వలసల కమిషన్‌తో చేటు

27 May, 2020 00:17 IST|Sakshi

కరోనా వైరస్‌ మహమ్మారి ముంచుకొస్తున్న తరుణంలో దేశవ్యాప్తంగా విధించిన లాక్‌డౌన్‌ అందరి కన్నా ముందు కాటేసింది వలసజీవుల్ని. రోజూ దేశంలో లక్షలాదిమంది జాతీయ రహదార్ల వెంట, రైలుపట్టాల పొడవునా నడుచుకుంటూ వెళ్తున్న దృశ్యాలు ప్రపంచంలో మన ప్రతిష్టను దెబ్బ తీశాయి. లాక్‌డౌన్‌ విధిస్తే వచ్చే పర్యవసానాలను అంచనా వేసుకుని, అందుకవసరమైన ముందస్తు చర్యలు అమలు చేసివుంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు. ప్రభుత్వాల మాటవిని వున్నచోటే వుండిపోతే ఆకలిచావు ఖాయమని నిర్ధారించుకున్నాకే వలసజీవులంతా స్వస్థలాల బాట పట్టారు. వారి కష్టా లను విని, చూసి ఎన్నో స్వచ్ఛంద సంస్థలు, సోనూ సూద్‌ వంటి చలనచిత్ర నటులు రంగంలోకి దిగి చేతనైనంత చేశారు. చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి మానవతా దృక్పథంతో రాష్ట్రంలోని వలసజీవుల గురించి మాత్రమే కాక... రాష్ట్రం మీదుగా నడిచివెళ్తున్నవారిని సైతం పట్టించుకుని రైళ్లు, బస్సుల ద్వారా వారి వారి స్వస్థలాలకు తరలించే ఏర్పాటు చేశారు. దానికి ముందు వారందరికీ ఆశ్రయం కల్పించి, కడుపునింపారు. వారి కనీసావసరాలు తీరేలా చూశారు.

దేశంలో అన్ని ప్రభుత్వాలూ ఇలా చేసివుంటే వలసజీవులకు సమస్యలే ఎదురయ్యేవి కాదు. కనీసం ఇప్పుడైనా వలసజీవుల వెతలపై అందరూ దృష్టి సారించాలి. వారి సంక్షేమం కోసం ఏంచేయాలో, ఇప్పుడెదురైన చేదు అనుభవాలు భవిష్యత్తులో ఎదురుకాకూడదనుకుంటే ఎలాంటి చట్టాలు చేయడం అవసరమో లోతుగా ఆలోచించాలి. కానీ ఆ క్రమంలో అసలుకే ఎసరుతెచ్చే పనులకు దిగ కూడదు. ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం ఆదివారం ప్రకటించిన నిర్ణయం ఈ మాదిరే వుంది. ప్రభుత్వ అదనపు ప్రధాన కార్యదర్శి అవనీష్‌ అవస్థీ చెబుతున్న ప్రకారం ఆ రాష్ట్రం వలసల కమిషన్‌ ఏర్పాటు చేయబోతోంది.  ప్రాజెక్టులకైనా, ఇతర పనులకైనా కార్మికులు అవసరమనుకున్న రాష్ట్రాలు ఈ కమిషన్‌ను సంప్రదించాల్సివుంటుంది. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ కూడా ఈ సంగతే చెప్పారు. కార్మికులను కావాలని అడిగిన రాష్ట్రం, ఆ కార్మికుల సంక్షేమానికి, వారి సామాజిక భద్ర తకు ఎలాంటి చర్యలు తీసుకోదల్చుకున్నదో కమిషన్‌కు ఏకరువు పెట్టాలట. బీమా సదుపాయం కల్పిస్తామని హామీ ఇవ్వాలట. చూడ్డానికిది మంచిగానే కనిపిస్తుంది. వలస కార్మికులుగా వెళ్లేవారికి ఇకపై ఎలాంటి సమస్యలూ వుండబోవన్న అభిప్రాయం కలుగుతుంది. కానీ సారాంశంలో వారికి కలిగే మేలు కన్నా కీడే ఎక్కువ. 

మన దేశంలోవున్న కార్మికుల్లో 82 శాతంమంది అసంఘటిత రంగానికి చెందినవారు. దేశం లోని సమస్థ మౌలిక సదుపాయాలకూ వీరే వెన్నెముక. మాల్స్, మల్టీప్లెక్స్‌లు, అపార్ట్‌మెంట్లు, హోటళ్లు, ఆసుపత్రులు, ఫ్యాక్టరీలు అన్నీ వీరి శ్రమశక్తితోనే నిర్మాణమవుతాయి. కార్యకలాపాలు సాగిస్తాయి. ఆకాశ హర్మ్యాలకు రంగులద్దినా, గూడ్స్‌ రైళ్లనూ, ట్రక్కులనూ సరుకులతో నింపినా, రిక్షాలు లాగినా, ఆటోలు నడిపినా, తోపుడు బళ్లపై ఆధారపడినా, ఆహారమో, సరుకులో ఇంటింటికీ అందించినా అంతా వీరి చలవే. రోడ్లపక్క పండ్లు, పూలు, కూరగాయలు, టీలు, టిఫిన్లు అమ్మేది వీరే. ఈ పనులు చేసేవారిలో అత్యధికులు దళితులు, ఆదివాసీలు, మైనారిటీలు. పుట్టినచోటే  ఏదో ఒక పని దొరికితే...కన్నవారిని విడిచి, భార్యాబిడ్డల్ని వదిలి వేల కిలోమీటర్ల దూరం దాటి రావల్సిన అవసరం వీరికి వుండదు. ఇలా నగరాలకొస్తున్నవారంతా ఎంతటి దుర్భరమైన స్థితిలో బతుకు లీడుస్తున్నారో చూస్తే దిగ్భ్రాంతి కలుగుతుంది. ప్రభుత్వాలన్నీ సంఘటిత రంగాన్ని పట్టించు కుంటూ, ఆ రంగంలోనివారికి పనికొచ్చే నిర్ణయాలు మాత్రమే తీసుకుంటున్నాయి. దేశ సంపద పెంచడంలో కీలకపాత్ర పోషిస్తున్న వలసజీవుల్ని పూర్తిగా ఉపేక్షిస్తున్నాయి. చెప్పుకోవడానికి  పేదరిక నిర్మూలన పథకాలు దేశంలో చాలానే వున్నాయి. కానీ అవి పెద్దగా ఉపయోగపడటం లేదు. లాక్‌డౌన్‌ విధించాక ఇదంతా బద్దలైంది. వలస జీవులకు ఇన్ని దశాబ్దాలుగా ప్రభుత్వాలు చేసిందేమీ లేదని వెల్లడైంది. కనీసం ఇకపై చేయాల్సిందేమిటన్న అంశంపై ప్రభుత్వాలు దృష్టి కేంద్రీకరించాలి.

 అందుకు బదులు ‘మా రాష్ట్రంనుంచి పనుల కోసం పోయిన వలస కార్మికుల్ని మహారాష్ట్ర వంటిచోట్ల దారు ణంగా చూశార’ంటూ ఆరోపణలు చేయడం తగని పని. వేరే రాష్ట్రాలనుంచి తమ రాష్ట్రం వచ్చిన వలస కార్మికులకు సైతం ఆ మాదిరి పరిస్థితులే ఎదురయ్యాయని ఆదిత్యనాథ్‌ తెలుసుకోవడం మంచిది. అంతా బాగుంటే పదకొండేళ్ల పసివాడు తబారక్‌ వారణాసి నుంచి మూడు చక్రాల సైకిల్‌పై తల్లిదండ్రులను ఎక్కించుకుని 400 కిలోమీటర్ల దూరంలోని స్వగ్రామానికి వెళ్లాల్సిన దుస్థితి దాపురించేది కాదు. జన్‌సాహస్‌’ అనే సంస్థ గత నెల నిర్వహించిన సర్వేలో 3,196మందిని ఇంటర్వ్యూ చేయగా 62 శాతంమందికి సంక్షేమ పథకాల గురించి ఏమాత్రం తెలియదు. వలస జీవులతో పనులు చేయించుకుంటున్న యజమానుల్లో అత్యధికులు వారికి సంబంధించి ఎలాంటి రికార్డులూ నిర్వహించరు. కార్మికులకు న్యాయంగా దక్కవలసినవి ఎగ్గొట్టడం కోసం చాలా తక్కువ మందిని లెక్కల్లో చూపుతారు. పర్యవేక్షించాల్సిన ప్రభుత్వ యంత్రాంగాలు నిద్ర నటిస్తాయి. యోగి ఆదిత్యనాథ్‌ ముందుగా వాటిని సరిచేసే పనికి పూనుకోవాలి. సరదా కోసమో, కాలక్షేపం కోసమో ఎవరూ అయినవాళ్లను వదిలి పనుల కోసం వేల కిలోమీటర్లు వలస వెళ్లరు. యూపీలో ఈ రెండు మూడు దశాబ్దాల్లో వచ్చిన పరిశ్రమలు లేవు. గత మూడు నాలుగేళ్లుగా బీజేపీ ప్రభుత్వం ఆ విష యంలో పెద్దగా చేసిందేమీ లేదు. నిజంగా యూపీవారికి వేరేచోట్ల అన్యాయం జరిగిందనుకుంటే ఆ కార్మికులకు స్వరాష్ట్రంలో ఉపాధి చూపించే దిశగా పథకాలు రూపొందించాలి. వారి కుటుంబాలకు బతుకు భయం లేకుండా చూడాలి. అందుకు తగిన ప్రణాళికలను రచించాలి. వలసల కమిషన్‌ వంటివి ఆచరణలో  కార్మికులకు ఉపయోగపడకపోగా, వారి హక్కుల్ని కాలరాస్తాయి.

Read latest Editorial News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా