గొంతెండిన కేప్‌టౌన్‌

14 Feb, 2018 04:14 IST|Sakshi
కేప్‌టౌన్‌లో మంచినీటి కటకట

గుక్కెడు మంచినీటి కోసం మున్ముందు ప్రపంచ ప్రజానీకం పడబోయే కష్టాలెలా ఉంటాయో దక్షిణాఫ్రికా నగరం కేప్‌టౌన్‌ శాంపిల్‌గా చవిచూపిస్తోంది. అభివృద్ధి పేరిట నేల విడిచి ఆకాశం వైపు దూసుకెళ్తున్న నగరాలకు భవిష్యత్తులో ఇలాగే చుక్కలు కనబడటం ఖాయమని ఆ నగర పౌరులు పడుతున్న ఆప సోపాలు చూస్తే అర్ధమవుతుంది. ఇప్పటికే నగరంలో రేషన్‌ మొదలైంది. మనిషికి 50 లీటర్ల చొప్పున ఇచ్చే నీటితో కాలక్షేపం చేస్తున్న నగర పౌరులు మరో మూడు నెలల్లో మరిన్ని ఇబ్బందులు పడకతప్పదని అధికారులు చెబుతున్నారు. మే 11ను వారు ‘జీరో డే’గా ప్రకటించారు. ఆ రోజు మొదలుకొని కేప్‌టౌన్‌లోని 40 లక్షలమంది పౌరుల ఇళ్లకూ, వ్యాపార సంస్థలకూ నల్లాల ద్వారా నీటి సరఫరా నిలిచిపోతుంది. పౌరులందరూ నగరంలో ఏర్పాటయ్యే 200 నీటి కేంద్రాల వద్ద బారులు తీరి నిలబడి నీళ్లు పట్టుకోవాల్సివస్తుంది. అప్పటినుంచీ మనిషికి కేవలం 25 లీటర్ల నీటిని మాత్రమే ఇస్తారు. తెల్లారింది మొదలుకొని రాత్రి నిద్రపోయేవరకూ ప్రతి ఒక్కరూ ఈ నీటితోనే తమ సమస్త అవసరాలనూ తీర్చుకోవాలి.  ప్రపంచవ్యాప్తంగా 2022 నాటికల్లా నీటి వనరులన్నీ యుద్ధాలకు వనరులుగా మారబోతున్నాయని అయిదారేళ్లక్రితం అమెరికా ఇంటెలిజెన్స్‌ సంస్థ అంచనా వేసింది. ఎత్తయిన భవంతుల్ని, కళ్లు జిగేల్‌మనేలా విద్యుత్‌ దీప కాంతుల్ని, వాహనాలు శరవేగంతో దూసుకెళ్లడానికి వీలయ్యే రోడ్లనూ పరిచి, అక్కడ సమస్తమూ కేంద్రీకరించి ఆ నగరాలను అభివృద్ధి నమూనాలుగా, తమ ఘనతగా చాటే పాలకులు కళ్లు తెరవక తప్పదని కేప్‌టౌన్‌ అనుభవం చెబుతోంది.

దక్షిణ అట్లాంటిక్‌ మహా సముద్ర తీరాన ఉండే కేప్‌టౌన్‌ సాధారణ నగరం కాదు. నల్లజాతి ప్రజల మహానాయకుడు నెల్సన్‌ మండేలాను దీర్ఘకాలం బందీగా ఉంచిన కారాగారం ఆ నగరంలోనిదే. దేశంలో ప్రధాన నగరం జోహ న్నెస్‌బర్గ్‌ అయినా ప్రపంచంలోని సంపన్నుల కళ్లన్నీ కేప్‌టౌన్‌పైనే ఉంటాయి. ఏటా ప్రపంచం నలుమూలలనుంచీ ఆ నగరానికి 16 లక్షలమంది సందర్శకులు వస్తుంటారు. వారు అక్కడ చేసే ఖర్చు 330 కోట్ల డాలర్ల(రూ.21,000 కోట్ల) పైమాటే. ఆకాశాన్నంటే అయిదు నక్షత్రాల హోటళ్లు, బీచ్‌లు, కేబుల్‌ కార్లు, ప్రపంచం మూల మూలలనుంచీ తరలివచ్చిన రకరకాల వినియోగవస్తువులతో కొలువు దీరే మహా దుకాణ సముదాయాలు, సైకిల్‌ రేసులు, క్రికెట్‌ మొదలుకొని రగ్బీ వరకూ తరచుగా జరిగే జాతీయ, అంతర్జాతీయ క్రీడలు పర్యాటకులకు మంచి కాలక్షేపాన్నిస్తాయి. నగరానికి దగ్గర్లో సముద్ర గర్భాన ఉండే రాబెన్‌ ద్వీపానికి రాత్రి, పగలు తేడాలేకుండా  పడవల్లో రాకపోకలు సాగించే జనాన్ని చూసి తీరాల్సిందే. కేప్‌టౌన్‌ ప్రధాన ఓడరేవున్న నగరం కూడా. ఇంత హడావుడి నగరం కనుక అక్కడికి పొట్టపోసుకొనేందుకొచ్చే వలస జనం కూడా ఎక్కువే. డబ్బే సర్వస్వమైన ఆ నగరం ఇప్పుడు నీటి చుక్కకు కటకటలాడే దుస్థితి తలె త్తడాన్ని సహజంగానే జీర్ణించుకోలేకపోతోంది.

ఇదెక్కడో ఏర్పడ్డ సంక్షోభమని కొట్టి పారేయడానికి లేదు. మన నగరాల తలుపు తట్టే రోజు ఎంతో దూరంలో లేదు. రాబోయే రోజుల్లో నీటి సంక్షోభాన్ని ఎదుర్కొనబోతున్న నగరాల జాబితాను ఈమధ్యే బీబీసీ ప్రకటించింది. అందులో బ్రెజిల్‌ ఆర్థిక రాజధాని సావోపావ్‌లో మొదటి స్థానంలో ఉంటే ఆ తర్వాత నగరం బెంగళూరే. బీజింగ్, కైరో, మాస్కో తదుపరి స్థానాల్లో ఉన్నాయి. ఈ నగరాలన్నీ చెప్పుకోవడానికి ‘శరవేగంగా’ అభివృద్ధి చెందుతున్న నగరాలే. వాటి ద్వారా ప్రభుత్వాలకు లభిస్తున్న ఆదాయం సైతం భారీగానే ఉంటున్నది. కానీ అక్కడికి చేరుతున్న జనాభాకు అవసరమైన జల వనరులు ఆ నగరాలకు అందుబాటులో లేవు. వెనకా ముందూ చూసుకోకుండా అభివృద్ధినంతటినీ ఒకేచోట కేంద్రీకరించడం వల్ల తలెత్తిన సమస్య ఇది. బెంగళూరుకు నీటి సమస్య కొత్తగాదు. అక్కడ సమస్య ఉన్నట్టు ప్రభుత్వాలు సైతం గుర్తించి దశాబ్దాల వుతోంది. అయినా ఎవరికీ చీమ కుట్టినట్టయినా లేకపోయింది. పాలకులు హ్రస్వ దృష్టితో వ్యవహరించారు. అడవుల్ని విచక్షణారహితంగా నాశనం చేస్తుంటే, కొండల్ని పిండి చేస్తుంటే వానలు పడటం తగ్గుతుందని, కరువు రాజ్యమేలుతుందని పర్యావరణవాదులు హెచ్చరిస్తున్నా పెడచెవిన పెట్టారు. పైపెచ్చు అభివృద్ధి మాటున తామే సహజ సంపదను ధ్వంసం చేసే పనికి పూనుకున్నారు. కరువు కాటకాల వల్ల నదులు చిక్కిపోతున్నాయి. పారినంత మేరా అనేక వ్యర్థాల బారిన పడి అవి కాలుష్యమయమవుతున్నాయి.  ఇక నగర జనాభాకు నీటి లభ్యత అడుగంటడంలో ఆశ్చర్యమేముంది?  

భూ ఉపరితలంపై నీటి వాటా 70 శాతమైతే 30 శాతం మాత్రమే భూభాగం. ఇంత పుష్కలంగా నీరున్నా అందులో తాగడానికి పనికొచ్చేది 3 శాతం మాత్రమే. ప్రపంచ జనాభా 760 కోట్లయితే అందులో కోటిమందికి అసలు మంచినీటి సదుపాయమే లేదు. మరో 270 కోట్లమంది ఏటా కనీసం నెలరోజులపాటు చాలి నంత నీరు లభ్యంకాక సతమతమవుతున్నారు. ప్రపంచంలోని 500 మహా నగరాలు మున్ముందు నీటి ఇబ్బందుల్లో పడతాయని నాలుగేళ్ల క్రితం వెలువడిన సర్వే అంచనా వేసింది. ప్రతి నాలుగు నగరాల్లోనూ ఒకటి మంచినీటి వెతల్ని ఎదుర్కొనవలసి వస్తుందని ఆ సర్వే అంటున్నది. ఇప్పటికైనా ప్రభుత్వాలు మేల్కొని తమ అభివృద్ధి నమూనాలను సమీక్షించుకోనట్టయితే ప్రమాదకర పర్య వసానాలు ఏర్పడటం ఖాయం. ఈ విషయంలో తెలంగాణ ప్రభుత్వాన్ని అన్ని రాష్ట్రాలూ ఆదర్శంగా తీసుకోవాలి. 2020 నాటికి ఆ రాష్ట్రంలోని 46,530 చెరు వుల్ని, సరస్సుల్ని పునరుద్ధరించాలన్న సంకల్పంతో 2015లో ప్రారంభించిన ‘మిషన్‌ కాకతీయ’ అనుకున్నట్టు విజయం సాధిస్తే ఇటు మంచినీటి కొరతనూ తీరుస్తుంది. అటు సాగునీటి లభ్యతనూ పెంచుతుంది. ఇది అనుసరణీయమైన మార్గం. ముప్పు ముంచుకొచ్చే వరకూ పట్టనట్టు ఉంటే ఇప్పుడు కేప్‌టౌన్‌ వాసులు ఎదుర్కొంటున్న దుస్థితే అందరికీ దాపురిస్తుంది. బహుపరాక్‌!!

మరిన్ని వార్తలు