బెంగాల్‌ ‘యుద్ధం’

5 Feb, 2019 00:42 IST|Sakshi

రానున్న సార్వత్రిక ఎన్నికలు ఎంత హోరాహోరీగా ఉండబోతున్నాయో కొన్ని రోజులుగా దేశంలో చోటుచేసుకుంటున్న పరిణామాలు చాటిచెబుతున్నాయి. దాదాపు అన్ని పార్టీలూ నువ్వా నేనా అన్నట్టు పోటీ పడుతున్నాయి. పరస్పరం సవాళ్లు విసురుకుంటున్నాయి. పశ్చిమ బెంగాల్‌లో అయితే రోడ్డున పడి కొట్టుకునే స్థితికి చేరాయి. ఆ రాష్ట్రంలో జరిగిన  రెండు కుంభకోణాలపై దర్యాప్తు జరిపేందుకు, కోల్‌కతా పోలీస్‌ కమిషనర్‌ రాజీవ్‌కుమార్‌ను ప్రశ్నించేందుకు వెళ్లిన తమ సిబ్బందిపై కోల్‌కతా పోలీసులు దాడిచేసి అదుపులోకి తీసుకున్నారని సీబీఐ ఆరోపిస్తుంటే...వారి దగ్గర తగిన అనుమతిపత్రాలు ఉన్నాయో లేదో తెలుసుకోవడానికి తీసుకెళ్లి విడిచిపెట్టామని పోలీ సులు చెబుతున్నారు. గతంలో ఆ కుంభకోణాలనుఉ దర్యాప్తు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం నియ మించిన ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్‌)కు రాజీవ్‌కుమార్‌ సారథ్యం వహించారు. ఆ సందర్భంగా కుంభకోణానికి సంబంధించిన కీలక పత్రాలను ఆయన గల్లంతు చేశారన్నది సీబీఐ అభియోగం.

పశ్చిమ బెంగాల్‌ గవర్నర్‌ రాష్ట్రంలో తలెత్తిన పరిస్థితులపై కేంద్రానికి నివేదిక పంపారు. చివరకు ఇదంతా రాష్ట్రపతి పాలనకు దారితీయొచ్చని కొందరు ఊహిస్తున్నారు. మమత కూడా దీన్నే కోరు కుంటున్నట్టు కనబడుతోంది. రాష్ట్రంలో పుంజుకుంటున్నట్టు కనిపిస్తున్న బీజేపీని చావుదెబ్బ తీయాలన్నది ఆమె వ్యూహం. మమత దేనికీ భయపడే రకం కాదు. రాష్ట్రంలో లెఫ్ట్‌ఫ్రంట్‌ అధి కారంలో ఉన్నప్పుడు ఆమె సీపీఎం కార్యకర్తలతో వీధుల్లో హోరాహోరీ తలపడి, తన పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు. నిన్నటి నుంచి ఆమె నడిరోడ్డుపై సాగిస్తున్న ధర్నా, అక్కడే కూర్చుని కేబినెట్‌ సమావేశం జరపడం వగైరాలు చూస్తుంటే ఆ పోరాట చేవ ఇంకా తగ్గలేదని అర్ధమవు తుంది.  కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య విభేదాలు తలెత్తడం, ఒక్కోసారి అవి కట్టుదాటడం కొత్త గాదు. అలాంటి పరిస్థితులు తలెత్తినప్పుడల్లా ఒక్క కలం పోటుతో రాష్ట్ర ప్రభుత్వాలను బర్తరఫ్‌ చేయడం కాంగ్రెస్‌ హయాంలో అడ్డూ ఆపూ లేకుండా సాగేది. ఎస్‌ఆర్‌ బొమ్మై కేసులో సుప్రీంకోర్టు కొన్ని మార్గదర్శకాలు జారీచేశాకS ఆ దురలవాటు కాస్త తగ్గింది. కానీ పూర్తిగా పోలేదు. తమను వ్యతిరేకించే పక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో సమస్యాత్మక గవర్నర్లను నియమించడం, వారు ఏదో సాకుతో ముఖ్యమంత్రులను చికాకు పెట్టడం ఇంకా కొనసాగుతూనే ఉంది. గతంలో యూపీఏ హయాంలోనూ, ఇప్పుడు ఎన్‌డీఏ హయాంలోనూ కూడా ఢిల్లీలో కేజ్రీవాల్‌ ప్రభుత్వాన్ని సమానంగా ముప్పుతిప్పలు పెట్టడం దీనికి ఉదాహరణ.  


కుంభకోణాల దర్యాప్తులో కొన్ని కీలక పత్రాల గల్లంతుకు రాజీవ్‌కుమార్‌ కారణమయ్యారని అనుమానం వస్తే సీబీఐ చేయాల్సిందేమిటి? 40మందిని ఆయన కార్యాలయంపైకి దండయాత్రకు పంపటమా? కేంద్ర, రాష్ట్రాల మధ్య పొరపొచ్చాలున్నప్పుడు సీబీఐ లాంటి సంస్థ తన విధుల్ని అత్యంత జాగురూకతతో నిర్వహించాలి. ఈ విషయమై పార్లమెంటులో తృణమూల్‌ సభ్యులు ఆందోళన చేసినప్పుడు కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ ఇచ్చిన జవాబు సమర్థనీయంగా లేదు. ఆయన చెప్పినట్టు సుప్రీంకోర్టు ఆదేశాలతో జరిగే దర్యాప్తులో భాగంగా సీబీఐ వెళ్లినట్టయితే, ఆ సంస్థ అందుకు తగిన విధానాలు పాటించాల్సింది. బలప్రదర్శన చేసి సీబీఐ ఏం సాధించదల్చు కుందో అర్ధం కాదు. రాజీవ్‌కుమార్‌ ప్రైవేటు వ్యక్తి కాదు. ఆయన అజ్ఞాతంలోకి పోయే అవకాశం లేదు. తగిన నోటీసులిచ్చి విచారించడానికి వస్తామని చెప్పడం, అందుకాయన స్పందించకపో యినా, నిరాకరించినా న్యాయస్థానం ద్వారా తగిన చర్యలు తీసుకోవడం సీబీఐ విధి. అవతలివారు అక్రమాలకు పాల్పడుతున్నారు గనుక తాము సైతం అదే దోవన వెళ్లాలనుకోవడం సరైంది కాదు. రెండు కుంభకోణాలపైనా దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు విచారణ జరిపి సీబీఐకి సహ కరించాలని రాష్ట్రాన్ని ఆదేశించిన మాట వాస్తవమే. కానీ అలా చెప్పి నాలుగున్నరేళ్లు దాటుతోంది. ఇన్నే ళ్లుగా సీబీఐ ఏం చేసినట్టు? ఎన్నికలు సమీపిస్తుండగా ఇప్పుడే ఎందుకంత ఉత్సాహం పుట్టుకొచ్చినట్టు? ఇంతకూ సుప్రీంకోర్టు ఈ కేసుల్ని పర్యవేక్షించడం లేదు. దీనికి సంబంధించిన అన్ని అంశాలనూ కోల్‌కతా హైకోర్టుకు నివేదించమని అప్పట్లోనే తెలిపింది. రాష్ట్ర పోలీస్‌ అధికారులకు సీబీఐ జారీచేసిన సమన్లను హైకోర్టు నిలిపేసింది. ఈ దశలో ఎలాంటి ముందస్తు సమాచారమూ లేకుండా, హైకోర్టు అనుమతి కూడా కోరకుండా సీబీఐ వెళ్లడంలోని ఔచిత్యమే మిటో అర్ధంకాదు.


అయితే ఈ విషయంలో మమతను, ఆమెను సమర్థిస్తున్న విపక్షాల నైతికతను కూడా ప్రశ్నించాల్సి ఉంది. వ్యవస్థల్ని ధ్వంసం చేయడంలో, వాటిని భ్రష్టుపట్టించడంలో ఈ పార్టీల పాత్ర కూడా తక్కువేమీ కాదు.  మమత మొదలుకొని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు వరకూ అందరూ అందరే. సామాజిక మాధ్యమాల్లో తన ఫొటో పెట్టి వ్యంగ్యంగా వ్యాఖ్య రాసినందుకు విశ్వవిద్యాలయం ప్రొఫెసర్‌ ఒకరిని మమత అరెస్టు చేయించిన తీరు ఎవరూ మర్చిపోరు. చంద్ర బాబు ఈ విషయంలో మరింత ఘనుడు. ఆయన విపక్షంలో ఉన్నప్పుడే నాటి యూపీఏ ప్రభుత్వంతో, కిరణ్‌కుమార్‌ రెడ్డి సర్కారుతో కుమ్మక్కయి సకల వ్యవస్థల్ని భ్రష్టు పట్టించి, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై కక్ష సాధింపు చర్యలకు ఎలా ఉసిగొల్పారో అందరికీ గుర్తుంది. ముఖ్యమంత్రి అయ్యాక సైతం ఆయన అధికార యంత్రాంగాన్ని తన స్వప్ర యోజనాల కోసం ఎడాపెడా వాడుకుంటున్నారు. అందుకే ఈ బాపతు నేతల పోరాటంపై అందరూ పెదవి విరుస్తున్నారు. అన్ని పార్టీలూ ఆ తానులోని ముక్కలే అని తెలిసినప్పుడు ప్రజల్లో నిరాశానిస్పృహలు కలగడం సహజం. చిత్తశుద్ధితో రాజ్యాంగానికి కట్టుబడినప్పుడే ప్రజా స్వామ్యం నిలబడుతుందని నేతలందరూ గ్రహించాలి. తాము ఇష్టానుసారం వ్యవహరిస్తామని, తమ జోలి కొస్తే మాత్రం యాగీ చేస్తామంటే ఎవరూ సమర్థించరు. 

>
మరిన్ని వార్తలు