పాక్‌ విజేత సైన్యమే!

27 Jul, 2018 01:58 IST|Sakshi

ఎట్టకేలకు పాకిస్తాన్‌ మాజీ క్రికెటర్‌ ఇమ్రాన్‌ఖాన్‌ జీవితేచ్ఛ నెరవేరవేరుతోంది. ఇరవై రెండేళ్లక్రితం ఆయన ప్రారంభించిన తెహ్రీకే ఇన్సాఫ్‌(పీటీఐ) పార్టీ బుధవారం జరిగిన పాకిస్తాన్‌ జాతీయ అసెంబ్లీ ఎన్నికల్లో అతి పెద్ద పార్టీగా అవతరించింది. 272 స్థానాల్లో ఆ పార్టీకి 120 దక్కాయి. ఇంతవరకూ అధికారంలో ఉన్న మాజీ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌ నేతృత్వంలోని పాకిస్తాన్‌ ముస్లిం లీగ్‌ (పీఎంఎల్‌)–ఎన్‌ ఈ అంకెకు చాలా దూరంగా 63 దగ్గర ఆగిపోయింది. మరో మాజీ ప్రధాని బేనజీర్‌ భుట్టోకు చెందిన పాకిస్తాన్‌ పీపుల్స్‌ పార్టీ(పీపీపీ) 40 స్థానాలు గెల్చుకుని మూడో స్థానంతో సరిపెట్టుకుంది. అయితే తనకు బాగా పట్టున్న సిం«ద్‌ ప్రాంతంలో అది పీటీఐను నిలువ రించగలిగింది. అందువల్లే పీటీఐకి అధికారానికి అవసరమైన స్పష్టమైన మెజారిటీ 137 దక్కలేదు.

ఇమ్రాన్‌ స్వస్థలమైన ఖైబర్‌ పఖ్తున్‌ఖ్వా ప్రాంతంలో ఆయన పార్టీకే అధిక స్థానాలొచ్చాయి. మొదటినుంచీ అండగా ఉన్న పంజాబ్‌ ప్రావిన్స్‌ ప్రాంతాలైన రావల్పిండి, లాహోర్‌ వగైరాల్లో పీఎంఎల్‌–ఎన్‌కు ఆశించినంతగా స్థానాలు రాలేదు. జాతీయ అసెంబ్లీ ఫలితాలనే ప్రావిన్స్‌ ఫలితాలు కూడా ప్రతిబింబించాయి. ఖైబర్‌ ఫక్తూన్‌ఖ్వా ప్రావిన్స్‌ పీటీఐకి, పంజాబ్‌ ప్రావిన్స్‌ పీఎంఎల్‌–ఎన్‌కూ, సిం«ద్‌ ప్రావిన్స్‌ పీపీపీకి దక్కే అవకాశం ఉంది. ఈ ఎన్నికల్లో సైన్యం కనుసన్నల్లో భారీయెత్తున రిగ్గింగ్‌ జరిగిందని ప్రధాన పార్టీలన్నీ ఆరోపిస్తున్నాయి. అందులో అబద్ధమేమీ ఉండకపోవచ్చు. ఎందుకంటే సకల వ్యవస్థలూ ఈసారి సైన్యం ముందు మోకరిల్లాయి.

బల హీనమైన అవినీతి ఆరోపణల కేసులో ఆదరా బాదరగా విచారణ జరిపి న్యాయస్థానం నవాజ్‌ షరీఫ్‌కు, ఆయన కుమార్తెకూ జైలు శిక్షలు విధించింది. ఎన్నికల సంఘం పోలింగ్‌ కేంద్రాలన్నిటినీ సైన్యం పహారా కింద ఉంచింది. ఇంకా సిగ్గుచేటైన విషయమేమంటే పోలింగ్‌ కేంద్రాల దగ్గర గొడవలు జరిగితే అక్కడికక్కడే విచారించి శిక్ష విధించటానికి వీలుగా సైన్యానికి మెజిస్టీరియల్‌ అధికారాలు ఇచ్చింది. మీడియా సంస్థలపై సైతం సైన్యం ఉక్కుపాదం మోపింది. జియో న్యూస్‌ చానెల్‌ ప్రసారాలకు అంతరాయాలు కలిగించింది. డాన్‌ పత్రిక పంపిణీ ని అడ్డుకుంది.

ఇతర మీడియా సంస్థలన్నీ సైన్యానికి తలొగ్గాయి. ఇలా సైన్యం అండదండలు పుష్కలంగా ఉన్న ఇమ్రాన్‌ పైచేయి సాధించటం ఖాయమని రాజకీయ నిపుణులు ముందుగానే అంచనా వేశారు.  అలాగని సైన్యానికి ఇమ్రాన్‌పై పూర్తి స్థాయిలో ప్రేమ ఉందని చెప్పలేం. వారు బలంగా కోరుకున్నది హంగ్‌ పార్లమెంటే. అది కుదరని పక్షంలో మాత్రమే ఇమ్రాన్‌ అధికార పీఠంపై ఉండాలని ఆశించారు.  చివరకు వారి రెండో కోరిక నెరవేరుతోంది. పాకిస్తాన్‌ రాజకీయాల్లో పీటీఐ ఛాందసవాద ధోర ణులున్న పార్టీగా ముద్రపడింది. అయితే అల్లాహో అక్బర్‌ తెహ్రీక్‌(ఏటీటీ) పేరిట బరిలోకి దిగిన జమాత్‌ ఉద్‌ దవా చీఫ్, ఉగ్రవాది హఫీజ్‌ సయీద్‌ అభ్యర్థుల్ని జనం టోకుగా తిరస్కరించారు.  

అంతకుముందుగానీ, ఎన్నికల ప్రచారంలోగానీ భారత వ్యతిరేకతను బలంగా ప్రదర్శించిన ఇమ్రాన్‌ దేశప్రజలనుద్దేశించి గురువారం చేసిన ప్రసంగంలో ఆచి తూచి మాట్లాడారు. తాను భారత్‌ వ్యతిరేకిని కానని చెప్పారు. కశ్మీర్‌ సమస్యపై భారత, పాకిస్తాన్‌లు రెండూ చర్చించుకోవాలన్నది తన అభిమతమని చెప్పారు. భారత్‌ ఒక అడుగేస్తే తాము రెండడుగులేస్తామని అన్నారు. చర్చల ప్రతి పాదన వచ్చినప్పుడల్లా వాటిని భగ్నం చేస్తున్నది పాకిస్తాన్‌ సైన్యమే. ఇరుదేశాల మధ్యా సామరస్యం ఏర్పడాలని నిజంగా ఇమ్రాన్‌ కోరుకుంటే ఆయన ముందుగా ఒప్పించాల్సింది అక్కడి సైన్యాన్నే.

గత రెండున్నరేళ్లుగా సైన్యం మద్దతుతో అనేక ఉద్యమాలు నడుపుతున్న నాయకుడు గనుక ఇమ్రా న్‌కు దాని అభిమతమేమిటో ఇప్పటికే తెలిసి ఉండాలి. అయితే దేశాన్ని చైనా మాదిరిగా పారిశ్రా మికంగా అభివృద్ధి చేసి పేదరికాన్ని నిర్మూలించటమే, ‘కొత్త పాకిస్తాన్‌’ను నెలకొల్పటమే తన లక్ష్య మని ఆయన తన ప్రసంగంలో చెప్పారు. ఆ లక్ష్య సాధనకూ, సైన్యం ధోరణులకూ చుక్కెదురు. దానికి కావాల్సింది పౌర ప్రభుత్వం అత్యంత బలహీనంగా ఉండటం, దేశం తన కనుసన్నల్లో నడ వటం... మరీ ముఖ్యంగా భారత్‌తో సంబంధాల విషయంలో తన మాటే చెల్లుబాటు కావటం. పాక్‌లో కీలుబొమ్మ సర్కారుంటే మనకు అది తలనొప్పే. పుష్కలంగా ప్రజామద్దతున్న అధినేత లేన ట్టయితే అక్కడ అరాచకం తాండవిస్తుంది. దాని ప్రభావం మనపైనా ఉంటుంది. 

పాకిస్తాన్‌ ఆవిర్భవించాక అది అత్యధిక కాలం సైన్యం పడగనీడనే కొనసాగింది. పౌర ప్రభు త్వాలపై తిరుగుబాటు చేసి అధికారాన్ని చేజిక్కించుకోవటం సైన్యానికి అక్కడ రివాజు. పౌర ప్రభుత్వాలు నిరంతరాయంగా అధికారంలో కొనసాగింది ఈ పదేళ్లకాలంలోనే. 2008లో అప్పటి సైనిక నియంత జనరల్‌ ముషార్రఫ్‌ తప్పనిసరి పరిస్థితుల్లో ఎన్నికలకు ఒప్పుకున్నారు. తిరుగులేని  మెజారిటీ సాధిస్తారనుకున్న పీపీపీ అధినేత బేనజీర్‌ భుట్టోను ప్రచారపర్వంలోనే హత్యచేశారు.

దీని వెనక ముషార్రఫ్‌ హస్తమున్నదన్న ఆరోపణలు బలంగా వచ్చినా ఆయన పాత్రపై విచారణ జరగలేదు. ఆరోపణలు వచ్చాక ఆయన్ను కొన్నాళ్లు గృహ నిర్బంధంలో ఉంచారు. కానీ రోగాలను సాకుగా చూపి 2016లో దుబాయ్‌ వెళ్లి అప్పటినుంచీ ఆయన ప్రవాసజీవితం గడుపుతున్నారు. నవాజ్‌ షరీఫ్‌ ప్రధానిగా ఉండగా ఒకసారి రావడానికి ప్రయత్నించినా అరెస్టు చేయటం ఖాయమని ప్రభుత్వం చెప్పడంతో ఆగిపోయారు. షరీఫ్‌పై సైన్యం ఆగ్రహించడానికి గల కారణాల్లో ఇదొకటని చెబుతారు.

ప్రజాస్వామ్య ప్రక్రియ చాలా దేశాల్లో భ్రష్టుపడుతుండటం ఇటీవలికాలంలో కొట్టొ చ్చినట్టు కనబడుతోంది. సైన్యం పెత్తనం బాహాటంగా కనబడే పాక్‌లో అందుకు భిన్నంగా ఉంటుందని ఆశించలేం. కొత్తగా ఏర్పడే పాక్‌ ప్రభుత్వం మన లోక్‌సభ ఎన్నికలు ముగిసి కొత్త ప్రభుత్వం వచ్చేవరకూ మనతో యధాతథ స్థితినే కొనసాగించి ఆ తర్వాత మాత్రమే తన విధా నాలను ప్రకటించే అవకాశముంది. ఆ విధానాలు ఇరుదేశాల మధ్యా సానుకూల వాతావరణానికి దోహదపడాలని ఆశిద్దాం.

మరిన్ని వార్తలు