జె.కె.రోలింగ్ రాయని డైరీ

8 Nov, 2015 04:15 IST|Sakshi
జె.కె.రోలింగ్ రాయని డైరీ

పిల్లలు పడుకున్నట్లున్నారు. అలికిడి వినిపించడం లేదు. పిల్లలతో పాటు స్కాట్లాండ్ రాజధాని పట్టణం ఎడిన్‌బరో కూడా నెమ్మదిగా నీలి రంగు పడక దీపాల మాంత్రిక భ్రాంతివర్ణంలోకి ఫ్యాంటసైజ్ అయినట్లుంది! శరత్కాలపు నులివె చ్చని చలిలో ఈ మహానగరపు చీకట్లు.. నిశ్శబ్దాన్ని వెలిగిస్తున్నాయి. నాకిష్టమైన చీకటి. నాకిష్టమైన నిశ్శబ్దం.

చీకటి గదిలో నేనొక్కదాన్నీ నిశ్శబ్దాన్ని వింటూ కూర్చున్నాను. ఆలోచనలు వాటికవే వచ్చి నన్ను అల్లుకుంటున్నాయి. లైటు వేసుకుని రాయడానికి కూర్చుంటే.. ఆ ఆలోచనలన్నీ సీతాకోక చిలుకలై ఎగిరిపోతే! వాటిని వెతికిపట్టి తేవడం ఎలా? పిల్లలు నమ్ముతారా.. రాత్రి మీ కోసం ఒక కథ రాయాలనుకున్నాను.. కానీ ఆ కథ రాత్రికి రాత్రే ఎగిరిపోయిందని చెబితే ఊరుకుంటారా? ఏ ఒడ్డుకు చేరుకుందో పడవ వేసుకుని వెళ్లి మరీ తెమ్మంటారు.

కదలకుండా అలా కూర్చునే ఉన్నాను. హారీ పోట్టర్ తర్వాత ఇంకేం లేకుండా పోదు కదా అన్న ఆందోళన ఒక్కటే నాలో కదులుతోంది. ఇంకొక్కటైనా రాయాలి పిల్లల కోసం. పిల్లల కోసం మాత్రమే కాదు, పెద్దవాళ్లను ‘ఛూ మంత్రకాళి’ అని పిల్లలుగా మార్చేయడం కోసం కూడా. వయసులు వేర్వేరు కావచ్చు. పిల్లలు, పెద్దలు ఎప్పటికీ వేర్వేరు కాదు. ఊహా జగత్తు.. పిల్లల్ని వాస్తవాలలో తేలియాడిస్తుంది. అదే ఊహా జగత్తు.. పెద్దల్ని ‘టే’ నదీ తీరప్రాంత గ్రామం అబర్‌ఫెల్డీ తీసుకెళ్లి అక్కడి వారాంతపు సంతలో వారి చేత మ్యాజిక్ వాండ్ కొనిపిస్తుంది. వారిని ఆడిస్తుంది. పాడిస్తుంది. బుగ్గలు ఉబ్బేలా బూర ఊదిస్తుంది.

‘పిల్లల్ని గాలికి వదిలిపెట్టినట్టు అలా ఊహా లోకాల్లోకి వదిలిపెడతామా మిస్ రోలింగ్!’ అని హారీ పోట్టర్ తొలికాపీ చూసి పెదవి విరుస్తూ పన్నెండు మంది పబ్లిషర్లూ ఒకేమాట అన్నప్పుడు నాకేం ఆశ్చర్యంగా అనిపించలేదు. ఊహల్లేకుండా పెరిగిన పిల్లలు వాళ్లు. అలాగే ఉంటారు. అలాగే అంటారు. ఊహకు స్వేచ్ఛను ఇస్తే వికసిస్తుంది. ఊహను బంధిస్తే వికటిస్తుంది.

అబర్‌ఫెల్డీ వెళ్లొచ్చి అప్పుడే వారం! హా.. హా.. యాభై ఏళ్ల ఒక వారం అనాలేమో! ‘జూలైలో అయిపోయింది కదా మీ బర్త్‌డే, మళ్లీ ఇప్పుడెందుకు సెలబ్రేట్ చేస్తున్నారు మిస్ రోలింగ్’ అని అడిగారు నా యాభయ్యవ జన్మదిన వేడుకలకు ప్రత్యేక ఆహ్వానంపై అబర్‌ఫెల్డీకి ప్రయాణమై వచ్చినవారు. నవ్వాను. ఆ ప్రశ్నకు నా దగ్గర సమాధానం లేదు. నవ్వు మాత్రమే ఉంది. కొద్దిగా భయం కూడా ఉందేమో! అప్పుడే యాభై!! యాభై అంటే సగమా? సంపూర్ణమా? పిల్లల కోసం మరో పుస్తకం రాసేందుకు త్వరపడవలసిన సమయమా?
 

మరిన్ని వార్తలు