రుణ ఊబిలో లంక

20 Dec, 2017 00:39 IST|Sakshi
హంబన్‌టోటా ఓడరేవు

దేశాల మధ్య ఏర్పడే చెలిమికి ఆకర్షణీయమైన పేర్లు పెట్టడం, వాటిమధ్య కుదిరే ఒప్పందాలను బరువైన పదబంధాలతో అభివర్ణించడం సర్వ సాధారణం. కానీ స్నేహం కుదిరే ఆ రెండు దేశాల మధ్యా సమాన స్థాయి లేనప్పుడు వాటి మధ్య కుదిరే ఒప్పందాల్లో కూడా అదే ప్రతిఫలిస్తుంది. కుదిరే ఒప్పందాలు చిన్న దేశానికి శిరోభారమవుతాయి. దాన్ని రుణ సంక్షోభంలోకి నెట్టేస్తాయి. చైనా–శ్రీలంకల మధ్య కుదిరిన ఒప్పందంలో భాగంగా చైనా సాయంతో లంకలో నిర్మించిన హంబన్‌టోటా ఓడరేవు పరిస్థితి ప్రస్తుతం అదే. ఆ భారీ ఓడరేవు ఎలాంటి కార్య కలాపాలు సాగక తీవ్ర నష్టాలు తీసుకొస్తుంటే... దానికి ఏటా భారీ మొత్తంలో చైనాకు వాయిదాలు చెల్లించాల్సి వస్తుంటే శ్రీలంక విలవిల్లాడింది.

తనను దివాళా తీయిస్తున్న ఈ ఓడరేవును వదుల్చుకోవడం ఎలాగో తెలియక ఇబ్బంది పడింది. చివరకు ఈ భారాన్ని మోయడం తమ వల్ల కాదని చేతులెత్తేసి దాన్ని నిర్మించిన చైనా పబ్లిక్‌ రంగ సంస్థ చైనా మర్చంట్‌ పోర్ట్స్‌(సీఎంపీ) సంస్థకే తిరిగి అప్ప గించింది. ఆ ఓడరేవులో 85 శాతం వాటాను దానికి అప్పగించి, దాన్ని 99 ఏళ్లకు చైనాకు లీజుకిచ్చింది. ఆ ఒప్పందంలో ఉన్న అంశాలేమిటో, అది మన భద్రతపై ఎలాంటి ప్రభావం చూపుతుందో మున్ముందు తెలుస్తుంది. హిందూ సముద్ర ప్రాంత దేశాల్లో తన పలుకుబడి పెంచుకోవడానికి, ముందూ మునుపూ పాగా వేసి మన దేశానికి సవాలు విసరడానికి చాన్నాళ్లక్రితమే చైనా ఆర్ధిక దౌత్యాన్ని ఎంచు కుంది. అందులో భాగంగానే శ్రీలంకతో ఈ ఒప్పందం కుదుర్చుకుంది. 

లంకలో తమిళ టైగర్లను ఊచకోత కోసిన శ్రీలంక సైన్యం తీరుపై పశ్చిమ దేశాలు అభ్యంతరం వ్యక్తం చేసి, ఆ సైన్యంపై యుద్ధ నేరాల కింద అంతర్జాతీయ విచారణ జరగాలని కోరుతున్న సమయంలో చైనా శ్రీలంకకు, ఆనాటి దేశాధ్యక్షుడు రాజపక్సకు బాసటగా నిలిచింది. ఆ తర్వాతే హంబన్‌టోటా ఓడ రేవు నిర్మాణానికి ఒప్పందం కుదిరింది. దీని నిర్మాణంలో చైనాకు వాణిజ్యపరమైన ప్రయోజనాలు మాత్రమే కాదు...వ్యూహాత్మక అవసరాలు కూడా ఇమిడి ఉన్నాయి. ఈ ప్రాంతం అత్యంత కీలకమైనది. ఇది అటు ఆఫ్రికా, పశ్చిమాసియాలకూ... ఇటు ఆగ్నేయా సియా దేశాలకూ మధ్య ఉంటుంది. చైనాతో మొదలుపెట్టి ఆఫ్రికా, యూరప్‌ ఖండాల్లోని 65 దేశాలను అనుసంధానించే వన్‌ బెల్ట్‌ వన్‌ రోడ్‌(ఓబీఓఆర్‌) లాంటి బృహత్తర ప్రాజెక్టును కలగంటున్న చైనా అధినేత జీ జిన్‌పింగ్‌ వ్యూహంలో హంబన్‌టోటా కూడా భాగం. లక్షా 70 వేల కోట్ల డాలర్లు( రూ.1,08,85,000 కోట్లు) వ్యయం కాగల ఓబీఓఆర్‌ ప్రాజెక్టు కోసం ఆ 65 దేశాల్లోనూ భారీయెత్తున రహదార్లు, రైలు మార్గాలు, ఓడరేవులు నిర్మాణాల్లో పాలుపంచుకోవడానికి చైనా సిద్ధపడుతోంది. ఈలోగా హంబన్‌టోటా ఓడరేవు వ్యవహారం మొత్తం గాలి తీసే చందంగా తయారైంది.  

హంబన్‌టోటా ఓడరేవుకు వ్యయమైన 150 కోట్ల డాలర్లలో 85 శాతం మొత్తాన్ని... అంటే 127.5 కోట్ల డాలర్లను లంకకు 6.5 శాతం వడ్డీతో చైనా ఎగ్జిమ్‌ బ్యాంకు రుణంగా ఇచ్చింది. మిగిలిన 22.5 కోట్ల డాలర్లను శ్రీలంక భరించింది. ఏడేళ్లక్రితం ఈ ఓడరేవు ఎంతో ఆర్భాటంగా ప్రారంభమైంది. కానీ 2015 సార్వత్రిక ఎన్నికల్లో రాజపక్స ఓడిపోయాక అనంతరం వచ్చిన మైత్రిపాల సిరిసేన ప్రభుత్వానికి ఇదొక గుదిబండగా మారింది. ఆ రుణాన్ని ఏడాదికి 6 కోట్ల డాలర్లు చెల్లించాల్సి రావడం దానికొక సమస్యగా మారింది. వాస్తవానికి ప్రారంభమైన మూడేళ్లలో... అంటే 2013కల్లా ఆ ఓడరేవు ద్వారా దండిగా ఆదాయం లభించి రుణం సులభంగా చెల్లించగలగాలి. కానీ శ్రీలంకకు నిరుడు ఆఖరుకల్లా అక్కడ 300 కోట్ల మేర నష్టాలొచ్చాయి. రుణ వాయిదాలను చెల్లించడం దానివల్ల కావడం లేదు.


నిజానికి మహిందా రాజపక్స ప్రభుత్వం హయాంలో దేశంలోకి తీసుకొచ్చిన విదేశీ పెట్టుబడులను సమీక్షించి అవసరమైతే వాటిని వెనక్కు పంపుతామని సిరిసేన దేశ ప్రజలకు హామీ ఇచ్చారు. కానీ హంబన్‌టోటా ఓడరేవు ఒప్పందం జోలికెళ్లడానికి ఆయన సాహసించలేకపోయారు. అలాగని దాన్ని ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో పడ్డారు. ఓడరేవుకు ఆదాయం రావాలంటే చైనా షిప్పింగ్‌ కంపెనీల ఓడలు ఆ రేవులో ఆగాలి. అక్కడినుంచి ఎగుమతులు, దిగుమతులు ముమ్మరంగా సాగిం చాలి. ఓడరేవుకు చేర్చి 15,000 ఎకరాల నిడివిలో ప్రత్యేక ఆర్ధిక మండలి (ఎస్‌ఈ జడ్‌) నిర్మించి అక్కడ చైనా తయారీ రంగ పరిశ్రమలు వస్తే... భారత్‌– శ్రీలంక మధ్య ఉన్న ఒప్పందానికి అనుగుణంగా ఆ ఎస్‌ఈజడ్‌లో ఉత్పత్తయ్యే వస్తువులకు భారత్‌లో టారిఫ్‌లు ఉండవని లెక్కేశారు. ఈ ఏడాది మొదట్లో ఆ ఎస్‌ఈజడ్‌ కూడా ప్రారంభమైంది. అయితే అక్కడ ఆశించిన స్థాయిలో కార్యకలాపాలు మొదలు కాలేదు. ఈలోగా లంక తీరంలో చైనా నావికా దళ కార్యకలాపాలు పెరగడంపై మన దేశం కూడా అప్రమత్తమైంది. అక్కడ చైనా పట్టు పెరిగితే అది భారత్‌ భద్రతకు ముప్పు కలిగిస్తుందని మన దేశం భావిస్తోంది. అందుకే హంబన్‌టోటాకు సమీపంలో ఉన్న విమానాశ్రయంలో జపాన్‌ భాగస్వామ్యంతో 20.5 కోట్ల డాలర్ల పెట్టుబడి పెడతామని, అందుకు ప్రతిగా దాన్ని 40 ఏళ్లపాటు లీజుకివ్వాలని మన దేశం ప్రతిపాదించింది. 

ఏ దేశమైనా మౌలిక సదుపాయాలు మెరుగుపర్చుకోవాలనుకోవడంలో తప్పులేదు. కానీ ఆ మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల్లో ఏవి ప్రాధాన్యత కలిగినవో, ఏవి లాభదాయకమైనవో నిపుణులతో అంచనాలు వేసుకుని సొంతంగా నిర్ణయిం చుకోవాలి. వేరే దేశం తన స్వప్రయోజనాల కోసం ప్రతిపాదిస్తే వెనకా ముందూ చూడకుండా అంగీకరిస్తే శ్రీలంక తరహాలోనే ఆర్ధికంగా దివాళా తీసే స్థితి ఏర్ప డుతుంది. చైనా–పాకిస్తాన్‌ ఆర్ధిక కారిడార్‌పైనా పాకిస్తాన్‌ ఆర్ధిక నిపుణుల నుంచి ఇలాంటి అభ్యంతరాలే వ్యక్తమవుతున్నాయి. ఆ కారిడార్‌ వల్ల పాకిస్తాన్‌కు లాభం కన్నా నష్టమే ఎక్కువని వారు చెబుతున్నారు. నేపాల్, మయన్మార్, పాకిస్తాన్‌లలో చైనా నిర్మించతలపెట్టిన జల విద్యుత్‌ ప్రాజెక్టులపై స్థానికంగా వ్యతిరేకత వ్యక్తమ వుతోంది. లంక అనుభవం ఆ దేశాల కళ్లు తెరిపిస్తే అది మనకు కూడా మేలు చేకూరుస్తుంది.

మరిన్ని వార్తలు