ఓడీఎఫ్‌ లక్ష్యం నెరవేరిందా?

4 Oct, 2019 00:12 IST|Sakshi

దేశంలోని గ్రామీణ ప్రాంతాలు బహిరంగ మల విసర్జన రహిత(ఓడీఎఫ్‌)మయ్యాయని బుధవారం ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. ఆయన చెబుతున్న లెక్కల ప్రకారం దేశంలో గత అయిదేళ్లలో 60 కోట్లమంది ప్రజలకు 11 కోట్ల మరుగుదొడ్లను నిర్మించారు. కేంద్ర గృహ నిర్మాణ, పట్టణాభివృద్ధి శాఖ వివరాలనుబట్టి పశ్చిమబెంగాల్‌లోని 52 మున్సిపాలిటీలు మినహా దేశమంతా ఓడీఎఫ్‌ సాధించినట్టే. తొలిసారిగా ప్రధానిగా బాధ్యతలు స్వీకరించాక మోదీ స్వాతంత్య్ర దినో త్సవం రోజున ఎర్రకోట బురుజులపై నుంచి ప్రసంగిస్తూ ‘స్వచ్ఛ భారత్‌’ బృహత్తర కార్యక్రమానికి అంకురార్పణ చేశారు. 2019లో జరగబోయే మహాత్మా గాంధీ 150వ జయంతి నాటికి ఓడీఎఫ్‌ సాధించాలని అప్పట్లో మోదీ లక్ష్య నిర్దేశం చేశారు. దీనిపై ఆనాటినుంచీ అన్ని మాధ్యమాల్లో, అన్ని భాషల్లో విస్తృతంగా ప్రచారం చేశారు. మోదీ తానే స్వయంగా ప్రతి సందర్భంలోనూ దాని గురించి ప్రస్తావిస్తూ వచ్చారు.  అందువల్ల చెప్పుకోదగ్గ ఫలితం కూడా కనబడిందనడంలో సందేహం లేదు.

అయితే అది ఓడీఎఫ్‌ ప్రకటించేంత స్థాయిలో ఉందా అన్న విషయంలోనే అందరికీ సంశయం. స్వచ్ఛభారత్‌ కార్యక్రమంలో రెండు ప్రధానాంశాలున్నాయి. అందులో మరుగుదొడ్ల నిర్మాణం ఒకటైతే, ప్రజానీకం ప్రవర్తలో మార్పు తీసుకురావడం రెండోది. మరుగుదొడ్ల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం భారీయెత్తున నిధులు వ్యయం చేసింది. అయితే ఈ కార్యక్రమంలో ప్రధాన లోపం ఏమంటే, ఇంటి యజమానులు ముందుగా తమకు తాము మరుగుదొడ్లు నిర్మించుకోవాలి. వాటిని తనిఖీ చేసి అవి సక్రమంగా ఉన్నాయని సంతృప్తి చెందాక యజమానులకు పంచాయతీలు ఆ నిర్మాణానికైన ఖర్చు చెల్లిస్తాయి. ఒక మరుగుదొడ్డి కోసం కనీసం రూ. 15,000 అవసరమవుతాయి. అంత సొమ్ము సొంతంగా పోగేసుకుని నిర్మించుకోవడం ఎంతమందికి సాధ్యమవుతుంది? ఏమై తేనేం రిజిస్టరైన ప్రతి ఇంటి ఆవరణలోనూ ఇప్పుడు మరు గుదొడ్డి సదుపాయం ఉందని కేంద్రం అంటున్నది. అది జరిగిందనే అనుకుందాం. మరి ప్రజానీకం ప్రవర్తనలో మార్పు సంగతేమిటి? అసలు అది ప్రవర్తనకు సంబంధించిన సమస్యా లేక ఇతరత్రా సమస్యల పర్యవసానంగా ఏర్పడిందా? మరుగుదొడ్ల లెక్కలన్నీ దేశవ్యాప్తంగా 2012లో గ్రామీణ గృహ నిర్మాణ సంస్థలు, గ్రామీణాభివృద్ధి విభాగం పంచాయతీలతో కలిసి సంయుక్తంగా జరిపిన సర్వే ద్వారా వెల్లడైనవే. ఇప్పుడు దాని ప్రాతిపదికనే  ఓడీఎఫ్‌ ప్రకటించారు. అప్పట్లోనే ఎన్నో విమర్శలొచ్చిన ఆ గణాంకాల ప్రాతిపదికగా అంతా సవ్యంగానే ఉన్నదని చెప్పడం సరైందేనా?

మన దేశంలో బహిరంగ మల విసర్జన ఏనాటినుంచో ఒక ప్రధాన సమస్యగా ఉంది. మోదీకి ముందు పనిచేసిన ప్రధానులెవరూ దీన్నంతగా పట్టించుకోలేదుగానీ, ఇది తీవ్ర అనారోగ్య సమస్య లకు దారితీస్తోంది. ముఖ్యంగా మహిళలకు చెప్పనలవికాని సమస్యల్ని సృష్టిస్తోంది. పరిశుభ్రత భావన లేకపోవడం వల్లనే జనంలో ఈ అలవాటు పెరిగిందని చెప్పడం పూర్తిగా అవాస్త వమవుతుంది. వారు గత్యంతరం లేక, సిగ్గు విడిచి ఈ అలవాటు కొనసాగించవలసి వస్తున్నది. మరుగుదొడ్లు నిర్మించుకున్నా వాటి నిర్వహణకు అవసరమైన నీరు, ఫ్లష్‌అవుట్‌ సదుపాయం వగైరాలు సరిగా లేకపోతే ఆ మరుగుదొడ్లను ఉపయోగించుకోవడం సాధ్యం కాదు. అలాంటి లోపాలు ఉత్తరప్రదేశ్, ఒడిశా, బిహార్, జార్ఖండ్‌ వంటి రాష్ట్రాల్లో ఎన్నోచోట బయటపడ్డాయి. ఆ మరుగుదొడ్లు నిష్ప్రయోజనంగా పడి ఉండటంతో అనేకచోట్ల వాటిని చిన్న సైజు గోడౌన్లుగా వినియోగించుకుంటున్నారు. పట్టణ ప్రాంతాల్లో మురికివాడలు అధికం. దుర్భర దారిద్య్రంలో మగ్గుతూ రోజుకూలీపై ఆధారపడేవారు, చిన్న చిన్న పనులతో పొట్టపోసుకునేవారు అనేకమంది వాటిల్లో బతకవలసి వస్తోంది. అలాంటిచోట ఎవరికివారు మరుగుదొడ్లు ఎలాగూ ఏర్పాటు చేసుకోలేరు. కనీసం అందరూ వినియోగించుకోవడానికి నిర్మించిన సామాజిక మరుగుదొడ్లు సైతం సరైన నీటి సదుపాయం లేక అంతంతమాత్రంగా నడుస్తున్నాయి. ఇలాంటి పరిస్థితులున్నప్పుడు జనం బయటకు పోక తప్పడం లేదు. రాజస్తాన్, బిహార్‌ వంటిచోట్ల మరుగుదొడ్లు నిర్మిం చుకోకపోతే ఇతరత్రా సౌకర్యాలను ఆపేస్తామని ఒత్తిళ్లు తీసుకురావడం వంటివి చోటు చేసుకున్నాయి.

కొన్నిచోట్ల బహిరంగ మలవిసర్జనకు పోతున్నవారిని గేలిచేయడం, అవమా నించడం, బెదిరించడం వంటివి జరిగాయి. రాజస్తాన్‌లోని ఒక గ్రామంలో కేవలం 19శాతం ఇళ్లకు మాత్రమే మరుగుదొడ్లు ఉన్నాయని ఆగ్రహించి ఆ గ్రామానికి విద్యుత్‌ సదు పాయాన్ని నిలిపేశారు. మొన్నీమధ్య మధ్యప్రదేశ్‌లో నిరుపేద దళిత కుటుంబానికి చెందిన ఇద్దరు పిల్లలు బహిరంగ మల విసర్జన చేస్తున్నారని ఆగ్రహించి వారిని కొట్టి చంపిన ఉదంతం బయటికొచ్చింది. ఆ పిల్లల తండ్రి పక్కా ఇల్లు కోసం చేసిన దరఖాస్తును కావాలని పంచాయతీలో కొందరు బుట్టదాఖలు చేశారు. ఆ ఇల్లు దక్కితే తనకు కూడా మరుగుదొడ్డి ఉండేదని, తన పిల్లలు ప్రాణాలు కోల్పోయేవారు కాదని అతడు ఆవేదనపడుతున్నాడు. చిత్రమేమంటే ఆ గ్రామం కూడా ఓడీఎఫ్‌ జాబితాలో ఉంది. ఇలా సమస్య తీరకపోయినా జాబితాల్లోకెక్కిన గ్రామాలు మరెన్ని ఉన్నాయో?

స్వచ్ఛభారత్‌ కార్యక్రమం నిస్సందేహంగా బృహత్తరమైనది. దాన్ని విజయవంతంగా అమలు చేయగలిగితే ప్రజారోగ్యానికి అదెంతో మేలు చేస్తుంది. ఐక్యరాజ్యసమితి 2030నాటికి ప్రపంచ దేశాలన్నీ సాధించాలంటున్న సుస్థిరాభివృద్ధి లక్ష్యాల్లో పారిశుద్ధ్యం కూడా ఉంది. అందుకోసం కేంద్రప్రభుత్వం పెట్టిన శ్రద్ధ కూడా మెచ్చదగిందే. అయితే దాని అమలుకు ఎదురవుతున్న సమస్యలేమిటో తెలుసుకుని ఎప్పటికప్పుడు వాటిని పరిష్కరించుకుంటూ పోతే వేరుగా ఉండేది. ఇప్పుడైనా ఇలాంటి లోటుపాట్లను గుర్తించి, మరుగుదొడ్ల నిర్వహణ ఎలా ఉంటున్నదో తెలుసుకుని సరిచేస్తే స్వచ్ఛభారత్‌ అనుకున్న స్థాయిలో విజయం సాధించడానికి వీలవుతుంది.

మరిన్ని వార్తలు