దారుణం... అమానుషం

5 Nov, 2019 00:13 IST|Sakshi

వాగ్వాదం పెరిగి సంయమనం కోల్పోయి దుర్భాషలాడటం, సవాళ్లు విసురుకోవడం... ఆవేశం ముదిరి అవతలి వ్యక్తిపై దౌర్జన్యానికి దిగడం, ప్రాణాలు తీయడం తరచు వింటూనే ఉంటాం. కానీ తన కార్యాలయంలో విధుల్లో నిమగ్నమై ఉన్న ఒక మహిళా అధికారిని పెట్రోల్‌ పోసి నిప్పంటించి సజీవదహనం చేయడం అనేది ఎవరి ఊహకూ అందనిది. హైదరాబాద్‌ నగర శివారులోని అబ్దుల్లా పూర్‌మెట్‌ తహసీల్దార్‌ విజయారెడ్డిపై సోమవారం మధ్యాహ్నం ఒక దుండగుడు అత్యంత దారు ణంగా దాడి చేసి హతమార్చిన తీరు దిగ్భ్రాంతికరం. సమస్య ఉండొచ్చు. దాని పరిష్కారంలో జాప్యం వల్లనో, ఆ పరిష్కారం చేసిన తీరువల్లనో పట్టరాని కోపం వచ్చి ఉండొచ్చు. ఆ అధికారి తీసుకున్న నిర్ణయం పర్యవసానంగా అన్యాయమే జరిగి ఉండొచ్చు. దాన్ని సరిచేయడానికి భిన్న మార్గాలు అందుబాటులో ఉన్నప్పుడు వాటన్నిటినీ విడనాడి దౌర్జన్యానికి పూనుకోవడం, ప్రాణాలు తీయడం అత్యంత ఘోరం. తమ కుటుంబాలకు దక్కాల్సిన కొంత భూమి రెవెన్యూ అధికారుల నిర్ణయం కారణంగా వేరెవరికో వెళ్లిందన్నది దుండగుడి ఆగ్రహానికి కారణం. కానీ తహసీల్దార్‌ స్థాయిలో పరిష్కారం కాని వివాదం సబ్‌ కలెక్టర్‌ దృష్టికో, కలెక్టర్‌ దృష్టికో తీసుకెళ్లి న్యాయం దక్కేలా చూసుకోవచ్చు. ఇవన్నీ దాటాక న్యాయస్థానాలు ఉండనే ఉన్నాయి. ఇందువల్ల డబ్బు, సమయం వృధా అవుతున్నాయన్న నిరాశానిస్పృహలు ఏర్పడతాయనడంలో సందేహం లేదు. కానీ దేనికైనా ఒక క్రమాన్ని పాటించాల్సిందే.  

భూసంబంధ వివాదాలతో నిత్యం వ్యవహరించవలసి వచ్చే రెవెన్యూ సిబ్బంది విధి నిర్వహణ కత్తి మీద సాము వంటిది. తమ ముందున్న సమస్యను అన్ని కోణాల్లో పరిశీలించి తీసుకునే నిర్ణయం సహజంగానే కొందరికి కోపం తెప్పించవచ్చు. వివాదంలో ఎక్కువ పక్షాలున్నప్పుడు పరిష్కారం మరింత సంక్లిష్టమైనది. ఎవరికి వారు తమ వాదనే సరైందనుకుంటారు. లేదా ఏదే మైనా నిర్ణయం తమకు అనుకూలంగా ఉండాల్సిందే అనుకుంటారు. ఇలాంటివారందరితోనూ రెవెన్యూ సిబ్బంది నిత్యం మాట్లాడవలసి ఉంటుంది. ముఖ్యంగా తహసీల్దార్‌ స్థానంలో ఉండేవారు ఈ క్రమంలో ఎదుర్కొనే ఒత్తిళ్లు అన్నీ ఇన్నీ కావు. ప్రజాప్రతినిధులు, ప్రజాసంఘాలు, పార్టీలు... ఇలా అనేకులు వచ్చి కలిసి, ఫలానా వారి విషయంలో తీసుకున్న నిర్ణయం సరికాదని, దాన్ని పునఃపరిశీలించాలని కోరుతుంటారు. ధర్నాలు, రాస్తారోకోలు చేస్తారు. పై అధికారులకు ఫిర్యాదు చేస్తారు. తీసుకున్న నిర్ణయం తమకు రుచించనప్పుడు అవతలి పక్షం నుంచి లంచం తీసుకున్నారని ఆరోపించేవారుంటారు. అలా చేతివాటం ప్రదర్శించేవారు ఏసీబీకి చిక్కిన సందర్భాలు లేకపోలేదు. కానీ అది అందరికీ సాధ్యమయ్యే కళ కాదు. వీటి సంగతలా ఉంచి ఎందరు ఎన్నివిధాలుగా ఒత్తిళ్లు తెస్తున్నా, బెదిరింపులకు దిగుతున్నా చాకచక్యంగా వాటిని అధిగమించే అధికారులు లేకపోలేదు. కొన్ని వృత్తిలో భాగమనుకుని చేసుకుంటూ వెళ్లడం, అలవాటుపడటం అధికారులకు తప్పదు. కానీ ప్రాణాలు తీసే స్థితి ఏర్పడిందంటే అసలు విధి నిర్వహణ సాధ్యమేనా? తహసీల్దార్‌ అధికారాల రీత్యా తన పరిధిలో ఎగ్జిక్యూటివ్‌ మేజిస్ట్రేట్‌. ఆ స్థాయి అధికారి వద్దకు ఒక దుండగుడు సులభంగా పెట్రోల్‌తో వెళ్లగలిగాడంటే విస్మయం కలుగుతుంది. రెవెన్యూ అధికారులు వారు పరిష్కరించా ల్సిన సమస్యల రీత్యా పటిష్టమైన భద్రత అవసరమైనవారు. కానీ అది సక్రమంగా లేదని ఈ ఉదంతం నిరూపిస్తోంది. 

తెలంగాణలో భూ రికార్డుల ప్రక్షాళన మొదలయ్యాక రెవెన్యూ సిబ్బందిపై పనిభారం అపా రంగా పెరిగింది. పట్టాదారులు, కౌలుదారులు, ఇతరత్రా హక్కుదారులు రికార్డుల నవీకరణ వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కుటుంబాల్లోనే కలహాలు పెరుగుతున్నాయి. కోర్టు కేసుల వల్ల కావొచ్చు...ప్రభుత్వ భూములుగా నిర్ధారణ కావడం వల్ల కావొచ్చు– పట్టాదారు పాస్‌ పుస్తకాలు హక్కుదారులుగా చెప్పుకుంటున్నవారికి ఇవ్వడం అసాధ్యం. అలా చేస్తే ఉద్యోగాలకు ముందూ మునుపూ ముప్పు కలగొచ్చు. ఇవ్వకపోతే ఉద్దేశపూర్వకంగా రెవెన్యూ సిబ్బందే వాటిని అంద కుండా చేస్తున్నారన్న అపోహలు బయల్దేరవచ్చు. కొన్నిసార్లు సాఫ్ట్‌వేర్‌ లోపాలు కూడా సమస్యలకు దారితీస్తాయి. వీటిని విడమరిచి చెప్పడం, సముదాయించడం సిబ్బందికి పెను సమస్యగా మారు తుంటుంది. సమయమంతా దానికే సరిపోతుంది. ఇలా ఒకటికి పదిసార్లు తిరగకతప్పని పరిస్థితి ఏర్పడటంతో అవతలివారిలో అసహనం కలుగుతుంది. ఇలాంటి అనేకానేక సమస్యల మధ్య పని చేసే సిబ్బందికి కాస్తయినా వెసులుబాటు దొరకడం అసాధ్యమవుతున్నది. తగినంత సిబ్బంది లేక పోవడం వల్ల లేదా కుటుంబాలకు దూరంగా ఉండకతప్పని పరిస్థితులు ఏర్పడటం వల్ల వృత్తి పరమైన ఒత్తిళ్ల తీవ్రత మరింత పెరుగుతోంది. ఇటీవల నిజామాబాద్‌ జిల్లాలో తహసీల్దార్‌ ఒకరు ఆత్మహత్య చేసుకున్న ఘటన దీనికి ఉదాహరణ. 

దీనికితోడు 24 గంటల న్యూస్‌ చానెళ్లు ప్రారంభమయ్యాక, వాట్సాప్‌ వంటి సామాజిక మాధ్యమాల్లో వెనువెంటనే ప్రచారంలో పెట్టే అవకాశం ఏర్పడటం వల్ల కొందరు నాయకులు హద్దులు మరుస్తున్నారు. సంగతి చూస్తాం...తాటతీస్తాం...రోడ్లపై తిరగనివ్వం అంటూ బెదిరింపు ధోరణిలో మాట్లాడుతున్నారు. అధికారులను తూలనాడుతున్నారు. ఇలా అనడం వల్ల బాధితుల్లో ధైర్యం ఏర్పడుతుందనో, వారు మానసికంగా సంతృప్తి చెందుతారనో నేతలు అనుకుంటున్నారు. కానీ మూర్ఖత్వమో, మొండితనమో, మానసిక వ్యాధో ఉన్నవారిలో ఇటువంటి మాటలు చేతలకు పురిగొల్పుతాయి. పర్యవసానాల గురించి వారు ఆలోచించలేరు. కనుక ఆ బాపతు నేతలు నోరు అదుపులో పెట్టుకోవాలి. జరిగిన ఉదంతంపై ప్రభుత్వం సమగ్ర విచారణ జరిపి కారకులకు కఠిన శిక్షలు పడేలా చూడటం అవసరం. అలాగే ఇలాంటివి పునరావృతం కాకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవడం... అధికారులు స్వేచ్ఛగా, నిర్భయంగా పనిచేసే పరిస్థితులు కల్పించడం ముఖ్యం. 

Read latest Editorial News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు