సమగ్ర ప్రక్షాళనే మందు

15 Feb, 2020 03:45 IST|Sakshi

రాజకీయాల్లో నేరస్తుల ప్రాబల్యం పెరగకుండా, చట్టసభలు నేర చరితుల నిలయాలు కాకుండా చర్యలు తీసుకోవాలని ఆశించేవారికి సుప్రీంకోర్టు గురువారం ఇచ్చిన ఉత్తర్వులు ఉపశమనం ఇస్తాయి. ఎన్నికల్లో పోటీ చేయడానికి ఎంపిక చేసిన అభ్యర్థుల్లో నేర చరితులుంటే వారి కేసుల వివరాలు ఇవ్వడంతోపాటు, వారిని ఎంపిక చేయడానికి గల కారణాలను కూడా ఇకపై రాజకీయ పార్టీలు తమ వెబ్‌ సైట్లలో, సామాజిక మాధ్యమాల్లో ఉంచాలని, ప్రాంతీయ, జాతీయ దినపత్రికల్లో కూడా ప్రకటనలు జారీచేయాలని జస్టిస్‌ ఆర్‌.ఎఫ్‌. నారిమన్, జస్టిస్‌ రవీంద్రభట్‌లతో కూడిన ధర్మాసనం ఆదేశించింది. గెలుపొక్కటే వారి ఎంపికకు కారణంగా చూపితే కుదరదని, వారికున్న ఇతరత్రా అర్హతలు, కారణాలు చూపించాల్సివుంటుందని ధర్మాసనం స్పష్టం చేసింది. రాజకీయాలు నేరమయం కావడాన్ని అరికట్టేందుకు సుప్రీంకోర్టు రెండేళ్లక్రితం ఇచ్చిన తీర్పు అమలు కావడం లేదంటూ దాఖలైన పిటిషన్‌పై విచారణ సందర్భంగా ధర్మాసనం ఈ ఆదేశాలిచ్చింది.

తాము అధికారంలోకొస్తే ఏం చేస్తామో, ఎలాంటి కార్యక్రమాలు అమలు చేసి మెరుగైన పాలన అందిస్తామో చెప్పి ఒప్పించడానికి ప్రయత్నించాల్సిన రాజకీయ పార్టీలు ఇటీవలికాలంలో ధనబలాన్ని, కండ బలాన్ని నమ్ముకునే స్థితికి చేరుకుంటున్నాయి. గెలుపొందడమే గీటురాయిగా నిర్ణయించుకుని, అందుకు దీటైన వారెవరన్న ఆలోచన చేస్తున్నాయి. ఈ క్రమంలో హత్య, అత్యాచారం, హత్యా యత్నం, కిడ్నాప్, దోపిడీ తదితర క్రిమినల్‌ కేసులున్నవారు ప్రజాప్రతినిధులవుతున్నారు. తాజా కేసులో ఎన్నికల సంఘం దాఖలు చేసిన నివేదిక చూస్తే ఈ సంగతి అర్ధమవుతుంది. పార్లమెంటులో కనీసం 43 శాతం ఎంపీలపై క్రిమినల్‌ కేసులున్నాయని ఆ నివేదిక వెల్లడించింది. ఇదిలాగే కొనసాగనిస్తే చట్టసభలో సగంమంది ఆ బాపతే ఉండే అవకాశం ఎంతో దూరంలో లేదనిపిస్తుంది. గణాంకాలు చూస్తే ఈ సంగతి అర్ధమవుతుంది.  2004లో ఈ కేటగిరీలో ఉండే ఎంపీల సంఖ్య 24 శాతం కాగా, 2009కి అది 30 శాతంగా, 2014కు 34 శాతంగా పెరుగుతూవచ్చి ఇప్పుడు 43 శాతానికి చేరుకుంది. అంటే నేరచరితులపై ఆధారపడకపోతే గెలవలేమన్న అభద్రతలో రాజకీయ పార్టీలు పడ్డాయనుకోవాలి.

పార్టీలు తాము ఎంపిక చేసే అభ్యర్థులపై క్రిమినల్‌ కేసులు వున్న పక్షంలో అందుకు సంజాయిషీ ఇచ్చుకోవాలన్న తాజా నిర్ణయం కీలకమైంది. ఇప్పటివరకూ తమపై వున్న కేసుల వివరాలను అభ్యర్థులు వెల్లడించాలన్న నిబంధన మాత్రమే వుంది. అభ్యర్థులు ఈ నిబంధనపై కొంత ఇబ్బంది పడుతున్నా పార్టీలకు అది సమస్య అనిపించలేదు. ఇకపై ఆ కేసుల వివరాలను పార్టీలు సైతం వెల్లడించాలి. దాంతోపాటు అభ్యర్థిత్వం కోసం పోటీపడిన ఇతరులను కాదని, వారినే ఎందుకు ఎంపిక చేయాల్సివచ్చిందో చెప్పాలి. పైగా అభ్యర్థుల్ని ఎంపిక  చేసిన 48గంటల్లోగా లేదా నామినేషన్ల దాఖలు ప్రక్రియ మొదలయ్యే తేదీకి కనీసం రెండు వారాల ముందు అభ్యర్థులపై వున్న కేసుల వివరాలన్నీ వెల్లడించాలని సుప్రీంకోర్టు తెలిపింది. ఈ ఆదేశాలను పాటిస్తామని ఎన్నికల సంఘానికి పార్టీలన్నీ లిఖితపూర్వకంగా తెలపాలని కూడా ఆదేశించింది. నిబంధనలు ఉల్లంఘించిన పార్టీలపై కోర్టు ధిక్కార నేరం కింద విచారణ జరుపుతామని కూడా హెచ్చరించింది.  కొత్తగా విధించిన ఈ నిబంధన వల్ల ఎంపిక ప్రక్రియలోనే పార్టీలు జాగ్రత్తలు తీసుకోకతప్పదు. ఇందువల్ల పరిస్థితి ఎంతో కొంత మెరుగుపడుతుంది. పార్టీలన్నీ పారదర్శకంగా వుండేలా చర్యలు తీసుకోవడం, కట్టుదిట్టమైన నిబంధనలు పెట్టడం హర్షించదగిన పరిణామం. అయితే వ్యవస్థలన్నీ సక్రమంగా మెలిగినప్పుడు, వాటన్నిటికీ జవాబుదారీ తనం వున్నప్పుడు మాత్రమే ఇలాంటి నిబంధనలు రాజకీయాల ప్రక్షాళనకు ఉపయోగపడతాయి.

ఉదాహరణకు ఒక మంత్రిగానో, మరో పలుకుబడి కలిగిన పదవిలోనో ఉన్న నాయకుడు తన నియోజకవర్గంలో రాబోయే ఎన్నికల్లో బలమైన ప్రత్యర్థిగా మారే అవకాశం వున్నదని భావించే వ్యక్తిని ఏదో ఒక కేసులో ఇరికించడం ఇప్పుడున్న పరిస్థితుల్లో కష్టం కాదు. పోటీ చేయొచ్చని భావించడం ఒక్కటే కాదు...ఇతరత్రా కారణాల రీత్యా కూడా అనేకమంది అమా యకులను అక్రమ కేసుల్లో ఇరికించడం కనబడుతూనేవుంది. చంద్రబాబు హయాంలో ఆంధ్రప్రదేశ్‌లోని అమరావతి ప్రాంతంలో బలవంతపు భూసేకరణకు వ్యతిరేంగా ఉద్యమించినవారిపై అక్రమ కేసులు బనాయించడం, చిత్రహింసలు పెట్టడం, నిష్కారణంగా జైలుపాలు చేయడం అందరూ చూశారు. పార్టీలు లేదా ప్రజాసంఘాలు ఉద్యమాలకు పిలుపునిచ్చినప్పుడల్లా రకరకాల కేసులు పెట్టడం మన దేశంలో రివాజుగా మారింది. కనుకనే వ్యవస్థలన్నీ చిత్తశుద్ధితో, జవాబుదారీతనంతో పనిచేసేలా చేయడానికి ఎలాంటి చర్యలు అవసరమో పరిశీలించాలి.

తమపై వున్న కేసులు ఎప్పటికీ విచారణకు రాకుండా స్టే తెచ్చుకునేవారున్నట్టే, తాము కేసుల్లో ఇరికించినవారు ఏళ్ల తరబడి మానసికంగా, ఆర్థికంగా కుంగిపోవాలని...చివరకు తమకు దాసోహం కావాలని కోరుకునే పాలకులు కూడా వుంటారు. దురదృష్టమేమంటే అలాంటి పాలకుల చేతుల్లో దర్యాప్తు సంస్థలు ఉపకరణాలుగా మారుతున్నాయి. నిందితులు నిర్దోషులుగా తేలితే, పెట్టిన కేసుల్లో పస లేదని నిర్ధారణ అయితే ఆ కేసులు ఏళ్ల తరబడి నడిపించి ప్రభుత్వ సొమ్మును వృధా చేసిన అధికారులపై చర్య తీసుకునే అవకాశం ఉండాలి. ప్రభుత్వాలను అభిశంసించగలగాలి. అది జరగనప్పుడు కొందరు నిష్కారణంగా ఏళ్ల తరబడి కేసుల్లో చిక్కుకుని చట్టసభలకు పోటీచేసే అవకాశం కోల్పోతారు. రాజకీయాలు నేరమయం కాకుండా నిరోధించడానికి సుప్రీంకోర్టు  ఇచ్చిన తాజా ఉత్తర్వులు తోడ్పడతాయి. అయితే దీనికి సమాంతరంగా ఇతర వ్యవస్థల ప్రక్షాళన కూడా జరిగితేనే అనుకున్న ఫలితాలొస్తాయి. బలమైన ప్రజా ఉద్యమాలు మాత్రమే ఈ దిశగా పాలకుల్ని కదిలించగలవు.

Read latest Editorial News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా