ఫిరాయింపు రోగానికి విరుగుడు

23 Jan, 2020 00:11 IST|Sakshi

రాజకీయాల్లో నైతికత నానాటికీ క్షీణిస్తూ, ఫిరాయింపులు రివాజుగా మారుతున్న వేళ సర్వోన్నత న్యాయస్థానం ధర్మాగ్రహం ప్రకటించింది. ఫిరాయింపులపై వచ్చే ఫిర్యాదులను మూడు నెలల్లో పరిష్కరించాలని నిర్దేశించడంతోపాటు, అసలు ఫిరాయింపుల బెడద పరిష్కారానికి ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేయడం ఉత్తమమని సూచించింది. ఫిరాయింపులకు పాల్పడిన చట్టసభల సభ్యులపై అనర్హత వేటు వేసే అధికారం చట్టసభల అధ్యక్షులకు ఉన్నా దాన్ని వినియోగించుకోవడానికి ఎవరూ సిద్ధప డటం లేదు. లోక్‌సభ మొదలుకొని అసెంబ్లీల వరకూ ఇదే తంతు. పర్యవసానంగా ప్రజా స్వామ్యం ప్రహసనంగా మారింది. పరిస్థితులు ఇంతగా వికటించిన తీరుపై స్పీకర్లు కూడా మధన పడుతు న్నారు. గత నెలలో డెహ్రాడూన్‌లో జరిగిన రెండురోజుల అఖిల భారత స్థాయి స్పీకర్ల సద స్సులో ఇతర అంశాలతోపాటు ఫిరాయింపులు కూడా చర్చకొచ్చాయి. కొందరైతే తమ నుంచి ఈ అధికారం తీసేసి, స్పీకర్‌ పదవికుండే గౌరవాన్ని కాపాడాలని కూడా కోరారని వార్తలొచ్చాయి. రాజీవ్‌గాంధీ హయాంలో 52వ రాజ్యాంగ సవరణ ద్వారా ఫిరాయింపులను నిరోధించడానికి చేర్చిన పదో షెడ్యూల్‌ చివరికిలా తయారుకావడం విచారకరం. ఆ చట్టం సమర్ధవంతంగా పనిచేయక పోవడం గమనించి 2003లో 91వ రాజ్యాంగ సవరణ ద్వారా దానికి సవరణలు తీసుకొచ్చారు. అయినా  ఫలితం లేకపోయింది. అసలు పదో షెడ్యూల్‌ను రాజ్యాంగంలో చేర్చడం వెనకున్న ఉద్దేశా లేమిటో, దాని లక్ష్యాలేమిటో ఆ షెడ్యూల్‌లోనే సవివరంగా ప్రస్తావించారు.

ఈ రాజకీయ ఫిరాయిం పులు జాతీయ స్థాయిలో అందరినీ కలవరపరుస్తున్నాయని, దీన్ని ఎదుర్కొనకపోతే మన ప్రజా స్వామ్య పునాదులను అది పెకలించే ప్రమాదం వున్నదని తెలిపింది. 1992లో కిహోటో హŸల్లోహన్‌ కేసులో సుప్రీంకోర్టు ఈ చట్టం ఆవశ్యకతను తెలిపింది. పదవులిస్తామని, ఇతరత్రా పనులు చేస్తా మని ప్రలోభపెట్టి ఫిరాయింపులను ప్రోత్సహించే తీరును అరికట్టడానికి ఈ చట్టం అవసరం ఎంతో  వుందని అభిప్రాయపడింది. కానీ మూడున్నర దశాబ్దాలు గడిచాక చూస్తే ఆ చట్టం నిరర్ధకంగా మారిన దాఖలా కనబడుతోంది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు తాజాగా చేసిన సూచనల్ని అందరూ స్వాగతిస్తారు.ఈ కేసు నేపథ్యాన్ని ఒకసారి ప్రస్తావించుకోవాలి. 60మంది సభ్యులున్న మణిపూర్‌ రాష్ట్ర అసెంబ్లీకి 2017లో ఎన్నికలు జరిగినప్పుడు కాంగ్రెస్‌ కనీస మెజారిటీకి దూరంగా వుండిపోయింది. దానికి మూడు స్థానాలు తక్కువయ్యాయి. ఈలోగా ఇతర పార్టీలను కలుపుకోవడంతోపాటు కాంగ్రెస్‌ సభ్యుడు శ్యాంకుమార్‌ను కూడా బీజేపీ తన శిబిరంలో చేర్చుకుని ఆయనకు మంత్రి పదవి ఇచ్చింది. శ్యాంకుమార్‌పై అనర్హత వేటు వేయాలన్న తమ వినతుల్ని స్పీకర్‌ ఖాతరు చేయక పోవ డంతో కాంగ్రెస్‌ సుప్రీంకోర్టును ఆశ్రయించింది.

ఈ కేసును విచారిస్తూ సుప్రీంకోర్టు చేసిన సూచనలు విలువైనవి. స్పీకర్లు పక్షపాతంతో వ్యవహరిస్తున్నందున ఫిరాయింపుల వ్యవహారంలో వచ్చే ఫిర్యా దులను పరిశీలించి నిర్ణయం తీసుకోవడానికి ఒక శాశ్వత ట్రిబ్యునల్‌ ఏర్పాటు చేస్తే బాగుంటుందని పార్లమెంటుకు సూచించింది. అసలు ఒక పార్టీకి చెందిన సభ్యుడిగా వుండే స్పీకర్‌కు ఫిరాయించిన సభ్యులపై అనర్హత వేటు వేసే అధికారం ఇవ్వడంలోని ఔచిత్యంపై కూడా పార్లమెంటు పునరా లోచించాలని వ్యాఖ్యానించింది. పరిస్థితి తీవ్రతకు సుప్రీంకోర్టు చేసిన ఈ వ్యాఖ్యానమే నిదర్శనం. వాస్తవానికి లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా ఇప్పటికే ఫిరాయింపుల విషయంలో ఏం చేయాలో సూచిం చడానికి ఒక కమిటీని ఏర్పాటు చేసినట్టు చెబుతున్నారు. ఫిరాయింపుదార్లపై మూడు నెలల్లో నిర్ణయం తీసుకోవాలని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కూడా రెండేళ్లక్రితం సూచించారు. మొత్తా నికి ఫిరాయింపులు అన్ని వ్యవస్థల్లోనూ ఏవగింపు కలిగించాయని ఈ పరిణామాలను చూస్తే అర్థమ వుతుంది. ఇది సంతోషించదగ్గదే. ఎందుకంటే ఫిరాయింపుల జాడ్యం ఒక మహమ్మారిలా మారింది. ఎవరేమనుకుంటారోనన్న భయం కానీ, తమను ఎన్నుకున్న ప్రజల విశ్వాసాన్ని వమ్ము చేస్తున్నా మన్న చింతగానీ ఫిరాయింపుదార్లకు లేకుండా పోతోంది.

వారిని చేర్చుకునేవారూ ఈ మాదిరే నదురూ బెదురూ లేకుండా ప్రవర్తిస్తున్నారు. ఫిరాయింపుల గురించి మాట్లాడవలసి వస్తే ఎవరికైనా ముందుగా చంద్రబాబు గుర్తుకొస్తారు. 2014 ఎన్నికల్లో ప్రభుత్వాన్ని నడపడానికి అవసరమైన మెజారిటీ సాధించినా, అనైతికంగా వైఎస్సార్‌ కాంగ్రెస్‌కు చెందిన 23 మంది ఎమ్మెల్యేలను ఆయన తమ పార్టీలో చేర్చుకున్నారు. వారిలో నలుగురికి మంత్రి పదవులు కూడా పంచారు. అంతకు కొన్ని నెలలముందు తెలంగాణలో తమ సభ్యుడొకరిని చేర్చుకుని మంత్రి పదవి ఇవ్వడాన్ని తప్పుబట్టిన బాబు... అదేపని అంతకన్నా నిస్సిగ్గుగా చేయడానికి సందేహించలేదు. ఫిరాయింపుల నిరోధానికి సూచించిన ట్రిబ్యునల్‌కు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి లేదా హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి నేతృత్వం వహించాలని లేదా స్వతంత్రంగా వ్యవహరించగల మరేదైనా యంత్రాంగాన్ని నియమించినా మంచిదేనని ధర్మాసనం వివరించింది. చట్టాలను, నిబంధనలను అన్ని వ్యవస్థలూ సక్రమంగా పాటించినప్పుడే ప్రజాస్వామ్యం వర్థిల్లుతుంది. వ్యవ స్థలు నిస్సహాయంగా మిగిలిపోతున్నాయని... నీతి నియమాలకు తిలోదకాలిచ్చే వ్యక్తులదే అంతి మంగా పైచేయి అవుతున్నదని అనిపిస్తే ప్రజాస్వామ్యం అపహాస్యం పాలవుతుంది. ఫిరాయింపుల నిరోధక చట్టం స్పీకర్లకు తిరుగులేని అధికారం ఇచ్చింది. కానీ వాటిని వినియోగించుకోలేని దుర్బ లత్వం సర్వత్రా వ్యాపించడం, పైగా ఈ అధికారం తమకొద్దంటూ కొందరు మొరపెట్టుకోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది. సుప్రీంకోర్టు సూచించేంతవరకూ ఆగకుండా ఈ విషయంలో ఇప్పటికే పార్ల మెంటు తనంత తాను చొరవ తీసుకోవాల్సింది. ఫిరాయింపులు సంప్రదాయంగా మారినప్పుడు, ప్రజాస్వామ్యం నవ్వులపాలవుతున్నప్పుడు కూడా పట్టించుకోకపోతే ఎట్లా? కనీసం ఇప్పుడైనా కేంద్ర ప్రభుత్వం చురుగ్గా వ్యవహరించి, ఫిరాయింపుల నిరోధక చట్టానికి మరింత పదును పెట్టాలి.

మరిన్ని వార్తలు