పొదుపులకు చేటుకాలం

8 Aug, 2017 00:25 IST|Sakshi
పొదుపులకు చేటుకాలం
దేశంలోని అతి పెద్ద బ్యాంకైన స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా హఠాత్తుగా సేవింగ్స్‌ ఖాతాలపై వడ్డీ రేటులో 50 బేసిస్‌ పాయింట్ల కోత వేసి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. కోటి రూపాయలకంటే తక్కువ సేవింగ్స్‌ బ్యాంక్‌ డిపాజిట్లపై వడ్డీ రేటును 4 శాతం నుంచి 3.5 శాతానికి తగ్గించింది. 42 కోట్ల ఖాతాదార్ల పునాదిగల అతి పెద్ద బ్యాంకైన ఎస్‌బీఐని ఇతర వాణిజ్య బ్యాంకులు దిక్సూచిగా పరిగణించడం పరిపాటి. కాబట్టి పలు ఇతర వాణిజ్య బ్యాంకులు కూడా ఇదే బాట పట్టవచ్చని భావిస్తున్నారు. ఎస్‌బీఐ ఖాతాదార్లలో కోటికి పైగా ఉన్న సేవింగ్స్‌ డిపాజిటర్లు ఎక్కువగా పదవీ విరమణ చేసిన ఉద్యోగులు, దినసరి కూలీలు వంటి చిన్న పొదుపరులే. వారందరికీ ఇది మింగుడు పడని చేదు వార్తే.

ఈ ఖాతాల్లోని రూ. 9 లక్షల కోట్ల డిపాజిట్ల వల్ల ఎస్‌బీఐ నికర వడ్డీ లబ్ధి (ఎన్‌ఐఎమ్‌) గణనీయంగా పెరుగుతుంది. పెద్ద నోట్ల రద్దు వల్ల భారీ ఎత్తున డిపాజిట్లు పెరిగాయి కాబట్టి, ద్రవ్యోల్బణం తగ్గి, నిజ వడ్డీ రేటు ఎక్కువగా ఉన్నది కాబట్టి ఈ నిర్ణయాన్ని తీసు కున్నామని ఎస్‌బీఐ తన చర్యను సమర్థించుకుంది. 2011లో సేవింగ్స్‌ ఖాతాల వడ్డీ రేటుపై నియంత్రణను ఎత్తివేసినప్పటి నుంచి సూత్ర రీత్యా ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులకు ఆ స్వేచ్ఛ లభించిన మాట నిజమే. కానీ, వాణిజ్య బ్యాంకుల మధ్య పోటీ వల్ల చిన్న పొదుపుదార్లకు ఎక్కువ వడ్డీ రేట్లు లభించే అవకాశాన్ని కల్పిం చాలనే ఆ స్వేచ్ఛను కల్పించించారు. ద్రవ్యోల్బణం తగ్గడం వల్ల నిజ వడ్డీ రేట్లు పెరి గితే అది చిన్న పొదుపరులకు మేలు చేయాలనే లక్ష్యానికి తోడ్పడేదే తప్ప, అవాం ఛనీయమైనది కాదు. కానీ ఎస్‌బీఐ నిర్ణయం, నియంత్రణ ఎత్తివేత అసలు లక్ష్యానికే విరుద్ధమైనది, చిన్న పొదుపరుల ప్రయోజనాలను దెబ్బతీసేది. అది దీర్ఘ కాలంలో మొత్తం పొదుపును తగ్గించి ఆర్థిక వ్యవస్థపైన, పొదుపులను బ్యాంకింగ్‌ రంగానికి దూరంగా మరల్చి బ్యాంకులపైన ప్రతికూల ప్రభావాన్ని నెరపుతుంది.

సేవింగ్స్‌ వడ్డీ రేటు తగ్గింపు వల్ల ఆ ఖాతాల్లో నిరుపయోగంగా ఉన్న నిధులను ఖాతాదార్లు మ్యూచ్యువల్‌ ఫండ్స్‌వంటి లాభదాయక ద్రవ్య సాధనాల రూపంలోకి మళ్లిస్తారని, అది వారికి, ఆర్థిక వృద్ధికి మేలు చేస్తుందని మరో సమర్థన కూడా వినవస్తోంది. విద్యావంతులలో సైతం ద్రవ్య మార్కెట్‌ అక్షరాస్యత అంతంత మాత్రంగా ఉన్న మన దేశంలో, ఈ చిన్న పొదుçపుల క్యాపిటలైజేషన్‌ పగటి కలే. నష్టభయంలేని జాతీయ పొదుపు పత్రాలు, కిసాన్‌ వికాస్‌ పత్ర, పబ్లిక్‌ ప్రావిడెంట్‌ ఫండ్, ఫిక్సెడ్‌ డిపాజిట్ల వంటి ప్రత్యామ్నాయాలపై వడ్డీ రేట్లను ఇప్పటికే తగ్గించారు. కాబట్టి చిన్న మదుపరులు ఈ కోతకు తలూపడం తప్ప గత్యంతరం ఉండకపోవచ్చు. పైగా ప్రస్తుతం ద్రవ్యోల్బణం ఊహించిన దానికన్నా తక్కువగా ఉన్నా, 2018 నాటికి 4 శాతం పైకి చేరుతుందని ఆర్‌బీఐ స్వయంగా చెబుతోంది. కాగా, ద్రవోల్బణం తిరిగి రెక్కలు చాచక తప్పదని కొందరు ఆర్థిక నిపుణులు చేస్తున్న హెచ్చరికనూ తోసి పారేయలేం. అదే జరిగితే 3.5 శాతం వడ్డీ సైతం మటు మాయమై పోతుంది. 

అల్ప వడ్డీ రేట్లు ఆర్థిక వృద్ధికి సోపానాలనేదే యూపీఏ నుంచి నేటి ఎన్‌డీఏ వరకు ఆర్థిక మంత్రులందరి మాట. ఆగస్టు 2న ఆర్‌బీఐ, రెపో రేటును 25 బేసిస్‌ పాయింట్ల మేర  తగ్గించింది. మరింత వడ్డీ కోతను ఆశిస్తూ ఆర్థిక మంత్రి జైట్లీ తాజాగా ‘ద్రవ్యోల్బణం చాలా కాలంగా అదుపులో ఉంది. ఇప్పట్లో చమురు ధరలు తిరిగి ఆకాశాన్ని చేరే అవకాశం లేదు. కాబట్టి ఏ ఆర్థిక మంత్రి అయినా వడ్డీ రేట్లు కోతను ఆశిస్తాడు’ అన్నారు. వడ్డీ రేట్లను నియంత్రించే ద్రవ్య విధాన కమిటీ (ఎమ్‌ఎన్‌సీ) సోమవారం సమావేశంలో ఆ కోత తప్పిపోయిందిగానీ, అక్టోబర్లో తప్పదని వినవస్తోంది. అందువల్లనే వడ్డీ రేట్లు మరింత తగ్గే అకాశం ఉన్నదనే సహేతుకమైన ఆందోళన చిన్న మదుపర్లను బెంబేలెత్తిస్తోంది. తక్కువ వడ్డీరేట్లు పొదుపరులు, పెన్షనర్లపై అదనపు పన్ను విధింపులా పనిచేసి, వారి అదాయాలకు కత్తెర వేస్తాయి. మరోలా చెప్పాలంటే పెద్ద వయస్కుల ఆదాయాలను తగ్గించడం ద్వారా సాపేక్షికంగా యువ పౌరులకు తక్కువ వడ్డీలకు రుణాలను అందజేస్తాయి. అయినా, వస్తు వినియోగం, డిమాండు పెరిగి ఉత్పత్తికి, వృద్ధికి ప్రోత్సాహం లభి స్తుందని మన విధానకర్తల సిద్ధాంతం. రెండు చేదు వాస్తవాలు దీన్ని ఆచరణకు కొరగానిదని తేల్చాయి. నేటి ప్రపంచ మాంద్య పరిస్థితుల్లో మన ఆర్థిక వ్యవస్థలో వడ్డీ రేట్ల తగ్గింపు ప్రభావం ఉత్పాదక మదుపులను గణనీయంగా పెంచడానికి బదులు నిల్వ ఉన్న సరుకుల గుట్టలను వదిలించుకోడానికే చాలా వరకు పరిమితం అవుతోంది. రెండవది, కొత్త మదుపులు ఉద్యోగాలు లేని వృద్ధికి మాత్రమే దోహ దం చేస్తున్నది. అయినా తక్కువ వడ్డీ రేట్ల సిద్ధాంతాన్నే నమ్ముకుని ఆర్‌బీఐ 2015 నుంచి ఇంతవరకు మొత్తం 175 శాతం బేసిస్‌ పాయింట్ల మేర వడ్డీ రేటును తగ్గిం చింది. ఈ తగ్గింపు గణనీయమైనదే. కానీ పారిశ్రామిక వృద్ధి చెప్పుకోదగినంతగా  పుంజుకోకపోగా, జీడీపీలో వస్తుతయారీ రంగం వాటా 16 శాతం వద్ద ఈడిగిలపడి ఉంది.

కార్పొరేట్‌ బ్యాంకు రుణాల్లో పెరుగుదల ఆశించినంతగా లేదంటే.. అందుకు కారణం వడ్డీ రేట్లు ఎక్కువగా ఉండటం కాదు, వస్తు డిమాండు తక్కువగా ఉండటమే. ఉపాధి కల్పన, కొనుగోలు శక్తి పెంపుదల వంటి దీర్ఘకాలిక పరిష్కా రాలు తప్ప, వడ్డీ రేట్ల చిట్కా పనిచేయదని... 2008 ఆర్థిక మాంద్యం తదుపరి కాలపు అమెరికా తదితర అభివృద్ధిచెందిన దేశాల అనుభవం రుజువు చేసింది. అల్ప వడ్డీ రేట్లతో చిన్న పొదుపరులను, పెన్షనర్లను ఆర్థిక వృద్ధి కోసం త్యాగాలు చేయమనడం సమంజసమే అనుకున్నా, ఈ సిద్ధాంతం ఆచరణలో బెడిసి కొట్టక తప్పదు. అల్ప వడ్డీ రేట్లు పెట్టుబడి మదుపులపై చూపే ప్రభావం సంగతి ఎలా ఉన్నా, తక్కువ వడ్డీకి రుణాలిచ్చి, రుణ ఆధారిత వినియోగంతో స్తోమతకు మించిన జీవనశైలిని అనుభవించేలా చేస్తాయి. దీంతో నేటి యువత రుణ భారంతో కుంగడానికి ఎంతో కాలం పట్టదు. ఎలాగో నెట్టుకు వచ్చినా, వయోభారంతో పాటూ రుణ భారాన్ని మోస్తూ వృద్ధాప్యంలోకి ప్రవేశించాల్సి వస్తుంది. ఎలాంటి సామాజిక సంక్షేమ రక్షణ లేని మన దేశంలో ఇది ఎలాంటి దుస్థితో చెప్పనవసరం లేదు. అయినా వడ్డీ రేట్ల తగ్గింపు మంత్రం పఠిస్తూనే ఉందామా?
మరిన్ని వార్తలు