మంచి నిర్ణయం

12 Dec, 2014 01:06 IST|Sakshi

క్షణికావేశమో... అనుకున్నది సాధించలేదన్న నిరాశనో... కోరుకున్నది దక్కలేదన్న భావనో... సర్వం కోల్పోయామన్న బాధనో... పట్టరాని ఉద్రేకమో, ఉద్వేగమో, భయమో...ఏదైతేనేమి, బతకడానికి ఒక్క కారణమూ కనబడని క్షణాన ఏ అభాగ్యజీవి అయినా సేద తీరాలనుకునేది మృత్యుదేవత ఒడిలోనే. కానీ ఆ ప్రయత్నంలో పొందే వైఫల్యం మిగిలిన అన్ని వైఫల్యాలకంటే ఎక్కువగా బాధిస్తుంది. ఇరుగుపొరుగువారిలో తనపై అనవసర ఆసక్తిని రేకెత్తిస్తుంది. సిగ్గుతో చితికిపోయేలా చేస్తుంది. ఒక ముద్రపడేందుకు ఆస్కారం కల్పిస్తుంది. అయినవారికి సరేసరి... వారు నిరంతరమూ, అనుక్షణమూ ఆదుర్దాతో సతమతమవుతారు. వీటన్నిటికంటే ఆత్మహత్యాయత్నం చేసేవారిని ఎక్కువగా బాధించేది-దాన్ని నేరంగా పరిగణించే రాజ్యస్వభావం! ఎవరినీ ఏమీ అనలేని అశక్తతలో ప్రాణం తీసుకోవడానికి చేసే ప్రయత్నం కూడా నేరం కావడమేమిటని అలాంటివారు తల్లడిల్లుతారు.

ఇక ఆత్మహత్య మహాపాపమని...దేవుడిచ్చిన ప్రాణాన్ని తీసుకునే హక్కు ఎవరికీ లేదని దాదాపు అన్ని మతాలూ బోధిస్తాయి. ఆత్మహత్యాయత్నం చేసేవారిని దోషులుగా పరిగణించి ఏడాది శిక్ష విధించడం అత్యంత దుర్మార్గమూ, అమానుషమూ అనీ... అది మానవహక్కుల భావనకు విరుద్ధమని సామాజిక కార్యకర్తలు ఏనాటినుంచో వాదిస్తున్నారు. అలాంటివారి వాదనలు ఫలించి ఇన్నాళ్లకు భారత శిక్షాస్మృతినుంచి ఆత్మహత్యాయత్నాన్ని నేరంగా పరిగణించే సెక్షన్ 309 రద్దవుతున్నది. దీన్ని తొలగించబోతున్నట్టు కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో బుధవారం ప్రకటించింది. వాస్తవానికి ఈ అమానవీయ నిబంధనను తొలగించాలన్న ప్రయత్నం ఈనాటిది కాదు.

1971లో అప్పటి లా కమిషన్ తన 42వ నివేదిక ద్వారా  దీని రద్దుకు తొలిసారి సిఫార్సుచేసింది. అందుకు అనుగుణంగా 1978లో ప్రవేశపెట్టిన భారత శిక్షాస్మృతి సవరణ బిల్లును రాజ్యసభ ఆమోదించింది కూడా. దురదృష్టవశాత్తూ అప్పుడు లోక్‌సభ రద్దుకావడంతో అది కాస్తా మురిగిపోయింది. 1997లో మాత్రం లా కమిషన్ వేరే వైఖరిని తీసుకున్నది. దీన్ని కొనసాగించాలంటూ 156వ నివేదికలో సూచించింది. జస్టిస్ ఏఆర్ లక్ష్మణన్ నేతృత్వంలోని లా కమిషన్ 2008లో ఇచ్చిన 210వ నివేదిక ఈ సెక్షన్‌ను తొలగించాలని సిఫార్సు చేసింది.  ఇక న్యాయస్థానాలు కూడా ఈ నిబంధనపై ఒక్కోసారి ఒక్కోరకంగా స్పందించాయి.  మానవ సమాజంలో ఈ సెక్షన్ ఉండతగనిదని ఢిల్లీ హైకోర్టు 1981లో అభిప్రాయపడింది.

ఆత్మహత్యాయత్నం నేరం కాదని 1994లో సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. సెక్షన్ 309 చెల్లదన్నది. జీవించే హక్కును ప్రాథమిక హక్కుగా చేస్తున్న రాజ్యాంగంలోని 21వ అధికరణంలోనే ‘బలవంతంగా జీవించకూడదని కోరుకునే హక్కు’ కూడా ఇమిడి ఉన్నదని... అలా చూస్తే 309 రాజ్యాంగ విరుద్ధమవుతుందని అభిప్రాయపడింది. అయితే, ఈ అభిప్రాయాన్ని 1996లో సుప్రీంకోర్టే మార్చుకుంది. 21వ అధికరణానికి ఇలాంటి భాష్యం చెప్పడం సరికాదని తీర్పునిచ్చింది. మొత్తానికి విషయం మొదటికొచ్చింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ మాత్రం ఆదినుంచీ ఆత్మహత్యకు ప్రయత్నించడమనేది మానసిక సమస్యేనని చెబుతున్నది. అలాంటివారిని నేరస్తులుగా చూడటంకంటే అనారోగ్యానికి లోనైనవారిగా పరిగణించి చికిత్స జరిపించాలని కోరుతున్నది. ప్రపంచదేశాల్లో మనతోపాటు పాకిస్థాన్, బంగ్లాదేశ్, సింగపూర్ వంటివి మినహా మిగిలినవన్నీ ఆత్మహత్యాయత్నాన్ని నేరంగా పరిగణించే చట్టాలను రద్దుచేశాయి.

ఇతరత్రా జరిగే ఆత్మహత్యల సంగతలా ఉంచి అందరికీ అన్నంపెట్టే రైతులు రుణభారంతో కుంగి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. మహిళలతో పోలిస్తే పురుషుల్లో నానాటికీ ఆత్మసై్థర్యం కొరవడి బలవన్మరణాలకు మొగ్గుచూపుతున్నారని ఈమధ్యే జాతీయ క్రైం రికార్డుల బ్యూరో గణాంక సహితంగా తెలిపింది. 2013లో దేశవ్యాప్తంగా 1,34,799 ఆత్మహత్యలు చోటుచేసుకోగా అందులో 90,543 మంది పురుషులైతే 44,256మంది మహిళలు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనూ ఈ ధోరణే కనబడింది. ఆ ఏడాది  9,902 మంది పురుషులు, 4,705 మంది మహిళలు ఉసురు తీసుకున్నారు. వాస్తవానికి ప్రపంచంలో అత్యధిక మరణాలు సంభవిస్తున్న దేశాల జాబితాలో భారత్ తొలి స్థానంలో ఉన్నదని ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ప్రకటించింది. ఆత్మహత్యలకు పురిగొల్పే కారణాలను నివారించలేకపోతున్న మన ప్రభుత్వాలు రాజకీయ ఉద్దేశాలతో చేసే నిరశన దీక్షలను ఆత్మహత్యాయత్నంగా పరిగణించి 309 నిబంధనను విచక్షణారహితంగా ఉపయోగిస్తున్నాయి.

సాయుధ దళాల ప్రత్యేకాధికారాల చట్టాన్ని రద్దుచేయాలని కోరుతూ 14 ఏళ్లనుంచి నిరాహార దీక్ష చేస్తున్న మణిపూర్ మణిపూస ఇరోం షర్మిలను ఈ సెక్షన్‌కిందే పదే పదే అరెస్టుచేసి ఖైదుచేసి బలవంతంగా ఆహారాన్ని ఎక్కిస్తున్నారు. ఈ సెక్షన్‌ను తొలగిస్తే ఆత్మహత్యలు పెరగవచ్చునని ఇప్పుడు కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు వాదిస్తున్నాయి. ఆమరణ దీక్షలు చేసేవారి సంఖ్య పెరుగుతుందని మధ్యప్రదేశ్ అభిప్రాయపడి తే... రైతులను బలవన్మరణాల జోలికిపోకుండా నివారించే చట్టమేదీ ఉండదని పంజాబ్ ఆందోళన వ్యక్తంచేసింది.

మొత్తానికి 309 తొలగింపునకు 18 రాష్ట్రాలు అనుకూలంగా, అయిదు రాష్ట్రాలు వ్యతిరేకంగా స్పందించాయి. ఆత్మహత్యల విషయంలో ఈ సెక్షన్‌కు పరిమితం కాకుండా ఆలోచించగలిగితే నివారణమార్గాలు దొరుకుతాయి. వాటి సంగతలా ఉంచి ఆత్మహత్యాయత్నం చేసినవారిని ముందు పోలీస్‌స్టేషన్‌లో, ఆ తర్వాత కోర్టు బోనులో, ఆనక జైల్లో ఉంచడం కాకుండా నిపుణులు సూచిస్తున్నట్టు వైద్య చికిత్సకు పంపడమే సరైంది. చావుబతుకుల పొలిమేరల్లోకి వెళ్లి వచ్చినవారిని చేరదీసి సాంత్వన చేకూరిస్తే...నిరాశానిస్పృహల నుంచి వారిని దూరం చేస్తే, ఆత్మవిశ్వాసాన్ని పెంచితే నిండు జీవితాలు నిలబడతాయి. ఇందుకవసరమైన కౌన్సెలింగ్‌ను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రభుత్వాలు ఇకనైనా ప్రయత్నించాలి.
 

మరిన్ని వార్తలు