‘తటస్థత’కు తూట్లు

20 Jul, 2015 01:08 IST|Sakshi

 ఇంటర్నెట్ తటస్థత విషయంలో మన దేశం నిర్దిష్టంగా, ఖచ్చితంగా వ్యవహరించ కపోవచ్చునని కొందరు వ్యక్తం చేసిన అభిప్రాయాలే నిజమయ్యేలా ఉన్నాయి. టెలికాం విభాగం నియమించిన నిపుణుల నివేదికను పరిశీలిస్తే ఈ సంగతి అర్థమవుతుంది. నిపుణుల కమిటీ నివేదికను ఇంకా టెలికాం రెగ్యులేటరీ అథారిటీ (ట్రాయ్) పరిశీలించి కేంద్రానికి సిఫార్సులు చేయాల్సి ఉంది. దానిపై చివరకు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్న విషయాన్ని పక్కనబెడితే కమిటీ సిఫార్సు ల్లోని హేతుబద్ధతను ఒకసారి చూడాల్సి ఉంది. ఇంటర్నెట్ తటస్థతను సమర్థిం చినట్టు కనబడుతూనే కమిటీ దానికి విరుద్ధమైన ప్రతిపాదనలు చేసింది. కమిటీ  చేసిన కొన్ని సూచనలను గమనిస్తే ఆ అనుకూలతలో దాగున్న ప్రమాదకర ధోరణు లు కనిపిస్తాయి.

ఇప్పుడు అమల్లో ఉన్న విధానం పారదర్శకమైనది. వినియో గదారులకు పూర్తి స్వేచ్ఛనిచ్చేది. టెలికాం సంస్థలకు నిర్దిష్టమైన రుసుం చెల్లించి ఇంటర్నెట్ కనెక్షన్ తీసుకునే వినియోగదారులే అందులో ఏ వెబ్‌సైట్ చూడాలో నిర్ణయించుకుంటారు. ఆయా వెబ్‌సైట్లు సమకూర్చే డేటాను అవి విధించే నిబంధ నలకు లోబడి డౌన్‌లోడ్ చేసుకుంటారు. ఇప్పుడు అనుసరిస్తున్న ఈ విధానంలో ఎయిర్‌టెల్‌లాంటి కొన్ని టెలికాం సంస్థలు మార్పులు ప్రవేశపెట్టేందుకు ప్రయత్ని స్తున్నాయి. ఆయా వెబ్‌సైట్లు వినియోగించుకునే బ్యాండ్ విడ్త్ ఆధారంగా వాటి నుంచి చార్జీలు వసూలు చేయాలని ప్రతిపాదిస్తున్నాయి.
 
 ఉదాహరణకు యూ ట్యూబ్, నెట్‌ఫ్లిక్స్ వంటి వెబ్‌సైట్లు ఎక్కువ బ్యాండ్‌విడ్త్‌ను ఉపయోగించుకుం టాయి గనుక వాటినుంచి అధిక చార్జీలను వసూలు చేస్తారు. అంతిమంగా ఆ చార్జీల భారాన్ని ఆయా సంస్థలు వినియోగదారులపైనే మోపుతాయి. ఫలితంగా అప్పటికే ఇంటర్నెట్ కోసం డబ్బు చె ల్లించే వినియోగదారులు అదనంగా ఆయా వెబ్‌సైట్లు డిమాండ్‌చేసే అదనపు మొత్తాన్ని సమర్పించుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ టెలికాం సంస్థల విధానాన్ని వెబ్‌సైట్లు వ్యతిరేకిస్తే అవి వినియోగదారులకు అందుబాటులోకి రాకుండాపోతాయి. అలా చూసినా చివరకు నష్టపోయేది ఇంటర్నెట్ వినియోగదారులే.
 
 ఇంటర్నెట్‌లో ప్రవహించే సమాచారాన్ని ఇలా అంతరాల దొంతరలో చిక్కుకు నేలా చేయడం...ఎలాంటి సమాచారమైనా క్షణాల్లో అందుబాటులోకొచ్చే ప్రస్తుత విధానం స్థానంలో డబ్బు నిర్ణయాత్మక శక్తిగా మారడం ఆందోళన కలిగించే అంశం. ఏ డేటా తమకు ముఖ్యమైనదో నిర్ణయించుకునే స్వేచ్ఛ వినియోగదారులకు ఉండే ప్రస్తుత విధానానికి బదులు ఎవరు డబ్బు ఎక్కువిచ్చారో వారికి సంబంధించిన డేటాయే పెనువేగంతో వినియోగదారులకు చేరుతుంది. వారు అవసరమనుకునే సమాచారం మాత్రం సుదీర్ఘ సమయం వేచిచూసినా అందుబాటులోకి రాదు. ఈ విషయంలో ఫేస్‌బుక్ అనుసరించిన విధానాన్ని నిశితంగా విమర్శించిన కమిటీ... అదే ఫలితాన్నిచ్చే జీరో రేటింగ్ పద్ధతిని మాత్రం అంగీకరించింది.
 
 ఎయిర్‌టెల్ రూపొందించిన ఈ పద్ధతి ప్రకారం కొన్ని వెబ్‌సైట్లు ఉచితంగా అందుబాటులో కొస్తాయి. ఈ ప్లాట్‌ఫాంలో భాగం కాదల్చుకున్న వెబ్‌సైట్‌లు అందుకు కొంత మొత్తాన్ని ఎయిర్‌టెల్‌కు చెల్లించాల్సి ఉంటుంది. ఇందులో తప్పేం లేదన్న అభిప్రా యంలో కమిటీ ఉంది. వాస్తవానికి ఫేస్‌బుక్, ఎయిర్‌టెల్ అనుసరించే విధానాలు వేరు తప్ప ఫలితం ఒకటేనని ఎవరికైనా అర్థమవుతుంది. ఫోన్ టారిఫ్‌లను నిర్ణ యించే ప్రస్తుత విధానం తరహాలోనే జీరో రేటింగ్‌కు సంబంధించికూడా అందులో ఏ వెబ్‌సైట్‌కు చోటిస్తున్నారు...దాన్నుంచి ఎంత వసూలు చేస్తున్నారనేది ట్రాయ్ సమీక్షించాలని, ఇంటర్నెట్ తటస్థతకు దెబ్బతగిలే అవకాశం ఉన్న కేసుల్లో అనుమ తిని నిరాకరించే విధానాన్ని అనుసరిస్తే సరిపోతుందని కమిటీ అభిప్రాయపడింది. ఆచరణలో ఇది తటస్థతను దెబ్బతీస్తుంది. వివక్షకు బాటలు పరుస్తుంది. ఇప్పు డున్న విధానంలో దండిగా డబ్బును వెదజల్లే పెద్ద సంస్థకూ, అంతంతమాత్రం పెట్టుబడితో వచ్చిన వ్యక్తికి సమానావకాశాలున్నాయి. సంస్థ స్థోమతనుబట్టి కాక...ఎవరి అప్లికేషన్‌వల్ల అధిక ప్రయోజనమో, దేనిలో సృజనాత్మకత ఎక్కువగా ఉందో వినియోగదారులు నిర్ణయించుకుంటారు. ఆ అప్లికేషన్‌ను అందించే సంస్థ వైపు మొగ్గుచూపుతారు. జీరో రేటింగ్ ప్లాట్‌ఫాంలు ఈ సమానతను దెబ్బ తీస్తాయి. వినియోగదారుల ఎంపికకు పరిమితులు విధిస్తాయి.
 
 అన్నిటికీ మించి వాట్సప్, స్కైప్, వైబర్‌వంటి ఇంటర్నెట్ ఆధారిత అప్లికేషన్ల విషయంలో నిపుణుల అభిప్రాయాలు వింతగా ఉన్నాయి. ఈ అప్లికేషన్ల ఆధారంగా విదేశాలకు పంపే డేటా విషయంలోగానీ, ఫోన్ కాల్స్ విషయంలోగానీ అభ్యం తరం లేదన్న కమిటీ...దేశీయంగా మాత్రం నియంత్రణలు విధించడం అవసరమని సూచించింది. ఒకే విధానాన్ని విదేశాలకు సంబంధించి ఒకవిధంగా, దేశీయంగా వినియోగిస్తే మరో విధంగా పరిగణించడం అన్యాయం, వివక్షాపూరితమవుతుం దని వేరే చెప్పనవసరం లేదు. ఈ అప్లికేషన్‌లు వాడుకలోకొచ్చాక ఫోన్ కాల్స్ వినియోగం తగ్గిన మాట వాస్తవమే.
 
 ప్రస్తుతం ఫొటోలు, వీడియోలు వేగంగా చేరే యడానికి ఉపయోగపడుతున్న వాట్సప్ ద్వారా త్వరలో సంభాషించుకునే వీలు కూడా కలుగుతుందని చెబుతున్నారు. అది అందుబాటులోకొస్తే టెలికాం సంస్థలకు నష్టం వస్తుందన్న ఉద్దేశంతోనే కమిటీ ఈ మాదిరి సిఫార్సు చేసిందంటున్నారు. టెలికాం సంస్థలకు లబ్ధి చేకూర్చాలన్న సంకల్పంతో ఒక విధానాన్ని నిరుత్సా హపర్చడం, దానికి ఖరీదుకట్టి అందుబాటులోకి రాకుండా చేయడం అన్యాయం అనిపించుకుంటుంది. టెలికాం సంస్థలు నిలదొక్కుకోవాలంటే తమ సేవలను మరింత మెరుగుపర్చుకోవడం, అనుబంధ సేవలను అందించడం వగైరా మార్గాలను అనుసరించాలి తప్ప ప్రపంచమంతటా అందుబాటులోకొచ్చిన విధానం ఇక్కడ ఎవరికీ దక్కకుండా చేయాలనుకోవడం సరికాదు.
 
 ఇంటర్నెట్ తటస్థతపై నాలుగు నెలలనుంచి నెటిజన్లలో ఆందోళన నెలకొంది. కేంద్ర ప్రభుత్వం సైతం ఇంటర్నెట్ తటస్థత విషయంలో రెండో మాటకు తావులేద నే చెప్పింది.  ఇప్పుడు నిపుణుల కమిటీ ఇంటర్నెట్ తటస్థతను నిర్ద్వంద్వంగా సమ ర్థిస్తున్నామని అంటూనే దాన్ని దెబ్బతీసే సిఫార్సులు చేసింది. ఈ నివేదిక విషయం లో ట్రాయ్ సక్రమంగా వ్యవహరించి కేంద్రానికి సహేతుకమైన సూచనలు అందిం చాలి. ట్రాయ్ ఏం చెప్పినా ప్రజాస్వామిక విధానాలకు అనుగుణంగా కేంద్రం తుది నిర్ణయం తీసుకోవాలి. ఇంటర్నెట్ తటస్థతకు విఘాతం కలగకుండా చూడాలి.

మరిన్ని వార్తలు