ఉల్లిగడ్డ ఉరుకులు!

22 Aug, 2013 02:00 IST|Sakshi

సంపాదకీయం: పాలనలో దాదాపు పదేళ్ల అనుభవాన్ని గడించినా స్టాక్ మార్కెట్ పాతాళానికి ఎందుకు పరిగెడుతున్నదో, ఉల్లిగడ్డల ధర ఊహకందనంత వేగంగా ఎందుకు పెరుగుతున్నదో తెలియక యూపీఏ ప్రభుత్వం అయోమయంలో పడిపోయింది. ఉల్లిపాయే కాదు... కూరగాయల ధరలన్నీ గత కొంతకాలంగా పైపైకి పోతున్నాయి. పక్షం రోజుల క్రితం ధర పెరిగిన ఉల్లిగడ్డ తగ్గినట్టే తగ్గి మళ్లీ జోరందుకుంది. తన జోక్యం వల్లే పరిస్థితి చక్కబడిందని సర్కారు అనుకుంటుండగానే తిరిగి పరుగులు తీసింది.
 
 భగ్గునమండుతున్న ఉల్లి ధరను చల్లార్చడమెలాగో కేంద్రానికి తోచడంలేదు. ఢిల్లీ మొదలుకొని దేశంలోని ప్రధాన నగరాలన్నిటా ఉల్లి ధర హఠాత్తుగా కిలో రూ.60కి చేరుకున్నప్పుడు అందరిలాగే సర్కారూ ఆశ్చర్యపోయింది. అది తేరుకోకముందే అది రూ.80 వరకూ ఎగ బాకింది. ఉల్లి ఉత్పత్తి ఎక్కువుండే రాష్ట్రాల్లో అధిక వర్షాలు కురియడం, సరుకు రవాణాకు ఇబ్బందులేర్పడటంవల్ల ధరలిలా మండుతున్నాయని కేంద్ర వ్యవసాయ మంత్రి శరద్‌పవార్ సంజాయిషీ ఇస్తున్నారు. పైగా ఉల్లికి ప్రధాన మార్కెట్‌గా ఉన్న నాసిక్ ప్రాంతాన్ని కరువు చుట్టుముట్టి పంట దిగుబడి తగ్గడం కూడా ఇందుకు దోహదపడిందని ఆయన చెబుతున్నారు. ఏ సమస్యనైనా డిమాండు, సరఫరా చట్రంలో చూడటానికి అలవాటుపడి పోయిన సర్కారు ధోరణే నిత్యావసరాల ధరలను ఆకాశానికి ఎగదోస్తున్నది. ఒక ప్రాంతంలో వర్షాలు కురియవచ్చు... ఇంకోచోట కరువు కాటేయవచ్చు. కాదనలేం.
 
 కానీ, ఇప్పుడు ఉల్లి దిగుబడిపై ఆ రెండింటి ప్రభావమూ పెద్దగా లేదు. మొత్తంమీద చూస్తే దాని దిగుబడి స్థిరంగా ఉంది. ఇంకా చెప్పాలంటే గత రెండేళ్ల దిగుబడితో పోల్చినా ఈ ఏడాది అది చెక్కుచెదిరింది లేదు. దేశం మొత్తంమీద ఈ జూలై నెలాఖరుకు ఉల్లి దిగుబడి కోటీ 70 లక్షల టన్నులు. గత ఏడాది, అంతకు ముందూ కూడా ఈ సమయానికి ఇంచుమించు ఇదే దిగుబడి ఉంది. ఒక్క ఉల్లిపాయనే కాదు... ఆలుగడ్డలు, వంకాయ, టమాట వంటి దిగుబడులూ అంతే. అయినా, జూలై టోకు ధరల సూచీ చూస్తే గుండె గుభేలుమంటుంది. ఐదు నెలల గరిష్ట స్థాయికి అది చేరుకుంది. నిరుడు జూలైతో పోలిస్తే ధరలన్నీ టోకుగా 5.79 శాతం పెరిగాయి. నాసిక్ మార్కెట్‌లో ఉల్లి ధర క్వింటాలు రూ.5,000 దాటి పోయింది. మన రాష్ట్రంలో ఇది క్వింటాలుకు రూ.4,800 వరకూ వెళ్లింది.
 
 ఏయే పంటలు ఎంత విస్తీర్ణంలో పెంచుతున్నారో, దిగుబడుల అంచనా ఎలా ఉన్నదో, తమ బాధ్యతగా చేయాల్సింది ఏమిటో ఆలోచించే యంత్రాంగం ఉన్నట్టయితే ధరల్లో ఉండగల హెచ్చుతగ్గుల విషయం ముందుగానే అంచనా వేయడానికి అవకాశం ఉంటుంది. వీటికి తోడు రవాణా సౌకర్యాలు సరిగాలేని కారణంగా వర్షాకాలంలో ఇబ్బందులేర్పడతాయని తెలియనిదేమీ కాదు. ఇలాంటి అంశాలన్నిటినీ ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ, అందుకు అనుగుణమైన వ్యూహాలు రూపొందించుకుని అమలుచేస్తే పరిస్థితులు ఇలా విషమించవు. కానీ, మన పాలకుల కంటే దళారులు చాలా చురుగ్గా, మెరుగ్గా ఉన్నారు. సరిగ్గా వానా కాలంలో రాబోయే సమస్యలను గమనించుకుని ముందే ఉల్లి నిల్వలను గోదాముల్లో భద్రం చేసుకున్నారు. కృత్రిమ కొరత సృష్టించి ధరలు ఆకాశాన్నంటేలా చేశారు. మన దేశంలో గోడౌన్‌ల కొరత తీవ్రంగా ఉంది. కూరగాయల పెంపకంలో మన దేశం రెండో స్థానం ఆక్రమిస్తుంటే, వీటిని నిల్వ ఉంచడానికి శీతల గిడ్డంగులు మాత్రం తగినంతగా లేవు.
 
 దేశం మొత్తంమీద మన గిడ్డంగుల సామర్ధ్యం 11 కోట్ల 30 లక్షల టన్నులు కాగా, అందులో కూరగాయలకిస్తున్న వాటా కేవలం 15 శాతం మాత్రమే. 1998లో ఉల్లి సంక్షోభం ఏర్పడి ఢిల్లీ, రాజస్థాన్ ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వాలు కూలిపోగా అప్పటి ఎన్‌డీఏ ప్రభుత్వం భాభా అణు పరిశోధనా కేంద్రం సాయంతో నాసిక్ సమీపంలో రూ.8 కోట్లతో అత్యాధునిక యూనిట్‌కు శ్రీకారం చుట్టుంది. ఉల్లి, ఇతర దిగుబడులను ప్రాసెసింగ్ చేసి, వాటిల్లోని హానికారక బాక్టీరియాను, తేమను తొలగించడం ఈ యూనిట్ ప్రధానమైన పని. అలా చేసిన సరుకు ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది గనుక అందుకు అవసరమైన గిడ్డంగులను నిర్మించాలని కూడా నిర్ణయించారు. అయితే, ఆ యూనిట్ ప్రారంభమైందిగానీ అందులో ప్రాసెసింగ్ సరిగా సాగటం లేదు. గంటకు పది టన్నుల ఉల్లిని ప్రాసెస్ చేయగలిగే ఈ యూనిట్‌కు గత నాలుగేళ్లుగా ఉల్లిగడ్డలే రాలేదంటే పరిస్థితి ఎలా ఉన్నదో ఊహించుకోవచ్చు. ఇక గిడ్డంగుల నిర్మాణం సంగతి చెప్పనవసరం లేదు.
 
 ఇందిరాగాంధీ పాలనాకాలం నుంచి కేంద్రంలో ఉండే ప్రభుత్వాలకు ఉల్లితో చాలా చేదు అనుభవాలున్నాయి. వాటి ధరలు పెరిగినప్పుడల్లా ప్రభుత్వాలు పతనమవుతున్నాయి. అయినా, పాలకులెవరూ గుణపాఠాలు నేర్వడంలేదు. ధరలు పెరిగి, ప్రజల్లో ఆగ్రహావేశాలు పెల్లుబికాక నిద్రలేచి కొన్ని విక్రయ కేంద్రాలను తెరవడం, హుటాహుటిన నాఫెడ్ వంటి సంస్థలను రంగంలోకి దించి, గ్లోబల్ టెండర్లు పిలిచి ఇరుగు పొరుగు దేశాల నుంచి సరుకు దిగుమతి చేసుకో వడం అలవాటైపోయింది. ఇప్పుడు ఢిల్లీలోనూ, మరికొన్ని నగరాల్లోనూ ప్రభు త్వం చేసింది ఇదే. మరో సంక్షోభం ఏర్పడినప్పుడూ ఇదే తంతు పునరావృతమవు తుంది.
 
 ఉల్లి అయినా, ఇతర కూరగాయలైనా నిల్వ ఉంచుకోవడానికి, మంచి ధర వచ్చినప్పుడు అమ్ముకోవడానికి రైతులకు చేయూతనిస్తే పరిస్థితులు వేరుగా ఉంటాయి. అటు రైతులూ బాగుపడతారు. ఇటు ప్రజలకు అధిక ధరల భారమూ తప్పుతుంది. కానీ, అనుభవాలెన్ని ఎదురవుతున్నా గుణపాఠాలు నేర్వని ప్రభు త్వాల వల్ల అటు రైతులు పంట దిగుబడులను తక్కువ రేటుకు విక్రయించి అప్పుల్లో కూరుకుపోతున్నారు. ఇటు సాధారణ ప్రజానీకం అధిక ధరలతో ఇబ్బందులు పడుతున్నారు. మధ్యలో దళారుల పంట పండుతోంది. ఇప్పుడు ఏర్పడిన ఉల్లి సంక్షోభమైనా పాలకుల కళ్లు తెరిపిస్తుందా? అనుమానమే!

మరిన్ని వార్తలు