ఇదేం నివేదిక?!

20 Sep, 2018 02:59 IST|Sakshi

ఆగ్రహోదగ్రులైన జనాన్ని చల్లార్చడానికి విచారణ కమిషన్లు మత్తు మందుగా పనికొస్తాయని విఖ్యాత న్యాయ కోవిదుడు స్వర్గీయ జస్టిస్‌ వీఆర్‌ కృష్ణయ్యర్‌ ఒక సందర్భంలో వ్యాఖ్యానించారు. ఈ కమిషన్లకు నేతృత్వం వహించేవారిని ఎంపిక చేయటం మొదలుకొని జరిగే మొత్తం ప్రక్రియంతా సంశయాత్మక క్రీడ అని కూడా ఆయన చెప్పారు. ఏం చేయడానికైనా సిద్ధపడే రిటైర్డ్‌ న్యాయమూర్తుల దురాశను ఆయన చెరిగిపారేశారు. మూడేళ్లక్రితం గోదావరి పుష్కరాల సందర్భంగా రాజమహేంద్ర వరంలో తొక్కిసలాట జరిగి 29 నిండు ప్రాణాలు బలైన ఉదంతంపై నియమించిన జస్టిస్‌ సీవై సోమయాజులు కమిషన్‌ సమర్పించిన నివేదిక చూస్తే జస్టిస్‌ కృష్ణయ్యర్‌ అభిప్రాయాలు అక్షర సత్యాలని అర్ధమవుతుంది. సాధారణంగా కమిషన్లు ఏర్పాటు చేసేటపుడు ప్రభుత్వాలు చాలా విష యాలు చెబుతాయి.

జరిగిన ఉదంతానికి దారితీసిన పరిస్థితులేమిటో, వాటికి బాధ్యులెవరో,  భవి ష్యత్తులో ఈ మాదిరి ఘటనలు చోటు చేసుకోకుండా ఉండటానికి తీసుకోదగిన చర్యలేమిటో సూచించటం తదితరాలు అందులో ఉంటాయి. మూడేళ్లపాటు సాగిన విచారణలోఎందరో పాల్గొని అనేక అంశాలను జస్టిస్‌ సోమయాజులు కమిషన్‌ దృష్టికి తీసుకొచ్చారు. ఆనాటి ప్రమాదంలో గాయాలపాలైనవారితో, మరణించినవారి కుటుంబసభ్యులతో అఫిడవిట్లు దాఖలు చేయించారు. ఏం జరిగుంటే ఈ విషాదాన్ని నివారించటం సాధ్యమయ్యేదో సవివరంగా చెప్పారు. పుష్కరాలకు భారీయెత్తున ఏర్పాట్లు చేస్తున్నామంటూ వందల కోట్లు ఖర్చుపెట్టిన ప్రభుత్వం తగిన సంఖ్యలో అంబులెన్స్‌ల మాట అటుంచి, కనీసం మంచినీళ్లు కూడా అందుబాటులో ఉంచకపోవడాన్ని ఎత్తిచూ పారు.

పైగా నిబంధనలు అతిక్రమించి ఘటనాస్థలికి సమీపంలో పలు వీఐపీ వాహనాలు, ఇతర వాహనాలు పార్క్‌ చేసిన తీరును వెల్లడించారు. ఊరునిండా పద్మవ్యూహాన్ని తలపించేలా బారికేడ్లు పెట్టి ఎటు పోవాలో తెలియని అయోమయ స్థితిని కల్పించిన వైనాన్ని వెల్లడించారు. వీటన్నిటికీ ఆధారాలుగా వీడియోలు, ఫొటోలు, పత్రికల క్లిప్పింగ్‌లు కమిషన్‌కు సమర్పించారు. వాదనలన్నీ విని, వీరందరూ సమర్పించిన నివేదికలను పరిశీలించి చివరాఖరికి జస్టిస్‌ సోమయాజులు కమిషన్‌ తేల్చిందేమిటన్నది చూస్తే ఎవరికైనా విస్మయం కలుగుతుంది. ప్రభుత్వానికి, ప్రభుత్వ పెద్దలకు క్లీన్‌ చిట్‌ ఇవ్వడానికి... పుష్కర ఏర్పాట్లతో, నిర్వహణతో, ఆనాటి ఘటనతో ఏమాత్రం సంబంధంలేని వారిపై బురదజల్లడానికి కమిషన్‌ చూపించిన ఉత్సాహం దిగ్భ్రమగొలుపుతుంది. 

పుష్కరఘాట్‌లో జరిగిన తొక్కిసలాటకు కారణాలేమిటో అక్కడ విధులు నిర్వహించిన హోంగార్డు స్థాయి ఉద్యోగి సైతం చెప్పగలడు. రాజమహేంద్రవరం పరిసరాల్లో దాదాపు 30 ఘాట్లు ఏర్పాటు చేశామని, ఎన్ని లక్షలమందైనా సునాయాసంగా స్నానాలు చేయడానికి వీలుంటుందని ప్రభుత్వం గొప్పగా చెప్పుకుంది. ఒక్క పుష్కరఘాట్‌ మినహా ఇతర ఘాట్లలో వాస్తవానికి అలాంటి పరిస్థితే ఉంది. ఉన్నవాటిలో పుష్కరఘాట్‌ చిన్నది. అయినా అక్కడ మాత్రమే ఇంత భారీయెత్తున జనం ఎందుకు గుమిగూడారన్న అంశంపై కమిషన్‌ దృష్టి సారించి ఉంటే ఎన్నో అంశాలు వెలుగు లోకొచ్చేవి. వేకువజామున 6.26 నిమిషాలకు దివ్యమైన ముహూర్తం ఉన్నదని, ఆ సమయంలో స్నానం చేస్తే ఏడేడు జన్మాల్లో చేసిన పాపాలన్నీ పోతాయని దృశ్య, శ్రవణ మాధ్యమాల ద్వారా ప్రభుత్వం భారీయెత్తున ప్రచారం చేసింది.

ఆ ముహూర్తానికే ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన మంత్రివర్గ సహచరులు తమ తమ కుటుంబాలతో స్నానానికి తయారయ్యారు. చేస్తే చేశారు... వీరంతా వీఐపీల కోసం కేటాయించిన విశాలమైన సరస్వతి ఘాట్‌ను కాదని, వైశాల్యంలో చిన్నదిగా ఉండే ఈ పుష్కరఘాట్‌కు పొలోమంటూ ఎందుకు పోవాల్సివచ్చిందో కమిషన్‌ అడగలేదు. ప్రభు త్వంవైపు నుంచి ఎవరూ చెప్పలేదు. సందేహాలే విజ్ఞానానికి బాటలు పరుస్తాయంటారు. కమిషన్‌కు ఈ విషయంలో సందేహం రాకపోవడం వల్ల అనేక అంశాలు మరుగునపడ్డాయి. పుష్కర సంరం భాన్ని, ముఖ్యమంత్రి కుటుంబసమేతంగా స్నానం చేస్తున్న దృశ్యాలను సినీ దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో చిత్రీకరించాలని ప్రభుత్వ పెద్దలు నిర్ణయించారు.

ఆ దృశ్యాల్లో జనసందోహం భారీయెత్తున కనబడాలన్న ఉద్దేశంతో చంద్రబాబు కుటుంబాన్ని పుష్కరఘాట్‌కు తీసుకొచ్చారు. గోదావరి స్టేషన్‌లో దిగేవారు, ఇతరత్రా మార్గాల ద్వారా వచ్చే భక్తులు వేర్వేరు‡ఘాట్‌లకు పోతే ఇక్కడ జనం తక్కువవుతారన్న ఆలోచనతో పోలీసులు, ఇతర సిబ్బంది సాయంతో అందరినీ పుష్కర ఘాట్‌కు మళ్లించారు.  ఆ విధంగా చిన్నపిల్లలు, వృద్ధులు, మహిళలు తెల్లారుజామున 4.30 మొదలుకొని 8 గంటల సమయం వరకూ ఆ ఘాట్‌ వెలుపల పడిగాపులు పడ్డారు. ఇంతమంది భక్త జనం కెమెరా ఫ్రేంలో అద్భుతంగా కనబడి ఉండొచ్చుగానీ, అది వారందరికీ శాపంగా మారింది. బాబు అక్కడినుంచి నిష్క్రమించగానే, అంతవరకూ అక్కడున్న బందోబస్తు మాయమైంది. ఆ ఘాట్‌కున్న ఒకే ఒక ప్రవేశద్వారాన్ని తెరవడంతో తొక్కిసలాట చోటుచేసుకుంది. అందులో గాయ పడినవారు గుక్కెడు నీళ్లిమ్మని రోదిస్తున్నా సమీపంలో ఎక్కడా మంచినీరు లేని తీరును చాలామంది మీడియాకు ఆ వెంటనే వివరించారు.

అలా నీళ్లు అందించి ఉంటే కొందరి ప్రాణాలైనా కాపాడటం సాధ్యమయ్యేదని చెప్పారు. ఆ దరిదాపుల్లో అంబులెన్స్‌ల జాడలేదని, చేతులపై మోసుకెళ్లామని వివరించారు. పైగా సీసీ టీవీ ఫుటేజ్‌గానీ, నేషనల్‌ జియోగ్రఫిక్‌ చానెల్‌ కోసం తీసిన వీడియోగానీ కమిషన్‌ ముందుకు రానేలేదు. మూడేళ్ల తర్వాత సమర్పించిన నివేదికలో ఇలాంటి కీలకమైన అంశాలు లేవు సరిగదా పంచాంగకర్తలు మొదలుకొని ప్రతిపక్షాల వరకూ టోకున అందరినీ ‘దోషుల్ని’ చేసిన వైనం, ప్రజలనూ, మీడియాను బాధ్యులను చేసిన తీరు విస్మయపరుస్తుంది. తనకనుకూలంగా అన్ని వ్యవస్థలనూ దిగజార్చటంలో సిద్ధహస్తుడైన చంద్రబాబు ఆఖరికి విచారణ కమిషన్లపై జనంలో కొద్దో గొప్పో ఉండే విశ్వసనీయతను కూడా దారుణంగా దెబ్బతీశారని నివేదిక చూస్తే అర్ధమవుతుంది. ఇది క్షమార్హం కాదు. 

మరిన్ని వార్తలు