మాఫియా రాజ్యానికి ఎదురుదెబ్బ

6 Apr, 2019 00:29 IST|Sakshi

ఇసుక మాఫియా రాష్ట్రంలోని నదీనదాలను నాశనం చేస్తుంటే... పర్యావరణానికి ముప్పు కలిగి స్తుంటే నిమ్మకు నీరెత్తినట్టు కూర్చున్న ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి జాతీయ హరిత ట్రిబ్యునల్‌ చీవాట్లు పెట్టి రూ. 100 కోట్ల జరిమానా విధిస్తూ తీసుకున్న చర్యను మెచ్చనివారుండరు. రాష్ట్రంలో మాఫియా ఆగడాలు ఏ స్థాయిలో ఉన్నాయో గత అయిదేళ్లుగా అడపా దడపా మీడియాలో కథ నాలు వెలువడుతూనే ఉన్నాయి. క్రెడాయ్‌ వంటి రియల్‌ ఎస్టేట్‌ డెవలపర్ల సంఘాలు సైతం ఈ విషయంలో ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూనే ఉన్నాయి. ఎంతో నిజాయితీతో, పర్యావరణం పట్ల నిజమైన ప్రేమతో ఇసుక అక్రమ తవ్వకాలను నిలువరించడానికి ప్రయత్నించిన తహసీల్దార్‌ వనజాక్షిపై టీడీపీ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌ చింతమనేని ప్రభాకర్, ఆయన అనుచర గూండాలు సాగించిన దౌర్జన్యకాండ ఎవరూ మరిచిపోలేరు. ఇవన్నీ ఒక ఎత్తయితే సాక్షాత్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నివాసానికి కూతవేటు దూరంలో యథేచ్ఛగా కృష్ణానదీ గర్భంలో ఇసుక తోడేస్తున్నా పట్టనట్టు ఉండటం మరో ఎత్తు.

అధికార పార్టీకి చెందిన ముగ్గురు మంత్రులకూ, 38మంది ఎమ్మెల్యేలకూ, ఆరుగురు ఎమ్మెల్సీలకూ రాష్ట్రంలో సాగుతున్న అక్రమ ఇసుక దందాతో ప్రమేయం ఉన్నదని ఇంటెలిజెన్స్‌ విభాగం నాలుగేళ్లక్రితం నివేదిక ఇచ్చింది. డ్వాక్రా సంఘాలకు ఇసుక విక్రయాలను కట్టబెడతామని, ఇసుక విక్రయాల్లో వచ్చిన సొమ్ములో వారికి 25 శాతం వాటా ఇస్తామని ప్రకటించి, ఆ మాటున ఇసుక మాఫియాలను ప్రోత్సహించింది చంద్రబాబు సర్కారే. అడ్డూ ఆపూ లేకుండా సాగుతున్న ఈ ఆగడాల గురించి ఆందోళన చెందిన తరుణ్‌ భారత్‌ సంఘ అధ్యక్షుడు రాజేంద్రసింగ్‌ మరికొందరు పర్యావరణవేత్తలతో కలిసి స్వయంగా తెలుసుకుని జాతీయ హరిత ట్రిబ్యునల్‌కు లేఖ రాశారు. దాన్ని పిటిషన్‌గా పరిగణించి విచారణ జరిపాక ఎన్జీటీ తాజా చర్య తీసుకుంది. నిజానికి పర్యావరణవేత్తలు ప్రధాని నరేంద్ర మోదీకి సైతం ఏణ్ణర్ధం క్రితం ఫిర్యాదు చేశారు. ఆంధ్రప్రదేశ్‌లోని ఇసుక మాఫియాల వెనక అధికార టీడీపీ నేతల హస్తం ఉన్నదని ఆ ఫిర్యాదులో తెలిపారు. అక్రమ తవ్వకాలను గురించి ప్రశ్నిస్తే ఆ మాఫియా ముఠాలు ఆయుధాలు చూపించి బెదిరిస్తున్నాయని, పలువురు రైతులపై దాడులు కూడా చేశారని ఆరో పించారు. కానీ చివరకు ఎన్జీటీ జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. ఈలోగా ఎంతో విలువైన కాలం గడిచిపోయింది.

ఇసుక ప్రకృతి ప్రసాదిస్తున్న అనేకానేక సహజ వనరుల్లో ఒకటి. నిర్మాణరంగానికి అది ప్రాణావసరం. అంతమాత్రం చేత దాన్ని ఇష్టానుసారం తవ్వి తీసుకుపోకూడదు. అశాస్త్రీయంగా, చట్టవిరుద్ధంగా ఇసుక తవ్వడం వల్ల విపత్తులేర్పడతాయి. నదుల గమనం మారుతుంది. అవి వట్టిపోయే ప్రమాదం కూడా ఉంది. వాటిపై ఆధారపడి జీవనం సాగించే పశుపక్ష్యాదులపై, ఇతర జీవులపై ప్రభావం పడుతుంది. భూగర్భ జలాలు అడుగంటుతాయి. చివరకు ఆ ప్రాంతమంతా ఎడారవుతుంది. ఆంధ్రప్రదేశ్‌లో దాదాపు 90 ఇసుక రీచ్‌లున్నాయి. ఇందులో 11 రీచ్‌లలో సరి హద్దు రాష్ట్రాలకు వాటా ఉంది. ఇవిగాక చట్టవిరుద్ధంగా అనేకచోట్ల తవ్వకాలు సాగుతున్నాయి.  సీఎం అధికార నివాసం సమీపంలోని పెనుమాక, వెంకటపాలెం, ఉద్ధండ్రాయునిపాలెం, లింగా యపాలెం, రాయపూడి, సూరాయపాలెం, గుంటుపల్లి, ఇబ్రహీంపట్నం తదితర రీచ్‌లలో కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి, రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి అధికారులు మూడు నెలల క్రితం తనిఖీలు చేసినప్పుడు అనేక అవకతవకలు బయటపడ్డాయి.

నిబంధనలకు విరుద్ధంగా భారీ యంత్రాలను ఉపయోగిస్తూ ఈ తవ్వకాలు సాగిస్తున్నారని, రోజూ వేలాది ట్రక్కుల్లో ఇసుకను తరలించుకుపోతున్నారని వారి పరిశీలనలో తేలింది. మర పడవల వినియోగం వల్ల నదీజలాల్లో డీజిల్‌ కలిసి కాలుష్యం ఏర్పడుతోందని, ట్రక్కుల వల్ల పర్యావరణం దెబ్బతింటున్నదని ఆ సంస్థలు తెలిపాయి. అన్నిటికన్నా ఘోరమైన విషయమేమంటే... కనీసం ఎంత ఇసుక తవ్వుకుపోతున్నారో తెలిపే రికార్డులు కూడా ఎక్కడా లేవు. ఇంతవరకూ మాఫియాలు తవ్వి తీసుకెళ్లిన ఇసుక విలువ రూ. 10,000 కోట్ల మేర ఉంటుందని ఎన్జీటీలో పర్యావరణవేత్తల తరఫున వాదించిన కె. శ్రావణ్‌ కుమార్‌ చెప్పారంటే ఈ దుర్మార్గం ఏ స్థాయిలో సాగుతున్నదో అర్ధం చేసుకోవచ్చు.

దేశంలో వచ్చే ఏడాదికల్లా 140 కోట్ల టన్నులకుపైగా ఇసుక అవసరమవుతుందని ఒక అంచనా. అశాస్త్రీయంగా జరిపే తవ్వకాలను నిరోధించి, పర్యావరణానికి అనువైనవిధంగా ఇసుక తీసుకునేందుకు వీలుగా మార్గదర్శకాలు రూపొందించమని 2012లో సుప్రీంకోర్టు కేంద్రానికి సూచించింది. అంతేకాదు...ఇసుకతోసహా ఖనిజ తవ్వకాలన్నిటికీ కేంద్ర పర్యావరణ విభాగం అనుమతిని తప్పనిసరి చేయాలని సూచించింది. ఆ తర్వాత మూడేళ్లకు ఆ మార్గదర్శకాలు కూడా రూపొందాయి. కానీ విషాదమేమంటే దీన్ని ఎవరూ సరిగా పట్టించుకున్న పాపాన పోలేదు. ఈ మాఫియాలు అధికారులను నయానా, భయానా దారికి తెచ్చుకుంటున్నాయి. మాటవినని వారిపై దాడులు చేస్తున్నాయి.

ఎడాపెడా ఇసుక తవ్వుతూ వేల కోట్లు ఆర్జిస్తున్నాయి. ఇందులో తమ ప్రమేయాన్ని కప్పిపుచ్చడానికి ఏవో చర్యలు తీసుకుంటున్నట్టు ప్రభుత్వం నాటకాలు ఆడుతోంది. మాఫియాలను అరికట్టడం కోసం జీపీఎస్‌ ట్రాకింగ్‌ వ్యవస్థ తీసుకొస్తామని నిరుడు ఆర్భాటంగా ప్రకటించింది. కానీ ఎన్జీటీ దీన్నంతా గ్రహించింది. కనుకనే భారీ జరిమానా విధించింది. ఇంత టితో అయిపోలేదు. అనుమతి లేని ఇసుక తవ్వకాలను నిషేధించమని ప్రభుత్వాన్ని ఆదేశించింది. అలాగే తనిఖీలు నిర్వహించి ఇంతవరకూ నదులకు జరిగిన నష్టమెంతో, ప్రభుత్వం కోల్పోయిన ఆదాయమెంతో అంచనా వేసి సమగ్ర నివేదిక ఇవ్వమని కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి, ధన్‌బాద్‌లోని ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మైనింగ్‌లను ఆదేశించింది. మాఫియా ముఠాలకు, వారికి అండగా ఉంటున్న సర్కారుకు ఈ చర్యలు ఒక హెచ్చరికగా ఉంటాయని భావించాలి.

Read latest Editorial News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

‘తక్షణ తలాక్‌’పై ఇంత తొందరేల?

ఈ నేరాలు ఆగుతాయా?

ప్రజాతీర్పే పరిష్కారం

వినూత్నం... సృజనాత్మకం

అద్భుత విజయం

బ్రహ్మపుత్ర ఉగ్రరూపం

నిర్లక్ష్యం... బాధ్యతారాహిత్యం 

పాక్‌కు ఎదురుదెబ్బ

దుర్వినియోగానికి తావీయొద్దు

పరిష్కారం అంచుల్లో కర్ణాటకం

ఏపీకి ‘నవరత్నాల’ హారం

అన్నదాతకు ఆసరా ఎలా?

జనం చూస్తున్నారు...జాగ్రత్త!

మళ్లీ ‘రాజద్రోహం’

‘రాజన్న రాజ్యం’ లక్ష్యంగా...

గ్రామీణంవైపు అడుగులు

ఆశల సర్వే!

ఎట్టకేలకు...

మళ్లీ అదే తీరు!

అత్యంత అమానుషం

అమెరికా ఒత్తిళ్లు

మంచంపట్టిన ప్రజారోగ్యం

‘మూకదాడుల’ బిల్లు జాడేది?

విలక్షణ పాలనకు శ్రీకారం

మమత ‘మందుపాతర’

నెరవేరిన జలసంకల్పం

జమిలి పరీక్ష

కీలెరిగి వాత

పసితనంపై మృత్యుపంజా

ఇంత దారుణమా!

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

బిగ్‌బాస్‌.. జాఫర్‌, పునర్నవి సేఫ్‌!

దిల్ రాజు ప్యానల్‌పై సీ కల్యాణ్ ప్యానల్‌ ఘనవిజయం

ఇది ‘మహర్షి’ కలిపిన బంధం

ప్రేమలో పడ్డ ‘చిన్నారి’ జగదీశ్‌!

కన్నడనాట ‘కామ్రేడ్‌’కి కష్టాలు!

హీరోయినా..? ఐటమ్‌ గర్లా?