నిర్లక్ష్యమే నిప్పంటించింది

1 Feb, 2019 00:15 IST|Sakshi

భాగ్యనగరం అనగానే గుర్తుకొచ్చే అపురూపాల్లో ఒకటిగా... ఎన్నో తరాలకు ఒక తీయని జ్ఞాప కంగా ఉంటూ వస్తున్న నుమాయిష్‌ బుధవారం రాత్రి ఉన్నట్టుండి మంటల్లో చిక్కుకుంది. ఈ ప్రమాదంలో దాదాపు 400 దుకాణాలు దగ్థమయ్యాయంటే, జరిగిన ఆస్తినష్టం రూ. 60 కోట్ల మేర ఉన్నదంటే... గురువారం సాయంత్రానికి కూడా మంటలు పూర్తిగా అదుపులోకి రాలేదంటే దీని తీవ్రతేమిటో అర్ధమవుతుంది. ఆ సమయంలో దాదాపు 50,000మంది సందర్శకులున్నా వారంద రినీ సురక్షితంగా బయటకు పంపడం ఊరటనిస్తుంది. ఇందుకు పోలీసుల్ని, అగ్నిమాపక సిబ్బం దిని, విపత్తు నివారణ బృంద సభ్యుల్ని అభినందించాలి. అయితే ప్రమాదాలను అంచనా వేయడంలో, వాటి నివారణకు అవసరమైన చర్యల్ని అమల్లోకి తీసుకురావడంలో అటు అధికార యంత్రాంగం, ఇటు నుమాయిష్‌ నిర్వాహకులు కూడా విఫలమైన తీరు ఆశ్చర్యం కలిగిస్తుంది. ఇదేమీ కొత్తగా మొదలైన వేడుక కాదు. చిరు వ్యాపారులను ఆదుకోవడం కోసం నిజాం పాలకుడు 79 ఏళ్లనాడు దీన్ని ప్రారంభించాడు. ఏటా నెలన్నరపాటు లక్షలాదిమంది ఈ నుమాయిష్‌ను సందర్శిస్తారు. నిజానికి అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన పేరిట దీన్ని నిర్వహిస్తున్నా జనం నానుడిలో ఇది నుమాయిష్‌గానే ఉంది.

ఈశాన్య రాష్ట్రాలతో సహా దేశం మూలమూలలనుంచీ చిరు వ్యాపారులంతా దీనికోసం తరలివస్తారు. వారు కేవలం తమ తమ ప్రాంతాల్లో చేతివృత్తులవారు, గ్రామీణ ప్రాంత హస్త కళాకారులు, చిన్న పరిశ్రమలవారు రూపొందించిన ఉత్పత్తులను తీసుకు రావడం మాత్రమే కాదు...అక్కడి సంస్కృతీ సంప్రదాయాలను కూడా మోసుకొస్తారు. ఆ రకంగా నుమాయిష్‌ భిన్న ప్రాంతాలమధ్య సజీవమైన, బలమైన అనుబంధం ఏర్పడేందుకు దోహద పడుతోంది. సందర్శకులు ప్రతి ఏటా క్రమం తప్పకుండా హాజరుకావటానికి ఉత్సాహం చూపడం లోని రహస్యం ఇదే. ఎగ్జిబిషన్‌ నిర్వాహణకు ప్రత్యేకంగా ఒక సొసైటీ దశాబ్దాలుగా పనిచేస్తోంది.  కానీ ఇన్నేళ్ల అనుభవం నుంచి వారు నేర్చుకున్నదేమీ లేదని తాజా ప్రమాదం చాటుతోంది. వారి వైఫల్యం మాట అటుంచి కనీసం పోలీసు యంత్రాంగం, అగ్నిమాపక విభాగం, విపత్తు నివారణ సంస్థల అధికారులైనా సక్రమంగా వ్యవహరించలేకపోయారు. ఎగ్జిబిషన్‌ ప్రారంభానికి ముందే ఆ ప్రాంతాన్ని సందర్శించి లోటుపాట్లను ఎత్తిచూపి సరిచేసే బాధ్యత తీసుకోవద్దా? కేవలం అదృష్టవ శాత్తూ ఇన్నేళ్లుగా ప్రమాదాలు జరగలేదు తప్ప, అందుకోసం ముందస్తుగా తీసుకున్న ప్రత్యేక చర్య లేమీ లేవని ఈ దుర్ఘటన అనంతరం బయటపడిన అంశాలు స్పష్టం చేస్తున్నాయి. 

భారీయెత్తున జనం హాజరయ్యే సందర్భాలున్నప్పుడు వారి భద్రత కోసం అమలయ్యే చర్య లేమిటని ఆరా తీయడం ముఖ్యం. అది లేనప్పుడు అనుభవాలనుంచి మనం గుణపాఠాలు నేర్చు కోవడం లేదని అర్ధం. మన దేశంలో కావొచ్చు... వేరే దేశాల్లో కావొచ్చు, గతంలో ఎన్నో అగ్ని ప్రమా దాలు, తొక్కిసలాటలు చోటుచేసున్నాయి. 1995లో హరియాణాలోని ఒక పట్టణంలో పాఠశాల వార్షికోత్సవంలో వేదిక అంటుకుని 450 మంది పిల్లలు సజీవ దహనమయ్యారు. 2011లో కోల్‌క తాలో ఒక ఆస్పత్రి మంటల్లో చిక్కుకుని 90 మంది మరణించారు. నాలుగేళ్లక్రితం ఢిల్లీలోని ఎయి మ్స్‌లో ఉన్న ఒక వార్డులో మంటలు చెలరేగాయి. జరిగే అగ్ని ప్రమాదాల్లో దాదాపు సగం వాటికి విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూటే కారణమని దేశవ్యాప్తంగా జరిగిన పలు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. కనుక ఎగ్జిబిషన్‌ వంటివి నిర్వహిస్తున్నప్పుడు ఈ విషయంలో అత్యంత అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా విద్యుత్‌ వినియోగానికి ఉపయోగించే వైర్ల నాణ్యత ఏపాటో తనిఖీ చేయడం అవసరం. అలాగే ఒకే కనెక్షన్‌ నుంచి వేర్వేరు దుకాణాలకు విద్యుత్‌ సరఫరా చేయడం ప్రమాదం తెస్తుంది. దుకాణాల ఏర్పాటుకు కట్టెలు ఉపయోగించడం, త్వరగా మంటలు వ్యాపించడానికి ఆస్కారమిచ్చే సిల్కు, పాలియెస్టర్‌ వస్త్రాలను వాటి రూపకల్పనలో వాడటం ముప్పు కలిగిస్తుంది. నుమాయిష్‌ ద్వారా వచ్చే ఆదాయాన్ని సమాజ సేవకు ఉపయోగిస్తున్నామని నిర్వాహకులు చెబుతున్నారు. మంచిదే. కానీ అక్కడ ఏర్పాటు చేసే దుకాణాల విషయంలో ఇటీవల వ్యాపార దృక్పథమే ఎక్కువ కనిపిస్తున్నదని చాలామంది చెబుతున్నారు. ఒక్కో దుకాణాన్ని రూ. 70,000 చొప్పున అద్దెకివ్వడం వల్ల అంత మొత్తాన్ని భరించలేనివారు ఆ చోటును మరో ఇద్దరు ముగ్గురితో కలిసి పంచుకుంటు న్నారు. దాంతో సహజంగానే విద్యుత్‌ వినియోగం పెరుగుతుంది. సరఫరా తీగలపై అధిక భారం పడుతుంది. ఇవన్నీ నుమాయిష్‌ నిర్వాహకుల దృష్టికి రాలేదంటే ఏమనుకోవాలి?

ప్రమాదాలు జరిగిన పక్షంలో సురక్షితంగా జనాన్ని తరలించడానికి, మంటలను సాధ్య మైనంత త్వరగా అదుపులోనికి తెచ్చేందుకు అనువుగా దుకాణాల డిజైన్‌ రూపొందాలి. పొగ బయ ల్దేరిన వెంటనే అలారం మోగి అప్రమత్తం చేసే ఏర్పాటుండాలి. ఏదైనా అనుకోనిది సంభవించి నప్పుడు ఫైరింజన్లు రావడానికి ఉన్న మార్గాలేమిటో, అక్కడుండే అడ్డంకులేమిటో పరిశీలించాలి. నుమాయిష్‌ వంటి అతి పెద్ద సందర్భంలో ఇవి తప్పనిసరి. అలాగే ప్రతి దుకాణం వద్దా మంటల్ని ఆర్పే పరికరాలు ఉంచాలి. వాటిని ఉపయోగించడం ఎలాగో దుకాణదారులకు నేర్పాలి. అదే అమలు చేసి ఉంటే ఫైరింజన్లు వచ్చేలోగా దుకాణదారులంతా ఒక్కటై మంటల్ని అదుపు చేసేవారు. నష్టం కనిష్టంగా ఉండేది. ఈ తరహా భద్రతా ప్రమాణాల మాట అటుంచి ప్రమాద సమాచారం అందుకుని వచ్చిన ఫైరింజన్లలో నీళ్లే సరిగా లేవు. ఈ దుర్ఘటనలో నష్టపోయిన దుకాణదారులకు ఆదుకుంటామంటున్నారు. అది సాధ్యమేనా? ఎందరో వ్యాపారులు స్థిరచరాస్తులు కుదువ పెట్టు కుని వచ్చారు. అలాంటివారంతా సర్వస్వం కోల్పోయారు. తిరిగి వెళ్లడానికి కూడా వారిదగ్గర డబ్బు లేదంటే నష్టం ఏ స్థాయిలో ఉందో అంచనా వేయొచ్చు. నిర్వాహకుల నిర్లక్ష్యం, దురాశ, అధికార యంత్రాంగంలో కొరవడిన ముందుచూపు దుకాణదారుల బంగారు భవిష్యత్తుకు నిప్పంటిం చాయి. ఇందుకు ఎవరికి శిక్ష పడాలి? 

మరిన్ని వార్తలు