చార్జీల బేరసారాలు

5 May, 2020 00:12 IST|Sakshi

లాక్‌డౌన్‌ మూడో దశలోకి ప్రవేశించాక కొత్త సడలింపులు అమల్లోకి రావడం మొదలైంది. ముఖ్యంగా దేశంలో 40 రోజులుగా ఎక్కడికక్కడ చిక్కుకున్న వలసజీవుల్ని స్వస్థలాలకు తరలించడానికి రైళ్లు నడపాలని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వారిలో సంతోషాన్ని నింపింది. చేయదగ్గ పనులున్నాయని తెలిస్తే ఎన్ని వందల కిలోమీటర్లయినా వెళ్లడం అలవాటైన ఆ అభాగ్యుల్ని హఠాత్తుగా అమల్లోకి వచ్చిన లాక్‌డౌన్‌ కోలుకోలేని దెబ్బతీసింది. దుర్భరమైన బతుకీడుస్తూ ఇన్నాళ్లుగా అంతో ఇంతో సంపాదించుకున్న సొమ్ములు కాస్తా ఆవిరయ్యాయి. అర్థాకలితో రోజులు గడుపుతున్నా ఇదే దుస్థితి. దానికితోడు వందల కిలోమీటర్ల దూరంలోని తమ ఆప్తులు పడుతున్న కష్టాలు వారిని మరింత కుంగదీశాయి. క్షణం వుండలేక లక్షలాదిమంది వెంటనే సొంతూళ్లకు కాలి నడకన తరలి పోతే... రోజులు గడిస్తే అంతా సర్దుకుంటుందని ఆగినవారు సైతం ఆకలిని తట్టుకోలేక అటుతర్వాత నడక మొదలుపెట్టారు.

కొందరైతే సిమెంట్‌ మిక్సర్‌ ట్రక్కువంటి ప్రమాదకర ప్రయాణ సాధనాలు ఎంచుకున్నారు. ఎందరు ఎన్నివిధాల చేస్తున్నా సాయం అందనివారు లెక్కకు మిక్కిలి వున్నారు. ఇలాంటివారిలో సహనం నశించింది. తమను స్వస్థలాలకు పోవడానికి అనుమతించమంటూ దాదాపు అన్ని రాష్ట్రాల్లోనూ వలసజీవులు తిరగబడటం మొదలుపెట్టారు. ఇలాంటి సమయంలో ప్రత్యేక రైళ్లు నడిపి తరలించడానికి నిర్ణయించడం మెచ్చదగ్గదే అయినా, యధాప్రకారం ఈ నిర్ణ యంలో కూడా అయోమయం చోటుచేసుకుంది. ‘శ్రామిక్‌ స్పెషల్‌’ పేరిట నడపదల్చుకున్న ఈ రైళ్లు ఎక్కదల్చుకున్నవారి నుంచి టిక్కెట్టుకయ్యే మొత్తాన్ని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు వసూలు చేసి ఇవ్వా లన్న నిబంధన విధించి రైల్వేశాఖ అందరినీ దిగ్భ్రాంతిపరిచింది. అన్నివైపులనుంచీ విమర్శలు వెల్లు వెత్తాక కేంద్రం జోక్యం చేసుకుని 85 శాతం తాము భరిస్తామని, 15 శాతం రాష్ట్ర ప్రభుత్వాలు భరిస్తే సరిపోతుందని నిబంధనను సవరించింది. అయితే రైళ్లలో ఎక్కేవారికి ఆహారం, భద్రత, ఆరోగ్య పరీ క్షలు రాష్ట్రాలే చూసుకోవాలట. ప్రయాణం 12 గంటలు మించితే ఒక భోజనానికయ్యే ఖర్చు తాము భరిస్తామని తెలిపింది. 

ఈ కష్టకాలంలో వలసజీవుల తరలింపు వ్యవహారం దగ్గరకొచ్చేసరికి డబ్బు గుర్తుకురావడం ఎవరికైనా వింతగానే అనిపిస్తుంది. ఎందుకంటే గడిచిన నలభైరోజుల్లో విదేశాల్లో చిక్కుకున్నవారిని విమానాల్లో తీసుకొచ్చిన సందర్భాలున్నాయి. వారిని ఎవరూ డబ్బు అడగలేదు. సమస్య ఎలాంటిదో తెలుసుగనుక ఎవరూ దానిపై ప్రశ్నించలేదు కూడా. అయితే హఠాత్తుగా రైల్వే విభాగం ఈ చార్జీలను తెరపైకి తెచ్చింది. సోమవారం తాజాగా కేంద్రం విడుదల చేసిన మార్గదర్శకాల్లో కూడా చార్జీల ప్రస్తా వన వచ్చింది. విదేశాల్లోవుండి వెనక్కి తిరిగి రాదల్చుకున్నవారి కోసం విమానాలు, నౌకలు నడు పుతామని ప్రయాణ ఖర్చులు వసూలు చేస్తామని ఆ ప్రకటన చెబుతోంది. దీనిసంగతలావుంచి వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు పొరుగు రాష్ట్రాల్లో చిక్కుకున్న వివిధ వర్గాలకు చెందినవారిని తీసుకు రావడానికి బస్సులు వినియోగించాయి. అందుకు చార్జీలు వసూలు చేయలేదు. ఇప్పుడు అసలే అంతంతమాత్రం జీవితాలు గడుపుతూ, దిక్కుతోచని స్థితికి చేరుకున్న వలస జీవులనుంచి రాష్ట్ర ప్రభుత్వాలు 15 శాతం మొత్తాన్ని వసూలు చేయలేవు. అలాగని ఆ వ్యయాన్నంతటినీ భరించడం ఇప్పుడున్న స్థితిలో అసాధ్యం.

అటు వలసజీవుల సంగతి చూస్తే, వారిలో 65 శాతంమంది దగ్గర కనీసం వంద రూపాయలు కూడా లేవని కొన్ని స్వచ్ఛంద సంస్థలు చెబుతున్నాయి. విద్యార్థులు చెల్లించాల్సిన చార్జీలు తాము భరిస్తామని, కానీ వలసజీవులు ముందుగా చార్జీలు చెల్లించి వస్తే, 21 రోజుల పర్యవేక్షణను ముగించుకున్నాక ఆ డబ్బు తిరిగిస్తామని బిహార్‌ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీష్‌ కుమార్‌ చెబుతున్నారు. మహారాష్ట్ర కూడా ఈ మాదిరే చెప్పింది. వలసజీవులు కొంత భరించాలని సూచించింది. ఇతర రాష్ట్రాలు 15 శాతం వ్యయాన్ని భరించడానికి సిద్ధపడ్డాయి. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో రాష్ట్రాలను ఏమీ అనడానికి లేదు. అనుకోకుండా వచ్చిపడిన ఈ ఆపద నుంచి గట్టెక్కడం కోసం అవి సర్వశక్తులూ ఒడ్డుతున్నాయి. ఈ క్రమంలో ఎదురవుతున్న సవాళ్లు, ఇబ్బందులు పంటి బిగువన భరిస్తున్నాయి. చికిత్స చేయించుకునేవారి కోసం, పర్యవేక్షణ కేంద్రాల్లో వున్నవారి కోసం, కొత్తగా కరోనా వ్యాధిగ్రస్తులను గుర్తించడం కోసం అవి పెద్దయెత్తున వనరులను సమీకరించవలసి వస్తోంది. ఈ క్రమంలో ఎడాపెడా వ్యయం చేయాల్సి వస్తోంది.

ప్రధాని నరేంద్ర మోదీతో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడిన ప్రతిసారీ తమకు ఆర్థిక సాయం అందించాలని ముఖ్యమంత్రులంతా మొర పెట్టుకుంటున్నారు. రాష్ట్రాలకు వివిధ పద్దుల కింద రావలసిన మొత్తం కేంద్రం వద్ద పెండింగ్‌లో వుండటం, లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఆదాయం పూర్తిగా పడిపోవడం వంటి కారణాలతో తమకు తక్షణ సాయం అవసరమని వారు కోరుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వలసజీవుల్ని తరలించడానికయ్యే వ్యయంలో చిన్న భాగాన్ని తమపై మోపినా రాష్ట్రాలు తట్టుకునే స్థితిలో లేవు. వాస్తవానికి ఇలా భారీ సంఖ్యలో తిరిగి వస్తున్నవారందరికీ వసతి కల్పించడం, వారికి భోజన సదుపాయాలు కలగజేయడం వాటికి పెద్ద సమస్య. 

రైల్వేలకు సైతం సమస్యలున్న మాట నిజమే కావొచ్చు. దాన్నెవరూ కాదనరు. కానీ ఇంతటి పెను సంక్షోభం ఎదురైనప్పుడు బేరసారాలాడటం కాకుండా...అయోమయానికి తావివ్వకుండా ముందు కేంద్రంతో మాట్లాడి పకడ్బందీ విధానాన్ని రూపొందించుకుని వుంటే బాగుండేది. మొత్తం వ్యయాన్ని కేంద్రం భరించడమో, రాష్ట్రాలు చెల్లించే మొత్తాన్ని ఒకటి రెండేళ్లలో అందజేయాల్సి వుంటుందని చెప్పడమో చేస్తే వేరుగా వుండేది. వీటన్నిటి మాటా సరేగానీ...లాక్‌డౌన్‌కు సడలింపు లిచ్చి, కొన్నిచోట్ల పనులు ప్రారంభించడానికి గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చిన ఈ తరుణంలో వలసజీవుల్ని స్వస్థ లాలకు పంపేస్తే ఆ రంగాల్ని తెరిచి ప్రయోజనం ఏమిటి? 

మరిన్ని వార్తలు