లంకలో కొత్త నీరు!

10 Jan, 2015 00:47 IST|Sakshi

అందరూ ఊహించినట్టే, సర్వేలన్నీ జోస్యం చెప్పినట్టే శ్రీలంక అధ్యక్షుడు రాజపక్స అక్కడ జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో ఓటమిపాలయ్యారు. విపక్షానికి చెప్పుకోదగ్గ నాయకుడే లేని స్థితిని అదునుగా తీసుకుని, తనపై అంతకంతకూ పెరుగుతున్న అసంతృప్తిని పసిగట్టి... ఇప్పుడే ఎన్నికలకు వెళ్లడం ఉత్తమమని రాజపక్స భావించారు. పైగా ఆయనకు సంఖ్యా శాస్త్రంపై అపారమైన నమ్మకం. ఇటు సంవత్సరమూ, అటు తేదీ తన అదృష్ట సంఖ్య 8కి సరిపోయేలా ఉన్నాయి గనుక... జనవరి 8న ఎన్నికలు జరిగేలా ఆయన చూశారు. అన్నీ సరిపోయినా అధికార పీఠం అందుకోవడానికి తప్పనిసరైన జనం మద్దతు మాత్రం ఆయనకు లేకుండా పోయింది. ఇందుకు రెండే కారణాలు-ఆయన కుటుంబ పాలన, దానితో పెనవేసుకుపోయిన అవినీతి. రాజపక్స ఇద్దరు సోదరులు మంత్రులుకాగా, మరో సోదరుడు పార్లమెంటు స్పీకర్, కుమారుడు ఎంపీ. మొన్నటి నవంబర్‌లో ఎన్నికలు ప్రకటించిన రెండురోజుల తర్వాత అప్పటికి రాజపక్స ప్రభుత్వంలో ఆరోగ్య మంత్రిగా, నంబర్ టూ గా ఉన్న మైత్రిపాల సిరిసేన తన పదవికి రాజీనామా చేసి విపక్ష శిబిరంలో చేరి ఉండకపోతే ఇదంతా యథాతథంగా కొనసాగేదేమో! ఎల్‌టీటీఈని తుడిచిపెట్టడాన్ని స్వాగతించిన సింహళ బౌద్ధులు 2009 ఎన్నికల్లో రాజపక్స వెనక గట్టిగా నిలబడ్డారు. ఆ ఎన్నికల్లో  మైనారిటీ వర్గాలైన తమిళులు (15.3శాతం), ముస్లింలు (9.3 శాతం), క్రైస్తవులు (7.4శాతం) అనేక కారణాలవల్ల చీలివున్నారు. మొత్తంగా 32 శాతంగా ఉన్న మైనారిటీలు ఆ ఎన్నికల్లో విడివడి ఉండటంతో రాజపక్స ఘనవిజయం సాధించగలిగారు.
 
 ఈసారి పరిస్థితి తారుమారైంది. మెజారిటీ సింహళుల్లో చీలిక వచ్చి ఎక్కువ మంది ఆయనకు వ్యతిరేకమయ్యారు. వీరి మద్దతును తిరిగి పొందడం కోసం ఆయన చేయని ప్రయత్నమంటూ లేదు. తాను తప్పుకుంటే మళ్లీ తమిళ టైగర్లు విజృంభిస్తారని హెచ్చరించారు. సింహళులకూ, ముస్లింలకూ మధ్య...సింహళులకూ, క్రైస్తవులకూ మధ్య ఘర్షణలు రెచ్చగొట్టాలని చూశారు. అయితే, ఇది ఫలించలేదు సరిగదా...మైనారిటీలతో సింహళులు కూడా జతకట్టారు. ఫలితంగా సిరిసేన 51.3 శాతం ఓట్లతో నెగ్గగలిగారు. ముస్లింలు, తమిళులు అధికంగా ఉండే ప్రాంతాల్లో సిరిసేన 70 శాతానికిపైగా ఓట్లు తెచ్చుకోగలగడం రాజపక్సపై ఆ వర్గాల్లో ఉన్న వ్యతిరేకతను తెలియజేస్తుంది. విపక్షాల అభ్యర్థిగా అధ్యక్ష పీఠాన్ని గెలుచుకున్న సిరిసేనకు అసలు అగ్నిపరీక్షలు ఇప్పుడు మొదలవుతాయి.
 
 ఆయన ముందుగా తన అధికారాలను తాను రద్దు చేసుకోవాల్సి ఉన్నది. తాను అధికారంలోకొచ్చిన వెంటనే దేశంలో నియంతృత్వానికి తావిస్తున్న అధ్యక్ష తరహా పాలనకు స్వస్తి పలుకుతానని సిరిసేన వాగ్దానం చేశారు. దేశంలో తిరిగి పార్లమెంటరీ ప్రజాస్వామ్యం నెలకొల్పుతానన్నారు. అధ్యక్ష తరహా పాలనలో ఉండే లొసుగులవల్లే ప్రభుత్వ ఖజానాను రాజపక్స అయినవారికి దోచిపెట్టారని సిరిసేన ప్రచారం చేసివున్నారు. దిగువ మధ్యతరగతి, పేద వర్గాలవారి బతుకులు దుర్భర ం చేస్తున్న పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలనూ, ఇతర నిత్యావసరాల ధరలనూ తగ్గిస్తామని చెప్పారు. వీటితోపాటు రాజపక్స కుటుంబం చెప్పినట్టల్లా ఆడిన పోలీసు విభాగాన్ని పట్టాలెక్కించి దేశంలో చట్టబద్ధ పాలనను పునరుద్ధరించడం, న్యాయవ్యవస్థ స్వతంత్ర ప్రతిపత్తిని పునఃప్రతిష్టించి, రాజపక్స కారణంగా పదవి కోల్పోయిన షిరానీ బండారునాయకేను మళ్లీ చీఫ్ జస్టిస్‌గా నియమించడం వంటివి దేశ ప్రజలు సిరిసేన నుంచి తక్షణం ఆశిస్తున్నవి.
 
 ఇవిగాక ఆయన సమర్థతకు పరీక్షపెట్టే ఇతర అంశాలు చాలా ఉన్నాయి. రాజపక్స పాలనలో టైగర్ల అణచివేత పేరిట తమిళులపై సాగించిన దురంతాలపై ఐక్యరాజ్యసమితి నేతృత్వంలో విచారణకు సిద్ధపడటం అందులో కీలకమైనది. సైన్యం అత్యాచారాల సమయంలో సిరిసేన కొద్దికాలం రక్షణ మంత్రిగా వ్యవహరించారు. ఇప్పుడు ఆయనను బలపరిచిన సింహళ జాతీయవాద పార్టీలు ఇలాంటి విచారణకు ససేమిరా అంటున్నాయి. అలాగే తమిళ పార్టీల ఆధ్వర్యంలో ఉన్న ఉత్తర తూర్పు ప్రాంత మండలికి అధికారాలను ఇచ్చేందుకు వీలుగా రాజ్యాంగాన్ని సవరించాలన్న డిమాండును నెరవేర్చడం సిరిసేనకు తలకు మించిన భారం. దీనికి సంబంధించిన 13వ రాజ్యాంగ సవరణను సింహళ పార్టీలు గట్టిగా వ్యతిరేకిస్తున్నాయి. సిరిసేనకు మద్దతిచ్చిన తమిళ పార్టీలు మాత్రం ఆ సవరణ తీసుకురావల్సిందేనంటున్నాయి. వీటన్నిటితోపాటు లంక ఆర్థిక వ్యవస్థతో పెనవేసుకుపోయిన చైనా ప్రభావాన్ని తగ్గించడం సిరిసేనకు పెను సవాలు. చైనాకు దగ్గరకావాలన్న ఉద్దేశంతో అధిక వడ్డీరేట్లపై  ఆ దేశంనుంచి భారీ మొత్తంలో రాజపక్స రుణాలు తీసుకొచ్చారు. ఆయన ఓటమికి ఈ రుణభారం కూడా ఒక కారణం. భారత్‌కు వ్యతిరేకంగా ఒక్కొక్క దేశాన్నే చేరదీయాలన్న చైనా వ్యూహంలో భాగంగానే లంకకు భారీ మొత్తంలో రుణాలు అందజేసింది. ఆ దేశానికి చెందిన మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల్లో పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టింది.  శ్రీలంక సైన్యం ఉపయోగిస్తున్న రక్షణ పరికరాల్లో 70 శాతం ‘మేడిన్ చైనా’ గుర్తువే. దీన్నంతటినీ తిరగదోడటం, భారత్‌కు సన్నిహితం కావడం సిరిసేనకు పెద్ద పరీక్షే.
 
 ఈ విషయంలో ఆయన ఏం చేస్తారన్న విషయంలో చైనా, భారత్‌లే కాదు...ప్రపంచ దేశాలన్నీ ఉత్కంఠతో ఎదురుచూస్తున్నాయి. మరోపక్క లంక గడ్డపైనుంచి భారత్ లక్ష్యంగా పాకిస్థాన్ గూఢచార సంస్థ ఐఎస్‌ఐ కార్యకలాపాలు కొంతకాలంగా సాగుతున్నాయి. రాజపక్స హయాంలో లంకలో పెరిగిన చైనా, పాక్‌ల పలుకుబడి తగ్గించాలని భారత్ కృతనిశ్చయంతో ఉన్నది. అందువల్లనే సిరిసేన నెగ్గిన వెంటనే ప్రధాని నరేంద్ర మోదీ ఆయనకు శుభాకాంక్షలు చెప్పడంతోపాటు భారత్ సందర్శించాలని ఆహ్వానించారు. లంకలో మారిన రాజకీయ పరిస్థితుల్లో ఆ దేశంతో మన సంబంధాలు ఏ మేరకు మెరుగుపడగలవో చూడాల్సి ఉన్నది.

>
మరిన్ని వార్తలు