‘ప్రార్థించే హక్కు’కు రక్షణ

29 Sep, 2018 00:25 IST|Sakshi

కేరళలోని శబరిమల ఆలయంలో పదేళ్ల నుంచి 50 ఏళ్లలోపు ఆడవాళ్లకు ప్రవేశం లేదంటూ అమల వుతున్న నిబంధన చెల్లదని, అది రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు శుక్రవారం ఇచ్చిన మెజారిటీ తీర్పు చరిత్రాత్మకమైనది. ఈ వారంలో వెలువడిన తీర్పుల పరంపరలో అత్యంత కీలకమైనది. ధర్మాసనంలోని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ దీపక్‌ మిశ్రా, న్యాయమూర్తులు జస్టిస్‌ రోహింటన్‌ నారిమన్, జస్టిస్‌ ఖాన్విల్కర్, జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌లిచ్చిన తీర్పుతో అయిదో న్యాయమూర్తి జస్టిస్‌ ఇందూ బెనర్జీ విభేదించారు. ఏది అవసరమైన మతాచారమో, ఏది కాదో నిర్ణయించుకోవా ల్సింది మతమే తప్ప న్యాయస్థానం కాదని ఆమె అభిప్రాయపడ్డారు. సెక్యులర్‌ దేశంలో ప్రజలు తమ విశ్వాసాలను అవి హేతుబద్ధమైనవైనా, కాకున్నా ఆచరిస్తారని, వాటిని కోర్టులు ప్రశ్నించజాల వని... హేతుబద్ధ భావనను మత వ్యవహారాల్లోకి తీసుకురాకూడదని ఆమె భావించారు.

మన రాజ్యాంగం అందరికీ సమానావకాశాలు దక్కాలంటుంది. ఏ రూపంలోనూ వివక్ష కొనసాగనీయ రాదంటుంది. కానీ నిత్యం మనచుట్టూ అన్నిచోట్లా అది కనబడుతూనే ఉంటుంది. ఏళ్లు గడిచేకొద్దీ పరిణతి చెందాల్సిన, పదునెక్కాల్సిన రాజ్యాంగ నైతికత క్షీణిస్తున్న వైనం అందరి అనుభవంలోకీ వస్తున్నది. ఇతర వివక్షలను గుర్తించటం సులభమే. వాటిని ప్రశ్నించటం కూడా తేలికే. కానీ లింగ వివక్ష బహురూపి. కుటుంబ మర్యాద, కుల కట్టుబాటు, మత విశ్వాసం, ఆచారం, సంప్రదాయం తదితర అంశాల మాటున అది అమలవుతుంటుంది. వీటిలో అత్యధికం పురుషుల కంటే మహిళ లనే నియంత్రిస్తుంటాయి. రుతుస్రావం అయ్యే వయసులోని మహిళలకు శబరిమలలోని అయ్యప్ప దేవాలయంలో ప్రవేశాన్ని శతాబ్దాలుగా నిరాకరిస్తున్నారు. ఇది హిందూమతంలోని వైవిధ్యమే తప్ప వివక్ష కాదని ఆలయ ట్రస్టు వాదిస్తోంది. అయ్యప్పస్వామి నైష్టిక బ్రహ్మచారి గనుక ఈ నిబంధన అమలవు తున్నదని చెప్పింది. కానీ ధర్మాసనం ఈ వాదనను అంగీకరించలేదు. మహిళల ఆలయప్రవేశాన్ని అడ్డుకోవటం రాజ్యాంగ విరుద్ధమని తేల్చింది. శరీర ధర్మాల ఆధారంగా మహిళల హక్కును నిరా కరించటం కుదరదని తెలిపింది.

హిందూ సంప్రదాయాలకూ, ఆచార వ్యవహారాలకూ పునాదిగా భావించే వేదాలను మహిళలు కూడా అధ్యయనం చేసేవారని చెప్పడానికి అనేక ఉదాహరణలు న్నాయి. గర్గి, అదితి, ఇంద్రాణి, మైత్రేయి, లోపాముద్ర వంటి మహిళలు వేద విదుషీమణులుగా ఖ్యాతి గడించారు. ఆ కాలంలో స్త్రీలకు ఉపనయనం చేసే ఆచారం కూడా ఉండేదని చెబుతారు. అది ఎప్పుడు మారిందో, ఎందుకు మారిందో ఎవరికీ తెలియదు. ఏ సమాజంపైన అయినా మత విశ్వా సాలు, ఆచారాల ప్రభావం ప్రగాఢంగా ఉంటుంది. ఆ విశ్వాసాలు, ఆచారాలు అనూచానంగా అమ లవుతున్నాయన్న అభిప్రాయం ఉండటం దానికొక కారణం. వేద విద్యకు, ఉపనయనానికి మహి ళలు ఎప్పటినుంచి దూరంగా ఉన్నారన్నది జవాబులేని ప్రశ్న. కాలక్రమంలో ఎవరి ప్రమేయంతోనో లేదా మరే ప్రభావంతోనో వాటికి మార్పులు, చేర్పులు జరుగుతుంటాయి. ఆ మార్పులు కొన్నాళ్లకు ఆచారాలుగా స్థిరపడిపోతాయి. వివాదాస్పదం కాని ఆచారాల గురించి ఎవరూ ప్రశ్నించరు. కానీ వివక్షకు తావిచ్చే ఆచారాలు ఇప్పుడు కాకపోతే రేపైనా సందేహాన్ని రేకెత్తిస్తాయి. ఆ సందేహం కాలక్రమేణా చిక్కబడి ప్రశ్నించటానికి దోహదపడుతుంది.  

అయ్యప్ప ఆలయంలో తమకు ప్రార్ధన చేసే అవకాశం కల్పించాలని కోరుతున్నది ఆ స్వామి పట్ల భక్తి విశ్వాసాలున్న మహిళలే. శబరిమల ఆలయానికి ఒక విశిష్టత ఉంది. ఏటా అక్కడికి లక్షలాదిమంది భక్త జనం వెళ్తుంటారు. దానికి ముందు 41 రోజులపాటు కఠోర నియమాలతో కూడిన వ్రతాన్ని ఆచరిస్తారు. అయితే ఒక్క శబరిమలలో తప్ప దేశంలోని మరే ఇతర అయ్యప్ప దేవాలయాల్లోనూ మహిళల ప్రవేశంపై నిషేధం లేదు. దేశంలో 20 లక్షలకు పైగా ఆలయాలుంటే వాటిల్లో కొన్నిచోట్ల మాత్రమే ఈ మాదిరి విధి నిషేధాలు అమలవుతున్నాయి. రుతుక్రమం పేరు చెప్పి మహిళలకు ఆలయ ప్రవేశాన్ని నిరాకరించే దేవాలయాలు అరడజను వరకూ ఉన్నాయి. పురుషులను దూరంగా ఉంచే ఆలయాలు మరికొన్ని ఉన్నాయి. ఇప్పుడు శబరిమల ఆలయంలోకి మహిళలను అనుమతించకపోవటాన్ని సమర్ధిస్తున్నవారు ఈ ఉదాహరణలే ఇస్తున్నారు. ఒకచోట అమలవుతున్న ఆచారాన్ని సమర్ధించటానికి మరోచోట అదే రీతిలో ఉండటాన్ని ఎత్తిచూపటం జవాబు కాబోదు. ఒకప్పుడు వేద పఠనానికి, ఆలయ పూజారిగా ఉండటానికి బ్రాహ్మణులు మాత్రమే అర్హులన్న అభిప్రాయం ఉండేది.

ఇప్పుడు దళితులు, ఇతర కులాలకు చెందినవారు కూడా వేదాధ్యయనం చేస్తున్నారు. వారిని పూజారులుగా నియమిస్తున్నారు. పదేళ్లక్రితం తిరుమల తిరుపతి దేవస్థానం ఈ నిర్ణయం తీసుకుంది. వివక్షకు తావిచ్చే ఆచారాలను, సంప్రదాయాలను సంస్కరించుకోవటం అంతిమంగా మత విస్తరణకు దోహదపడుతుందే తప్ప దానికి హాని కలి గించదు. సముద్రాలను దాటడం మహా పాపమన్న విశ్వాసం హిందువుల్లో బలంగా ఉండేది. కాల క్రమేణా దానికి ప్రాయశ్చిత్తం కూడా రూపొందింది. ఇప్పుడు ఆ నియమానికి కాలం చెల్లింది. ఎని మిదేళ్లక్రితం మహారాష్ట్రలో ఏర్పడిన భూమాత రణరంగిని బ్రిగేడ్‌(బీఆర్‌బీ) ఆ రాష్ట్రంలోని శనిసింగ నాపూర్‌లో ఉన్న శనీశ్వరాలయం ప్రధాన వేదికపైకి మహిళలను అనుమతించకూడదన్న శతాబ్దాల నాటి ఆచారానికి వ్యతిరేకంగా పోరాడింది. చివరకు బొంబాయి హైకోర్టు జోక్యం చేసుకుని రాష్ట్ర ప్రభుత్వాన్ని మందలించాక శనీశ్వరాలయం ట్రస్టు ఆ ఆచారాన్ని రద్దు చేస్తున్నట్టు రెండేళ్లక్రితం ప్రక టించింది. ఈ ప్రపంచం, అందులోని సమస్త జీవరాశులు భగవంతుని సృష్టేనని నమ్ముతున్నవారు వివక్షను, వ్యత్యాసాలను దరిచేరనీయకూడదు. అవి రాజ్యాంగవిరుద్ధమని, సమానత్వ భావనను దెబ్బతీస్తున్నాయని తెలుసుకున్నప్పుడు అసలే పాటించకూడదు. సుప్రీంకోర్టు ఇచ్చిన మెజారిటీ తీర్పు ఈ విజ్ఞతను, వివేకాన్ని అందరిలో కలిగించాలి.

మరిన్ని వార్తలు