విశాఖపై విషవాయు పంజా

8 May, 2020 00:01 IST|Sakshi

ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పు తీరాన కొలువైవున్న సుందర విశాఖ నగరం వెలుపల వేకువజామున ఎల్‌జీ పాలిమార్స్‌ కర్మాగారం నుంచి వెలువడిన విషవాయువు పంజా విసిరింది. ఏం జరుగుతు న్నదో తెలిసేలోగానే కొందరి ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. వందలమంది కళ్ల మంటలు, ఊపిరి తీసుకోలేకపోవడం, వాంతులు వగైరా లక్షణాలతో అనారోగ్యం పాలయ్యారు. వీరిలో కొందరు ఆసుపత్రిలో మరణించారు. సహాయచర్యల్లో పాల్గొంటున్న పోలీసు సిబ్బంది, ఇతరులు సైతం ఈ విషవాయువు ప్రభావానికి లోనయి ఆసుపత్రిలో చేరాల్సివచ్చింది. సుదీర్ఘ లాక్‌డౌన్‌ అనంతరం కర్మాగారాన్ని తెరవడానికి ఎల్‌జీ పాలిమార్స్‌ సంస్థ మొదలుపెట్టిన ప్రయత్నాలు చివరకు ఈ ప్రమాదాన్ని తెచ్చాయి. ప్రమాదం జరిగిన కొన్ని నిమిషాల్లోనే ప్రభుత్వ యంత్రాంగం యావత్తూ కదిలిన తీరు, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ఆ నగరానికి చేరుకుని బాధితులను పరా మర్శించి ధైర్యం చెప్పడం, ప్రాణాలు కోల్పోయినవారి కుటుంబాలకు రూ. కోటి నష్టపరిహారం ప్రక టించడంతో పాటు వేరు వేరు స్థాయిల్లో అనారోగ్యం పాలైన వారికి రూ. 10 లక్షలు మొదలుకొని రూ. 10 వేల వరకూ పరిహారం ఇస్తామనడం కొనియాడదగింది.  

అభివృద్ధి దిశగా అడుగులేస్తున్నట్టు కనబడే ఈ ప్రపంచంలో... ఆధునికంగా మారడానికి తోడ్ప డుతున్నాయని చెప్పే అనేకానేక ఉపకరణాల ఉత్పత్తిలో ఎన్ని ప్రమాదాలు పొంచివున్నాయో చెప్ప డానికి విశాఖ విషాదం తాజా ఉదాహరణ. మన దేశంలో విషవాయువు లీకైన ప్రతిసారీ 1984 డిసెం బర్‌ 2 వేకువజామున భోపాల్‌ నగరంలోని యూనియన్‌ కార్బయిడ్‌లో మిథైల్‌ ఐసోసైనేట్‌(ఎంఐసీ) వాయువు వెలువడిన ఉదంతం స్ఫురణకొస్తుంది. వేలమంది ప్రాణాలు బలిగొని, లక్షలాదిమందిని శాశ్వతంగా వ్యాధిగ్రస్తుల్ని చేసిన ఆ దుర్ఘటన... లాభాపేక్ష మినహా మరేది పట్టించుకోని బహుళజాతి సంస్థల పోకడలను, భద్రతా ప్రమాణాలు పాటించడంలో వాటి నిర్లక్ష్యాన్ని వెలుగులోకి తెచ్చింది. ఆనాటి దుర్ఘటనలో పసిపిల్లలతోసహా 4,000 మంది కన్నుమూయగా, దాదాపు అయిదు లక్షలమంది పలు రకాలుగా వ్యాధిగ్రస్తులయ్యారు. అది జరిగి 35 ఏళ్లు గడుస్తున్నా పరిశ్రమల తీరు మెరుగుపడలే దని తాజా ఉదంతం వెల్లడిస్తోంది.

ఛత్తీస్‌గఢ్‌లోని భిలాయ్‌ ఉక్కు కర్మాగారంలో 2014 జూన్‌లో జరి గిన విషవాయువు లీక్‌ పర్యవసానంగా ఆరుగురు మరణించారు. 40 మంది గాయపడ్డారు. మిథేన్‌ గ్యాస్‌ పైప్‌లైన్‌ బద్దలై ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. అదే ప్లాంటులో రెండేళ్లక్రితం పైప్‌లైన్‌ పేలడం వల్ల మరోసారి ప్రమాదం జరిగి తొమ్మిదిమంది చనిపోయారు. 2014లో ఆంధ్రప్రదేశ్‌లోని కోన సీమలో ఉన్న నగరం గ్రామంలో ఓఎన్‌జీసీ గ్యాస్‌ పైప్‌లైన్లు లీకై 17మంది బలయ్యారు. ఎందరో తీవ్ర గాయాలపాలయ్యారు. పైప్‌లైన్ల నుంచి గ్యాస్‌ లీకవుతున్నదని వచ్చిన ఫిర్యాదులను పట్టించు కోకపోవడంవల్ల ఈ దారుణం చోటుచేసుకుంది. ఢిల్లీలోని తుగ్లకాబాద్‌లో ఒక రసాయన డిపో నుంచి విషవాయువు లీకై 470 మంది బడి పిల్లలు అస్వస్థులయ్యారు. ఇలా పలు దుర్ఘటనలు జరుగుతున్నా, జన నష్టం సంభవిస్తున్నా అప్రమత్తంగా వ్యవహరించడంలో పరిశ్రమలు దారుణంగా విఫలమవు తున్నాయి. వాటì ని పర్యవేక్షించాల్సిన యంత్రాంగాలు సమర్థవంతంగా పని చేయడం లేదు.  

లాక్‌డౌన్‌ కారణంగా మార్చి 24న మూతబడిన ఎల్‌జీ పాలిమార్స్‌ పరిశ్రమ కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన వెసులుబాట్లతో తిరిగి ఉత్పత్తి ప్రారంభించేందుకు చేసిన ప్రయత్నాలు ఈ విషాదానికి కారణం. ఫ్యాక్టరీ ఆవరణలో వున్న స్టోరేజీ ట్యాంక్‌లో 1,800 టన్నుల స్టెరీన్‌ నిల్వలు వున్నాయని, పరిశ్రమ మూతబడేనాటికి ట్యాంక్‌లో వుండిపోయిన ఆ నిక్షేపాలు ఉష్ణోగ్రత మార్పుల కారణంగా పాలిమరైజేషన్‌కు లోనయి, ఆవిరిగా మారాయని, అది లీకై ఇంత పెద్ద ప్రమాదం జరిగిందని ఆ కంపెనీ ప్రతినిధి చెబుతున్నారు. దీంతోపాటు యాజమాన్యం అనేక ప్రశ్నలకు బదులీయాల్సివుంది. విషవాయువు లీకైనప్పుడు అప్రమత్తం చేస్తూ మోగాల్సిన అలారం ఏమైనట్టు? ఈ లాక్‌డౌన్‌ సమ యంలో అది కూడా పనికిరాకుండా పోయిందా? పరిశ్రమ మూతబడ్డాక ఇతరేతర సిబ్బంది వెళ్లిపో యినా, ట్యాంక్‌లో వున్న నిల్వల విషయంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలిసిన నిపుణులు తమ విధులు కొనసాగించారా? అసలు ఈ అంశంపై పరిశ్రమ యాజమాన్యం దృష్టి పెట్టిందా? వీటితోపాటు ఈ ట్యాంక్‌ నుంచి తొలిసారి గ్యాస్‌ లీకయింది గురువారం వేకువజామునేనా, అంతకు కొద్దిరోజులముందే అది మొదలైందా అన్న అంశాలు కూడా తేలాలి.

గ్యాస్‌ స్టోరేజీ ట్యాంకును తనిఖీ చేస్తున్న సిబ్బంది అందుకు సంబంధించిన అర్హతలున్నవారా కాదా అన్నది  తెలియాలి.  ఇలాంటి విషాద సమయాల్లో సహజంగానే అనేక సందేహాలు, అనుమానాలు వస్తాయి. ఎవరైనా ఉద్దేశ పూర్వకంగా, దుర్బుద్ధితో ఈ దుశ్చర్యకు పాల్పడ్డారా అన్నది అందులో ఒకటి. పౌరుల ప్రాణాలతో ముడిపడివున్న దుస్సంఘటనలు జరిగినప్పుడు దేన్నీ వదలకుండా విచారణ జరిపించడం తప్పని సరి. ఈ దుర్ఘటనపై సమగ్ర విచారణ జరిపిస్తామని సీఎం వైఎస్‌ జగన్‌ చెప్పారు గనుక అన్ని అంశాలూ వెలుగులోకొస్తాయని భావించాలి. ఈ విషాద ఘటన సమయంలో విశాఖ యువత, పోలీసు సిబ్బంది, ఎన్‌డీఆర్‌ఎఫ్, ఎస్‌డీ ఆర్‌ఎఫ్‌ సిబ్బంది చేసిన సేవలు కొనియాడదగినవి. వీరందరి చొరవ, సాధారణ పౌరుల ప్రాణాలు కాపాడాలన్న తపన దేశానికంతకూ ఆదర్శవంతం.

ఉషోదయ వేళకే వీరంతా 5,000 మంది పౌరుల్ని ఆసుపత్రులకు, సహాయశిబిరాలకు తరలించి శభాష్‌ అనిపించుకున్నారు. సంక్షోభం చుట్టుముట్టినప్పుడు స్వచ్ఛందంగా తరలివచ్చి స్పందించే తీరే సమాజ ఔన్నత్యాన్ని పట్టిచూపుతుంది. దురదృష్టవశాత్తూ ఇదే రోజు ఛత్తీస్‌గఢ్, తమిళనాడుల్లో కూడా రెండు వేర్వేరు దుర్ఘటనలు చోటు చేసుకున్నాయి. సీఎం జగన్‌మోహన్‌రెడ్డి విశాఖ విషాద ఉదంతంలో స్పందించిన తీరు ప్రశంసనీయం. ఈ ఘటనపై నివేదిక అందాక ప్రజల ప్రాణాలకు పూర్తి భరోసా కలిగే విధంగా ఆయన చర్యలు తీసుకోగలరన్న విశ్వాసం అందరికీ ఏర్పడింది. 

Read latest Editorial News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు