డా.సుబ్రహ్మణ్యస్వామి (ఎం.పి) రాయని డైరీ

26 Jun, 2016 00:46 IST|Sakshi
డా.సుబ్రహ్మణ్యస్వామి (ఎం.పి) రాయని డైరీ

రేస్ కోర్స్ రోడ్డులో దిగి, నేరుగా ‘పంచవటి’ లోకి వెళ్లిపోయాను. కిచెన్‌లో అటువైపు తిరిగి ఉన్నారు మోదీజీ. ‘‘గుడ్మాణింగ్ మోదీజీ’’ అన్నాను. ‘‘మీరా?’’ అన్నారు మోదీజీ ఇటువైపు తిరిగి. ‘‘అవును నేనే’’ అన్నాను. ‘‘చప్పుడైనా చెయ్యలేదు!’’ అన్నారు మోదీజీ. ‘‘మీరేం చేస్తున్నారో చూద్దామని’’ అన్నాను, చిన్న గెంతుతో కిచెన్ గట్టుపైకి ఎగిరి కూర్చొని.

‘‘ఉదయం నుంచీ ట్రయ్ చేస్తున్నాను.. చాయ్ కుదరడం లేదు’’ అన్నారు మోదీజీ. ఆయన చేతిలో టీ గిన్నె ఉంది. టీని వడగట్టే ఫిల్టర్ ఉంది. ‘‘ఉదయం నుంచి కాదు మోదీజీ, రెండేళ్లుగా మీకు టీ కాచడం రావడం లేదు’’ అన్నాను. ‘‘అరె! ఈ మాట నాతో ఎవరూ అనలేదే’’ అని ఆశ్చర్యపోయారు మోదీజీ. ‘‘ఎవరు అననిస్తున్నారు మోదీజీ’’ అన్నాను. ‘జైట్లీజీ గురించేనా మీరు అంటున్నది’ అన్నట్లు చూశారు మోదీజీ.

కిచెన్‌లోంచి హాల్లోకి వచ్చాం. ‘‘అపాయింట్‌మెంట్ లేకుండా ఎప్పుడు పడితే అప్పుడు, నేను ఏ గదిలో ఉంటే ఆ గదిలోకి మీరు వచ్చేయడం ఇక్కడ కొంతమందికి నచ్చట్లేదు స్వామీజీ’’ అన్నారు మోదీజీ. ‘‘అపాయింట్‌మెంట్ ఒక్కటే సరిపోతుందా? పాస్‌పోర్ట్, వీసా కూడా కావాలా మోదీజీ.. ’’ అన్నాను. మోదీజీ హర్ట్ అయినట్లున్నారు! మూడ్ మార్చుదామని, ‘‘టీ అదిరిపోయింది మోదీజీ’’ అన్నాను. మోదీజీ అదిరిపడ్డారు.

‘‘ఇంతకుముందే కదా.. నాకు టీ కాచడం రావడం లేదన్నారు’’ అన్నారు మోదీజీ. ‘‘నా ఉద్దేశం అది కాదు మోదీజీ, చక్కగా కాస్తున్నారు. కానీ చక్కగా వడపోయడమే మీకు చేతనవడం లేదు’’ అన్నాను. ‘‘స్వామీజీ.. ఏదైనా క్లియర్‌గా చెబితేనే నాకు అర్థమౌతుంది’’ అన్నారు మోదీజీ. ‘‘శక్తికాంతదాస్‌ని ఎప్పుడు తీసేస్తున్నారో చెప్పండి’’ అన్నాను. ‘‘శక్తికాంత్‌నా!! మీరు తీసేయమంటున్నది అరవింద్‌ని కదా’’ అన్నారు మోదీజీ. ‘‘ఇద్దర్నీ’’ అన్నాను. మళ్లీ అర్థం కానట్లు చూశారు మోదీజీ.  మోదీజీ ప్రధాని అయ్యాక అలా నా వైపు నాలుగైదుసార్లు చూశారు.

‘‘రాజ్యసభకి వచ్చేశారుగా. ఇకనైనా నెమ్మదిగా ఉండండి స్వామీజీ’’ అంటున్నారు మోదీజీ. నెమ్మదా!! అమెరికా వెళ్లి ఇండియా చెయ్యి మెలితిప్పి వచ్చిన దేశభక్తుడు అరవింద్. రియల్ ఎస్టేట్‌లో చిదంబరం మోచేతి కింది నీళ్లు తాగిన నిపుణుడు శక్తికాంత్. ఆయన చీఫ్ ఎకనమిక్ అడ్వైజర్. ఈయన ఎకనమిక్ ఎఫైర్స్ సెక్రటరీ. రాజన్ వెళ్లిపోయాక ఆర్బీఐకి వీళ్లిద్దర్లో ఒకర్ని గవర్నర్‌ను చేసినా చేసేస్తాడు అరుణ్‌జైట్లీ.  

‘‘నేను నెమ్మదిగానే ఉన్నాను మోదీజీ.. వాళ్లిద్దర్నీ తీసెయ్యకపోతే ఇండియన్ ఎకానమీకి నెమ్మది ఉండదు’’ అన్నాను.  తీస్తాననీ, తియ్యననీ చెప్పలేదు మోదీజీ. సొరుగులోంచి ఓ బరువైన పుస్తకం తీసి నా చేతిలో పెట్టారు. ‘‘తేలిక పడండి’’ అన్నారు. అది.. యోగాసనాల పుస్తకం!

>
మరిన్ని వార్తలు