లంకలో మళ్లీ ‘రాజపక్స’

19 Nov, 2019 00:20 IST|Sakshi

అయిదేళ్లక్రితం జరిగిన అధ్యక్ష, పార్లమెంటు ఎన్నికల్లో ఓటమిపాలైన రాజపక్స కుటుంబానికే ఆదివారం జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో అధికార పీఠం దక్కింది. మాజీ అధ్యక్షుడు మహిందా రాజపక్స సోద రుడు, రక్షణశాఖ మాజీ మంత్రి గోతబయ రాజపక్స విపక్ష శ్రీలంక పొదుజన పెరమున (ఎస్‌ఎల్‌ పీపీ) అభ్యర్థిగా రంగంలోకి దిగి 52.25 శాతం మద్దతు చేజిక్కించుకుని సోమవారం ఆ దేశాధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేశారు. అధికార యునైటెడ్‌ నేషనల్‌ పార్టీ(యూఎన్‌పీ) 41.99 శాతం ఓట్లు మాత్రమే సాధించింది. మహోద్రిక్తంగా, నువ్వా నేనా అన్నట్టు సాగిన ఈ ఎన్నికల్లో రాజపక్స కుటుంబ పునరాగమనం ఊహించని పరిణామమేమీ కాదు. నిజానికి నిరుడు ఏప్రిల్‌లో ఈస్టర్‌ పర్వదినాన రాజధాని కొలంబోలోని పలుచోట్లా, ఉత్తర ప్రాంత నగరం బట్టికలోవలోని చర్చిలో ఉగ్రవాదులు దారుణ మారణహోమాన్ని సృష్టించి 300మందికి పైగా పౌరులను పొట్టనబెట్టు కున్నప్పుడే ఈ పునరాగమనానికి బీజం పడింది. మన దేశం ముందస్తుగా హెచ్చరించినా నిమ్మకు నీరెత్తినట్టు ఉండిపోయిన లంక ప్రభుత్వం... అటు తర్వాత పెరిగిన విద్వేషాలను అదుపు చేయడంలో కూడా విఫలమైంది. ఉగ్రవాదులు జన్మతః ముస్లింలు గనుక ఆ వర్గానికి చెందినవారిపైనా, వారి వ్యాపార సంస్థలపైనా దుండగులు దాడులు చేశారు. బాధిత క్రైస్తవ వర్గాల ప్రజానీకం ముస్లింలపై దాడులు చేస్తారని ఆశించిన సింహళ తీవ్రవాద శక్తులు అలాంటిదేమీ జరగకపోవడంతో తామే స్వయంగా రంగంలోకి దిగాయి. ఉగ్రవాదులతో సంబంధాలున్నాయంటూ సింహళ తీవ్రవాద సంస్థలు పదే పదే ఆరోపణలు చేయడంతో తొమ్మిదిమంది మంత్రులు, ఇద్దరు గవర్నర్లు రాజీనామాలు చేశారు. ఈ పరిణామాల పర్యవసానంగా తలెత్తిన అశాంతి అంతిమంగా రాజపక్స కుటుం బానికే తోడ్పడుతుందని రాజకీయ పరిశీలకులు అంటూ వచ్చారు. చివరకు అదే నిజమైంది.

తరచు విధ్వంసాలకు దిగే తమిళ టైగర్లను కూకటి వేళ్లతో పెకలించివేసిన తాము కావాలో...భారీ పేలుళ్లు జరుగుతున్నాయని తెలిసినా చేతగానితనాన్ని ప్రదర్శించిన ప్రస్తుత అధినేతలు కావాలో తేల్చుకోవాలని రాజపక్స సోదరులు చేసిన ప్రచారం ఓటర్లను బాగా ఆకట్టుకుంది. సింహళ–బౌద్ధ జాతీయవాదాన్ని తలకెత్తుకుని ఎన్నికల ప్రచార పర్వాన్ని దేశ భద్రత చుట్టూ తిప్పడంలో రాజపక్స సోదరులు విజయం సాధించారు. అయితే వారు కేవలం దేశ భద్రత గురించి మాత్రమే చెప్పి ఊరుకోలేదు. దిగజారిన దేశ ఆర్థికవ్యవస్థను మళ్లీ అభివృద్ధి పట్టాలెక్కిస్తామని, రైతులకు సబ్సిడీ లివ్వడం ద్వారా వ్యవసాయాన్ని ఆదుకుంటామని హామీ ఇచ్చారు. పన్నుల్ని గణనీయంగా తగ్గిస్తా మని చెప్పారు. ద్రవ్యోల్బణం, ఉపాధి లేమి, అధిక పన్నులు వగైరాలతో ఇబ్బందులు ఎదుర్కొం టున్న ప్రజానీకం ఆఖరికి శాంతిభద్రతలు కూడా కరువయ్యాయని ఆందోళనలో పడ్డారు. ఈ పరిస్థితి రాజపక్సకు కలిసొచ్చింది. దేశ జనాభాలో సింహళులు, క్రైస్తవులు 70శాతం ఉంటారు. ఈ రెండు వర్గాలనూ తనకు అనుకూలంగా మలచుకోవడంలో రాజపక్స విజయం సాధించారు. దానికితోడు యూఎన్‌పీ అభ్యర్థిగా సజిత్‌ ప్రేమదాస రాజకీయంగా అనామకుడు. ఆ పార్టీకి డిప్యూటీ నాయ కుడిగా ఉన్నా విధాన రూపకల్పనలో ఆయన పాత్ర దాదాపు శూన్యం. ఆ పనంతా ప్రధాని రణిల్‌ విక్రమసింఘే, ఆయనకు సన్నిహితంగా ఉండే అరడజనుమంది నేతలు చూసుకున్నారు. కనుకనే ఆ విధానాలపై వెల్లువెత్తిన విమర్శలకు ప్రేమదాస సమర్థవంతంగా జవాబు ఇవ్వలేకపోయారు. పర్య వసానంగా యూఎన్‌పీకి కంచుకోటలుగా ఉండే కొలంబో, కాండీ వంటిచోట్ల సైతం గోతబయ రాజపక్స పాగా వేయగలిగారు.

మొత్తంగా లంకలో సింహళ పౌరుల జనాభా అధికంగా ఉండే దక్షిణ, పశ్చిమ, మధ్య శ్రీలంక ప్రాంతాల్లో గోతబయ రాజపక్సకు అత్యధిక ఓట్లు లభించగా...తమిళ జనాభా, ముస్లింలు ఎక్కువుండే ఉత్తర, తూర్పు ప్రాంతాల్లో సజిత్‌కు 80 శాతం ఓట్లు వచ్చాయి. అయితే మహిందా రాజపక్స పాలనలో అమలైన అణచివేత విధానాలను ఇప్పటికీ ఎవరూ మరిచిపోలేదు. వాటి అమలులో సోదరుడికి గొతబయ రాజపక్స రక్షణమంత్రిగా చేదోడువాదోడుగా ఉన్నారు. ఆ పదేళ్లకాలంలో అనేమంది తమిళ రాజకీయ నాయకులు హత్యలకు గురికాగా, వేలాది మంది పౌరులు, పలువురు పాత్రికేయులు అదృశ్యమయ్యారు. వారిలో అనేకమంది ఆచూకీ ఇప్పటికీ తెలియడంలేదు. టైగర్ల అణచివేత మాటున తమిళులపై సాగించిన హత్యలు, అకృత్యాలపై ఐక్య రాజ్యసమితి పర్యవేక్షణలో విచారణ జరిగింది. ప్రత్యేకించి గోతబయ రాజపక్సపై పలు అవినీతి కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. తమిళులపై సాగించిన హింసాకాండకు సంబంధించి అమెరికా న్యాయస్థానాల్లో సివిల్‌ వ్యాజ్యాలు పెండింగ్‌లో ఉన్నాయి. 2009లో కొలంబో నగరంలో ఒక పత్రిక సంపాదకుడిని కాల్చిచంపిన కేసులో ఆయన ప్రమేయమున్నదని ఆరోపణలొచ్చాయి. మానవ హక్కుల ఉల్లంఘనల విషయంలో జవాబుదారీతనాన్ని నిర్ధారించి బాధ్యులపై చర్యలు తీసు కుంటామని నాలుగేళ్లక్రితం లంక ప్రభుత్వం హామీ ఇచ్చింది. సహజంగానే అలాంటి హామీలన్నీ ఇప్పుడు అటకెక్కుతాయి. 

పైకి ఏం చెప్పినా రాజపక్స సోదరుల మొగ్గు మొదటినుంచీ చైనావైపే ఉంటున్నది. టైగర్లను పూర్తిగా అణచివేశాక దేశవ్యాప్తంగా ప్రారంభించిన మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల్లో అత్యధిక భాగం కాంట్రాక్టులు చైనా సంస్థలకే లభించాయి. అప్పట్లో దక్షిణ హంబన్‌టోటాలో నిర్మించిన ఓడరేవుకు అయిన వ్యయాన్ని భరించలేక చివరకు దాన్ని నిర్మించిన చైనా సంస్థకే శ్రీలంక 99 ఏళ్ల లీజుకిచ్చింది. రాజపక్స పాలనాకాలంలో చైనా జలాంతర్గాముల్ని కొలంబో రేవులో లంగరేయడానికి అనుమ తించినందుకు మన దేశం తీవ్ర అభ్యంతరం చెప్పింది. ఈ నేపథ్యంలో ఇరు దేశాల సంబంధాలు మున్ముందు ఎలా ఉంటాయోనన్న సందేహాలు అందరిలోనూ ఉన్నాయి. తాను ప్రజానీకానికంతకూ ప్రాతినిధ్యం వహించే సమర్థపాలన అందిస్తానని గోతబయ అంటున్నారు. దాన్ని ఏమేరకు నిల బెట్టుకోగలరో చూడవలసి ఉంది. 

మరిన్ని వార్తలు