నేరానికి తగిన శిక్ష

21 Dec, 2019 01:17 IST|Sakshi

అధికార మదంతో, తలపొగరుతో ఇష్టానుసారం చెలరేగే రాజకీయ నాయకుల వెన్నులో వణుకు పుట్టేలా ఉన్నావ్‌ అత్యాచార ఉదంతంలో బహిష్కృత బీజేపీ ఎమ్మెల్యే కులదీప్‌ సెంగార్‌కు ఢిల్లీ కోర్టు యావజ్జీవశిక్ష విధించింది. ఆయన తన శేష జీవితం మొత్తం జైల్లోనే గడపాలని, బాధితురాలికి రూ. 25 లక్షల జరిమానా చెల్లించాలని, మరో పది లక్షల రూపాయలు ఆమె తల్లికి ఇవ్వాలని శుక్రవారం తీర్పునిచ్చింది. ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నావ్‌లో రెండేళ్లక్రితం జరిగిన ఈ అత్యాచార ఘటన దేశ వ్యాప్తంగా అలజడి రేపింది. చివరకు ఐక్యరాజ్యసమితి సైతం ఈ ఉదంతంపై ఆందోళన వ్యక్తం చేసి, నేరగాళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది.

ఉన్నావ్‌ బాధితురాలు పడిన వెతలు అన్నీ ఇన్నీ కాదు. ఆమెను అపహరించి పదిరోజులపాటు అత్యాచారం చేయడం మాత్రమే కాదు... అదేమని ప్రశ్నించిన పాపానికి ఆ ఇంటిల్లిపాదినీ సెంగార్, ఆయన అనుచరగణం భయభ్రాంతులకు గురిచేశారు. వారికి పనులు దొరక్కుండా చేశారు. ఆ కుటుంబంతో మాట్లాడా లంటే భయపడేలా ఊరు మొత్తాన్ని శాసించారు. అతగాడిపై కేసు పెట్టాలంటూ బాధితురాలు పోలీస్‌ స్టేషన్‌ చుట్టూ తిరుగుతుండగా ఎప్పటికప్పుడు ఆమె కుటుంబసభ్యులను బెదిరించడం, దౌర్జన్యం చేయడం వారికి నిత్యకృత్యంగా మారింది.

తనను అపహరించారని, సామూహిక అత్యాచారానికి ఒడిగట్టారని బాధితురాలు ఫిర్యాదు చేస్తే పోలీసులు మాత్రం అపహరించడం(ఐపీసీ సెక్షన్‌ 363), బలవంతంగా పెళ్లాడేందుకు ప్రయత్నించడం(ఐపీసీ 366) వంటి ఆరోపణలు మాత్రమే ఎఫ్‌ఐఆర్‌లో రాశారు. సెంగార్‌ సోదరుడు బాధితురాలి తండ్రిని తీవ్రంగా కొట్టి గాయపరిచినప్పుడు పోలీసులు ఆయన్ను ఆసుపత్రికి తరలించకుండా పోలీస్‌ లాకప్‌లో ఉంచారు. ఆలస్యంగా వైద్య చికిత్స అంద డంతో ఆయన రెండురోజులు నరకం అనుభవించి కన్నుమూశాడు.

ఇక తానూ, తన కుటుంబం ఏకాకులమని, ఎవరి ఆసరా తమకు లభించే అవకాశం లేదని నిర్ధారణయ్యాక బాధితురాలు ముఖ్య మంత్రి యోగి ఆదిత్యనాథ్‌ నివాసగృహం సమీపంలో కిరోసిన్‌ పోసుకుని ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించింది. సెంగార్‌ సోదరుడు, మరికొందరు ఆమె తండ్రిపై దౌర్జన్యం చేయడం, నెత్తురు ముద్దలా మారిన ఆ వృద్ధుణ్ణి స్టేషన్‌లో కూర్చోబెట్టి పోలీసులు తాపీగా ప్రశ్నించడం వంటి దృశ్యాలు సామాజిక మాధ్యమాలకెక్కి అల్లరై జనం ఛీ కొట్టాకగానీ ఎమ్మెల్యే సోదరుణ్ణి అరెస్టు చేయలేదు. అటు తర్వాత ఈ కేసును రాష్ట్ర ప్రభుత్వం సీబీఐకి అప్పజెప్పింది. ఆ తర్వాతే కులదీప్‌ సెంగార్‌ను అరెస్టు చేశారు. ఈలోగా బాధితురాలి బాబాయ్‌పై తప్పుడు కేసులుపెట్టి జైలుకు పంపారు.


ఉన్నావ్‌ ఉదంతం మన దేశంలో రాజ్యాంగమూ, చట్టమూ ఉన్నాయా అన్న సందేహాన్ని కలిగించింది. ఉన్నావ్‌ బాధితురాలు ఆ ఉదంతం జరిగేనాటికి మైనర్‌. 2012లో వచ్చిన పోక్సో చట్టం కఠినమైనది. మొన్న జూలైలో సవరణలు చేసి దాన్ని మరింత కఠినంగా మార్చి నేరగాళ్లకు ఉరిశిక్ష పడే నిబంధన తీసుకొచ్చారు. కానీ 2017లో ఆ చట్టం బాధితురాలికి ఏమాత్రం ఉపయోగపడలేదు. ఆ చట్టం ఉన్నా అది తమకు తెలియనట్టు, అసలు లేనట్టు పోలీసులు ప్రవర్తించారు. మన దగ్గరున్న సమస్య అదే. నేరగాళ్లు సాధారణ వ్యక్తులైతే ఒకలా, రాజకీయ పలుకుబడి గలవారైతే మరోలా వ్యవహరిస్తుండటం రివాజుగా మారింది.

ఉన్నావ్‌లో అది పరాకాష్టకు చేరింది. మొన్న జూలైలో న్యాయస్థానంలో జరిగే విచారణలో పాల్గొనడానికి బాధితురాలి కుటుంబం కారులో వెళ్తుండగా ఒక ట్రక్కు దాన్ని ఢీకొట్టింది. ఇందులో ఆమె పిన్ని, మేనత్త మరణించారు. బాధితురాలు, న్యాయవాది గాయపడ్డారు. ఈ ఉదంతం తర్వాత బాధితురాలు నేరుగా అప్పటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయ మూర్తి రంజన్‌ గొగోయ్‌కి లేఖ రాశాక ఆయన జోక్యం చేసుకుని ఇందుకు సంబంధించిన కేసుల న్నిటినీ లక్నో న్యాయస్థానం నుంచి ఢిల్లీకి మార్చారు. రోజువారీ విచారించాలని, 45 రోజుల్లో పూర్తి చేయాలని నిర్దేశించారు. అటు తర్వాతే బీజేపీ సెంగార్‌ను పార్టీ నుంచి బహిష్కరించింది. 

నేరారోపణలొచ్చిన వ్యక్తి అధికార పక్ష నాయకుడైతే అధికార యంత్రాంగాన్ని కదిలించడం ఎంత కష్టమో, ఎంత ప్రాణాంతకమో ఉన్నావ్‌ బాధితురాలు, ఆమె కుటుంబం పడిన కష్టాలు గమనిస్తే బోధపడుతుంది. సెంగార్‌ ఆ రాష్ట్రంలోని ప్రధాన పార్టీలన్నిటిలోనూ పనిచేశాడు. ఎక్కడున్నా ఆయనపై ఆరోపణలు తరచు వస్తూనే ఉన్నాయి. బీజేపీలో చేరకముందు ఆయన బీఎస్పీ, సమాజ్‌ వాదీ పార్టీల్లో పనిచేశాడు.  కానీ ఆయన ఓట్లు సాధించిపెట్టే బలమైన నాయకుడు గనుక ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఆయన అరాచకాలపై ఎవరూ నోరెత్తలేదు.

దేశంలో, మరీ ముఖ్యంగా ఉత్తరా దిలో ఇలాంటివారే నాయకులుగా చలామణి అవుతున్నారు. ఉన్నావ్‌ బాధితురాలు రెండేళ్లపాటు ఒంటరి పోరు చేయాల్సి రావడం ఇందువల్లే. నేరం జరిగినప్పుడు వెంటవెంటనే వ్యవస్థలు కదలకపోయినా, ఆ నేరానికి తగిన శిక్ష పడకపోయినా సమాజంలో మరింతమంది నేరగాళ్లు పుట్టుకొస్తారు. ఏం చేసినా తమకేమీ కాదన్న ధైర్యంతో బరితెగిస్తారు. కనుక చట్టాలు కఠినంగా ఉండటం మాత్రమే సరిపోదు. అవి సత్వరం రంగంలోకి దిగాలి. అప్పుడే అందరిలోనూ చట్టాలంటే భయం ఏర్పడుతుంది. నిర్భయ ఉదంతం జరిగాక నియమించిన జస్టిస్‌ జేఎస్‌ వర్మ కమిటీ ఒక విలువైన మాట చెప్పింది.

సమాజంలో నేరాలు అధికంగా అణగారిన వర్గాలు, మహిళలు, పిల్లలపైనే జరుగుతాయని, అందువల్ల వారి రక్షణకు ఉద్దేశించిన విభాగాలు ఎలా పనిచేస్తున్నాయో ఎప్పటి కప్పుడు తనిఖీలు నిర్వహిస్తుండాలని ఆ కమిటీ తెలిపింది. ఏ అధికారి అయినా, కింది స్థాయి సిబ్బంది అయినా అలసత్వం ప్రదర్శిస్తున్నట్టు తేలితే తక్షణం కఠిన చర్యలు తీసుకోవాలని సూచిం చింది. ఉన్నావ్‌ ఉదంతం దేశంలోని అన్ని ప్రభుత్వాలకూ గుణపాఠం కావాలి. చట్టాలు సమర్థ వంతంగా పనిచేసేలా, వ్యవస్థలు సత్వరం కదిలేలా తీర్చిదిద్దాలి. అప్పుడు మాత్రమే చట్టాలంటే భయభక్తులు ఏర్పడతాయి.

మరిన్ని వార్తలు