కేరళపై ప్రకృతి పంజా!

18 Aug, 2018 01:09 IST|Sakshi

దాదాపు ఏడాదిగా దేశంలోని వివిధ ప్రాంతాల్లో వేర్వేరు రూపాల్లో వైపరీత్యాలు సృష్టిస్తున్న ప్రకృతి ఈసారి కేరళపై తన పంజా విసిరింది. గత శతాబ్దకాలంలో కనీ వినీ ఎరుగని పెను ఉత్పాతం భారీ వర్షాలు, వరదలుగా రాష్ట్రాన్ని చుట్టుముట్టింది. నాలుగురోజులుగా విరామం లేకుండా కురుస్తున్న వర్షాలతో ఆ రాష్ట్రంలోని 14 జిల్లాల్లో 13 వరద నీటిలో తేలియాడుతున్నాయి. అన్నిచోట్లా రెడ్‌ అలర్ట్‌ ప్రకటించారు. జాతీయ విపత్తు స్పందన దళం(ఎన్‌డీఆర్‌ఎఫ్‌) సిబ్బంది, నావికాదళం రంగంలోకి దిగి 2 లక్షలమందిని సురక్షిత ప్రాంతాలకు తరలించగలిగినా ఇంకా అనేకులు సాయం కోసం ఎదు రుచూస్తున్నారు. దాదాపు 400మంది ప్రాణాలు కోల్పోయారు. పక్కా ఇళ్లు సైతం పేకమేడల్లా కూలడం, పెనువృక్షాలు కూకటి వేళ్లతోసహా నేలకొరగడం ఆ విపత్తు తీవ్రతను తెలియ జెబుతు న్నాయి. జూన్‌ 1న ప్రవేశించిన రుతుపవనాలు ఇప్పటికి సాధారణం కంటే 37.5 శాతం అధిక వర్ష పాతాన్ని కుమ్మరించాయి. రాష్ట్రంలోని 44 నదులూ పొంగి ప్రవహిస్తున్నాయి. 33 రిజర్వాయర్ల గేట్లు ఎత్తేయవలసి వచ్చింది. వరద నీరు ప్రవేశించటంతో కొచ్చి అంతర్జాతీయ విమానాశ్ర యాన్ని మూసేశారు. పుణ్యక్షేత్రం శబరిమల, పర్యాటకులకు ఇష్టమైన మున్నార్, త్రివేణి సంగమం వంటి ప్రాంతాలు వరదనీటిలో చిక్కుకున్నాయి. శుక్రవారానికి వానలు కాస్త తగ్గుముఖం పట్టినా విద్యుత్‌ లైన్ల పునరుద్ధరణ జరగలేదు. ఒకటి రెండు రోజులైతే తప్ప వరద తీవ్రత తగ్గే అవకాశం లేదు.

మూడు వైపులా సముద్రం ఉన్న మన దేశానికి తరచు వాయుగుండాలు, తుఫాన్లు, వాటి పర్యవసానంగా వరదలూ తప్పవు. అందుకే 1954లోనే జాతీయ వరదల నిరోధక కమిషన్‌ నెలకొల్పారు. పది పన్నెండేళ్లలో దేశానికి వరదల బెడద లేకుండా చేస్తామని అప్పటి ప్రభుత్వం ప్రకటించింది. 2005లో ప్రధాని చైర్మన్‌గా జాతీయ విపత్తు నివారణ ప్రాధికార సంస్థ(ఎన్‌డీఎంఏ), దానికి అనుబంధంగా ఎన్‌డీఆర్‌ఎఫ్‌ ఏర్పడ్డాయి. ఎన్‌డీఆర్‌ఎఫ్‌ కేవలం వరదల సమయంలో మాత్రమే కాదు... ఎక్కడ ఎలాంటి వైపరీత్యాలు ఏర్పడినా రంగంలోకి దిగుతుంది. అయితే దుర దృష్టమేమంటే అటు వరదల్ని అరికట్టడంలోనూ, ముందస్తు చర్యలు తీసుకుని నష్టాన్ని కనిష్ట శాతా నికి తగ్గించడంలోనూ విఫలమవుతున్నాం. అయితే అడవులు ధ్వంసం కాకుండా, కొండలు పిండి చేయకుండా, పర్యావరణ సమతూకం దెబ్బతినకుండా చూస్తే ఇంత చేటు తీవ్రత ఉండదు.

మానవ తప్పిదాలవల్ల అడవులు తగలబడటం, అభివృద్ధి కోసమంటూ అడవుల్ని నాశనం చేయడం, విలువైన వృక్ష సంపద కొలువై ఉన్న పర్వత ప్రాంతాల్లో మైనింగ్‌ లీజులివ్వడం వగైరాలు పర్యావరణానికి ముప్పు కలిగిస్తున్నాయి. అడవుల్ని నరికినప్పుడు దానికి ప్రతిగా మొక్కలు నాటడం వగైరాలు చేస్తున్నట్టు కనబడుతున్నా అవి పెరిగి పెను వృక్షాలుగా మారడానికి ఎన్ని దశాబ్దాలు పట్టాలి? బెంగళూరులోని ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌(ఐఐఎస్‌సీ) నిరుడు రూపొందించిన నివేదిక ప్రకారం కేరళలో 1973 నుంచి 2016 వరకూ 9 లక్షల హెక్టార్ల అడవులు నాశనమయ్యాయి. ఇవన్నీ పడమటి కనుమల్లోని అడవులే. ప్లాంటేషన్ల కార్యక్రమాలు సాగుతున్నా సహజసిద్ధమైన వృక్షా లకు అవి ప్రత్యామ్నాయం కానేకాదు. ఈ స్థాయిలో అడవులు కోల్పోవడం వల్ల కేరళలో వేసవి తీవ్రత పెరగడం మాత్రమే కాదు... ఇలా ఊహించని స్థాయిలో వర్షాలు పడి, వరదలు ముంచెత్తుతు న్నాయి. అడవుల్లో నివసించాల్సిన వన్యమృగాలు దిక్కుతోచని స్థితిలో పడుతున్నాయి. వేటగాళ్లకు బలవుతున్నాయి. హైదరాబాద్‌లోని నేషనల్‌ రిమోట్‌ సెన్సింగ్‌ ఏజెన్సీ(ఎన్‌ఆర్‌ఎస్‌ఏ) భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ(ఇస్రో)తో కలిసి చేసిన అధ్యయనంలో గత 90 ఏళ్లలో పడమటి కను మలపై ఉన్న 33,579 చదరపు కిలోమీటర్ల ప్రాంతంలోని అడవులు ధ్వంసమయ్యాయి. ఇది మొత్తం అటవీ ప్రాంతంలో 35.3 శాతమని ఆ అధ్యయనం చెబుతోంది. పడమటి కనుమలపై ఉన్న అడ వులు ప్రపంచంలో పేరెన్నికగన్న జీవ వైవిధ్య అరణ్యాల్లో ఎన్నదగినవని నిపుణులు చెబుతున్న మాట. ఆనకట్టల నిర్మాణానికి, ఇతర అవసరాలకు అడవులు యధేచ్ఛగా నాశనం చేస్తున్నారు. లాభ సాటిగా లేదన్న పేరుతో వ్యవసాయ క్షేత్రాలను రియల్‌ ఎస్టేట్‌లుగా మారుస్తున్నారు. కొండలు చదు నుచేసి ఇష్టానుసారం భవంతులు నిర్మిస్తున్నారు. ఫలితంగా వర్షం నీరు దారీ తెన్నూ దొరక్క వరదల రూపంలో జనావాసాలపై విరుచుకుపడుతోంది. మొత్తానికి అటు కరువు, ఇటు పెను తుఫాన్లు, వర దలు సర్వసాధారణంగా మారాయి. నదుల నడత మారుతోంది. ఏడాదిలో ఏడెనిమిది నెలలు నిండుగా పారే నదులు నాలుగు నెలలు తిరగకుండా వట్టిపోతున్నాయి.

పర్యావరణ పరంగా కేరళ అత్యంత సున్నితమైన ప్రాంతమనీ, అక్కడ సమతూకం దెబ్బతింటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ఎప్పటినుంచో నిపుణులు హెచ్చరిస్తున్నారు. వాటిని పాలకులు దశాబ్దాలుగా పెడచెవిని పెట్టడం వల్లే ఇప్పుడీ దుస్థితి తలెత్తింది. పర్యావరణాన్ని దెబ్బతీసే కార్య కలాపాలను సంపూర్ణంగా నియంత్రించి, ప్రణాళికాబద్ధమైన అభివృద్ధికి అంకురార్పణ చేయడం అత్యవసరమని 2011లో మాధవ్‌ గాడ్గిల్‌ నేతృత్వంలోని నిపుణుల సంఘం సూచించింది. ఒక్క కేరళలో మాత్రమే కాదు... పడమటి కనుమలు విస్తరించి ఉన్న గుజరాత్, కర్ణాటక, మహారాష్ట్ర, గోవా, తమిళనాడుల్లో కూడా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని తెలిపింది. విషాదమేమంటే ఆ తర్వాత కూడా పడమటి కనుమల్లో విధ్వంసానికి అడ్డుకట్ట పడలేదు. కనీసం ఇప్పటికైనా పాలకులు మేల్కొనకపోతే దేశంలోని ఇతర ప్రాంతాలకు కూడా ఇలాంటి వైపరీత్యాల ముప్పు తప్పదు.

మరిన్ని వార్తలు