ఈవీఎంలపై దుమారం

23 Jan, 2019 00:19 IST|Sakshi

సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో వాటికి మరింత విశ్వసనీయత పెంచేలా... రాజకీయ పార్టీలు జవాబుదారీతనం అలవర్చుకునేలా... చట్టసభలు రాజ్యాంగ నిబంధనలను గౌరవించేలా చేయడానికి ఏం చర్యలు తీసుకోవాలన్న చర్చ జరగడానికి బదులు వేరే అంశాలు రంగం మీదికొస్తు న్నాయి. అమెరికాలో ముసుగు ధరించి కూర్చుని సామాజిక మాధ్యమం స్కైప్‌ ద్వారా సోమవారం లండన్‌లో మీడియాతో మాట్లాడిన సయ్యద్‌ షుజా లేవనెత్తిన ఈవీఎంల అంశం అటువంటిదే. ఎన్ని కల సీజన్‌ వచ్చినప్పుడల్లా ఈ వివాదం తెరపైకి రావడం మన దేశంలో రివాజుగా మారింది. కాక పోతే సయ్యద్‌ షుజా ఈసారి మసాలా అద్దాడు. అందులో రోడ్డు ప్రమాదాలు, పోలీసు ఎన్‌కౌంటర్లు, గుర్తు తెలియని వ్యక్తులు చేసిన హత్యలు ఉన్నాయి. తాను అలా బలికా కుండా ఉండటానికి భారత్‌ నుంచి పారిపోయి వచ్చానని కూడా చెప్పాడు. సయ్యద్‌ షుజాను చూస్తే దేశంలోని ఇతర రాష్ట్రాలవారి మాటెలా ఉన్నా రెండు తెలుగు రాష్ట్రాలవారికి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెంటనే స్ఫురణకొస్తారు. హైదరాబాద్‌ను కట్టించింది తానే నని, సెల్‌ఫోన్లు తన ఘనతేనని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డికి 1978 ఎన్నికల్లో కాంగ్రెస్‌ టిక్కెట్‌ ఇప్పించింది తానేనని బాబు అవకాశం దొరికినప్పుడల్లా చెబుతూనే ఉంటారు. 

ఈవీఎంలను ‘ట్యాంపర్‌’ చేయవచ్చునని ఎవరికైనా అనుమానం ఏర్పడినా, దాన్ని నిరూపి స్తామని ముందుకొచ్చినా వారిని తప్పుబట్టాల్సిన పనిలేదు. ప్రజాస్వామ్య వ్యవస్థలో అత్యంత కీలక మని భావించే ఎన్నికలు సందేహాతీతంగా ఉండాలని, ప్రజల తీర్పు వమ్ముకాకుండా పక డ్బందీ ఏర్పాట్లుండాలని పౌరులంతా కోరుకుంటారు. అందువల్లే పౌర సమాజ సంఘాలు, రాజ కీయ పక్షాలు ఈవీఎంల పనితీరుపై అనుమానాలు వ్యక్తం చేసినప్పుడల్లా ఎన్నికల సంఘం(ఈసీ) స్పందించి వివరణనిస్తూనే ఉంది. అలాగే పోలింగ్‌కు ముందు ఈవీఎంలను ప్రతి దశలోనూ తనిఖీ చేసుకునేందుకు, వాటి పనితీరును పరీక్షించేందుకు పార్టీల ప్రతినిధులకు అవకాశమిస్తున్నారు. ఈవీ ఎంలను ప్రభుత్వ రంగ సంస్థలైన బెంగళూరులోని బెల్, హైదరాబాద్‌లోని ఈసీఐఎల్‌ ఉత్పత్తి చేస్తు న్నాయి. వాటిల్లో వినియోగించే సాఫ్ట్‌వేర్‌ పోగ్రాం కోడ్‌ను ఆ సంస్థలే రూపొందించాయి. దానికి కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు కూడా కల్పించామని చెబుతున్నాయి. ఈవీఎంలలో వాడే సెమీ కండ క్టర్‌ మైక్రోచిప్‌ల ఉత్పత్తి ఇక్కడ లేకపోవడం వల్ల వాటి కోసం విదేశీ ఉత్పత్తిదారులను ఆశ్రయించ వలసి వస్తున్నదని ఈసీ గతంలో వివరించింది. ఇందువల్ల ఇదంతా బయటకు పోయే అవకాశమున్న దని ఎవరూ అనుమానించాల్సిన అవసరం లేదని, సాఫ్ట్‌వేర్‌ ప్రోగ్రాం కోడ్‌ను మెషీన్‌ కోడ్‌గా మార్చి పంపుతాం గనుక దాన్ని ఇతరులు చదవడం(రీడ్‌) లేదా నకలు తీయడం అసాధ్య మని ఈసీ వివరి స్తోంది.

ఈవీఎంలకు వైఫై, బ్లూ టూత్‌ వగైరాలను అనుసంధానించడం కుదరని పని అని చెబు తోంది. ఈసీ వివరణతో సంతృప్తి చెందాల్సిన పని లేదు. ఎందుకంటే సాంకేతికత రోజురోజుకూ అభి వృద్ధి చెందుతోంది. అది బహుముఖాలుగా విస్తరిస్తోంది. దాన్ని అనేకులు అంది పుచ్చుకుని తమ సృజనాత్మకతను చాటుకుంటున్నారు. దాంట్లో భాగంగా ఎవరికైనా ఈవీఎంలపై కొత్త అనుమానాలు తలెత్తితే వాటిని సైతం ఈసీ ముందు ఉంచవచ్చు. అయితే అందుకు కొన్ని పద్ధతులుంటాయి. వాటిని కాదని అడ్డదార్లు తొక్కితే చివరకు అలాంటివారే నవ్వులపాలవుతారు. 2010లో ఈవీఎంలను ఎలా ‘ట్యాంపర్‌’ చేయవచ్చునో ‘ప్రయోగాత్మకం’గా నిరూపిస్తానని ఒక వ్యక్తి బయల్దేరినప్పుడు అప్పటికి మాజీ ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు అతనికి మద్దతు పలికి, ఢిల్లీకి తీసుకెళ్లి దాన్నొక జాతీయ వివాదంగా మార్చడానికి ప్రయత్నించారు. చిత్రమేమంటే బీజేపీ, వామపక్షాలు కూడా చంద్రబాబుకు అప్పుడు మద్దతు పలికారు. తీరా హరిప్రసాద్‌ ఉపయోగించిన ఈవీఎం ముంబై కలక్టరేట్‌ నుంచి మాయమైన చోరీ సొత్తని అక్కడి పోలీసులు తేల్చారు. అప్పట్లో ఆయన్ను అరెస్టు చేశారు. 

మన దేశంలో ఎన్నికల్లో ఓడిపోయిన పార్టీ అందుకు దారితీసిన పరిస్థితులపై ఆత్మవిమర్శ చేసుకోవడం కంటే ముందు ఈవీఎంలను తప్పుబట్టడం అలవాటైంది. అవే పార్టీలు విజయం సాధించినప్పుడు మాత్రం మౌనంగా ఉండిపోతాయి. ఎన్నికలు జరిగాక  ఆరోపించడంకాక ముందే అలా చెబితే, దాన్ని నిరూపించడానికి పూనుకుంటే వేరుగా ఉంటుంది. కానీ ఏ పార్టీ కూడా ఆ పని చేయదు. 2004 ఎన్నికల సమయంలో తాను అధికారంలో ఉండటం వల్ల అప్పట్లో చంద్రబాబు ఈవీఎంలపై ఎలాంటి ఆరోపణలూ చేయలేదు. 2009 ఎన్నికల్లో ఓటమిపాలైనప్పుడు ఆయన ఈవీ ఎంలలో మోసం జరిగిందని గగ్గోలు పెట్టారు. అనంతరకాలంలో సుప్రీంకోర్టు ఆదేశాలతో ఈవీ ఎంలకు ప్రింటర్‌(వీవీప్యాట్‌)లను అనుసంధానించడం కూడా మొదలైంది.  షుజా తాను ఏకరువు పెట్టిన ఆరోపణలకు తగిన ఆధారాలు చూపడంలో విఫలమయ్యాడు. ఈవీఎంల సంగతలా ఉంచి అతని పేరు, ఊరు కూడా నిజమో కాదో చెప్పలేని స్థితి ఉంది.

తాను ఈసీఐఎల్‌ మాజీ ఉద్యోగినని అతగాడు చెబుతుంటే, అలాంటివారెవరూ ఎప్పుడూ పనిచేయలేదని సంస్థ నిర్వాహకులు, సిబ్బంది కూడా చెబుతున్నారు. ఇక కేంద్ర మాజీ మంత్రి గోపీనాథ్‌ ముండే దుర్మరణం, గౌరీ లంకేష్‌ హత్య కూడా అతను ఈవీఎంలతో ముడిపెట్టాడు. హైదరాబాద్‌లో తన బృందం సభ్యుల్ని పోలీసులు కాల్చిచంపడం వల్ల భయపడి భారత్‌ విడిచి వచ్చానంటున్నాడు. ఇందులో ఏ ఉదం తానికీ తగిన ఆధారాలు షుజా చూపలేకపోయాడు. ఇలాంటి వ్యక్తి మాటలకు విలువిచ్చి కాంగ్రెస్, సీపీఎం, తృణమూల్‌ తదితర పక్షాలు ఈవీఎంలపై సందేహాలు లేవనెత్తుతున్నాయి. దానికి బదులు తాము విశ్వసనీయులని భావించే నిపుణుల ద్వారా మరోసారి ఈవీఎంలనూ, వీవీప్యాట్‌లను పరీక్షించడానికి అవకాశమివ్వమని ఈసీని ఆ పార్టీలు కోరడం ఉత్తమం. ఇప్పుడు విపక్షాల తీరును తప్పుబడుతున్న బీజేపీ తాను విపక్షంలో ఉన్నప్పుడు ఇదే తీరున ఈవీఎంలపై సందేహం వ్యక్తం చేసిన సంగతిని గుర్తుతెచ్చుకోవాలి.

మరిన్ని వార్తలు