చరిత్రాత్మకమైన తీర్పు

8 Sep, 2018 00:26 IST|Sakshi

భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్‌ 377లో స్వలింగ సంపర్కులను నేరస్తులుగా పేర్కొనే నిబంధన ఎట్టకేలకు బుట్టదాఖలా అయింది. అది చెల్లుబాటు కాదంటూ గురువారం సర్వోన్నత న్యాయస్థానం వెలువరించిన ఏకగ్రీవ తీర్పు సమానత్వ సాధనలో, మానవ హక్కుల ప్రస్థానంలో మేలి మలుపుగా నిలుస్తుంది. సృష్టి ఒక గీత గీసిందని... అందరూ ఆ గీతకు అటో ఇటో ఉంటారని, ఉండాలని శతా బ్దాల తరబడి పాతుకుపోయిన భావనను ఈ తీర్పు నిర్ద్వంద్వంగా తోసిపుచ్చింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ దీపక్‌ మిశ్రా నేతృత్వంలోని అయిదుగురు సభ్యుల ధర్మాసనం యుక్త వయసున్న ఇద్దరు వ్యక్తులు పరస్పర అంగీకారంతో తమ లైంగిక భావనలకు అనుగుణంగా శృంగా రంలో పాల్గొనవచ్చునని, దాన్ని నేరంగా పరిగణించటం సరికాదని తేల్చిచెప్పింది. ఆడ మగ మధ్య లైంగిక సంబంధాలే సహజమైనవనీ, మిగిలినవన్నీ అసహజమని అనడం కాలం చెల్లిన భావనగా తెలిపింది.

‘ప్రకృతి ఇచ్చింది ఏదైనా సహజమైనదే’ అని స్పష్టం చేసింది. అసహజ లైంగిక నేరాలను ఏకరువుపెట్టే సెక్షన్‌ 377లో స్వలింగ సంపర్కం చేర్చటం సరికాదంటూ మన దేశంలో సాగుతున్న పోరాటం సుదీర్ఘమైనది. పదిహేడేళ్లుగా న్యాయస్థానాలే వేదికగా ఆ పోరాటం సాగుతోంది. బ్రిటిష్‌ వలసపాలకుల ఏలుబడిలో దాదాపు 160 ఏళ్లక్రితం భారతీయ శిక్షాస్మృతిలో స్వలింగ సంపర్కం నేరంగా మారింది. అప్పటినుంచి అనేకమంది పౌరులు వేధింపులకు గురవుతున్నారు. భయంతో బతుకీడుస్తున్నారు. 2000 సంవత్సరంలో సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ బీపీ జీవన్‌ రెడ్డి నేతృత్వంలోని లా కమిషన్‌ స్వలింగ సంపర్కం నేరంగా భావించలేమని, దీన్ని శిక్షాస్మృతి నుంచి తొలగించి ఇతర అసహజ నేరాలను కొత్తగా 376–ఎఫ్‌ కిందకు తీసుకురావాలని సిఫార్సు చేసింది. అయినా ఏ ప్రభుత్వమూ కదల్లేదు. 

2009లో అప్పటి ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఏపీ షా, న్యాయమూర్తి జస్టిస్‌ ఎస్‌. మురళీధర్‌లతో కూడిన ధర్మాసనం మొదటిసారి ఈ సెక్షన్‌ రాజ్యాంగంలోని 21, 14, 15 అధికరణలను ఉల్లంఘిస్తున్నదని నిర్ధారించింది. ఆ సెక్షన్‌లోని అస హజ నేరాల జాబితా నుంచి దీన్ని తొలగించాలని తీర్పునిచ్చింది. అయితే మరో నాలుగేళ్లకు సుప్రీం కోర్టులో జస్టిస్‌ జీఎస్‌ సింఘ్వీ, జస్టిస్‌ ఎస్‌జే ముఖోపాధ్యాయలతో కూడిన ధర్మాసనం అది రాజ్యాం గబద్ధమైనదేనని చెప్పి స్వలింగసంపర్కుల ఉత్సాహంపై నీళ్లు జల్లింది. దాన్ని కొట్టేసే అధికారం న్యాయస్థానాలకు లేదని, పార్లమెంటు మాత్రమే నిర్ణయం తీసుకోవాలని తెలిపింది.

ఏదైనా కీలక సమస్య వచ్చిపడినప్పుడు దానికొక ప్రజాస్వామిక పరిష్కారాన్ని చూపడం రాజ్యం బాధ్యత. పాలకులుగా ఉంటున్నవారు ఈ బాధ్యతను స్వీకరించటం సబబు. వారు దాన్ని సక్రమంగా నెరవేర్చనప్పుడు న్యాయవ్యవస్థ అయినా జోక్యం చేసుకొని సరిదిద్దాలి. కానీ సెక్షన్‌ 377 విషయంలో రెండుచోట్లా ఇన్నాళ్లూ నిరాదరణే ఎదురైంది. సుప్రీంకోర్టు ధర్మాసనంలోని మహిళా న్యాయమూర్తి జస్టిస్‌ ఇందూ మల్హోత్రా దీన్ని దృష్టిలో పెట్టుకునే ‘స్వలింగ సంపర్కాన్ని సహజమైన ప్రక్రియగా పరిగణించలేనందుకూ, పర్యవసానంగా శతాబ్దాలుగా వీరు పడుతున్న అవమానాలకూ చరిత్ర క్షమాపణ చెప్పాల్సి ఉన్నద’ని వ్యాఖ్యానించారు. ఏ సమాజంలోనైనా అత్యధిక సంఖ్యాకుల మనోభావాలకు అనుగుణంగానే అన్ని రకాల విలువలూ ఏర్పడతాయి.

వాటి ఆధారంగానే చట్టాలు రూపొందుతాయి. సమాజంలో ఆడ మగ కలిసి ఉండటమే సహజమని, ఇతరమైనవన్నీ అసహ జమని అత్యధికులు భావించబట్టి ఇతరత్రా లైంగిక భావనలున్నవారందరూ అపరాధ భావనతో కుమిలిపోతుంటారు. తమ లైంగిక వాంఛలు వెల్లడైతే వెలివేస్తారని భీతిల్లుతారు. జస్టిస్‌ దీపక్‌ మిశ్రా అన్నట్టు స్వీయ వ్యక్తీకరణకు అవకాశం లేకపోవటం చావుతో సమానం. ఈ స్వలింగసంపర్కులంతా ఇన్నేళ్లుగా జీవచ్ఛవాలుగా మనుగడ సాగిస్తున్నారు. దేశంలోని ఇతర పౌరులు అనుభవిస్తున్న హక్కులు వీరికి లేకుండా పోయాయి. బడిలో తోటి పిల్లల హేళనలతో మొదలై కుటుంబంలోనూ, బంధువుల్లోనూ వెలివేసినట్టు చూడటం, సమాజంలో నిరాదరణ ఎదురుకావటం ఈ స్వలింగç Üంపర్కులు నిత్యం ఎదుర్కొంటున్న సమస్య. ఎవరైనా ఫిర్యాదు చేయటం వల్ల పట్టుబడితే 377 సెక్షన్‌ ప్రకారం దోషులకు యావజ్జీవ శిక్ష లేదా పదేళ్లవరకూ శిక్ష, జరిమానా విధిస్తారు. ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పు విషయంలో 2012లో అప్పటి యూపీఏ ప్రభుత్వం తత్తరపడింది.

స్వలింగ సంపర్కం సామాజిక కట్టుబాట్లకు విరుద్ధమని, దానివల్ల ఎయిడ్స్‌లాంటి జబ్బులు వ్యాపిస్తాయని సర్వోన్నత న్యాయస్థానంలో అప్పటి అదనపు సొలిసిటర్‌ జనరల్‌ పి.పి. మల్హోత్రా వాదించారు. అదంతా చానెళ్లలో ప్రసారమయ్యేసరికల్లా ఆదరా బాదరాగా మరో అదనపు సొలిసిటర్‌ జనరల్‌ మోహ న్‌జైన్‌ను పంపి దానిపై ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోలేదని అనిపించారు. ప్రస్తుత ఎన్‌డీఏ ప్రభుత్వమైతే తన వైఖరేమిటో నిర్ధారించుకోలేకపోయింది. దీన్ని న్యాయస్థానం ‘విజ్ఞత’కే వదిలేస్తున్నామని చెప్పింది. ప్రజామోదంతో గద్దెనెక్కి, వారిని ఒప్పించగలిగిన స్థితిలో ఉండే పాలకులు ఇలాంటి సంక్లిష్ట అంశాల విషయంలో దాటవేత ధోరణి అవలంబించటం ఆశ్చర్యం కలిగిస్తుంది.

లెనిన్‌ ఆధ్వర్యంలో ఏర్పడిన సోవియెట్‌ ప్రభుత్వం 1920లో ప్రపంచంలోనే తొలిసారి స్వలింగ సంపర్కాన్ని సామాజిక, సాంస్కృతిక అంశంగా పరిగణించింది. స్వలింగసంపర్కులను కూడా పౌరులుగా గుర్తించి వారికి హక్కులు కల్పించింది. ఆ తర్వాతే అభివృద్ధి చెందిన దేశాల్లో ఈ ఉద్యమం ఊపందుకుంది. ఆధిపత్య భావజాలం ఏ రూపంలో ఉన్నా అది సమాజాన్ని ఎదగ నీయదు. ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పునిచ్చినంత మాత్రాన స్వలింగ సంపర్కులకు స్వేచ్ఛ లభిం చిందని భావించలేం. వారికి చట్టపరమైన అవరోధాలు తొలగినా సమాజంలో అలుముకున్న సంకు చిత భావాలు వెనువెంటనే మాయం కావు. కనీసం ఆ విషయంలోనైనా ప్రభుత్వాలు బాధ్యత తీసుకుని వారిపట్ల వివక్ష ప్రదర్శిస్తే చర్యలు తప్పవన్న సంకేతాలిస్తే మేలు.

మరిన్ని వార్తలు