తాజ్‌మహల్‌కు నిర్లక్ష్యం కాటు

12 May, 2018 02:01 IST|Sakshi
తాజ్‌మహల్‌

కాలం చెక్కిట ఘనీభవించిన కన్నీటిచుక్కగా, ధవళకాంతుల దివ్య మందిరంగా ఎందరెం దరినో పరవశింపజేసే తాజ్‌మహల్‌... దాన్ని కాపాడి రక్షించాల్సిన పురావస్తు శాఖ అధికారుల మనసుల్ని కాస్తయినా కదిలించలేకపోతున్నది. తాజ్‌ కళాకాంతులు క్షీణిస్తున్నాయని, అది క్రమేపీ పసుపు రంగుకు మారుతున్నదని ఆందోళన వ్యక్తం చేస్తూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై విచారణ సందర్భంగా బుధవారం సుప్రీంకోర్టు ఆ శాఖకు చీవాట్లు పెట్టింది. ఆ అపురూప కట్టడాన్ని పరిరక్షించడం చేతగాకపోతే  ఆ బాధ్యతనుంచి తప్పుకోండని అధికారు లను మందలించింది. సర్వోన్నత న్యాయస్థానం ఆగ్రహానికి కారణముంది.

తాజ్‌మహల్‌కు ముప్పు ముంచుకొస్తున్నదని పర్యావరణవేత్తలు దాదాపు పాతికేళ్లనుంచి ఆందోళనపడుతు న్నారు. ఈ విషయంలో ఏదో ఒక చర్య తీసుకుని రక్షించమని ప్రభుత్వాలను వేడుకుంటు న్నారు. అయినా ఫలితం శూన్యం. చివరకు వారు 1996లో సుప్రీంకోర్టు తలుపులు తట్టారు. ఆగ్రా పరిసర ప్రాంతాల్లో ఉన్న ఫౌండ్రీలను అక్కడినుంచి తరలించాలని, సమీపంలోని రిఫైన రీల నిర్వహణకు సహజవాయువును వినియోగించాలని అప్పట్లో కోర్టు సూచించింది. కానీ ఆ ఆదేశాలను గానీ, ఆ తర్వాత పలు సందర్భాల్లో చేసిన సూచనలను గానీ ప్రభుత్వాలు సరిగా పట్టించుకున్న దాఖలా లేదు.

నిరుడు ఒక హోటల్‌ నిర్మాణం కోసం తాజ్‌ పరిసరాల్లో దాదాపు 25 వృక్షాలను కూల్చారు. దానిపై జాతీయ హరిత ట్రిబ్యునల్‌ విచారిస్తుండగానే ఉత్తరప్రదేశ్‌ లోని మధురకూ, ఢిల్లీకి మధ్య రైల్వే ట్రాక్‌ నిర్మించడానికి 400 చెట్లు కొట్టేయవలసి ఉంటుందని, ఇందుకు అనుమతించాలని సుప్రీంకోర్టును కోరుతూ కేంద్ర ప్రభుత్వం అఫిడవిట్‌ దాఖలు చేసింది. దీనికి బదులు ఆ చారిత్రక కట్టడాన్ని ధ్వంసం చేయదల్చుకున్నా మని చెబితే సరిపోతుంది కదా అని ధర్మాసనం వ్యాఖ్యానించిందంటే ఈ అఫిడవిట్‌ దానికెంత ఆగ్రహం తెప్పించిందో అర్ధమవుతుంది.

ప్రపంచంలో ఏమూలకెళ్లినా తాజ్‌మహల్‌ను భారత్‌కు పర్యాయపదంగా చెప్పుకుంటారు. ఏటా విదేశీ పర్యాటకుల్ని ఆకర్షించే చారిత్రక కట్టడాల్లో అగ్రస్థానం తాజ్‌మహల్‌దే. ఏడు ప్రపంచ వింతల్లో అదొకటి. అంతర్జాతీయ సంస్థ యునెస్కో దాన్ని ప్రపంచ వారసత్వ సంప దగా గుర్తించింది. ఆ అద్భుతానికి ఇన్ని రకాల గుర్తింపు ఉన్నా ‘ఇంట్లో ఈగల మోత...బయట పల్లకీ మోత’ అన్నట్టు ఇక్కడి పాలకులకు మాత్రం దానిపై ఆసక్తిగానీ, అనురక్తిగానీ ఉండటం లేదు. బుధవారం సుప్రీంకోర్టు మరో కీలక వ్యాఖ్య చేసింది.

తాజ్‌మహల్‌ రక్షణకు ఏం చేయా లన్న విషయంలో పురావస్తు శాఖను పక్కనబెట్టి అంతర్జాతీయ నిపుణుల సహాయసహకా రాలు తీసుకోమని కేంద్ర ప్రభుత్వానికి సూచించింది. ఆ శాఖ ఎంత ఘనంగా పనిచేస్తున్నదో చెప్పడానికి ఇది చాలు. కీటకాలు, శైవలాలు దాన్ని దెబ్బతీస్తున్నాయని పురావస్తు శాఖ వ్యక్తం చేసిన అభిప్రాయాన్ని ధర్మాసనం విశ్వసించలేదు. సమీపాన ఉన్న యమునా నది నీరు నిలిచి పోయి నాచు పట్టడం వల్ల దాని ప్రభావం తాజ్‌పై పడుతున్నదని ఆ శాఖ చెప్పింది. నీరు నాచుపట్టడం నిజమే అయినా... అది ఎగిరొచ్చి తాజ్‌ను దెబ్బతీస్తుందా అని న్యాయమూర్తులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. 17 వ శతాబ్దంలో నిర్మించిన ఈ పాలరాతి కట్టడం వాయు కాలు ష్యంతో వన్నె కోల్పోతున్నది.

కాలుష్యం కాటుకు మనుషుల ప్రాణాలే రాలిపడుతున్నప్పుడు కట్టడాల గురించి చెప్పేదేముంది? గాలిలో గంధకం, నత్రజని తదితర ఉద్గారాల పరిమా ణాలు పరిమితికి మించి ఉన్నాయని, అప్పుడప్పుడు కురిసే ఆమ్ల వర్షాలు తాజ్‌ అందాన్ని పాడు చేస్తున్నాయని నిపుణులంటున్నారు. ఆ పాలరాతి కట్టడం చుట్టూ భారీ సంఖ్యలో మొక్కలు పెంచాలని కేంద్రం నిర్ణయించినట్టు నిరుడు వార్తలొచ్చాయి. అయితే ఇన్నేళ్లుగా జరి గిన విధ్వంసాన్ని అవి ఇప్పటికప్పుడు పూడ్చలేవు. అందుకు చాలా కాలం పడుతుంది.

చారిత్రక కట్టడాలను శిథిల, నిర్జీవ రూపాలుగా చూడకూడదు. అవి కేవలం గత కాలపు కళా కౌశలానికి, ఆనాటి ఇంజనీరింగ్‌ నైపుణ్యానికి, అప్పటి వాస్తు శాస్త్ర వైభవానికి మాత్రమే ప్రతీకలు కావు. అందాన్ని, ఆహ్లాదాన్ని కలిగించేవిగా మాత్రమే వాటిని చూస్తే సరిపోదు.  అవి మన వారసత్వ సంపద. వందల ఏళ్లనాటి చరిత్రకూ, సంస్కృతికీ సజీవ సాక్ష్యాలు. ఆనాటి విలువలకు నకళ్లు. ఇప్పటి మన అవసరాలతో, మనకుండే అభిప్రాయాలతో కాక వాటిని చరి త్రకు దర్పణాలుగా గుర్తించగలిగితే ఆ కట్టడాల గొప్పతనం అర్ధమవుతుంది.

వాటి సంరక్షణ ఎంత ముఖ్యమో కూడా తెలుస్తుంది. మిగిలినవారి మాటెలా ఉన్నా... పురావస్తు శాఖలో పనిచేసేవారికి, ఆ శాఖను పర్యవేక్షించే కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖకు చరిత్రపైనా, సంస్కృతిపైనా ఆపేక్ష ఉండాలి. చారిత్రక కట్టడాలను తగు జాగ్రత్తలతో కాపాడి భవిష్య త్తరాలకు భద్రంగా అప్పజెప్పాలన్న స్పృహ ఉండాలి. మన పురావస్తు శాఖకు 157 ఏళ్ల చరిత్ర ఉంది. అయినా ఏం ప్రయోజనం? ప్రపంచ వారసత్వ సంపదగా యునెస్కో గుర్తించిన తాజ్‌ మహల్‌కే పురావస్తు శాఖ ఈ గతి పట్టించింది. ఇక ఇతర కట్టడాల పరిరక్షణ విషయం చెప్పేదే ముంది? యుమునా నది తీరం వ్యర్థాలకు నిలయంగా మారింది. అక్కడ కొన్ని దశాబ్దాలుగా కర్మాగారాలకు అనుమతులీయడం వల్ల ఆ వ్యర్థాలన్నీ వచ్చి దాన్లో కలుస్తున్నాయి. ఆ కర్మా గారాలు వదిలే పొగ తాజ్‌మహల్‌ను కమ్ముతోంది.

దశాబ్దాలు గడుస్తున్నా వాటి దుష్ప్రభా వాన్ని కాస్తయినా నివారించడానికి ప్రయత్నించకపోవడం నేరం కాదా? కేంద్రంలో ఎవరున్నా తాజ్‌ పట్ల నిర్లక్ష్యమే రాజ్యమేలుతోంది. రెండేళ్లక్రితం సిరియాలోని పురాతన నగరం పాల్మై రాను ఐఎస్‌ ఉగ్రవాదులు ముట్టడించి, అందులోని కొత్త రాతియుగంనాటి అపురూప కళాఖం డాలను, అనంతరకాలంలో నిర్మించిన భవంతులను ధ్వంసం చేశారని విన్నప్పుడు ఎందరెంద రికో మనస్సు చివుక్కుమంది. మన నిర్లక్ష్యం ఇక్కడి చారిత్రక కట్టడాలకు అచ్చం అదే గతి పట్టి స్తున్నదని అర్ధమైతే వాటిపట్ల ఎంత జాగ్రత్తగా వ్యవహరించాలో అందరికీ తెలుస్తుంది.
 

మరిన్ని వార్తలు