మళ్లీ పుతిన్‌వైపే మొగ్గు

3 Jul, 2020 01:47 IST|Sakshi

శాశ్వతంగా అధికారంలో కొనసాగడం ఎలాగో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ను చూసి ప్రపంచ దేశాధినేతలు నేర్చుకోవాలి. రాజ్యాంగ నిబంధనలు ఏం చెబుతున్నా వాటిని అధిగమించి 20 ఏళ్లుగా ప్రధానిగానో, అధ్యక్షుడిగానో అధికారాన్ని అంటిపెట్టుకునే వున్న పుతిన్‌... ఇకపై అది సాధ్యపడదని గ్రహించి ఆర్నెల్లక్రితం ఏకంగా ఆ నిబంధనలనే సవరించారు. 2036 వరకూ తానే అధ్యక్షుడిగా కొనసాగడానికి వీలుకల్పించే ఆ సవరణలపై వారంరోజులుగా సాగుతున్న రిఫరెండంలో జనం ఆయన్నే విజేతగా నిలిపారు. బుధవారం వెల్లడైన ఫలితాల ప్రకారం పుతిన్‌ తీసుకొచ్చిన సవరణలకు అనుకూలంగా 77.9 శాతంమంది, వ్యతిరేకంగా 21 శాతంమంది ఓట్లేశారని అధికారులు ప్రక టించారు. 2000 సంవత్సరంలో తొలిసారి దేశాధ్యక్ష పీఠం అధిరోహించిన పుతిన్‌కు ప్రస్తుతం 67 ఏళ్లు. ఇప్పుడున్న నిబంధనల్ని అనుసరించి ఆయన 83 ఏళ్లు వయసు వచ్చేవరకూ అధ్యక్ష పదవిలో ఉండొచ్చు.

ఈలోగా మరిన్ని సవరణలు తీసుకొస్తే అంతకుమించి కూడా కొనసాగవచ్చు! వాస్తవానికి ఈ రిఫరెండం మొన్న ఏప్రిల్‌ 22న జరగాల్సివుంది. కానీ కరోనా వైరస్‌ వ్యాప్తితో దానికి బ్రేకు పడింది. వరసగా రెండు నెలల లాక్‌డౌన్‌ తర్వాత కూడా దాని తీవ్రత తగ్గకపోగా ఉగ్రరూపం దాల్చింది. ప్రపంచంలో అమెరికా, బ్రెజిల్‌ తర్వాత కరోనా కేసుల్లో రష్యా మూడో స్థానంలో వుంది. అక్కడ 6,62,000మంది దాని బారినపడగా 9,683మంది మరణించారు. వాస్తవానికి కరోనా కేసుల్ని రష్యా కప్పిపుచ్చుతోందన్న విమర్శలున్నాయి. ఇంతటి విపత్కర పరిస్థితుల్లో కూడా రిఫరెండం జరపాలనే పుతిన్‌ నిర్ణయించారు. జూలై 1న దీన్ని నిర్వహించాలని అనుకున్నా, పోలింగ్‌ కేంద్రాల వద్ద భారీగా జనం గుమిగూడతారన్న సాకుతో గత నెల 25నుంచి అక్కడ ఓటేయవచ్చని ప్రకటించారు.

మొత్తానికి జనవరిలోనే పార్లమెంటు  ఆమోదించిన రాజ్యాంగసవరణలకు అవసరం లేకపోయినా పుతిన్‌ రిఫరెండం నిర్వహించి జనం కూడా తన వెనకే వున్నారన్న అభిప్రాయం అందరిలో కలిగించే ప్రయత్నం చేశారు. కేవలం తన పదవి కోసమే సవరణలు చేశారన్న అనుమానం రాకుండా పుతిన్‌ ఇతర నిబంధనలు కూడా చేర్చారు. సామాజిక సంక్షేమ పథకాలను మెరుగుపరచడం, ఆడా మగా మధ్య జరిగే పెళ్లిని మాత్రమే గుర్తించడం, ఎగ్జిక్యూటివ్‌ అధికారాల్లో మార్పులు తీసుకొచ్చి అధ్యక్షుడికి అపరిమిత అధికారాలు వుండేలా చూడటం, అంతర్జాతీయ చట్టాలు రష్యా రాజ్యాంగానికి అనుగుణంగా లేకపోతే అవి వర్తించబోవని చెప్పడం ఇతర సవరణల ధ్యేయం. బలమైన నేతలకు రిఫరెండం అనేది ఒక శక్తిమంతమైన ఆయుధం.

సాధారణ ఎన్నికల్లో అయితే ఎన్నో అంశాలు చర్చకొస్తాయి. పాలన తీరెలావుందన్న అంశం చుట్టూ అవి తిరుగుతాయి. కానీ రిఫరెండం విధానం వేరు. అందులో కేవలం అవును, కాదు అనే రెండే ప్రత్యామ్నాయాలుంటాయి. ఎంతటి సంక్లిష్ట సమస్యయినా ఆ చట్రంలో ఒదిగిపోవాల్సిందే. తన సవరణలకు పుతిన్‌ ఇప్పటికే పార్లమెంటు ఆమోదం పొందినా రిఫరెండం మార్గం ఎంచుకోవడానికి గల ప్రధాన కారణం ఇదే. వాస్తవానికి రష్యా ఆర్థిక వ్యవస్థ మాంద్యంలో పడింది. దాన్నుంచి ఒడ్డున పడటానికి తీసుకుంటున్న చర్యలు ఫలితాలనివ్వడం లేదు. ఈలోగా కరోనా మహమ్మారి దాన్ని మరింత కుంగదీయడంతో పాటు... ప్రభుత్వ అసమర్థతను బట్టబయలు చేసింది.

ఆయన రేటింగ్‌ గణనీయంగా పడిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో ఎన్నికలొస్తే ఆ సమస్యల చుట్టూ చర్చలు సాగేవి. పుతిన్‌ గడ్డు పరిస్థితి ఎదుర్కొనవలసి వచ్చేది. కనుకనే ఆయన సుస్థిరత, భద్రత కావాలంటే తనకే ఓటేయాలని ఈ రిఫరెండం సందర్భంగా పిలుపునిచ్చారు. ఉగ్రవాద చర్యలు మొదలుకొని అసమ్మతి వరకూ దేన్నయినా అణచడంలో సిద్ధహస్తుడని రుజువైన పుతిన్‌కు దీటైన నేతను జనం ఊహించుకోగలరా? కనుకనే ‘బలమైన’ నేతను వారు ఎంచుకున్నారు. ఆయన ప్రత్యర్థి నవ్లానీ ఆరోపిస్తున్నట్టు ఈ పోలింగ్‌లో ఏదో మేరకు రిగ్గింగ్‌ జరిగివుండొచ్చు. అయితే కేవలం అందువల్లే పుతిన్‌ నెగ్గగలిగారన్నది అవాస్తవం. ఈ రిఫరెండం ద్వారా రష్యాకు తాను తిరుగులేని అధినేతనని పుతిన్‌ రుజువు చేయ గలిగారు. పశ్చిమ దేశాలు అనుసరిస్తున్న ఉదారవాద వ్యవస్థ తమకు ఆమోదయోగ్యం కాదని, తమ దేశంలో తాము అనుకునేదే చట్టమని ఆయన ఈ రిఫరెండంతో తేల్చిచెప్పారు.

పశ్చిమ దేశాల్లో చాలా భాగం ఇప్పుడు స్వలింగ సంపర్కుల వివాహానికి చట్టబద్ధతను కల్పించాయి. కానీ తాము మాత్రం సంప్రదాయంగా వస్తున్న కుటుంబ విలువలకే కట్టుబడి వున్నామని, భగవత్‌ సృష్టిని ధిక్కరించ బోమని ఈ సవరణలతో పుతిన్‌ చాటారు. ఇప్పటికే అమెరికాతోపాటు ఫ్రాన్స్, జర్మనీ, బ్రిటన్‌ తది తర దేశాల్లో క్రమేపీ బలం పుంజుకుంటున్న మితవాదులకు పుతిన్‌ మార్గదర్శకుడవుతారు. ఉదారవాద విధానాలకు తామే ప్రత్యామ్నాయమని వారు చెప్పుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది. వాస్తవానికి జర్మనీకి చెందిన తీవ్ర మితవాదులకు రష్యాలోని సెయింట్‌ పీటర్స్‌బర్గ్‌లో పారా మిలిటరీ శిక్షణనిచ్చినట్టు ఒక నివేదిక బయటపెట్టింది. 
ఈసారి సామాజిక మాధ్యమాల్లో పుతిన్‌ వ్యతిరేక ప్రచారం దీటుగానే సాగింది.

పుతిన్‌ శిబిరం ఆయనకు మద్దతుగా రూపొందించిన వీడియోలకు ప్రత్యర్థి నవ్లానీ గట్టిగా జవాబిచ్చారు. ఇతరత్రా ప్రచారాల విషయంలోనూ అదే జోరు సాగింది. కానీ పుతిన్‌ బలపడితే పబ్లిక్‌ రంగ సంస్థల సిబ్బంది వేతనాలు పెరుగుతాయని, బడుల్లో పిల్లలకు ఉచితంగా భోజన వసతి కల్పిస్తారని, శిశు సంక్షేమ పథకాలు అమల్లోకొస్తాయని జనం విశ్వసించారు. వీటిన్నిటికీ కావాల్సిన 8,000 కోట్ల డాలర్ల సొమ్ము ఇప్పుడున్న పరిస్థితుల్లో సాధ్యమా అన్న తర్కంలోకి ఓటర్లు పోలేదు. బలమైన అధ్యక్షుడుంటే అన్నీ వాటంతటవే సర్దుకుంటాయని నమ్మారు. మొత్తానికి మిన్నువిరిగి మీదపడినా పుతిన్‌కు ఇప్పట్లో తిరుగులేదని ఈ రిఫరెండం నిరూపించింది. 

మరిన్ని వార్తలు