ఒకడు శారద

15 Jul, 2013 03:56 IST|Sakshi
ఒకడు శారద

 ‘శారద గురించి తెలుసా నీకు?’
 ‘తెలుసు. సినిమా యాక్టర్’
 ‘నేను చెబుతున్నది రచయిత శారద గురించి’
 ‘ఆ పేరుతో రచయిత ఉన్నాడా?’
 ‘ఉండేవాడు. ఇప్పుడు లేడు. బతికుండగానే చంపేశారు. ఎంతటి గొప్పవాళ్లనయినా గుర్తించకుండా గుర్తించి గుర్తించనట్టు నటించి చంపేయడం తెలుగువాళ్ల స్పెషాలిటి. మనవి చావు తెలివితేటలు’
 ‘మన గురించి గిరీశం ఎప్పుడో చెప్పాడు కానీ నువ్వు శారద గురించి చెప్పు’
      
 1937. చలికాలం. తెనాలి రైల్వేస్టేషన్. వృద్ధుడైన తండ్రిని జాగ్రత్తగా దింపుతూ ఒక కుర్రాడు మద్రాస్ రైలు దిగాడు. వయసు పన్నెండు. ఆకలితో ఎండిపోయిన శరీరం. తమిళం తప్ప మరే భాషా రానివాడు. హోటల్లో పని చేస్తూ తండ్రికింత పెట్టి తను ఇంత తినాలనే ఆశతో తెనాలి చేరినవాడు. పేరు నటరాజన్. ఆ వయసుకే తమిళంలో బోలెడు పుస్తకాలు చదివేశాడు. అక్షరాల్లో అన్నాన్ని వెతుక్కోవడం అలవాటు.


 తెల్లవారిందగ్గరి నుంచి రాత్రి వరకూ హోటల్లో చాకిరీ. వీలు దొరికినప్పుడు పుస్తకాలు చదువుదామంటే తమిళ పుస్తకాలు తెనాల్లో దొరకవు. ఏదో ఒకటి చదవక పోతే చచ్చిపోతాడు. చదివినా చచ్చిపోయాడు. అదే విషాదం. తపస్సులా తెలుగు నేర్చుకున్నాడు. తెలుగువాళ్లకంటే బాగా నేర్చుకున్నాడు. చదివింది, నేర్చుకున్నది తోటి కుర్రాళ్లతో పంచుకోవడమే ఆ చిన్న హృదయానికి ఊరట. తల్లి చిన్నప్పుడే పోయింది. తెనాలి వచ్చిన మూడేళ్లకు తండ్రి పోయాడు. అనాథ.


 ఆకలి ప్రాణం. వీటికి తోడు మూర్ఛరోగం.
 పాటలు పాడినా కథల గురించి మాట్లాడినా హోటల్ ఓనర్లకు నచ్చేది కాదు. చావగొట్టేవాళ్లు. పని మానేసి ఎక్కడికో వెళ్లిపోయేవాడు. కన్నీళ్లు తుడిచే మిత్రులు ఉండేవారు. వారిలో భుజంగరావు ముఖ్యుడు. వీళ్లిద్దరూ కలిసి ఒకసారి మద్రాసు వెళ్లారు. నాలుగు రోజులు పస్తులున్నారు. ఐదోరోజు విందు భోజనం దొరికింది. భుజంగరావు అక్కయ్య ఒక స్టుడియోలో పని చేసేది. అక్కడొకరోజు పార్టీ జరిగింది. సర్వ్ చేసే పని అక్కయ్యది. తమ్ముళ్లను కర్టెన్లచాటున కూచోబెట్టి దొంగగా ప్లేట్లు అందించింది. ఎంతలా తిన్నారంటే తిన్నది అరిగించుకోలేక నాలుగురోజులు కడుపునొప్పి. తెనాలంటే నటరాజన్‌కి ఎంత ప్రేమంటే దారిని పోయేవారిని డబ్బులడిగి రెలైక్కి వచ్చేశాడు.


 తెనాల్లో ప్రజావాణి పేరుతో ఒక రాత పత్రికను నటరాజన్ నడిపాడు. కమ్యూనిస్ట్ పార్టీ అంటే ఎంత ప్రేమంటే పెనం పై ఉన్న పెసరట్టు పైన కూడా సుత్తి కొడవలి గీసేవాడు. ఇది చూసి హోటల్ నుంచి తరిమేశారు. ఎన్ని ఇబ్బందులున్నా ప్రతి రోజూ రాసేవాడు. కిరిసినాయిల్ పొగతో కళ్లు మండినా లెక్క చేసేవాడు కాదు. పత్రికలు అతన్ని గుర్తించాయి. శారద పేరుతో బోలెడు కథలు, నాలుగైదు నవలలు రాశాడు.
 కాని ఏం లాభం? ఎంత రాసినా కడుపు నిండదు. శ్రీపాదనే కన్నీళ్లు పెట్టించిన నేల ఇది. శారద ఎంత? పెళ్లయ్యింది. పిల్లలు పుట్టారు. ఒక హోటల్ పెట్టాడు. పన్ను కట్టమని మునిసిపాలిటీ వాళ్లు వెంట పడితే దిక్కులేక ఎత్తేశాడు. మజ్జిగ గ్లాసులు చేత్తో పట్టుకుని బస్టాండులో బస్సులన్నీ ఎక్కి దిగి అమ్మాడు. రోడ్డు పై బాణలి పెట్టి బజ్జీలు, వడలు... ఫుట్‌పాత్‌పై పాత పుస్తకాలు, అప్పులు చేసి మానాభిమానాలు అన్ని అమ్ముకున్నాడు. మేడలు మిద్దెలు కట్టడానికి కాదు. కాసింత కూడు తినడానికి. స్వాతంత్య్రం వచ్చిన రోజు తెనాల్లోనే ఉన్నాడు. ఎప్పటిలాగే పస్తున్నాడు. తమను పీడించిన హోటల్ యజమానులు జెండాలు ఎగరేసి సంబరాలు చేస్తుంటే నవ్వుకున్నాడు. మంచి తిండి తినకపోతే ఎక్కువ రోజులు బతకవని చెప్పినా తినలేకపోయాడు. చిన్న వయసులోనే పోయాడు. స్నేహితులంతా చందాలు పోగేసి అంత్యక్రియలు చేశారు. శారద రచనల్లో గాల్లో విన్యాసాలుండవు. పాత్రలన్నీ ఆయనలాంటి వాళ్లే. అన్నట్టు ఆయన మొదటి కథ పేరు ‘ప్రపంచానికి జబ్బు చేసింది’- ఇన్నేళ్ల తర్వాత కూడా ఆ జబ్బు నయం కాలేదు.
      
 ‘ఇదంతా ఎందుకు చెప్పినట్టు?’
 ‘శారద చనిపోయిన అరవై సంవత్సరాలకి కూడా మనమేం మారలేదు. అందుకు’
 - జి.ఆర్.మహర్షి
 

మరిన్ని వార్తలు