ఉల్లి కన్నీరు తప్పదా?

25 Aug, 2015 00:35 IST|Sakshi

వంటింట్లోకి వచ్చాక కన్నీళ్లు తెప్పించే ఉల్లి ఇప్పుడు అంగట్లో ఉండగానే కన్నీరు పెట్టిస్తోంది. ధనిక, పేద తేడాల్లేకుండా ప్రజలందరి ఆహారంలో అనివార్యంగా ఉండాల్సిన ఉల్లి ధర  దాదాపు గత రెండు నెలల్లో ఇంచుమించు 160 శాతం పెరిగింది. కిలో ఉల్లి చిల్లర ధర ప్రస్తుతం రూ.70 నుంచి రూ. 80 వరకు ఉంది. ఈ వారంలోనే వందకు చేరేట్టుంది. ఏటా తప్పని ఈ ఉల్లి కష్టాలకు కేంద్ర ఫుడ్ ప్రాసెసింగ్ మంత్రి హరిసిమ్రన్ సింగ్ కౌర్ చిట్కాలాంటి పరిష్కారం సూచించారు. వర్షాకాలం పంట రావడానికి ముందూ, వేసవిలోనూ ఉల్లి సరఫరా తగ్గి ధరలు పెరుగుతుంటాయని, ధర తక్కువ ఉన్నప్పుడే ఉల్లిలోని నీటిని తొలగించి పొడిగానో లేదా పేస్టుగానో చేసి దాచుకుంటే ధరలూ పెరగవు, ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమా అభివృద్ధి చెందుతుందని సెలవిచ్చారు.


ఒక్క ఉల్లే కాదు, బంగాళదుంపలు, టమాటాల నుంచి తోటకూర కాడ వరకు అన్ని కూరగాయలు, ఆకుకూరలనూ, అరటి నుంచి మామిడి వరకు అన్ని పళ్లనూ పొడులు కొట్టేసే ప్రాసెసింగ్ యూనిట్లు రాత్రికి రాత్రే వచ్చి పడ్డాయనుకున్నా... ఆ పొడుల తిండి ఎవరు తినాలి? భిన్న దేశాల, ప్రాంతాల ప్రజల ఆహారపుటలవాట్లు ఆయా దే శాల, ప్రాంతాల జీవావరణ వ్యవస్థలోనూ, సంస్కృతిలోనూ భాగంగా రూపొందుతాయి. అవి అంత తేలికగా మారేవి కావు. ఉల్లి పొడి తయారుచేసినా దాన్ని జపాన్‌లాంటి దేశాలకు ఎగుమతి చేసుకోవాల్సిందే తప్ప, ఇక్కడి ఇల్లాళ్లు గుమ్మం తొక్కనివ్వరు. కౌర్ సూచన హాస్యాస్పదమైనదే అయినా, బీజేపీ, కాంగ్రెస్ తేడాల్లేకుండా అన్ని ప్రభుత్వాలూ మన వ్యవసాయ మార్కెట్లలో, ప్రత్యేకించి ఆహార మార్కెట్లలో ధరలు నిర్ణయమయ్యే తీరు పట్ల ప్రదర్శిస్తున్న ఉద్దేశపూర్వకమైన ఉదాసీనతకు అద్దం పడుతుంది.


కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు సహా అంతా ఏటా జూలై-సెప్టెంబర్ మధ్య ఉల్లి నిల్వలు తరిగి ధరలు పెరుగుతుంటాయనే చెబుతున్నారు. ఏటా తప్పని ఈ సమస్యకు ఇంతవరకు ఏ ప్రభుత్వమైనా ఎన్నడైనా స్వల్పకాలిక, దీర్ఘకాలిక చర్యలను చేపట్టిన దాఖలాలున్నాయా? ఏటా ఈ సమయంలో చిలుకపలుకుల్లా వినిపించే కూరగాయలు, పళ్లు నిల్వ చేయగల శీతలీకర ణ గిడ్డంగుల కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని లెసైన్స్‌లు జారీ చేశాయి, ఎన్ని ఒప్పందాలు కుదుర్చుకున్నాయి? ఏప్రిల్, మే మాసాలలో అకాల వర్షాలకు ఉల్లి దెబ్బతిన్న తర్వాతనైనా ఈ సమస్య వారికి పట్టిందా? సరిగ్గా మన్మోహన్ ప్రభుత్వంలాగే మోదీ ప్రభుత్వం కూడా ఉల్లి ధర మిన్నంటడం మొదలయ్యాక, అదీ ఉల్లికి మంచి ధర పలుకుతుంద నుకుంటున్న రైతు ఆశలపై నీళ్లు చల్లేలా దిగుమతులకు దిగడం తప్ప ఏమైనా చేసిందా? ఇప్పుడు 10,000 టన్నుల ఉల్లిని దిగుమతి చేసుకోవడం సెప్టెంబర్-అక్టోబర్‌లలో పంట చేతికి వచ్చే ఉల్లి రైతుల ప్రయోజనాలకు భంగకర మైనదేనని కేంద్ర ప్రభుత్వమే అంటోంది. ఇక ఉల్లి కనీస ఎగుమతి ధరలను భారీగా పెంచడం ఉల్లి ధరను ప్రభావితం చేయదు సరికదా, మన ఎగుమతిదార్లు విదేశీ మార్కెట్లను కోల్పోవాల్సి వస్తుంది.


ఉల్లి ధరలు ఇలా విపరీతంగా పెరగడానికి సరఫరా కొరత ప్రధాన కారణం కానే కాదు. కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ‘అగ్‌మార్క్‌నెట్’ దేశంలోని కూరగాయల మండీలకు వచ్చే ఉల్లి ధర ఈ జూలై-ఆగస్టు మాసాల మధ్య టన్నుకు రూ. 2,275 నుంచి రూ. 2,985కు, అంటే సగటున కేజీకి రూపాయి కంటే తక్కువ మేరకు పెరిగినట్టు తెలిపింది. కానీ ఆగస్టు మొదటి వారంలో టోకు మార్కెట్లలో ఉల్లి ధర కిలో రూ.25 ఉంటే చిల్లర మార్కెట్లలో రూ. 45-50 ఉంది! మూడు, నాలుగు రకాలకు తప్ప కూరగాయలకు కొరత లేకున్నా వర్షాలు ఆలస్య మని తెలిసిన తర్వాతనే కూరగాయల ధరలన్నీ పెరగడం మొదలైందని ఢిల్లీ ఆజాద్ పూర్ మండీ వర్గాలే చెబుతున్నాయి.


ఉల్లి ధరల గారడీ మొత్తంగా మన వ్యవసాయ ఉత్పత్తుల టోకు మార్కెట్ల దగాకోరు స్వభావాన్ని కళ్లకు కడుతుంది. 2013-14లో ఉల్లి దిగుబడి రికార్డు స్థాయికి, 1.93 కోట్ల టన్నులకు చేరింది. ఉల్లి జాతీయ వార్షిక వినియోగం 1.5 కోట్ల టన్నులు మాత్రమే. అయినా 2013లో ఉల్లి ధరలు ఇలాగే మండిపోయాయి.  ఆ ఏడాది ఒక్క నాసిక్‌లోనే 20 లక్షల టన్నుల ఉల్లిని అక్రమంగా నిల్వ చేశారని, నిల్వదార్లలో అత్యధికులు రాజకీయవేత్తలేనని నాసిక్ వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్ కమిటీ తెలిపింది. ఆ ఆగస్టు మాసంలో కేవలం నాలుగు రోజుల్లోనే అక్రమ నిల్వదార్లు రూ. 150 కోట్ల లాభం ఆర్జించినట్టు ఒక జాతీయ పత్రిక అప్పట్లోనే వెల్లడించింది.


దేశ చరిత్రలోనే అత్యంత బలమైన, దృఢసంకల్పం కలిగిన ప్రధానిగా కీర్తినందుకుంటున్న నరేంద్రమోదీ ప్రభుత్వం సైతం అలాంటి అక్రమ నిల్వదారుల ఆట కట్టించడానికి ఎందుకు పూనుకోలేదు? గత ప్రభుత్వం లాగే నేటి ప్రభుత్వం కూడా టోకు మార్కెట్ల ధరలకు, రిటైల్ మార్కెట్ల ధరలకు మధ్య ఉన్న అగాధాన్ని పూడ్చలేని అదే నిస్సహాయతను లేదా అయిష్టతను ప్రదర్శిస్తోందనేది చెప్పక తప్పని వాస్తవం.


కనీసం జాతీయస్థాయిలో కూరగాయల మార్కెట్లపై నిర్ణయాత్మక ప్రభావం చూపే ముంబైలోని వాషీ మండీ, ఢిల్లీలోని  ఆజాద్‌పూర్ మండీలపైనైనా కొరడా ఝళిపించగలిగితే అది దేశవ్యాప్తంగా ఫలితాలనిచ్చేది. ప్రధాని స్వాతంత్య్ర దినోత్సవ సందేశంలో ధరల అదుపునకు ప్రయత్నాలను కొనసాగిస్తామని చేసిన వాగ్దానం మాటలకే పరిమితమా? లేకపోతే వినియోగదారుల ధరల సూచీలో 12 శాతంగా ఉండే పప్పులు, కూరగాయలు, కోడిమాంసం ధరలు గిరాకీ, సరఫరాలతో సంబంధం లేకుండా రెక్కలు కట్టుకు ఎగురుతున్నా అక్రమ వ్యాపారులపైకి దృష్టి సారించరేం? ఉద్దేశం లేకగానీ, 1955నాటి అత్యవసర వస్తువుల చట్టం దుమ్ముదులిపేవారు కారా? ఉల్లిని చిన్న చూపుచూసినందుకే 1998లో పరాభవం పాలైనామన్న విషయాన్ని ఎన్డీఏ ప్రభుత్వం అప్పుడే మరిచిందా? లేకపోతే ఎన్నికలకు మూడేళ్లకు పైగా గడువుందనే ధీమానా?

మరిన్ని వార్తలు