భూముల్లో ‘టేకు’, అన్నంలో ‘మేకు’

9 Jun, 2015 01:08 IST|Sakshi
భూముల్లో ‘టేకు’, అన్నంలో ‘మేకు’

రెండోమాట

‘ప్రతీ పదేళ్లకు భారతదేశంలో 20 లక్షల హెక్టార్ల వ్యవసాయ భూమిని (హెక్టార్=2.47 ఎకరాలు)వ్యవసాయేతర ప్రయోజనాల కోసం ఇటీవల ప్రభుత్వాలు మళ్లించేస్తున్నాయి. వంద నగరాల అభివృద్ధి పేరిట ఆగమేఘాల మీద పట్టణీకరణ కోసం, ఉద్యోగాల కల్పన మిషపైన బీజేపీ హామీ పడింది. ఈ లక్ష్యాలను సాధించడానికి బీజేపీ సాగు భూములపైన ఒత్తిడి తెచ్చి రైతాం గం ప్రయోజనాలను దెబ్బతీస్తుంది.

అందుకే, యూపీఏ ప్రభుత్వం తెచ్చిన భూసేకరణ బిల్లు సహితం మొదట రైతుల ప్రయోజనాలను దెబ్బతీసేదిగా ఉన్నందున తిరిగి ఆ బిల్లును రైతుల రక్షణ కోసం సవరించుకోవలసివచ్చింది. కనుకనే భారత పరిశ్రమాధిపతుల సమాఖ్య, భారత వాణిజ్య, పరిశ్రమల సమాఖ్య సహా యూపీఏ బిల్లును పారిశ్రామికాభివృద్ధి వ్యతిరేకంగా ప్రకటిం చి, అందులోని రైతాంగ అనుకూల అంశాలను నీరుగార్చాలని ఉద్య మించాయి’.
- ప్రసిద్ధ విశ్లేషకుడు సుధీర్ కుమార్ పన్వార్
 
కానీ, ఇంతకుమించిన ‘పిదప బుద్ధులు’ దేశ, రాష్ట్ర పాలనా వ్యవస్థలో చోటు చేసుకోబోతున్నాయి! ఆహార భద్రతకు ప్రాణప్రదమైన పంట భూము లనూ, వ్యవసాయ క్షేత్రాలనూ, రైతులనీ ‘నష్టజాతకం’గా భావించిన పాలక పక్షాలు ‘పరిశ్రమాభివృద్ధి, ఉద్యోగాల కల్పన’ అనే తాయిలం చూపి ప్రజల, రైతు కుటుంబాల దృష్టిని మళ్లించడానికి చేయని ప్రయత్నం లేదని పెంద లాడే గుర్తించటం కూడా అవసరం! కారణం లేని తోరణం ఉండదు! ఇటీవల, దేశవ్యాప్తంగా ప్రభుత్వ సంస్థలు, కొందరు రచయితలు, పత్రికలు సహా చిత్రమైన ‘సర్వే’ల పేరుతో వ్యవసాయంపై ఏవగింపు కలిగించే వ్యాసాలూ, సర్వేక్షణలూ ప్రచురిస్తున్నారు!

‘వ్యవసాయం దండగ మారిది, గిట్టుబాటు కానిది, రుణభారాన్ని మాత్రమే పెంచేది. కాబట్టి రంగం నుంచి తప్పు కోండ’న్న హెచ్చరికలను పాలకులు ప్రజల బుర్రల్లోకి ఎక్కించాలన్న తాపత్ర యంలో ఉన్నారు. వ్యవసాయానికి అవసరమైన ఎరువులు, విత్తనాలు, పురుగుమందులు సరసమైన ధరలకు అందించే బాధ్యత నుంచి పాలక పక్షాలు తప్పించుకుంటున్నాయి. తక్కువ వడ్డీరేట్లకు రుణాలు అందించాల్సిన బాధ్యతను ఎన్నికలలో విజయావకాశాలు పెంచే హామీగానే ఉంచుతు న్నాయి. పంట నష్టాలను బీమా పథకాలతో పూరించే బాధ్యతనూ గాలికి వదిలేస్తున్నాయి. దేశానికి వెన్నెముక రైతు, వ్యవసాయ కార్మికులని తెలిసి తెలిసీ పంట భూములను బడా కార్పొరేట్ సంస్థలకు (బ్యాంక్ సంస్కరణల మేరకు) ధారాదత్తం చేయడానికి ‘భూసేకరణ’ చట్టాలను ఆర్డినెన్సు పేరిట దొడ్డిదారిలో రైతాంగంపై ఒత్తిడి తీసుకొస్తున్నాయి.

సేద్యానికి ఎసరు పెట్టే సర్వే
ఈ క్రమంలోనే ప్రభుత్వాలకు ‘గొడుగు’లు పట్టే గణాంక, పరిశోధనా సంస్థల్లో ఒకటి - జాతీయ గణాంక సర్వేక్షణ సంస్థ (ఎన్‌ఎస్‌ఎస్)! ఇది జరి పిన నమూనా సర్వేక్షణ 70వ నివేదిక తాజాగా వెలువడింది. స్థూలంగా, ఆ సర్వే ఉద్దేశం ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాల వల్ల సంక్షోభంలో పడిన వ్యవ సాయాన్నీ, రైతాంగాన్నీ, వారిపై ఆధారపడిన వృత్తిదారులను గానీ ఆదు కోవడం కాదు. రైతులు అధికాధికంగా అప్పుల ఊబిలో కూరుకుపోతూ, ఏటా పెరిగిపోతున్న రుణభారంతో కుంగిపోతున్నారు.

దేశవ్యాపిత దృశ్యం లో భాగంగా తెలంగాణలో 83 శాతం, ఆంధ్రప్రదేశ్‌లో 90 శాతం రైతుల పరి స్థితి ఇదే. కనుక రైతుల సంఖ్య తరిగిపోతూ కౌలుదార్ల సంఖ్య పెరిగి పోతోందనీ, యంత్రాల వినియోగం పెరిగి వ్యవసాయం ఇక లాభసాటి కాని పరిస్థితి వచ్చిందంటూ ‘చావు కబురు’ సర్వే మన చెవుల్లో ఊది వెళ్లింది! ఆహా ర పంటల సాగుకన్నా పాడి సంపద మెరుగు కాబట్టి పశువులను పెంచుకో మంటోంది! సాగు వదిలేసి, ఇతర వ్యాపారాల్లోకి, కూలి పనుల్లోకి తరలి పోవటం మంచిదనీ ఉచిత సలహా ఇస్తోంది. ఒక్క ముక్కలో చెప్పాలంటే, భారత వ్యవసాయ రంగాన్ని ఎలా కుదించాలో చెప్పడమే ఆ సర్వే లక్ష్యం!

అంతకన్నా గొప్ప ‘సలహా’ ప్రధాని మోదీ నుంచి దూసుకొచ్చింది. గత నెల 26వ తేదీన ఢిల్లీలో మాట్లాడుతూ మోదీ వ్యవసాయం సాగాలంటే ఏం చేయాలో సలహా ఇచ్చారు. రైతులు తమ పొలంలో మూడింట ఒక వంతు మాత్రమే సాగు భూమిగా ఉంచుకోవాలి. మిగతా భూమిలో మూడింట ఒక వంతు పశువుల మేతకు, జంతువుల పెంపకానికి అట్టిపెట్టుకోవాలి. ఇక ఆపై మిగిలిన పొలంలో కలప (టేకు)నిచ్చే చెట్లు పెంచుకోండి! ఇదీ ఆ సూచన. ప్రధాని స్థాయిలో ఉన్న వారికి వాస్తవాలు తెలియవంటే నమ్మొచ్చా, లేదా వేళాకోళమా?!

పండే వ్యవసాయ క్షేత్రం సగటు పరిమాణం (సైజు) 1.15 హెక్టారు. ఇందులో రైతు తన జీవనానికి, అమ్మకానికి 0.36 హెక్టార్ కొండ్రను అట్టిపెట్టుకోవాలనీ, మరో 0.36 హెక్టార్ భూమిని పశుమేతకు ఉంచుకోవా లనీ, మిగతా టేకు చెట్ల పెంపకానికి ఉంచుకోవాలనీ మోదీ సలహా! టేకు చెట్లు పెరిగి చేతికి అందడానికి ఎన్నేళ్లు పడుతుందో ప్రధాని స్థాయిలో ఉన్న మోదీకి తెలియదా? శతాబ్దంలో నాలుగో వంతు - అంటే 25 సంవత్సరాలు పడుతుంది! ఈ లోగా రైతూ, అతని కుటుంబం ఎలా బతకాలి, వాళ్లని ఆదు కునే వాళ్లెవరని ఆర్థికవేత్తలు, నిపుణులు ప్రశ్నిస్తున్నారు. ప్రశ్నలే, ప్రశ్నలే గాని సమాధానాలు రావు! బహుశా పంజాబ్ ముఖ్యమంత్రి ప్రకాశ్‌సింగ్ బాదల్ లేదా మరాఠీ మొగల్ శరద్ పవార్ లాంటి ‘బక్క రైతుల్ని’ దృష్టిలో పెట్టుకుని మోదీ ఈ సలహా ఇచ్చి ఉంటారని మనం సర్దుబాటు చేసుకోవాలా!

రాయల మాట గుర్తు చేసుకోండి!
ఎందుకంటే, దేశంలో సన్నకారు, మధ్యరకం కమతాల సంఖ్య 2005-06 సంవత్సరాల మధ్య 83.29 శాతం ఉండేవి. అవి 2010-11 మధ్య 85 శాతా నికి పెరిగిపోయాయని మరచిపోరాదు. అందువల్ల మోదీ సలహా సన్నకారు రైతుల కమతాలకు పనికిరాదు. బక్కరైతు చావకుండా, బతక్కుండా సరి పెట్టుకోడానికే పనికొస్తుంది! ఈ రైతాంగ వ్యతిరేక విధానాన్ని చేపట్టడంతో ప్రధాని మోదీ - ముఖ్యమంత్రి చంద్రబాబుల్లో ఎవరికి ఎవరు గురువో, ఎవరు ‘లఘు’వో తెలుసుకోవటం కష్టమే! ఇద్దరూ దేశంలో రైతుల ఆత్మ హత్యల ‘పరంపర’ లక్షల్లో నమోదు కావడానికి కారణాలను పాలనా విధా నాల్లో చూడడం లేదు. అందుకే తప్పుడు ఆర్డినెన్సుల ద్వారా ‘అభివృద్ధి’ మంత్రం కింద రైతుల్ని ‘బేదఖల్’ చేస్తున్నారు!

2012లో మోదీ పాలనలోని గుజరాత్‌లో రైతుల ఆత్మహత్యలు పెచ్చరిల్లిపోయినప్పుడు, నాటి గుజరాత్ బీజేపీ అధ్యక్షుడు ఆర్.సి.ఫల్దూ పంటలు పండకపోవడానికి రైతులే కారణ మని ఎదురు బొంకాల్సివచ్చింది! ఆత్మహత్యలు చేసుకోడానికి ప్రయత్నించిన రైతులని పిరికిపందలైన నేరగాళ్లని ఆరోపిస్తూ, వీరు ప్రభుత్వ సహాయానికి అనర్హులని ‘బీజేపీ కిసాన్ మోర్చా’ నాయకుడు, హరియాణా వ్యవసాయ మంత్రి ఓపీ ధంకర్ వ్యాఖ్యానించిన సంగతిని రైతులు మరచిపోలేదు. దీనిని మించిన మరొక విషయం - ‘మనలో మాట’ పేరిట ప్రధాని మోదీ రేడియో ద్వారా రైతులను ఉద్దేశించి చేసిన ప్రసంగంలో విన్నాం. యూపీఏ 2013 ‘భూసేకరణ’ చట్టంలో భూసేకరణకు రైతుల అనుమతి అవసరమనీ, చట్టం వల్ల సమాజంపై పడనున్న ప్రభావం గురించి అభిప్రాయసేకరణ విధిగా జరగాలన్న ప్రతిపాదన ఉన్నదనీ, దీనివల్ల భూసేకరణ కార్యక్రమం ఆల స్యమై పోతుందని అన్న మానూ మరవరాదు!

ప్రభుత్వాలు అనుసరి స్తున్న రైతాంగ వ్యతిరేక, బడా భూస్వామ్య, దేశ, విదేశీ బడా వ్యాపారవేత్తల, బహుళజాతి కంపెనీలకు అనుకూలంగా పాలక పక్షాల విధాన రూపకల్పన జరుగుతున్నందునే సర్వీసు (ఐటీ వగైరా) సంస్థల, వస్తువుల తయారీ (మాన్యుఫాక్చరింగ్) రంగాలు మాత్రమే ‘అభివృద్ధి’ని సాధిస్తున్నట్టు చూపు కుంటున్నారు గాని - ఆహార భద్రతకు వెన్నుదన్నుగా నిలబడుతున్న సామా న్య రైతు, వ్యవసాయ కార్మికుల బతుకులు చితికి పోతున్నా పాల కులకు ‘చీమ కుట్టడం’ లేదు! కాని సర్వీసు, తయారీ రంగాల ద్వారా లభిస్తున్న ఉద్యోగాలు సర్వీసు రంగంలో 2.5 శాతం, తయారీ రంగంలో 1.5 శాతం మాత్రమేనని గమనించాలి. చివరికి ఒక వైపున రైతు - వ్యవసాయ కార్మిక జంట ఫలసాయాన్ని ఆరగిస్తూనే, వ్యవసాయాన్ని వృథా వ్యయ ప్రయాసగా ముద్ర వేయడానికి సాహసిస్తున్నారు. ఈ క్లిష్ట సమయంలో చరిత్రలో శాశ్వత కీర్తి పొందిన ఆంధ్ర, కన్నడ రాజ్యలక్ష్ముల ‘అరితి నీలపు దండ’ శ్రీకృష్ణదేవ రాయలు ‘ఆముక్త మాల్యద’లో రైతుల గురించి చెప్పిన ఆర్ద్రమైన మాటలను నేటి, రేపటి పాలకులు మరువరాదు


‘మా పాలకుల పాదాలలో (పదరేఖల) భాగ్యరేఖల సుడికి అసలు కార ణం - తమ భుజాలపైన నాగళ్లు మోసి మోసి, బొప్పిలు కట్టి కట్టి ప్రజలకూ, మాకూ ఇంత భోజనం పెడుతున్న ఆ రైతుల శ్రమేనని మరువరాదు. రాజులే కున్నా రాజ్యం ఉంటుంది, కాని రైతు లేకపోతే రాజ్యమే శూన్యం’! రాయల పాఠం కేంద్ర, రాష్ట్ర పాలకుల చెవికి ఎక్కుతుందా?

- ఏబీకే ప్రసాద్
 సీనియర్ సంపాదకులు

(వ్యాసకర్త మొబైల్: 9848318414)

మరిన్ని వార్తలు