస్‌(ఐటీబీపీ) జవాన్లనుద్దేశించి ప్రసంగించడంతో పాటు, చైనా సైనికుల దుండగంలో గాయపడి చికిత్స పొందుతున్న జవాన్లను పరామర్శించారు. విస్తరణవాదానికి ఇక నూకలు చెల్లాయని, అలాంటి ప్రయత్నాలు చేసే శక్తులు ఓటమి పాలవడమో, పలాయనం చిత్తగించడమో తప్పలేదని చరిత్ర చాటుతున్నదని చైనానుద్దేశించి హెచ్చరించారు. చెప్పాలంటే ఇది చైనాకు మాత్రమే కాదు...ఆ దేశం పోకడల గురించి ప్రపంచ దేశాలన్నిటినీ అప్రమత్తం చేసిన సందేశం. ఇరు దేశాల సైన్యం మధ్యా వాస్తవాధీన రేఖ(ఎల్‌ఏసీ) వద్ద గల్వాన్‌ లోయలో ఘర్షణలు జరిగాక మన ప్రధాని లదాఖ్‌ వెళ్లి సైన్యంతో మాట్లాడటం వారి నైతిక స్థైర్యాన్ని పెంచడానికి ఎంతగానో తోడ్పడుతుంది.

చొరబాటుకు పాల్పడితే భారత్‌ మౌనంగా వుండిపోదన్న సంకేతమిస్తుంది. పురాణ ప్రతీకలతో సాగిన మోదీ ప్రసంగం... యుద్ధానికి కాలుదువ్వితే అందుకు కూడా సిద్ధంగా వున్నామన్న  పరోక్ష సందేశాన్ని పంపింది. ‘మురళీకృష్ణుని కొలిచే జనమే సుదర్శన ధారి అయిన కృష్ణుణ్ణి కూడా పూజిస్తారని తెలుసుకోవాల’ని తన ప్రసంగంలో మోదీ చెప్పారు. ప్రధాని అడుగిడిన నిమూ ప్రాంతం  సముద్ర మట్టానికి 11,000 అడుగుల ఎత్తులో వుంది.  సుశిక్షిత జవాన్లకు తప్ప అన్యులకు అది కష్టసాధ్యమైన ప్రాంతం. గత నెల 18న అఖిల పక్ష సమావేశాన్నుద్దేశించి ప్రసంగించిన సందర్భంగా మన భూభాగంలోకి ఎవరూ ప్రవేశించలేదని, మన పోస్ట్‌లను ఎవరూ స్వాధీనం చేసుకోలేదని నరేంద్ర మోదీ చెప్పినప్పుడు విపక్షాలనుంచి విమర్శలొచ్చాయి. అదే నిజమైతే మన జవాన్లపై చైనా సైనికులు ఎందుకు దాడి చేశారన్న ప్రశ్నలు తలెత్తాయి. చైనా మొదటినుంచీ మన విషయంలో రెండు సమాంతర మార్గాలను అనుసరిస్తోంది. అక్కడి రాజకీయ నాయకత్వం మన పాలకులతో స్నేహ పూర్వకంగా వుంటుంది. దౌత్యపరమైన సంబంధాల్లో అంతా సవ్యంగానే వున్నట్టు కనబడుతుంది.

కానీ ఆ దేశ సైన్యం మాత్రం సరిహద్దుల్లో దూకుడు ప్రదర్శిస్తుంటుంది. కయ్యానికి కాలు దువ్వుతుంటుంది. మొదటినుంచీ ఈ తంతు సాగుతూనే వుంది. కనుకనే తరచుగా సమస్య లొస్తున్నాయి. ఒక్కోసారి అవి ఘర్షణలుగా రూపాంతరం చెందుతున్నాయి. అఖిలపక్ష సమావేశంలో మోదీ చేసిన ప్రసంగం చైనా నాయకత్వానికి ఒక అవకాశం ఇచ్చినట్టని...చప్పుడు చేయకుండా వచ్చిన దారినే వారు వెళ్లిపోవడానికి తోవ చూపినట్టని కొందరు సైనిక నిపుణులు విశ్లేషించారు. ఆయన కోరుకున్నట్టు జరగలేదు గనుకే తాజా ప్రసంగంలో మోదీ కఠినంగా మాట్లారని వారు చెబుతున్నారు. అందులో నిజానిజాలేమిటన్న సంగతలావుంచితే తూర్పు లదాఖ్‌ ప్రాంతంలో చైనా వైఖరి గతంతో పోలిస్తే పూర్తిగా మారిందన్నది వాస్తవం. ఎల్‌ఏసీ పొడవునా వివాదాస్పదమైనవిగా గుర్తించిన ప్రాంతాలపై ఇరు దేశాల మధ్యా కొన్ని దశాబ్దాలుగా చర్చలు సాగుతూనే వున్నాయి. 1993, 1996, 2005 ల్లో కుదిరిన అవగాహనను బట్టి ఇరు దేశాల సైన్యాలు పరస్పర విశ్వాసాన్ని పెంపొందించుకునే చర్యలు కొనసాగించాలి. తమకు సంబంధించని విషయాలపై అభ్యంతరాలు చెప్పకూడదు. కానీ ఈమధ్యకాలంలో దీనికి చైనా చెల్లుచీటి ఇచ్చింది. ఎల్‌ఏసీకి తనవైపున్న ప్రాంతంలో చాన్నాళ్లక్రితమే చైనా రోడ్ల నిర్మాణం చేపట్టి పూర్తి చేసింది.

అంతా పూర్తయ్యాక ఇరు దేశాలూ అన్ని రకాల నిర్మాణాలనూ ఆపేయాలంటూ ఈమధ్య ప్రతిపాదించడం మొదలుపెట్టింది. అంటే తనవైపున్న భూభాగంలో సైన్యం కదలికలకు అనువుగా రోడ్లు ఉండాలి.  కానీ మనం మాత్రం ఆ పని చేయకూడదు. తన ప్రతిపాదనను మనం అంగీకరించడం లేదన్న దుగ్ధ చైనాకుంది. అలాగే కొన్ని ప్రాంతాల్లోకి చొరబడి ఆక్రమిస్తే ఎల్‌ఏసీపై చర్చలకు భారత్‌ తొందరపడుతుందని, అప్పుడు సమస్య వేగంగా పరిష్కారమవుతుందని చైనా అనుకున్నట్టు కనబడుతోంది. కనుకనే ఇంతక్రితం కేవలం గస్తీకే పరిమితమైన గల్వాన్‌ ప్రాంతంలోకి చొరబడి తిష్టవేసింది. ఒక అనిశ్చితి వాతా వరణాన్ని ఎల్లకాలమూ కొనసాగించడం మంచిది కాదని, అది మన ప్రయోజనాలను దెబ్బ తీస్తుందని మన పాలకులు ఇన్ని దశాబ్దాలుగా తెలుసుకోలేకపోయారు. అందువల్లే ఎల్‌ఏసీపై విషయంలో ఎప్పుడూ సరిగా దృష్టి కేంద్రీకరించలేదు. ఇదే అదునుగా చైనా చొరబాటు ప్రయత్నాలు చేస్తూ వచ్చింది. 

శాంతి కావాలని బలంగా ఆకాంక్షిస్తే యుద్ధానికి నిరంతరం సిద్ధంగా వుండాలని రోమన్‌ జనరల్‌ వెజెటియస్‌ చెప్పిన మాట. లదాఖ్‌లో మన బలగాలనుద్దేశించి ప్రసంగించిన మోదీ సైతం ఆ అర్ధంలోనే మాట్లాడారు. శాంతి నెలకొనాలంటే ముందుగా ధైర్యసాహసాలుండాలని చెప్పారు. పిరికివారు, బలహీనులు శాంతిని సాధించలేరన్నారు. చైనా రెండు నెలలుగా ఎల్‌ఏసీ వద్ద కొన్ని ప్రాంతాల్లో సైన్యాన్ని మోహరిస్తున్నట్టే, మన దేశం కూడా అక్కడికి బలగాలను తరలిస్తోంది. దానికితోడు శుక్రవారం చేసిన ప్రసంగంలో దేనికైనా సిద్ధమని మోదీ ఇచ్చిన సంకేతం చైనాపై ప్రభావం చూపిన జాడలు కనబడుతున్నాయి.

కనుకనే ‘ఇరు దేశాలూ పరస్పర సంబంధాల్లో వున్నాయి. సరిహద్దుల్లో ఉద్రిక్తతలను ఉపశమింపజేసేందుకు దౌత్యపరంగా, సైనికంగా చర్చలు సాగుతున్నాయి. ఈ పరిస్థితిని విషమింపజేసేలా ఎవరూ వ్యవహరించకూడద’ంటూ చైనా విదేశాంగ ప్రతినిధి సన్నాయినొక్కులు నొక్కారు. యుద్ధం తలెత్తడం ఏ దేశానికీ మంచిది కాదు. అది ఇరు వైపులా ప్రాణనష్టానికి, ఆర్థికంగా కుంగుబాటుకు దారిదీస్తుంది. అలాగని ఉపేక్షించే ధోరణి కూడా ప్రమాదకరం. ఇప్పుడు సమస్య ఎజెండాలోకి వచ్చింది గనుక ఎల్‌ఏసీ విషయంలో శాశ్వత పరిష్కారం సాధించే దిశగా కృషి చేయాలి. ఆ విషయంలో ఇక తాత్సారం పనికిరాదు. 

మరిన్ని వార్తలు