మరణశిక్ష-మానవీయత!

4 Sep, 2014 02:00 IST|Sakshi

ఉరిశిక్ష ఉండాలా వద్దా అనే మీమాంస సంగతలా ఉంచి...ఆ శిక్ష పడినవారి విషయంలో అనుసరించాల్సిన విధానంపై చాన్నాళ్లుగా ఉన్న వివాదానికి సర్వోన్నత న్యాయస్థానం ముగింపు పలికింది. ఇకనుంచి అలాంటి ఖైదీలు దాఖలు చేసుకునే రివ్యూ పిటిషన్లపై బహిరంగ కోర్టులో విచారణ జరిపి, తుది నిర్ణయం తీసుకోవాలని అయిదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం 4-1 మెజారిటీతో మంగళవారం తీర్పునిచ్చింది. ఈ తీర్పు ప్రకారం మరణశిక్ష పడిన ఖైదీల రివ్యూ పిటిషన్లను ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం బహిరంగ కోర్టులో విచారించాల్సి ఉంటుంది. శిక్షపడిన ఖైదీ తరఫున వాదనలు వినిపించేందుకు న్యాయవాదికి అరగంట వ్యవధినివ్వాలనివ్వాల్సి ఉంటుంది.
 
‘అరుదైనవాటిలో అత్యంత అరుదైన’ నేరాలకు మాత్రమే మరణశిక్ష విధించాలన్నది మన న్యాయస్థానాలు అనుసరిస్తున్న విధానం. కింది కోర్టులు విచారణ జరిపి విధించే ఇలాంటి శిక్షలపై ఉన్నత న్యాయస్థానాలు సమీక్షిస్తాయి. వాటిని ఖరారు చేయడం లేదా యావజ్జీవ శిక్షలుగా మార్చడం చేస్తాయి. అయితే, మరణశిక్ష ఖరారైన ఖైదీలు రివ్యూ పిటిషన్లు దాఖలు చేసుకున్న సందర్భాల్లో వాటిని న్యాయమూర్తులు తమ ఛాంబర్లలోనే పరిశీలించి, తుది నిర్ణయం తీసుకోవడం దాదాపు ఆరు దశాబ్దాలుగా సాగుతున్న సంప్రదాయం.

ఈ విషయంలోనే మానవ హక్కుల ఉద్యమకారులు తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేస్తున్నారు. ఒకసారి సుదీర్ఘమైన విచారణ ప్రక్రియ పూర్తయిన కేసులపై రివ్యూ పిటిషన్ దాఖలైనప్పుడు దానిపై మళ్లీ మళ్లీ విచారించడం, ఖైదీ తరఫు న్యాయవాది వాదనలు వినడంవంటివి అవసరం లేదని... కేసులోని ప్రధానాంశాలను స్థూలంగా పరిశీలించి న్యాయమూర్తులు తుది నిర్ణయం తీసుకోవచ్చునన్న దృక్పథమే ఇంతవరకూ అనుసరించిన సంప్రదాయానికి ప్రాతిపదిక. అయితే, రెగ్యులర్‌గా సాగే విచారణల్లో వెల్లడికాని అనేకానేక అంశాలు అనంతరకాలంలో బయటపడటానికి అవకాశం ఎప్పుడూ ఉంటుందని... అలాగే, విచారణ జరిపిన ధర్మాసనం సైతం కొన్ని అంశాలను నిర్లక్ష్యం చేసిన సందర్భాలు ఏర్పడవచ్చునని మానవహక్కుల ఉద్యమ కారులు ఎప్పటినుంచో వాదిస్తున్నారు. ఇవన్నీ రివ్యూ పిటిషన్ విచారణ సమయంలో ప్రస్తావనకొస్తే మరణశిక్ష పడిన ఖైదీకి చివరి నిమిషంలో ఉపశమనం లభించే అవకాశం ఉండవచ్చన్నది వారి అభిప్రాయం. నేరస్తుడిగా ఖరారైన వ్యక్తిని చట్టబద్ధంగా ఉరితీసి శాశ్వతంగా అతని జీవితానికి ముగింపు పలుకుతున్నప్పుడు అందుకు సంబంధించి ఇచ్చే తీర్పు నిర్దుష్టమైనదిగా ఉండవలసిన అవసరం లేదా అన్నది వారి ప్రశ్న. ఒక మనిషికి నేరంలో ప్రమేయం ఉన్నదా, లేదా...ఉంటే అది ఏ మేరకు అనే విషయంలో ఎప్పుడూ భిన్నాభిప్రాయాలుంటాయి. ఇందిరాగాంధీ హత్య కేసులో మరణశిక్ష అమలైన కేహార్‌సింగ్ విషయంలో ఈ రకమైన వాదనలు బలంగా వినబడ్డాయి. ఆయనను దోషిగా నిర్ధారించడంలో ధర్మాసనం అవగాహనాలోపం ఉన్నదని మానవహక్కుల కార్యకర్తలు విమర్శించారు. నిరుడు ఫిబ్రవరిలో ఉరిశిక్ష అమలైన ఉగ్రవాది అఫ్జల్‌గురు విషయంలోనూ ఈ తరహా వాదనలే వినిపించాయి. పార్లమెంటుపై జరిగిన ఉగ్రవాద దాడిలో అతని ప్రమేయాన్ని తిరుగులేనివిధంగా రుజువుచేయగల సాక్ష్యాధారాలేవీ లేవని ఆయన తరఫు న్యాయవాదులన్నారు. బహుశా వారి రివ్యూ పిటిషన్లపై ధర్మాసనం మరోసారి సమగ్ర విచారణ జరిపి, వారి తరఫు న్యాయవాదులు లేవనెత్తుతున్న అంశాలను పరిశీలించి తీర్పు ఇస్తే ఇలాంటి అభిప్రాయాలకు చోటుండేది కాదేమో! ఇక్కడ చాన్నాళ్లక్రితం వచ్చిన అమెరికన్ చిత్రం ‘ట్వెల్వ్ యాంగ్రీమెన్’ గురించి చెప్పుకోవాలి. ఒక హత్య కేసు నిందితుడి దోషిత్వం విషయంలో జ్యూరీ సభ్యులమధ్య సాగిన వాదప్రతివాదాలు ఆ చిత్రం ఇతివృత్తం. ఒక వ్యక్తిని నిర్దోషిగా భావించడానికి ఎన్ని అవకాశాలుంటాయో ఆ చిత్రం చూపుతుంది.
 
మరణశిక్షపై వాదోపవాదాలు ఈనాటివి కావు. అది అమానుషమైనదని, దాన్ని కొనసాగించడమంటే మానవ హక్కును నిరాకరించడమేకాక జీవించే హక్కును కాలరాయడమని మానవహక్కుల ఉద్యమకారులంటారు. నేరం చేసే వ్యక్తికి విచక్షణా జ్ఞానం లోపించినంత మాత్రాన వ్యవస్థ సైతం అదే తోవన వెళ్లాల్సిన అవసరం లేదని వారు వాదిస్తారు. ప్రపంచంలో 139 దేశాలు మరణశిక్షలను తొలగించాయి. మరికొన్ని దేశాలు ఆ శిక్షల అమలును నిలిపేశాయి. ఈ తరహా అమానుష శిక్షలను రద్దు చేయాలని 2000 సంవత్సరంలో ఐక్యరాజ్యసమితి ఒక తీర్మానాన్ని ఆమోదించింది. అయితే, అత్యంత కఠినమైన శిక్షలుంటాయన్న భయం నేరస్తులకు ఉంటే తప్ప దారుణ అకృత్యాలు తగ్గవని ఆ శిక్షను సమర్థించేవారు వాదిస్తారు. మరణశిక్షను రద్దుచేసిన దేశాల్లో నేరాలు పెరిగిన దాఖలాలేదని మానవ హక్కుల ఉద్యమకారులు చెబుతారు. ఈ వాదప్రతివాదాల సంగతి అలావుంచితే ఉరిశిక్షపడినవారి విషయంలో సంప్రదాయంగా అనుసరిస్తూ వస్తున్న విధానంకంటే మరింత మెరుగ్గా ఉండాల్సిన అవసరం ఉన్నదని ధర్మాసనం భావించింది. శిక్షపడినవారు దాఖలు చేసే పిటిషన్ సమగ్రంగా ఉండకపోవచ్చునని, నిపుణుడైన న్యాయవాది మౌఖికంగా చేసే వాదనలు సమర్ధవంతంగా ఉండి కేసులో దోషిత్వ నిర్ధారణలో కొత్త కోణాన్ని ఆవిష్కరించే అవకాశం ఉంటుందని పేర్కొంది. స్వభావరీత్యా మరణశిక్ష అనేది ఒకసారంటూ అమలు చేశాక తిరగదోడటానికి వీల్లేనిది గనుక ఆ శిక్ష విధింపు విషయంలో అత్యంత జాగురూకతతో, మానవీయతతో మెలగాలన్నదే సుప్రీంకోర్టు తాజా తీర్పు సారాంశం. ఈ తీర్పుతో జీవించే హక్కుకు పూచీపడుతున్న రాజ్యాంగంలోని 21వ అధికరణ ఔన్నత్యాన్ని సర్వోన్నత న్యాయస్థానం మరోసారి చాటిచెప్పింది.

మరిన్ని వార్తలు