మిడతల దండు సంక్షోభం

29 May, 2020 00:55 IST|Sakshi

‘పీడ పోయిందనుకుంటే పిశాచం పట్టుకుంద’ని నానుడి. కానీ కరోనా వైరస్‌ మహమ్మారి రూపంలో పట్టిన పీడ వదలకముందే మిడతల దండు వచ్చిపడి మన దేశాన్ని గడగడలాడిస్తోంది. పది రోజుల క్రితం ఆ దండు పాకిస్తాన్‌ సరిహద్దులవైపు నుంచి ప్రవేశించి గుజరాత్, రాజస్తాన్‌లపై విరుచుకుపడి, అటుపై ఉత్తరప్రదేశ్‌ వైపు వెళ్తూ గాలివాటుకు రెండుగా చీలి ఒకటి మధ్యప్రదేశ్‌ దిశగా పోయి అక్కడ విధ్వంసకాండ సాగించింది. మరో దండు ఢిల్లీ, హర్యానా వైపు వెళ్లింది. మధ్యప్రదేశ్‌వైపు వెళ్లిన దండు మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌లవైపు మళ్లినట్టు చెబుతున్నారు. తెలుగు రాష్ట్రాలకు కూడా ముప్పు వుండొచ్చునన్న సమాచారంతో ప్రభుత్వ యంత్రాంగాలు అప్రమత్తమయ్యాయి. మిడతల దండు మన దేశానికి కొత్తగాదు. గత పదేళ్లుగా అప్పుడప్పుడు వీటి తాకిడివున్నా, చాలా స్వల్ప సంఖ్యలో రావడం.. రాజస్తాన్, గుజరాత్‌లలోని ఒకటి రెండు జిల్లాలకు సమస్య ఏర్పడటం ఉండేది. ఈసారి అవి కోట్లాదిగా వచ్చిపడ్డాయి. ఇంతటి భారీ సంఖ్యలో మిడతలు మన దేశం వచ్చిన ఉదంతాలు 1787–1796 మధ్య.. 1901–1908 మధ్య ఉన్నాయని చరిత్ర చెబుతోంది. ఆ తర్వాత కూడా మిడ తల దండు రావడం రివాజైనా కోట్లాదిగా వచ్చిన దాఖలా లేదు. అవి వచ్చి పంట పొలంపై వాల డాన్ని స్వయంగా వీక్షించిన రైతు ఒకరు ‘ఎవరో ఆకాశం నుంచి ఒక పెద్ద వస్త్రాన్ని పొలంపై కప్పినట్టు అనిపించింద’ని చెప్పాడంటే మిడతల దండు తీవ్రత అంచనా వేసుకోవచ్చు. 

 కోట్లాదిగా దండు కట్టడం, రోజుకు కనీసం 150 కిలోమీటర్ల దూరం వేగంగా ప్రయాణించడం ఈ కీటకాల ప్రత్యేకత. ఇవి పగటిపూట ప్రయాణిస్తూ ఏపుగా పెరిగిన పంట చేలపైనో, పచ్చని చెట్ల పైనో, పచ్చికబయళ్లపైనో వాలతాయి. ఆకులు, పండ్లు, కూరగాయలు, జొన్న, వరి... ఇలా ఏది దొరి కితే అది స్వాహా చేస్తాయి. చీకటి పడేవేళ వున్నచోటే వుండిపోతాయి. ఒక దండు కదిలిందంటే అందులో కనీసం నాలుగు కోట్ల మిడతలుంటాయని, అవి ఒక్క రోజులో 35,000 మంది తినే ఆహా రాన్ని ఖాళీ చేస్తాయని ఐక్యరాజ్యసమితి ఆహార, వ్యవసాయ సంస్థ(ఎఫ్‌ఏఓ) చెబుతోంది. అంత ర్జాతీయ స్థాయిలో మిడతల తీరుతెన్నులపై అధ్యయనం చేసే ఏకైక సంస్థ అది. మిడతల దండు తాకిడికి లోనైన దేశాలు ఇచ్చే సమాచారాన్ని అందుకుని, అక్కడి వాతావరణ పరిస్థితులను అధ్యయనం చేసి, ఆ దండు ఎటువైపు పోయే అవకాశం వుందో అంచనాకు రావడం... ఆ దిశగా వున్న దేశాలను అప్ర మత్తం చేయడం దాని బాధ్యత. నిజానికి ఇప్పుడేర్పడిన బెడద చిన్నదని, వచ్చే నెలకల్లా అది మరింత ఉగ్రరూపం దాల్చే ప్రమాదం వున్నదని ఎఫ్‌ఏఓ మన దేశాన్ని హెచ్చరించింది.

తూర్పు ఆఫ్రికా నుంచి పాకిస్తాన్‌ మీదుగా భారత్‌కి వచ్చిపడే ఆ మిడతల దండు మరింత పెద్దగా ఉండొచ్చు నంటున్నది. మన దేశంలో కూడా ప్రత్యేకించి మిడతల బెడదను పసిగట్టి ముందస్తు హెచ్చరికలు చేయడానికి, అవసరమైన చర్యలు సూచించడానికి రాజస్తాన్‌లోని జోద్‌పూర్‌ కేంద్రంగా లోకస్ట్‌ వార్నింగ్‌ ఆర్గనైజేషన్‌(ఎల్‌డబ్ల్యూ) పనిచేస్తోంది. ఇది ఎఫ్‌ఏఓతోనూ, వేరే దేశాల్లో ఇదే అంశంపై పనిచేస్తున్న సంస్థలతోనూ చర్చిస్తూ పరిస్థితిని పర్యవేక్షిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వాలను అప్రమత్తం చేస్తుంది. 

మిడతల దండు వల్ల ఆహార భద్రతకు ముప్పు ఏర్పడుతుంది. కోట్లాదిమంది వినియోగించే ఆహారధాన్యాలు, కూరగాయలు, పండ్లు, ఫలాలు వగైరాలను అవి స్వాహా చేస్తాయి. చాన్నాళ్ల తర్వాత ఈ ఏడాది పంటలు బాగా పండాయి. కానీ లాక్‌డౌన్‌ కారణంగా అవాంతరాలేర్పడ్డాయి. సకాలంలో పంట కోయలేక రైతులు అగచాట్లు పడ్డారు. దాని ప్రభావం దేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్రంగా ఉండగలదని అంచనా వేశారు. ఇప్పుడొచ్చిపడిన మిడతల దండు ఈ పరిస్థితిని మరింతగా కుంగ దీస్తుందని నిపుణులు చెబుతున్న మాట. అదృష్టవశాత్తూ రబీ పంట కోతలు ఇప్పటికే ముగిశాయి. ఖరీఫ్‌కి ఇంకా వ్యవధి వుంది. అయితే కొన్ని ప్రాంతాల్లో వేసవిలో చేతికందే పప్పుధాన్యాలు, కూరగాయలు, పత్తి వగైరాలు ఈ మిడతల దండువల్ల నష్టపోయే అవకాశం వుంది. ఇంకో ప్రమాదం కూడా వుంది... సరిగ్గా రుతుపవనాలు ప్రవేశించి, వానలు కురవడం ప్రారంభమయ్యాక వచ్చే మిడతలు భారీగా గుడ్లు పెడతాయంటున్నారు. ఒక్కో ఆడ మిడత 750 గుడ్లుపెడుతుందని, వాటివల్ల రెండేళ్లపాటు సమస్యలేర్పడే అవకాశం వుందని నిపుణులు అంటున్నారు.

ఇప్పటికి ఒక్క రాజస్తాన్‌లోనే అయిదు లక్షల హెక్టార్లలో పంట దెబ్బతిన్నదని అంచనా. మన దేశం మాత్రమే కాదు...ప్రపంచవ్యాప్తంగా ఇరాన్, అఫ్ఘానిస్తాన్, ఆఫ్రికాతోసహా 64 దేశాలు ఈ మిడతల దండువల్ల తీవ్ర నష్టాన్ని చవిచూడాల్సి వస్తుంది. వీటిని సాగనంపడానికి క్రిమి సంహారకాలు వెదజల్లడం మొదలుకొని అనేక రకాల చర్యల్ని సూచిస్తున్నారు. పళ్లాలు మోగించడం, వాహనాలపై లౌడ్‌స్పీకర్లు పెట్టి చెవులు చిల్లులు పడేలా సంగీతం పెట్టడం, డ్రోన్ల ద్వారా నిఘా తదితరాలు చేస్తున్నారు. ఈ మిడతల దండు పచ్చదనం అధికంగా వున్న నగరాలు, పట్టణాలను సైతం వదలటం లేదు. అన్ని అనర్థాల్లాగే ఇది కూడా మానవాళి స్వయంకృతమే. భూతాపం వల్ల హిందూ మహాసముద్రంలోని పశ్చిమ ప్రాంత సముద్ర జలాలు వేడెక్కాయని, పర్యవసానంగా గత ఏడాది చివరిలో ఆఫ్రికా ఎడారి ప్రాంతంలోనూ, అరేబియా ద్వీపకల్పంలోనూ కనీవినీ ఎరుగని స్థాయిలో వర్షాలు కురిశాయని, అందువల్లే ఈ స్థాయిలో మిడతల బెడద వచ్చిపడిందని పర్యావరణ నిపుణులు చెబుతున్నారు. రుతుపవనాలకు ముందు ఇక్కడ కురిసిన వర్షాలతో ఆ దండు మన దేశం వైపు వచ్చివుండొచ్చునని వారి అంచనా. కరోనా వైరస్‌ ప్రపంచ దేశాలతోపాటు మన దేశాన్ని కూడా కుంగదీసింది. దాన్నుంచి తేరుకోకుండానే ఇప్పుడు మిడతల సమస్య వచ్చిపడింది. పటిష్టమైన వ్యూహరచనతో అడుగేస్తే తప్ప వీటినుంచి సురక్షితంగా బయటపడటం అసాధ్యం. ఆ విషయంలో అత్యంత జాగు రూకతతో వ్యవహరించాలి. 

మరిన్ని వార్తలు