జైళ్ల వ్యవస్థ బాగుపడుతుందా?

15 May, 2018 02:01 IST|Sakshi

సంస్కరణాలయాలు కావలసిన కారాగారాలు పశువుల కొట్టాలుగా మారుతున్నాయి. ఖైదీలకూ హక్కులుంటాయని, వారూ మనుషులేనని మన ప్రభుత్వాలు మరిచినట్టున్నాయి. అందుకే అవి కిక్కిరిసిపోతున్నా, అక్కడ కనీస సౌకర్యాలు కూడా లభించక వేలాదిమంది ఇబ్బందులు పడుతున్నా వారికి పట్టడం లేదు. దేశంలో అత్యధిక జైళ్లలో పరిమితికి మించి ఖైదీలున్నారని, కొన్నిచోట్ల ఇది 150 శాతం మించిపోతున్నదని తాజాగా సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. ఇది మానవ హక్కుల ఉల్లంఘన గనుక అన్ని రాష్ట్రాల హైకోర్టులూ దీన్ని తీవ్రంగా తీసుకుని తగిన చర్యలు చేపట్టాలని కోరింది.  నిజానికి  కారాగారాల స్థితిగతులెలా ఉన్నాయో ఎప్పటికప్పుడు చూసుకుంటూ వాటిని సరిచేయాల్సిన బాధ్యత పాలకులదే. కానీ యధాప్రకారం వారు పట్టనట్టు ఉంటున్నారు. జైళ్లకు సంబంధించి ప్రతి రాష్ట్రంలోనూ ప్రత్యేక వ్యవస్థలున్నాయి. లక్షల రూపా యల్లో జీతాలు తీసుకునే ఉన్నతాధికార గణం ఉంది. అయినా కారాగారాలు మాత్రం నరకాలకు నకళ్లుగానే ఉంటున్నాయి.

జైళ్లలో ఉన్నవారంతా నేరస్తులు కాదు. అందులో శిక్ష పడినవారితో పాటు విచారణ ఖైదీలు కూడా ఉంటారు. నిజానికి వీరి సంఖ్యే అత్యధికం. ఆవేశంలో ఘర్షణలకు దిగి కేసుల్లో ముద్దా యిలుగా మారినవారు, అకారణంగా కేసుల్లో ఇరుక్కున్నవారు, కేసు చిన్నదే అయినా బెయిల్‌కు వీలున్నా పూచీకత్తులిచ్చేవారు దొరక్క, స్థోమత లేక మగ్గుతున్నవారు...ఇలా వేర్వేరు తరగతుల వారు అక్కడుంటారు. మావోయిస్టుల ప్రాబల్యం అధికంగా ఉన్న ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్‌ తదితర రాష్ట్రాల్లో ఆదివాసులు వందలమంది తమ నేరం కూడా ఏమిటో తెలియకుండా ఏళ్ల తరబడి జైళ్లలో మగ్గుతున్నారు. 2016 చివరినాటికి దేశంలోని జైళ్లలో 4,33,000మంది ఖైదీలున్నారని గణాంకాలు చెబుతున్నాయి. వీరిలో 2,93,000మంది...అంటే మూడింట రెండొంతుల మంది విచారణలో ఉన్నవారే. విచారణలో ఉన్న ఖైదీల్లో 25 శాతంమంది ఏడాదికన్నా ఎక్కువ కాలం నుంచి జైళ్లలో ఉంటున్నవారు. 17 రాష్ట్రాల్లో వందశాతానికి మించి, ఛత్తీస్‌గఢ్, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్‌ జైళ్లలో 150 శాతం మించి ఖైదీలుంటున్నారు. మధ్యమధ్యలో న్యాయస్థానాలు జోక్యం చేసుకుంటూనే ఉన్నా, సాక్షాత్తూ సుప్రీంకోర్టే తప్పుబట్టినా ఈ పరిస్థితుల్లో కాస్తయినా మార్పు రావడం లేదు.

పరిమితికి మించి ఖైదీలుండటం వల్ల జైళ్లలో అనేక సమస్యలొస్తున్నాయి. ముఖ్యంగా ఖైదీల ఆరోగ్యం, పరిశుభ్రత అటకెక్కుతున్నాయి. వారికి నిబంధనల ప్రకారం ఇవ్వాల్సిన ఆహారం అందడం లేదు. అందువల్ల చాలామంది ఖైదీలు జైళ్లకొచ్చాక రోగాలబారిన పడుతున్నారు. నిజానికి జైళ్ల మౌలిక ఉద్దేశం నేరస్తుల్లో మానసిక పరివర్తన తీసుకురావడం. కారాగారాల్లో ఇందుకు అవ సరమైన చర్యలన్నీ అమలు చేస్తే, వారికి ఆసక్తి ఉన్న రంగాల్లో మంచి శిక్షణ ఇప్పిస్తే శిక్షాకాలం పూర్తయి బయటికొచ్చినవారు సమాజంలో సాధారణ పౌరుల్లా బతకడానికి వీలుంటుందన్నది దీనివెనకున్న అవగాహన. కానీ జైలుకెళ్లినవారు అక్కడి కరడుగట్టిన నేరస్తులతో సావాసం చేసి మరింత రాటుదేలుతున్నారు. శిక్షపడిన నేరగాళ్లు అక్కడి అధికారులను లోబర్చుకుని, బెదిరించి జైళ్లను శాసిస్తున్నారు. అమాయక ఖైదీలు వారి దయాదాక్షిణ్యాలపై బతికే పరిస్థితి ఉంటోంది. కొందరు నేరగాళ్లు అక్కడుంటూ సెల్‌ఫోన్ల ద్వారా బయట ఉన్న తమ సామ్రాజ్యాలను నడిపి స్తున్నారు. బయటికొచ్చాక అంతు చూస్తామంటూ బెదిరిస్తున్నారు. పరిమితికి మించి ఖైదీలుం డటం వల్ల జైళ్ల పర్యవేక్షణ కూడా కష్టమవుతోంది. ఎక్కడే సమస్యలొస్తున్నాయో ఎప్పటికప్పుడు తెలుసుకుని దిద్దుబాటు చర్యలు చేపట్టవలసిన అధికారులు ఏం చేయాలో తోచక చూసీ చూడనట్టు ఊరుకుంటున్నారు. డబ్బు, పలుకుబడి ఉన్న ఖైదీలను మాత్రం ఎలాంటి లోటూ లేకుండా చూసు కుంటున్నారు. జైళ్ల అధికారులు, వార్డర్ల తీరుతెన్నులెలా ఉంటున్నాయో పట్టించుకోకపోవడం, వారికి అవసరమైన పునశ్చరణ తరగతులపై దృష్టి పెట్టకపోవడం వల్ల జైళ్ల వ్యవస్థ బండబారి పోతోంది. రెండేళ్లక్రితం జైళ్ల స్థితిగతులపై వచ్చిన ఫిర్యాదును విచారిస్తున్న సందర్భంగా జైళ్లలో మనుషుల్ని జంతువుల కన్నా హీనంగా చూస్తున్నారని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అప్పటికీ, ఇప్పటికీ పరిస్థితులు కాస్తయినా మారలేదు.

నేరం రుజువై శిక్ష పడినవారికి హక్కులన్నీ హరించుకుపోవు. తాత్కాలికంగా కొన్ని నిలిచి పోతాయి. కానీ ఖైదీల పట్ల అమానుషంగా వ్యవహరించడం అలవాటుగా మారింది. అక్కడ ఏం జరిగినా పట్టించుకునేవారు లేకపోవడమే ఇందుకు కారణం. చాలా అరుదుగా తప్ప జైళ్లలో జరుగు తున్నదేమిటో బయటి ప్రపంచానికి వెల్లడికాదు. దేశంలో 1,300 పైగా జైళ్లున్నాయి. ఖైదీల సంఖ్య అపరిమితంగా పెరుగుతున్నా, వీరి పర్యవేక్షణకు అవసరమైన సిబ్బంది ఉండటం లేదు. రిటైరై వెళ్తున్నవారి స్థానంలో కొత్తవారి నియామకాలు జరగటం లేదు. లెక్క ప్రకారం దేశవ్యాప్తంగా జైళ్లకు 77,230మంది సిబ్బంది ఉండాల్సిరాగా, గత డిసెంబర్‌నాటికి అందులో 30శాతానికిపైగా పోస్టులు ఖాళీ అయ్యాయి. విచారణలో ఉన్న ఖైదీల కేసుల్ని పరిశీలించి, అందులో బెయిల్‌కు అర్హులైనవారిని గుర్తించి విడుదలకు చర్యలు తీసుకుంటే ఈ పరిస్థితి కొంతైనా మారుతుంది. నిజానికి విచారణ ఖైదీల కోసం జిల్లా స్థాయిల్లో సమీక్షా సంఘాలున్నాయి. ఈ సంఘాల్లో జిల్లా న్యాయమూర్తి, కలె క్టర్, ఎస్పీ తదితరులుంటారు. విషాదమేమంటే ఈ సంఘాలిచ్చిన సూచనలు సైతం బేఖాతరవు తున్నాయి. ఇకపై ఇలా జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోబోతున్నామని కేంద్రం సుప్రీం కోర్టుకు తాజాగా హామీ ఇచ్చింది. అందుకవసరమైన ప్రామాణిక వ్యవహార సరళి(ఎస్‌ఓపీ)ని వచ్చే నెల 30కల్లా ఖరారు చేస్తామని చెప్పింది. మంచిదే. జైళ్లు సకల రుగ్మతలకూ నిలయాలుగా, నిస్స హాయుల పాలిట నరకాలుగా ఉండటం మొత్తం దేశానికే అప్రదిష్ట. ఈసారైనా ఇచ్చిన మాట నిలు పుకుని ఈ పరిస్థితిని మార్చే బాధ్యత కేంద్రానిదే.

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

చరిత్ర సృష్టించిన కోహ్లీసేన

లోక్‌పాల్‌ ఎక్కడ?

బ్రిటన్‌కు అగ్ని పరీక్ష!

యూపీలో పొత్తుల పర్వం

‘ఈశాన్యం’లో కొత్త చిచ్చు!

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

మాస్‌ మార్కే కాపాడిందా..?

జీవీతో ఐశ్వర్య

ఇళయదళపతితో మరోసారి..

రజనీ ఈసారెలా కనిపిస్తారో తెలుసా?

నిత్య నూతనం

అబుదాబీ ఫ్లైట్‌ ఎక్కనున్న ‘మహర్షి’ టీమ్‌..!!