చరిత్రాత్మక తీర్పు

10 Mar, 2018 00:44 IST|Sakshi

వైద్య కారణాలరీత్యా సుదీర్ఘకాలం అచేతన లేదా అర్థ చేతన స్థితిలో ఉన్నవారు సమాజంలోని ఇతరుల్లా తమకు నచ్చినట్టుగా జీవించలేరు. అటువంటివారు మర ణాన్ని ప్రసాదించమని కోరడం చట్టబద్ధమవుతుందా కాదా అనే ప్రశ్నకు ఎట్టకేలకు సర్వోన్నత న్యాయస్థానం నుంచి జవాబు లభించింది. హుందాగా, గౌరవప్రదంగా జీవించడం ప్రాథమిక హక్కు అయినట్టే హుందాగా మరణించాలనుకోవడం కూడా ప్రాథమిక హక్కే అవుతుందని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ దీపక్‌ మిశ్రా నేతృ త్వంలోని అయిదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం శుక్రవారం చరిత్రాత్మక తీర్పులో తేల్చి చెప్పింది. ఆసుపత్రుల్లో జీవచ్ఛవాల్లా బతుకీడుస్తూ నిస్సహాయ స్థితికి చేరుకున్నవారు ‘పాక్షిక కారుణ్య మరణాన్ని’ కోరుకునే వీలు కల్పిస్తూ... ఈ విషయంలో పార్లమెంటు ఒక చట్టం చేసేవరకూ అమల్లో ఉండేలా కొన్ని మార్గ దర్శకాలను రూపొందించింది. 

ఎంతటి సంక్లిష్టమైన పరిస్థితుల్లో చిక్కుకున్నవారిౖకైనా అర్ధాంతరంగా తనువు చాలించేందుకు అవకాశమీయడం హత్య చేయడంతో సమానమని ప్రపంచ దేశాల్లో చాలాచోట్ల భావిస్తారు. అమెరికా, బ్రిటన్, నెదర్లాండ్స్, ఆస్ట్రేలియా, బెల్జియం, కొలంబియా, లగ్జెంబర్గ్, కెనడా వంటి 27 దేశాల్లో మాత్రమే కారుణ్య మరణానికి అనుమతి ఉంది. అయితే వీటిల్లో ‘క్రియాశీల కారుణ్య మరణానికి’ అనుమతించేవి కొన్నయితే, ‘పాక్షిక కారుణ్య మరణానికి’ అనుమతించేవి మరికొన్ని. పైగా అమె రికా, ఆస్ట్రేలియా వంటిచోట్ల దేశమంతా ఒకే విధానం అమల్లో లేదు. ఆ దేశాల్లో కొన్ని రాష్ట్రాలు కారుణ్యమరణాన్ని చట్టవిరుద్ధంగా ప్రకటించాయి. చట్ట పరిభాషలో రోగికి మోతాదుకు మించి మందులిచ్చి మరణానికి చేరువయ్యేలా చేయడం ‘క్రియాశీల కారుణ్య మరణం’ అవుతుంది. 

అలాకాక జీవస్పందన ఉండేందుకు దోహదపడే కీలకమైన మందుల్ని రోగికి ఇవ్వడం ఆపేస్తే లేదా చేయాల్సిన చికి త్సను నిలుపుచేస్తే సంభవించే మరణం ‘పాక్షిక కారుణ్య మరణం’ అవుతుంది. ఈ రెండూ వైద్యుల పర్యవేక్షణలో జరగాల్సినవే. రోగి లేదా అతని సన్నిహితులు సొంతంగా నిర్ణయించుకుని అమలు చేసేవి కాదు. నైతికంగా అయినా, విలువల పరంగానైనా ఈ రెండు విధానాలూ హత్య చేయడంతో సమానమని వాదించేవారు కొందరైతే... ‘క్రియాశీల కారుణ్యమరణం’ మాత్రం స్పష్టంగా హత్యేనని చెప్పేవారు మరికొందరు. ఇది ఒక నిండు జీవితాన్ని ముగించడానికి సంబంధించిన అంశం గనుక సహజంగానే దీన్లో సామాజిక, మతపరమైన అంశాలు కూడా ఇమిడి ఉంటాయి.

నిజానికి ఈ కారుణ్య మరణం అంశం మన దేశంలో చర్చకు రావడానికి ప్రధాన కారణం నలభై రెండేళ్లపాటు అచేతన స్థితిలో మంచానికే పరిమితమై ఉండిపోయిన అరుణా రామచంద్ర శాన్‌బాగ్‌ అనే యువతి. ముంబైలోని కింగ్‌ ఎడ్వర్డ్‌ మెమోరియల్‌(కేఈఎం) ఆసుపత్రిలో నర్స్‌గా పనిచేస్తూ ఆమె అత్యాచారా నికి గురైంది. ఆ దుర్మార్గుడు అరుణ మెడకు ఇనుపగొలుసు బిగించి ఈడ్చుకుపో వడం పర్యవసానంగా మెదడుకు ఆక్సిజన్‌ సరఫరా నిలిచిపోయింది. దాంతో ఆమె శాశ్వత అచేతనస్థితికి వెళ్లిపోయింది. ఆ ఆసుపత్రిలో ఆమెతో పనిచేసిన సహ సిబ్బంది, కాలక్రమంలో అక్కడ ఉద్యోగ విధుల్లో చేరినవారు ఈ నాలుగు దశా బ్దాలూ అరుణను కంటికి రెప్పలా చూసుకున్నారు. అయితే అరుణ చలనరహిత స్థితిలో ఉండటాన్ని తట్టుకోలేని ఆమె స్నేహితురాలు పింకీ విరానీ 2009లో ఆమెకు కారుణ్యమరణం ప్రసాదించాలని 2009లో సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. 

అంతకు మూడేళ్ల ముందు అంటే... 2006లో జస్టిస్‌ ఎం. జగన్నాథరావు నేతృత్వంలోని లా కమిషన్‌ ఈ అంశంపై విపులంగా చర్చించింది. లా కమిషన్‌ నివే దికను కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ పరిశీలించినా ఎలాంటి నిర్ణయమూ తీసు కోలేదు. ఇదే అంశంపై తిరిగి జస్టిస్‌ పీవీ రెడ్డి ఆధ్వర్యంలోని లా కమిషన్‌ కూడా 2012లో సిఫార్సుచేసింది. ఇందుకోసం ముసాయిదా బిల్లును సైతం రూపొందిం చింది. దాంతోపాటే అది దుర్వినియోగమయ్యే అవకాశం లేకపోలేదని కూడా హెచ్చరించింది. అరుణ కేసులో 2011లో సుప్రీంకోర్టు తీర్పు వెలువరిస్తూ అసా ధారణ పరిస్థితుల్లో కారుణ్యమరణానికి అనుమతినీయవచ్చునంటూ పాక్షిక చట్టబ ద్ధత కల్పించింది. కానీ ఇది అరుణా శాన్‌బాగ్‌ విషయంలో వర్తించబోదని తెలి పింది. చివరకు ఆమె 2015 మేలో కన్నుమూసింది. 

అయితే ఇప్పుడు సుప్రీంకోర్టు వెలువరించిన మార్గదర్శకాల ప్రకారం... రోగి మానసిక స్వస్థతతో ఉండి, తనకెదురుకాగల పరిస్థితేమిటో అవగాహన చేసుకోగల సామర్ధ్యం ఉన్న సమయంలో మున్ముందు తాను అచేతన స్థితికి వెళ్లినపక్షంలో వైద్య చికిత్స నిలిపేయవచ్చునని సూచిస్తూ వైద్యులకు ‘సజీవ వీలునామా’ అంద జేయాలి. చికిత్స వల్ల మరణాన్ని వాయిదా వేయడం మినహా మరే ప్రయోజనమూ ఉండదని రోగి గ్రహించినప్పుడు వైద్య చికిత్సను తిరస్కరించే హక్కు అతడికి/ ఆమెకు ఉంటుందని ధర్మాసనం వ్యక్తం చేసిన అభిప్రాయం ఎన్నదగ్గది. అయితే ఇలాంటి ముందస్తు వీలునామా విధానం కొన్ని ప్రమాదాలకు దారితీసే అవకాశం కూడా లేకపోలేదు. ముఖ్యంగా తీవ్ర అనారోగ్యం బారినపడేవారికి, వృద్ధాప్యంలోకి అడుగిడినవారికి ఇది ప్రాణాంతకంగా మారుతుంది. 

వారిని ‘త్వరగా’ వదుల్చుకోవాలని, ఆస్తిపాస్తుల్ని రాబట్టుకోవాలని చూసే బంధువులు ఆ రోగికి మాయ మాటలు చెప్పి లేదా నయానో, భయానో ఒప్పించి ‘సజీవ వీలునామా’కు ఒత్తిడి చేయరన్న గ్యారెంటీ ఏమీ లేదు. దురాశ, స్వార్ధం, విలువల లేమి వంటివి వ్యక్తులను దేనికైనా దిగజారుస్తాయి. అలాగే తొలుత అనుమతినిచ్చిన రోగులే తదుపరి మనసు మార్చుకునే అవకాశం లేకపోలేదు. కానీ ఆ సమయానికి దాన్ని వైద్యులకు వ్యక్తపరిచే స్థితిలో వారు ఉండకపోవచ్చు. రోగిని మాత్రమే కాక... సమాజాన్నంతటినీ పరిగణనలోకి తీసుకున్నపక్షంలో తాజా విధానం అమలు ఎంత సంక్లిష్టమైనదో అర్ధమవుతుంది. కనుక ఆచితూచి దీన్ని అమలు చేయడం ఉత్తమం.

మరిన్ని వార్తలు