బిల్కిస్‌ ధీర

25 Apr, 2019 00:11 IST|Sakshi

పదిహేడేళ్ల కాలం అనేది ఎవరి జీవితంలోనైనా సుదీర్ఘమైనది. కానీ తనకు జరిగిన అన్యాయాన్ని సరిదిద్దమని, అందుకు కారకులైనవారిని శిక్షించమని కోరిన ఒక మహిళకు మన న్యాయస్థానాల్లో ఊరట లభించడానికి అంత సుదీర్ఘ కాలం పట్టింది. దేశ చరిత్రలో అత్యంత అమానుషమైన అధ్యాయంగా చెప్పదగిన 2002నాటి గుజరాత్‌ మారణకాండకు సంబంధించిన ఒక కేసులో బాధితురాలైన బిల్కిస్‌ బానోకు రూ. 50 లక్షల నష్టపరిహారం చెల్లించాలని, ఉద్యోగం ఇవ్వడంతోపాటు వసతి కూడా కల్పించాలని మంగళవారం సుప్రీంకోర్టు ధర్మాసనం గుజరాత్‌ ప్రభుత్వాన్ని ఆదేశించింది. అడుగడుగునా అవరోధాలెదురైనా ఇంత సుదీర్ఘకాలంపాటు పట్టు వీడకుండా ఎలా పోరాడగలిగారని బిల్కిస్‌ బానోను ఒక పాత్రికేయుడు అడిగితే ఆమె ఇచ్చిన సమాధానం గమనించదగ్గది.

‘మీ కుటుంబం మొత్తం మీ కళ్లముందే తుడిచిపెట్టుకుపోయిన ప్పుడూ... మీ జీవితం సర్వనాశనమైనప్పుడూ న్యాయం కోసం పోరాడకుండా ఎలా ఉండగలరు?’ అన్నది ఆమె జవాబు. నిజమే...బిల్కిస్‌ బానోకు ఎదురైన అనుభవాలు సాధారణమైనవి కాదు. అవి పగవారికి కూడా రావొద్దని ఎవరైనా అనుకుంటారు. 19 ఏళ్ల వయసులో అయిదునెలల గర్భిణిగా ఉన్నప్పుడు దుండగులు ఆమెపై సామూహిక అత్యాచారం చేశారు. ఆమె మూడున్నరేళ్ల కుమార్తెను బండకేసి బాది చంపారు. కుటుంబంలోని మరో నలుగురు మహిళలపై కూడా సామూహిక అత్యాచారాలకు పాల్పడి హత్య చేశారు. ఆడా మగా కలిపి మొత్తం 14మంది ప్రాణాలు తీశారు. బిల్కిస్‌ బానో చనిపోయినట్టు నటించడంతో ఆమెను పొదల్లోకి విసిరి వెళ్లిపోయారు. ఇద్దరు పసివాళ్లతో, ఒంటిపై బట్టలు కూడా సరిగాలేని స్థితిలో ఆమె ఆ కాళరాత్రి గడిపి ఒక ఆదివాసీ మహిళ ఇచ్చిన ఆసరాతో ప్రాణాలు కాపాడుకుంది.  

ఇలాంటి ఉదంతాల గురించి విన్నప్పుడు మనం నాగరిక సమాజంలోనే జీవిస్తున్నామా అన్న సందేహం కలుగుతుంది. ఇంతటి దుర్మార్గం జరిగింది సరే... కనీసం ఆ తర్వాతనైనా కారకులైన ఆ మానవమృగాలను దండించడానికి, ఆ మహిళకు న్యాయం చేయడానికి ఇన్నేళ్ల సమయం పట్టడంలో ఏమైనా అర్ధముందా? దుర్మార్గం జరిగిన మర్నాడు సమీపంలోని పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయడానికి వెళ్లింది మొదలుకొని అడుగడుగునా ఆమెకు అవరోధాలే ఎదురయ్యాయి. ఫిర్యాదును తారుమారు చేయడం, పోస్టుమార్టం నివేదికలను మార్చేయడం, అడుగడుగునా బెదిరింపులకు దిగడం, కొన్నిసార్లు ఆమెను హతమార్చేందుకు ప్రయత్నించడం షరా మామూలుగా సాగాయి. ఒక దశలో ఖననం చేసిన శవాల తలలు మాయమయ్యాయి. బిల్కిస్‌బానోకు నిలకడ లేదని, ఆమె క్షణానికో మాట మాట్లాడుతున్నదని చిత్రించారు. చివరకు తగిన సాక్ష్యాధారాలు లేవని మేజిస్ట్రేట్‌ కోర్టులో కేసు కొట్టేశారు. వెంటాడుతున్న దుండగులను తప్పించుకుంటూ, జాతీయ మానవ హక్కుల సంఘం, సుప్రీంకోర్టు వరకూ అన్నిచోట్లకూ వెళ్లి తన గోడు వినిపిస్తూ, అందుకోసం ఆ కాళరాత్రినాటి చేదు జ్ఞాపకాలను చెదిరిపోకుండా చూసుకుంటూ ఆమె జరిపిన పోరాటం అసాధారణమైనది.

ఎట్టకేలకు అహ్మదాబాద్‌ కోర్టులో విచారణ ప్రారంభమయ్యాక సాక్షులకు ఇక్కడ రక్షణ లేదని ఆమె విన్నవించుకోవడంతో సుప్రీంకోర్టు ఈ కేసును 2004 ఆగస్టులో ముంబైకి బదిలీ చేసింది. ఆ తర్వాత ఆ కేసు తేలడానికి మరో నాలుగేళ్లు పట్టింది. ఆరుగురు పోలీసు అధికారులు, ఇద్దరు ప్రభుత్వ వైద్యులు సహా 19మందిపై అభియోగాలు నమోదు కాగా అందులో 11మందికి యావజ్జీవ శిక్ష పడింది. రెండేళ్లక్రితం ఈ శిక్షలను బొంబాయి హైకోర్టు ధ్రువీకరించింది. అంతేకాదు...కిందికోర్టు నిర్దోషులుగా తేల్చిన మరో 8మందిని సైతం శిక్షించాల్సిందేనని బిల్కిస్‌ బానో చేసిన అప్పీల్‌ను అంగీకరించి వారికి కూడా శిక్ష ఖరారు చేసింది. వీరిలో ఐపీఎస్‌ అధికారి ఆర్‌ఎస్‌ భగోరా, మరో నలుగురు అధికారులు, ఇద్దరు వైద్యులు దాఖలు చేసిన అప్పీళ్లను సుప్రీం కోర్టు తాజాగా తోసిపుచ్చింది. తనకు ప్రకటించిన రూ. 5 లక్షల పరిహారాన్నీ పదిరెట్లు పెంచాలన్న ఆమె వినతిని అంగీకరించింది. భగోరా ఆలిండియా సర్వీస్‌ అధికారి గనుక అతనిపై చర్య తీసుకోవడానికి అనుమతించమని కోరుతూ కేంద్రానికి లేఖ రాయాలని, నాలుగు వారాల్లో చర్య తీసుకుని తమకు వర్తమానం అందించాలని గుజరాత్‌ ప్రభుత్వాన్ని ఆదేశించింది.

ఈ కేసు క్రమాన్ని పరిశీలిస్తే బాధితులకు న్యాయం లభించడానికి మన దేశంలో ఎన్ని అవాంతరాలు ఎదురవుతాయో అర్ధమవుతుంది. ఎప్పటికప్పుడు ఏదో ఒక కారణం చూపిస్తూ, కేసు విచారణ ముందుకు పోకుండా చేయడం ప్రభుత్వాలకు రివాజుగా మారింది. చాలా సందర్భాల్లో న్యాయస్థానాలు సైతం నిస్సహాయ స్థితిలో పడుతున్నాయి. ఏళ్లకు ఏళ్లు కేసులు పెండింగ్‌లో పడుతూ న్యాయస్థానాల సమయం వృధా అవుతోంది. గుజరాత్‌ మారణకాండకు సంబంధించి మరెన్నో కేసులు ఇంకా విచారణ దశలో ఉన్నాయి. ఈ కేసులు మాత్రమే కాదు...ఇందిరాగాంధీ హత్యానంతరం ఢిల్లీలోనూ, ఆ చుట్టుపట్లా జరిగిన సిక్కుల ఊచకోత కేసుల గతీ ఇలాగే ఉంది. కేసుల్లో ఇలా అసాధారణ జాప్యం చోటు చేసుకుంటే, నిందితుల నుంచి అడుగడుగునా బెదిరిం పులు ఎదురవుతుంటే అందరూ బిల్కిస్‌ బానో తరహాలో పోరాడలేరు. ఆమె పేదింటి మహిళ అయినా, ఉండటానికి గూడంటూ లేక భర్తతో కలిసి దాదాపు సంచారజీవనం సాగిస్తున్నా పది హేడేళ్లపాటు దృఢంగా నిలబడింది. గుజరాత్‌లోని వడోదర, అహ్మదాబాద్‌లతోపాటు ఢిల్లీ, లక్నో, ముంబై వంటి సుదూర నగరాలకు సైతం ఆ కుటుంబం వలసపోవాల్సి వచ్చింది. ఈ క్రమంలో ఎన్నో ఇబ్బందులు పడింది. బిల్కిస్‌ బానో కేసు వంటివి అంతర్జాతీయంగా దేశ పరువు ప్రతిష్టల్ని దిగజారుస్తాయి. బాధితులకు న్యాయం దక్కడం అక్కడ అసాధ్యమన్న అభిప్రాయాన్ని కలిగిస్తాయి. సకాలంలో దక్కని న్యాయం అన్యాయంతో సమానమంటారు. కనీసం ఊచకోతల కేసుల విష యంలోనైనా ఇలాంటి అన్యాయాలకు తావీయరాదన్న స్పృహ మన పాలకులకు కలగాలి.

మరిన్ని వార్తలు