చట్టసభలు–జీతభత్యాలు

5 Aug, 2017 01:17 IST|Sakshi
చట్టసభలు–జీతభత్యాలు

‘మనదో చిత్రమైన ప్రజాస్వామ్యం. ఇక్కడ న్యాయమూర్తులే న్యాయమూర్తులను నియమించుకుంటారు. ఎంపీలు వాళ్ల జీతాల్ని వాళ్లే పెంచుకుంటారు’– పన్నెండేళ్ల    క్రితం అప్పటి లోక్‌సభ స్పీకర్‌ సోమనాథ్‌ ఛటర్జీ చేసిన వ్యాఖ్య ఇది. మళ్లీ ఇన్నేళ్ల తర్వాత ఎంపీల జీతభత్యాలపై విమర్శనాత్మక వ్యాఖ్య పార్లమెంటులో వినబడింది. బీజేపీ ఎంపీ వరుణ్‌గాంధీ జీరో అవర్‌లో దీన్ని లేవనెత్తుతూ కనీసం ఈ లోక్‌సభ కాలపరిమితి వరకూ మనం దాని జోలికి పోవద్దని కోరారు. అయితే ఆయనకు ఎవరినుంచీ పెద్దగా మద్దతు లభించలేదు. రాజ్యాంగంలోని 106, 195 అధికర ణాలు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తమ జీతభత్యాలను తామే పెంచుకునే అధికారాన్నిస్తున్నాయి.

న్యాయమూర్తుల నియామకాల కోసం ఉన్న కొలీజియం వ్యవస్థకు బదులు న్యాయ నియామకాల కమిషన్‌ ఏర్పాటుకు పార్లమెంటు ఒక చట్టం చేయడం, దాన్ని సుప్రీంకోర్టు కొట్టేయడం చరిత్ర. చట్టసభల సభ్యుల జీత భత్యాలకు సంబంధించి అలాంటి ప్రయత్నమేదీ జరగలేదు. అయితే సోమనాథ్‌ ఛటర్జీ కేవలం వ్యాఖ్యానించి ఊరుకోలేదు. ఈ అంశంపై ఒక అఖిల పక్ష సమావేశం నిర్వహించారు. ఆ సమావేశంలో దాదాపు అన్ని పార్టీల నేతలూ ఈ విధానం సరైంది కాదన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. జీతభత్యాలను ఎప్పటికప్పుడు సమీక్షించేందుకు ప్రత్యేక కమిషన్‌ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని ఏకగ్రీవంగా తీర్మానించారు. అది అక్కడే ఆగిపోయింది. ఈ విషయంలో రాజ్యాంగ సవరణ బిల్లుగానీ, జీతభత్యాల కమిషన్‌ ఏర్పాటుకు సంబంధించిన బిల్లుగానీ రూపొం దించే ప్రయత్నమే జరగలేదు. ఈలోగా మూడు, నాలుగు దఫాలు ఎంపీల జీత భత్యాలు మాత్రం పెరిగాయి. ఎంపీల జీతభత్యాలపై ఉభయ సభల సభ్యులతో ఒక కమిటీ ఉంటుంది. ప్రస్తుత యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ నేతృత్వంలోని కమిటీ నిరుడు ఎంపీల జీతభత్యాలు సవరిస్తూ సిఫార్సు చేసింది.

అంతా పారదర్శకంగా, హేతుబద్ధంగా సాగుతుంటే ఎవరికీ అభ్యంతరం ఉండదు. దాన్ని ప్రశ్నించేవారు కూడా ఉండరు. అలా లేనప్పుడే సమస్య అవు తుంది. ఏ ప్రమాణాల ఆధారంగా జీతభత్యాల పెంపు చేస్తున్నారో ఎవరికీ తెలి యదు. వరుణ్‌గాంధీ బ్రిటన్‌ ఎంపీలతో తెచ్చిన పోలిక ఆలోచించదగ్గది. అక్కడి ఎంపీల జీతభత్యాలు గత పదేళ్లలో 13 శాతం పెరిగితే, మన ఎంపీలకు 400 శాతం పెరిగాయని ఆయన వివరించారు. బ్రిటన్‌ ఎంపీల జీతాల అంశాన్ని పరిశీలించేం దుకు ఒక స్వతంత్ర సంస్థ ఉంది. ఆస్ట్రేలియాలో సైతం ఇలాంటి ఏర్పాటే చేసుకు న్నారు. ఈ కారణం వల్లనే కావొచ్చు... ఆ దేశాల ఎంపీల జీతభత్యాల పెరుగుదల మరీ అతిగా లేదు. మన దేశంలో చిత్రమైన పరిస్థితి. సాగు ఖర్చు అపరిమితంగా పెరిగి, పండిన పంటకు గిట్టుబాటు ధర లభించక చివరకు అప్పుల ఊబిలో కూరు కుపోయి ఏం చేయాలో దిక్కుతోచక రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.

ఈ ఏడాది ఇంతవరకూ దేశవ్యాప్తంగా 1,600మంది రైతులకు పైగా బలవన్మరణాల పాలయ్యారు. కేంద్రంలో పాలకులెవరున్నా రైతుల వ్యథ తీరడం లేదు. కానీ చట్ట సభల సభ్యులకు మాత్రమే కాదు... కేంద్రంలోనూ, రాష్ట్రాల్లోనూ ఉద్యోగుల జీతభ త్యాలు కూడా ఎప్పటికప్పుడు పెరుగుతున్నాయి. 1970లో గోధుమ మద్దతు ధర క్వింటాల్‌కు రూ. 76గా ఉంటే ఇప్పుడది రూ. 1,625 అయింది. అంటే ఈ 47 ఏళ్ల లోనూ 21 రెట్లు పెరిగింది. మిగిలిన పంటల మద్దతు ధరలు కూడా అంతంత మాత్రమే. ఇదే కాలంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సిబ్బంది జీతాలు దాదాపు 150 శాతం పెరిగాయి. ఇలాంటి వ్యత్యాసాలు బాహాటంగా కనిపిస్తున్నప్పుడు కనీసం తమవరకైనా సంయమనం పాటించాలన్న స్పృహ చట్టసభల సభ్యులకు ఉండాలి. 2001లో రూ. 12,000గా ఉన్న ఎంపీ జీతం నిరుడు పెంచిన తర్వాత రూ. 1,00,000 అయింది. తమ పంటలకు గిట్టుబాటు ధరలు కావాలని, రుణమాఫీ వర్తింపజేయాలని తమిళనాడు రైతులు గత కొన్ని నెలల నుంచి సాగిస్తున్న ఆందో ళన ఇంకా విరమించలేదు.

వారి సమస్య మాటేమోగానీ తమిళనాడు అసెంబ్లీ గత వారం ఎమ్మెల్యేల జీతాలను రూ. 55,000 నుంచి ఒక్కసారిగా రూ. 1,05,000కు పెంచుతూ తీర్మానించింది. రైతుల ఆత్మహత్యలు ఎక్కువగా చోటుచేసుకునే మహా రాష్ట్రలో నిరుడు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల జీతాలు రూ. 75,000 నుంచి ఒకేసారి రూ. 1,70,000కు పెరిగాయి. చిత్రమేమంటే ఇలా పెంచినప్పుడు చట్టసభల్లో కనీసం ఒక్క నిరసన స్వరమైనా వినబడటం లేదు. ఆమధ్య ఆంధ్రప్రదేశ్‌లో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల జీతాలు పెంచుతూ నిర్ణయం తీసుకున్న ప్పుడు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి దాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు.

బ్రిటన్, ఆస్ట్రేలియా వంటి కొన్ని మినహా చాలా దేశాల్లో ఎంపీల జీతభత్యాల పెంపును అక్కడి చట్టసభల్లోనే నిర్ణయిస్తారు. అమెరికాలో వివిధ రాష్ట్రాలు వివిధ రకాల విధానాలను అనుసరిస్తున్నాయి. దాదాపు 19 రాష్ట్రాలు ఎంపీల జీతభత్యా లపై కమిషన్‌లు ఏర్పాటు చేయగా కొన్నిచోట్ల చట్టసభలే ఆ నిర్ణయం తీసుకుం టాయి. మరికొన్ని రాష్ట్రాలు కమిషన్‌ నిర్ణయాలను సభలో చర్చించి వాటిని సవరిం చుకునే స్వేచ్ఛను దఖలు పరచుకున్నాయి. మన రాజ్యాంగ నిర్మాతలు అప్పట్లో వివిధ దేశాల రాజ్యాంగాలనూ, అక్కడి పాలనా సంప్రదాయాలనూ అధ్యయనం చేశారు. ఆ సమయంలో చాలాచోట్ల చట్టసభల నిర్ణయమే అంతిమంగా ఉండేది కనుక ఆ ఒరవడినే బహుశా ఇక్కడా కొనసాగించి ఉండొచ్చు.

అయితే వరుణ్‌గాంధీ చెప్పినట్టు ఎంపీల జీతభత్యాలు దశాబ్దకాలంలో 400 శాతం పెరగడం ఆరోగ్యకర ధోరణిని ప్రతిబింబించదు. కనీసం ఇలా పెంచినప్పుడు చర్చ జరగడం, ఆ నిర్ణ యంపై అన్ని పార్టీల సభ్యులు మాట్లాడటమనే సంప్రదాయం ఉంటే అందులోని మంచిచెడ్డలు ప్రజలందరికీ అర్ధమవుతాయి. అలాకాక అన్ని పార్టీలూ మౌనంగా ఉండిపోవడం ద్వారా ఆమోదముద్ర వేస్తుంటే ప్రజలకు ఎలాంటి సంకేతాలు వెళ్తాయి? ప్రతి అంశంపైనా చట్టసభల్లో చర్చ జరగడం ప్రజాస్వామ్యానికి ఆరోగ్య కర లక్షణం. అది ఎటూ లేదు. కనీసం తమ జీతాల విషయంలోనైనా దాన్ని పాటిం చడం అత్యవసరమని ప్రజాప్రతినిధులు గుర్తించాలి.

మరిన్ని వార్తలు