లంకలో ఎన్నికల సందడి

29 Dec, 2014 03:29 IST|Sakshi
లంకలో ఎన్నికల సందడి

ప్రజాస్వామ్యంలో నిర్ణీత కాలవ్యవధిలో జరిగే ఎన్నికలు పాలకులకు పెద్ద శిరోభారం. వెనకా ముందూ చూడకుండా చేసిన వాగ్దానాలు, సృష్టించిన భయాలు పాలించడానికొచ్చేసరికి శాపాలై వెంటాడతాయి. ‘మా సంగతేమిట’ని నిలదీస్తాయి. పాలకులకు అప్పుడిక దిక్కుతోచదు. ఏం చేయాలో అంతుబట్టదు. ఆశలు, ఆకర్షణలు అడుగంటుతున్న అలాంటి సందిగ్ధ సమయంలో అర్థాంతరంగానైనా మళ్లీ ఎన్నికలకు వెళ్లడమే సబబని తోస్తుంది. శ్రీలంక అధ్యక్షుడు మహిందా రాజపక్స అలాంటి పరిస్థితుల్లోనే దాదాపు రెండేళ్ల ముందుగా ఎన్నికలకు వెళ్తున్నారు. వచ్చేవారం జరగబోయే అధ్యక్ష ఎన్నికలకు అంతకన్నా వేరే కారణం ఏమీ లేదు.

2005లో జరిగిన ఎన్నికల్లో తొలిసారి దేశాధ్యక్ష పదవిని చేపట్టిన రాజపక్స లంక తమిళుల ప్రయోజనాల కోసం పోరాడుతున్న లిబరేషన్ టైగర్లపై యుద్ధం ప్రకటించి దాన్ని తుదముట్టించేందుకు ఉత్తర, తూర్పు ప్రాంతంలో సైన్యాన్ని మోహరించారు. ఉగ్రవాదంపై పోరాటమంటూ సాగిన ఆ యుద్ధంలో వేలాదిమంది సామాన్య పౌరులు మరణించారు. లక్షలమంది ప్రాణభయంతో వలసలుపోయారు. చివరకు టైగర్ల నాయకుడు ప్రభాకరన్, మరికొందరు కీలక నేతలు హతం కావడంతో ఆ యుద్ధం ముగిసింది.

యుద్ధం పేరిట సాగించిందంతా నరమేథమని, అందులో 40,000మంది అమాయక పౌరులు మరణించారని ఐక్యరాజ్యసమితి నియమించిన కమిటీ అంచనా వేసింది. ఇవిగాక తమిళ టైగర్లకు చెందిన మహిళా కార్యకర్తలపై లైంగిక నేరాలు, పసివాళ్లను సైతం నిర్దాక్షిణ్యంగా హతమార్చడం వంటి ఉదంతాలు ఎన్నో చోటుచేసుకున్నాయని చెప్పింది. ఆ ఘటనలపై అంతర్జాతీయ విచారణకు అంగీకరించాలన్న వినతిని రాజపక్స బేఖాతరుచేశారు. సైనిక చర్య సింహళుల్లో, బౌద్ధుల్లో తీసుకొచ్చిన అనుకూల వాతావరణాన్ని ఆసరాగా చేసుకుని గడువుకన్నా ఏడాదికి ముందే 2010లో రాజపక్స ఎన్నికలకు వెళ్లారు. సహజంగానే అందులో ఘనవిజయం సాధించారు. ఆ తర్వాతే తన అసలు రూపాన్ని ప్రదర్శించారు.
 
తన విధానాలను విమర్శించేవారిని జాతి వ్యతిరేకులుగా చిత్రించడం, ప్రత్యర్థులపై నిఘా పెట్టి వారిని భయోత్పాతానికి గురిచేయడం, ప్రభుత్వానికి చెందిన వ్యవస్థలన్నిటా తనకు నమ్మిన బంట్లుగా ఉన్నవారిని నియమించి నియంత్రణలోనికి తెచ్చుకోవడం రాజపక్స అనుసరించిన విధానం. ప్రజాస్వామ్య విరుద్ధమైన ఇలాంటి పోకడలు దేశ ప్రజల్లో ఆయనంటే వ్యతిరేకతను పెంచాయి. కీలక పదవుల్లో రాజపక్స తన బంధుగణాన్ని నియమించుకున్నారు.

ఈ ఏడాది దేశ బడ్జెట్ వ్యయంలో ఆ బంధుగణం చూసే శాఖల వాటా 47 శాతం. వాస్తవానికి ఇది చాలా తక్కువ. రెండేళ్లక్రితమైతే ఇది 70 శాతం! సహజంగానే ఈ పోకడ అవినీతికి దారితీసింది. కాంట్రాక్టులు అనర్హులకు దక్కుతున్నాయన్న విమర్శలు వెల్లువెత్తాయి. అయితే, ఆర్థిక పరిస్థితి చూడబోతే దివ్యంగా ఉంది. ఈ ఏడాది ఆ దేశం నమోదుచేసిన స్థూల దేశీయ ఉత్పాదకత(జీడీపీ) 8 శాతం. 2010-14 మధ్య చైనా మినహాయిస్తే ఏ ఆసియా దేశంలోనూ జీడీపీ దీని దరిదాపుల్లో లేదు. స్టాక్ మార్కెట్‌లు సరేసరి...కళ కళలాడుతున్నాయి.

ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు కూడా గణనీయంగానే పెరిగాయి. ఇవన్నీ సాధారణ పౌరుల జీవితాల్లో ప్రతిఫలించి ఉంటే రాజపక్స కథ వేరుగా ఉండేది. ఆయనకు జనం హారతులు పట్టేవారు. కానీ, క్షేత్ర స్థాయిలో పరిస్థితులు అంత బాగాలేవు.  చైనా సాయంతో దేశంలో భారీయెత్తున ప్రారంభించిన మౌలిక సదుపాయాల ప్రాజెక్టులవల్ల సాధారణ పౌరులకు వచ్చిన ఉద్యోగాలు అంతంతమాత్రం. అటు పాఠశాలల మొదలుకొని విశ్వవిద్యాలయాల వరకూ అన్నిటికీ నిధుల కొరత. ఆరోగ్యరంగం సంగతి చెప్పనవసరమే లేదు. అది క్షీణ దశకు చేరుకుంది. ఆహార ధరలు ఆకాశాన్నంటాయి.

పదకొండు నెలల్లో ఒక్క బియ్యం ధరే 36 శాతం పెరిగింది. ప్రభుత్వ రుణ భారం జీడీపీలో 78 శాతంగా ఉంది. దీన్ని 50 శాతానికి కుదించకపోతే విపత్కర పరిస్థితులు ఎదురవుతాయని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ(ఐఎంఎఫ్) హెచ్చరించింది. ఉపాధి లేక, ధరలు భారమై అగచాట్లు పడుతున్న జనంలో క్రమేపీ అసంతృప్తి గూడుకట్టుకుంటున్నది. దృష్టి మళ్లించడానికి, సింహళ జాతీయతను రెచ్చగొట్టడానికి ఇదివరకున్నట్టు తమిళ టైగర్ల బెడద లేదు. మరోపక్క ముస్లింలకూ, బౌద్ధులకూ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటున్నది.
 
ఇదంతా చేయి దాటిపోయేలా ఉన్నదని రాజపక్సకు తెలుసు. 2010 అధ్యక్ష ఎన్నికల్లో ఆయన 58 శాతానికిపైగా ఓట్లు కైవసం చేసుకున్నారు. నిరుడు జరిగిన ప్రాంతీయ మండళ్ల ఎన్నికల్లో రాజపక్స పలుకుబడి గణనీయంగా తగ్గిందని వెల్లడైంది. షెడ్యూల్ ప్రకారం 2017లోనే ఎన్నికలు నిర్వహిస్తే తనకు పరాజయం తప్పదని తెలుసుకునే ఆయన మధ్యంతర ఎన్నికలకు సిద్ధపడ్డారు. అయితే, రెండు నెలలక్రితం ఎన్నికలు ప్రకటించిననాటికీ, ఇప్పటికీ పరిస్థితులు మారాయి.

ఒక్కొ క్కరే ఆయనను విడిచి వెళ్తున్నారు. రాజపక్స కేబినెట్‌లో మొన్నటి వరకూ నంబర్ 2 గా ఉన్న మైత్రిపాల సిరిసేన తన పదవికి రాజీనామా చేసి అధ్యక్ష పదవికి విప క్షాల ఉమ్మడి అభ్యర్థిగా బరిలో నిలిచారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు నిర్వహిస్తే సిరి సేన విజయం ఖాయమని సర్వేలంటున్నాయి. సిరిసేన ఫిరాయింపుతో ఖంగుతిన్న రాజపక్సకు తాజాగా మరో మంత్రి, శ్రీలంక ముస్లిం కాంగ్రెస్ నాయకుడు రవూఫ్ హకీం రాజీనామా ఇచ్చి షాకిచ్చారు.

దేశ మాజీ అధ్యక్షురాలు చంద్రికా కుమార తుంగ మళ్లీ క్రియాశీల రాజకీయాల్లోకి వస్తున్నట్టు ప్రకటించి సిరిసేనకు మద్దతుగా నిలుస్తానన్నారు. వరస విజయాలతో గర్వం తలకెక్కిన రాజపక్స రాజ్యాంగ, ప్రజాస్వామిక విలువలన్నిటినీ కాలరాశారు. నియంతగా మారారు. అదేమని ప్రశ్నించినవారిని జాతిద్రోహులుగా చిత్రించారు. వచ్చే నెల 8న జరగబోయే అధ్యక్ష ఎన్నికలు రాజపక్సకు ఎలాంటి గుణపాఠాన్నివ్వబోతున్నాయో వేచిచూడాలి.
 
పింఛన్ బాధలు కొత్త పింఛన్లకు దరఖాస్తు చేసుకు న్న అర్హులైన వితంతువులు లబోది బోమంటున్నారు. కొత్త లబ్దిదారు ల జాబితాలో తమ పేర్లు లేవని గుండెలు బాదుకుంటున్నారు. కొ త్త పింఛన్ జాబితాలో అతికొద్ది మంది పేర్లను ప్రభుత్వం పోస్టాఫీ స్‌లకు పంపింది. మిగతావారి గతేంటని వితంతువులు, వృద్ధులు బావురుమంటున్నారు. కొత్త పింఛ న్లు ప్రకటించామని గొప్పలు చెప్పుకునే ప్రభుత్వం తగిన ధ్రువీ కరణ పత్రాలున్నా అర్హులను ఇం కా జాబితాలో ఎందుకు చేర్చలే దు. వెంటనే మరో కొత్త జాబితా ప్రకటించి అక్టోబర్ 2 నుంచే కొత్త వారికి పింఛన్ వచ్చేటట్లు ప్రకటిం చాలి. లేకుంటే ఈ ప్రభుత్వాన్ని ఎవరూ నమ్మరు.

- సి.అంకాలమ్మ  గుత్తి
 

మరిన్ని వార్తలు