‘మహా’ సంక్షోభం

13 Nov, 2019 00:57 IST|Sakshi

ఊహించని మలుపులు తిరుగుతూ ఉత్కంఠ రేపిన మహారాష్ట్ర రాజకీయానికి రాష్ట్రపతి పాలన విధింపుతో తాత్కాలికంగా బ్రేకు పడింది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికివ్వాల్సిన వ్యవధి విష యంలో రాష్ట్ర గవర్నర్‌ భగత్‌సింగ్‌ కోష్యారీ తమపట్ల వివక్ష ప్రదర్శించారని శివసేన సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అసెంబ్లీ ఎన్నికలు ముగిశాక వివిధ చానెళ్లు ఎగ్జిట్‌ పోల్స్‌ పేరిట ప్రసారం చేసిన అతిశయోక్తుల మాటెలా ఉన్నా, ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి అవసరమైనంత మెజారిటీనైతే ఎన్‌డీఏ సొంతం చేసుకుంది. 288మంది సభ్యులుండే అసెంబ్లీలో ఎన్‌డీఏ ప్రధాన పక్షమైన బీజేపీ 105 స్థానాలతో అతి పెద్ద పార్టీగా అవతరించగా, భాగస్వామ్య పక్షమైన శివసేనకు 56 స్థానాలు దక్కాయి. అంటే...ఇంతక్రితంలాగే ఈ రెండు పార్టీలూ కలిసి సుస్థిర ప్రభుత్వం ఏర్పాటు చేయడం సాధ్యమే. కానీ ఫలితాలు వెలువడి పక్షం రోజులు దాటుతున్నా ఆ రెండు పార్టీలూ తమ  విభేదాలను పరిష్కరించుకోలేక పోయాయి. పర్యవసానంగా ప్రభుత్వం ఏర్పాటు తమ వల్ల కాదని ఆదివారం బీజేపీ చేతులెత్తేసింది.

నిజానికి మహారాష్ట్రతోపాటే ఎన్నికలు జరిగిన హరియాణాలో బీజేపీకి అవసరమైన మెజారిటీ రాకపోయినా విపక్షమైన జననాయక్‌ జనతాపార్టీ(జేజేపీ), మరికొందరు స్వతంత్రుల అండతో అక్కడ సునాయాసంగా బీజేపీ సర్కారు ఏర్పాటు చేయగలి గింది. కానీ అయిదేళ్లపాటు అధికారంలో కొనసాగి,పెద్దగా అవినీతి ఆరోపణలు రాని మహారాష్ట్రలో మాత్రం అడుగు ముందుకేయలేక ఆపసోపాలు పడింది. పైగా శివసేనతో బీజేపీకి ఉన్న బంధం ఈనాటిది కాదు. ఆ రెండు పార్టీలూ మూడు దశాబ్దాలుగా రాజకీయాల్లో కలిసి నడుస్తున్నాయి. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో సీట్ల పంపకంపై విభేదాలొచ్చి రెండు పార్టీలూ వేర్వేరుగా పోటీ చేసినా, ఎన్నికల ఫలితాలు వెలువడ్డాక ఇద్దరూ రాజీకొచ్చి సుస్థిర ప్రభుత్వాన్ని అందించారు. ఈసారి కలిసి పోటీ చేసి నెగ్గినా, ఫలితాలు వెలువడ్డాక ఇద్దరూ విడిపోయారు! ఎన్నికల్లో గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పుడు ముఖ్యమంత్రి పదవిని రెండున్నరేళ్ల చొప్పున పంచుకుందామని సీట్ల పంపకం సమయంలో తమకు బీజేపీ హామీ ఇచ్చిందని శివసేన చెబుతుండగా...అదంతా నిజం కాదని బీజేపీ కొట్టిపారేస్తోంది. ఇందులో ఎవరు నిజం చెబుతున్నారో తెలిసే అవకాశం లేదు. ఎందుకంటే ఈ అంశం ఎన్నికల ప్రచార పర్వంలో ఏనాడూ చర్చనీయాంశం కాలేదు. ఫలితాలు వెలువడ్డాకే శివసేన ఈ హామీ సంగతిని బయటి ప్రపంచానికి వెల్లడించింది. 

 దేశంలో సంపన్నవంతమైన రాష్ట్రంగా పేరుబడిన మహారాష్ట్రలో తమ కూటమికి మెజారిటీ దక్కినా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేని నిస్సహాయ స్థితిలో పడిపోవడం బీజేపీకి అప్రతిష్టే. అందుకే ఆ పార్టీ అధిష్టానం చివరి వరకూ శివసేనను బుజ్జగించేందుకు తీవ్ర ప్రయత్నం చేసింది. మంత్రివర్గంలో సగం స్థానాలు ఇవ్వడానికి సంసిద్ధత వ్యక్తం చేసింది. అయినా శివసేన ఎక్కడా తగ్గలేదు. బీజేపీతో పోలిస్తే దాదాపు సగం స్థానాలే వచ్చినా అది రాజీకి ససేమిరా అంది. పొత్తు పేరుతో తమను క్రమేపీ బీజేపీ తుడిచి పెట్టేస్తున్నదన్న శంక ఆ పార్టీలో బయల్దేరబట్టే ఈసారి పాలన పగ్గాలు తీసుకోవాలన్న పట్టుదలతో శివసేన ఉన్నదంటున్నారు. సిద్ధాంత సారూప్యం ఉన్న ఈ రెండు పార్టీలే కలిసి మనుగడ సాగించలేనప్పుడు...ఎన్‌సీపీ, కాంగ్రెస్‌లతో శివసేన చెలిమి ఎన్నాళ్లుంటుందన్న అనుమానాలు అందరిలోనూ ఉన్నాయి. ఇటీవలికాలంలో సిద్ధాంతాలకు కాంగ్రెస్‌ పెద్దగా విలువిస్తున్న దాఖలాలు లేవు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల అనంతరం వేసిన ఎత్తుగడల పర్యవసానంగా పార్టీకి జరిగిన నష్టమేమిటో ఆ పార్టీకి గుర్తుంది.

అందుకే శివసేనకు మద్దతివ్వాలా వద్దా, ఏ ప్రాతిపదికన దానికి మద్దతివ్వాలి, ఎలాంటి షరతులు విధించాలి, ప్రభుత్వంలో చేరాలా వద్దా అనే అంశాల్లో అది ఎటూ తేల్చుకోలేక అయోమయంలో పడింది. పార్టీలో మెజారిటీ ఎమ్మె ల్యేలు కోరుకుంటున్నట్టు శివసేనకు మద్దతిస్తే మహారాష్ట్రలో ముస్లిం ఓటర్లను శాశ్వతంగా దూరం చేసుకోకతప్పదన్న ఆందోళన ఆ పార్టీలో ఉంది. అలాగే కేరళలో సైతం దాని ప్రభావం బలంగా పడుతుందన్న భయం ఉంది. త్వరలో రాబోయే జార్ఖండ్‌ ఎన్నికల్లో కూడా ఈ నిర్ణయం ప్రభావం ఉంటుందన్న అంచనాలు కూడా ఉన్నాయి. కనుకనే గవర్నర్‌ శివసేనకిచ్చిన గడువు ముగుస్తున్నా నిర్ణయం తీసుకోలేక కాంగ్రెస్‌ చేష్టలుడిగినట్టు ఉండిపోయింది. కాంగ్రెస్‌ మద్దతు కూడగట్టడం విషయంలో శివసేనకు ఎన్‌సీపీ ఏం హామీ ఇచ్చిందోగానీ ఆ పార్టీ కూడా ఇరకాటంలో పడింది. ఇంతకూ శివసేన–ఎన్‌సీపీల మధ్య కుదిరిన అవగాహనేమిటో తెలియదు. ఈ పరిణామాలన్నీ సహజంగానే బీజేపీకి లాభిస్తాయి. సిద్ధాంత సారూప్యం ఉన్న తమను కాదని శివసేన అవకాశవా దాన్ని ఆశ్రయించిందని చెప్పడానికి దానికి అవకాశం ఏర్పడింది.  

గవర్నర్‌ కోష్యారీ ప్రభుత్వం ఏర్పాటు కోసం వివిధ పార్టీలకిచ్చిన గడువు గురించి విమర్శలొ స్తున్నాయి. బీజేపీకి 48 గంటల గడువిచ్చి, తమకు మాత్రం అందులో సగం వ్యవధే ఇచ్చారని శివసేన గుర్రుగా ఉంది. ఎన్‌సీపీకి ఇచ్చిన వ్యవధి ఇంకా తక్కువ. ఆ పార్టీని 17 గంటల్లో నిర్ణయం చెప్పాలని గవర్నర్‌ కోరారు. సంక్షోభాలొచ్చినప్పుడు కేంద్రంలోని పాలకపక్షం అభీష్టానికి అనుగు ణంగానే గవర్నర్లు వ్యవహరిస్తారన్నది కొత్తేమీ కాదు. కానీ రాజకీయంగా ఆరితేరిన ఎన్‌సీపీ, కాం గ్రెస్‌లు బీజేపీ–శివసేనల మధ్య విభేదాలొచ్చే అవకాశం ఉన్నదని, అదే జరిగితే శివసేన తమను ఆశ్రయించక తప్పదని అంచనా వేయలేకపోవడం, తమ వ్యూహానికి పదును పెట్టుకోకపోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఫలితాలొచ్చి పక్షం రోజులు దాటినా ఆ రెండు పార్టీలూ వివిధ సంభావ్యతల గురించి చర్చించుకోలేకపోవడం వాటి వైఫల్యాన్ని సూచిస్తుంది. ఇప్పుడు రాష్ట్రపతి పాలన విధించినంత మాత్రాన దారులన్నీ మూసుకుపోయినట్టు కాదు. కొత్త ఎత్తులకూ, వ్యూహాలకూ కావలసినంత సమయం ఉంటుంది. కనీసం ఇప్పుడైనా పార్టీలన్నీ మిత్రుల్ని ఖరారు చేసుకుని సుస్థిర ప్రభుత్వం ఏర్పాటుకు ప్రయత్నించాలి. 

Read latest Editorial News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా