విపక్షాలకు భంగపాటు

8 May, 2019 02:57 IST|Sakshi

నిరాధార ఆరోపణలు చేయడం, ఎదుటివారిపై సులభంగా నిందలేయడం మన రాజకీయ పార్టీ లకు వెన్నతో పెట్టిన విద్య. తాము దేనికీ జవాబుదారీ కాదన్న ధీమాయే ఇందుకు కారణం. కానీ సర్వోన్నత న్యాయస్థానం ముందు సైతం ఇలాగే ప్రవర్తిస్తే చెల్లుతుందా? పోలింగ్‌కు వినియో గిస్తున్న ఈవీఎంలలో 50 శాతాన్ని వాటికి అనుసంధానించే వీవీ ప్యాట్‌లలోని రశీదులతో సరిపోల్చి చూడాలని 21 రాజకీయ పార్టీలు కోరుతున్నాయి. అయితే అందువల్ల సమయం వృధా అవుతుంది గనుక ఒక్కో అసెంబ్లీ స్థానంలో అయిదేసి ఈవీఎంల చొప్పున లెక్కిస్తే సరిపోతుందని గతనెలలో సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. ఆ తీర్పువల్ల న్యాయం జరగలేదని భావించినప్పుడు అందుకు గల కారణాలేమిటో, తమ సందేహాలకు ప్రాతిపదికేమిటో ఆ పార్టీలు సహేతుకంగా వివరించి ఉంటే వేరుగా ఉండేది. అది లేకపోబట్టే ఆ తీర్పును పునఃసమీక్షించాలన్న విపక్షాల వినతిని మంగళవారం సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. తమ వాదనకున్న శాస్త్రీయత ఏమిటో ఈ పార్టీల్లో దేనికీ స్పష్టత లేదు.

ఆ వంకన జాతీయ స్థాయిలో ఏదో మహోద్యమం సాగిస్తున్నామన్న అభిప్రాయం అందరిలోనూ కలగజేయడమే వీటి ధ్యేయంగా కనబడుతోంది. సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌లో ఇప్పటికే అయిదు దశలు పూర్తయ్యాయి. మరో రెండు దశలు మిగిలి ఉన్నాయి. పక్షం రోజుల్లో ఓట్ల లెక్కింపు ప్రక్రియ మొదలై విజేతలెవరో, పరాజితులెవరో తేలిపోతుంది. ఈ దశలో ఈవీఎంల పనితీరుపై సందేహాలు లేవనెత్తుతూ ఎందుకీ రాద్ధాంతం? ఈవీఎంలపై రాజకీయ పార్టీలు ఇలా వివాదం రేకెత్తించడం కొత్తగాదు. కాకపోతే గతంలో ఓట్ల లెక్కింపు పూర్తయి, ఫలితాలు వెల్లడయ్యాక ఓడిన పార్టీలు ఆ పని చేసేవి. ఇప్పుడు ఓపక్క పోలింగ్‌ ప్రక్రియ సాగుతుండగానే దీన్ని మొదలెట్టాయి. సుప్రీంకోర్టు తమ రివ్యూ పిటిషన్‌ను తోసిపుచ్చాక కేంద్ర ఎన్నికల సంఘం కార్యాలయానికెళ్లి 50 శాతం ఈవీ ఎంలను వీవీ ప్యాట్‌లతో లెక్కించాలని ఈ పార్టీలన్నీ వినతిపత్రం అందించాయి. 

తాజా గణాంకాల ప్రకారం దేశంలో దాదాపు 90 కోట్లమంది ఓటర్లున్నారు. 10 లక్షల పోలింగ్‌ కేంద్రాలున్నాయి. ఇన్నిచోట్ల ఈవీఎంలు వాడుతున్నప్పుడు మానవ తప్పిదం వల్లకావొచ్చు, సాంకే తికపరమైన సమస్య వల్ల కావొచ్చు...వాటిల్లో కొన్ని మొరాయిస్తుంటాయి. ఫిర్యాదులొచ్చినప్పుడు ఎన్నికల అధికారులు వెంటనే వాటిని సరిచేయించి పోలింగ్‌ కొనసాగించడం ఆనవాయితీ. కానీ ఈవీఎంలను ట్యాంపర్‌ చేసి, ఎవరికి ఓటేసినా ఫలానా పార్టీకి ఆ ఓటు వెళ్లేలా సాఫ్ట్‌వేర్‌ను మార్చా రని ఈ పార్టీల ఆరోపణ. ఇలాంటి సందేహాలను పటాపంచలు చేయడం కోసం సుప్రీంకోర్టు ఆదే శాల మేరకు ఈవీఎంలకు వీవీప్యాట్‌ ప్రింటర్‌లను అనుసంధానించారు. కానీ 50శాతం ఈవీ ఎంలను వీవీప్యాట్‌లతో సరిపోల్చి చూడాలని ఈ 21 రాజకీయ పార్టీలు కోరుతున్నాయి. చిత్రమే మంటే... ఇన్ని కోట్ల మంది ఓటర్లలో ఏ ఒక్కరూ ఇంతవరకూ తాము ఒకరికి ఓటేస్తే, మరొకరికి పోయిందని ఫిర్యాదు చేయలేదు. సాధారణ పౌరుల సంగతలా ఉంచి బరిలో ఉండే వేలాదిమంది అభ్యర్థులు సైతం ఇంతవరకూ ఆ మాట అనలేదు. ఈవీఎంల విషయంలో నిజాయితీగా అనుమా నాలు వ్యక్తం చేసిన పౌరసమాజ సంఘాలున్నాయి.

ఆ సందేహాలను తీర్చడానికి ఎన్నికల సంఘం సంసిద్ధత వ్యక్తం చేస్తూనే ఉంది. పోలింగ్‌కు ముందు ఈవీఎంలను ప్రతి దశలోనూ తనిఖీ చేసేం దుకు, వాటి పనితీరును పరీక్షించుకునేందుకు పార్టీల ప్రతినిధులకు అవకాశం ఇస్తున్నారు. రెండేళ్ల క్రితం ఈవీఎం లోపాలను నిరూపించాలని కేంద్ర ఎన్నికల సంఘం పార్టీలను ఆహ్వానించింది. కానీ ఎవరూ ఆ సవాలును స్వీకరించి నిరూపించే ప్రయత్నం చేయలేదు.  ఈవీఎంలలో వాడే సాఫ్ట్‌వేర్‌ ప్రోగ్రాం కోడ్‌తో వైఫై, బ్లూటూత్‌ వగైరాలను అనుసంధానించడం కుదరని పని అని ఎన్నికల సంఘం చెబుతోంది. అది తప్పని నిరూపించడానికి ఈ పార్టీలేవీ కనీసం ప్రయత్నించలేదు. అలాగని ఆరోపణలు చేయడం మానుకోలేదు. ఓడినప్పుడు నెపాన్ని ఈవీఎంలపై నెట్టడం, విజ యం సాధించినప్పుడు మౌనంగా ఉండిపోవడం ఈ పార్టీలు అనుసరిస్తున్న అవకాశవాద వైఖరి. 2004, 2009 ఎన్నికల్లో ఓటమిపాలయ్యాక ఈవీఎంల వల్లే ఓడిపోయామని తెలుగుదేశం శోకాలు పెట్టింది. 2014లో నెగ్గాక నోరెత్తలేదు. 2012లో అకాలీల చేతుల్లో ఓటమిపాలైన కాంగ్రెస్‌ కూడా ఈవీఎంలపైనే నెపం వేసింది. 2017లో నెగ్గినప్పుడు మాట్లాడలేదు. 2009లో బీజేపీ సైతం ఇలాంటి పాటే పాడింది. నిరుడు జరిగిన రాజస్తాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ విజయం సాధించింది. ఈవీఎంలను తారుమారు చేసేట్టయితే ఇది సాధ్యమయ్యేదా? 

ఏపీలో మళ్లీ తమకు అధికారం దక్కే అవకాశం లేదని టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబుకు అర్ధమైంది. దాపురించక తప్పని ఆ ఓటమికి సాకులు వెదుక్కో వడంలో భాగంగానే ఈవీఎంల గొడవను ఆయన తలకెత్తుకున్నారు. వెనకా ముందూ చూడకుండా దానికి వంత పాడటం సరి కాదని కాంగ్రెస్‌తోసహా ఏ పార్టీ అనుకోకపోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఆంధ్రప్రదేశ్‌లో 23 మంది విపక్ష ఎమ్మెల్యేలను కొనడమే కాక, వారిలో ముగ్గురికి మంత్రి పదవులు కూడా ఇచ్చిన చంద్ర బాబుకు అసలు ఇలాంటి సమస్యను లేవనెత్తడానికి, ఉద్యమించడానికి నైతిక హక్కుందా? ఈవీ ఎంలపై సందేహాలుండటాన్ని తప్పుబట్టాల్సిన అవసరం లేదు. కానీ ఆ సందేహాలను వ్యక్తం చేయ డానికి, వాటిపై పోరాడటానికి గడిచిన అయిదేళ్లలో ఈ పార్టీలకు తీరికే దొరకలేదా? నిజంగా చిత్తశుద్ధి ఉంటే తమ వాదన సరైందని నిరూపించడానికి అవసరమైన ప్రాతిపదికల్ని కనీసం ఇప్ప టికైనా అవి రూపొందించుకోవాలి. ఈవీఎంలపై మాత్రమే కాదు... ఫిరాయింపులకు పాల్పడిన ఎమ్మెల్యే లేదా ఎంపీ సభ్యత్వాన్ని రద్దు చేసే అధికారాన్ని ఎన్నికల సంఘానికి దఖలుపరచడం, అది ఆర్నెల్లలో నిర్ణయం ప్రకటించేలా చేయడం వంటి సంస్కరణలు అమలు కావడానికి ఉద్యమించాలి. ఎన్నికల్లో నల్లధనాన్ని అరికట్టడానికి చర్యలు తీసుకోవాలని ఒత్తిడి తేవాలి. ఈ పార్టీలన్నీ కాలక్షేప ఉద్యమాలకు స్వస్తిపలికి నిర్మాణాత్మకంగా, బాధ్యతాయుతంగా వ్యవహరించాలి.

>
మరిన్ని వార్తలు