కశ్మీర్‌లో మళ్లీ పాత కథ!

18 Apr, 2015 00:40 IST|Sakshi

మళ్లీ కశ్మీర్ ఉద్రిక్తతల్లోకి జారుకుంటున్నది. ఈ వారం మొదట్లో శ్రీనగర్‌కు సమీపంలోని త్రాల్‌లో ఖలీద్ అనే యువకుడు ఎన్‌కౌంటర్‌లో మరణించాక మళ్లీ నిరసనల పర్వం ప్రారంభం కాగా, వేర్పాటువాద నాయకులు సయ్యద్ అలీషా గిలానీ, మసరత్ ఆలంలు బుధవారం నిర్వహించిన ర్యాలీలో పాకిస్థాన్ అనుకూల నినాదాలు వినబడ్డాయి. ఆ దేశ జెండాలను ప్రదర్శించారు. అటు పాకిస్థాన్‌లో దీన్ని సాకుగా తీసుకుని ఉగ్రవాది హఫీజ్ సయీద్ రెచ్చిపోయాడు. కశ్మీర్ ప్రజలకు అండగా ఉంటామని బహిరంగ సభలో ప్రకటించాడు. కశ్మీర్ లోయలో సాగుతున్న నిరసనల్లో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. మొత్తానికి కశ్మీర్‌లో మళ్లీ పాత కథే ప్రారంభమైనట్టు కనబడుతోంది. గిలానీ చాన్నాళ్లనుంచి ఢిల్లీలో ఉంటున్నారు. ఆయన శ్రీనగర్ విమానాశ్రయంలో దిగగానే అరెస్టుచేసి మళ్లీ ఢిల్లీ వెళ్లే విమానం ఎక్కించడం రివాజుగా సాగుతున్నది. ఈసారి మాత్రం ఆయన శ్రీనగర్‌లో దిగడమే కాదు... తమ సంస్థ ప్రధాన కార్యాలయం వరకూ ర్యాలీగా వెళ్లారు. రాష్ట్రంలో ముఫ్తీ మహమ్మద్ సయీద్ నేతృత్వంలో పీడీపీ-బీజేపీ కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక జరిగిన రెండో పరిణామమిది.

ఆయన ప్రభుత్వం ఏర్పడిన కొన్ని రోజులకే సుదీర్ఘ నిర్బంధం నుంచి ఆలం విడుదలయ్యారు.  వేర్పాటువాదుల విషయంలో బీజేపీకి ఎలాంటి అభిప్రాయాలున్నా ముఫ్తీ వైఖరి మాత్రం వేరే ఉంది. ఆలం విడుదలపై బీజేపీ వైపునుంచి ఎంత గట్టిగా అభ్యంతరాలొచ్చినా ముఫ్తీ తట్టుకోగలిగారు. రాష్ట్రంలో ప్రజాస్వామిక వాతావరణం ఏర్పడితే ఉద్రిక్తతలు తగ్గుతాయని, అందుకు తనకొక అవకాశమివ్వాలని ఆయన బీజేపీ నాయకత్వాన్ని కోరినట్టు కథనాలు వెలువడ్డాయి. ఈలోగానే వివాదాస్పద ర్యాలీ ఆయనకు తల నొప్పిగా మారింది. అన్నివైపులనుంచీ విమర్శలు వెల్లువెత్తడంతో ర్యాలీ నిర్వాహ కులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన ప్రకటించారు. నిజానికి ర్యాలీలో అవాంఛనీయ ఘటనలకు ఆస్కారం కల్పించి మసరత్, గిలానీలు తమకు తామే నష్టం చేకూర్చుకున్నారు. ఉదారవాద వైఖరితో ఉన్న ముఫ్తీకి ఇబ్బంది కలిగించి సాధారణ స్థితి ఏర్పడటానికి ఆయన చేస్తున్న కృషిపై చన్నీళ్లు జల్లినట్టయింది.
 భిన్న ధ్రువాలుగా ఉన్న రెండు పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయడం మామూలు పరిస్థితుల్లోనే కష్టం. అందులోనూ కశ్మీర్‌లో అలాంటి ప్రయత్నం చేయడమంటే కత్తి మీద సాము.  కశ్మీర్ సమస్యపై బీజేపీ అభిప్రాయాలూ, పీడీపీ అభిప్రాయాలూ పరస్పర విరుద్ధమైనవి. రెండూ ఎక్కడా కలిసే అవకాశం లేదు. ముఫ్తీకి ‘మెతక వేర్పాటువాది’ అనే పేరు ఉండనే ఉంది. అందువల్ల ఇలాంటి సమస్యలు తలెత్తడం ఊహించనిదేమీ కాదు.

అయితే, పాక్ సరిహద్దుల్లో ఉన్న రాష్ట్రంగా కశ్మీర్ విషయంలో అన్ని పక్షాలూ ఆచి తూచి అడుగేయాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్‌తోసహా ఎవరూ దీన్ని పరిగణనలోకి తీసుకుంటున్న దాఖలాలు లేవు. పాక్ అనుకూల నినాదాలు వినబడటం, ఆ దేశ జెండాలను ప్రదర్శించడాన్ని ఎవరూ సమర్థించలేరు. ఆ పని చేసినవారిపై చర్య తీసుకోవాల్సిందే. ఇప్పటికే పోలీసులు ఈ విషయంలో ఎఫ్‌ఐఆర్ నమోదుచేశారు. అయితే కశ్మీర్ లోయలో ఇలాంటి పోకడలు కనబడటం ఇది మొదటిసారేమీ కాదు. 1977 ఎన్నికల్లో కాంగ్రెస్-నేషనల్ కాన్ఫరెన్స్ కూటమి సర్కారు కుప్పకూలాక జరిగిన ఎన్నికల్లో జనతాపార్టీ వేర్పాటువాద అనుకూల అవామీ యాక్షన్ కమిటీతో పొత్తు కుదర్చుకుని పోటీ చేసినప్పుడు ఆ పార్టీ పక్షాన ఆనాటి ప్రధాని మొరార్జీ దేశాయ్, నాటి కేంద్ర మంత్రులు చరణ్‌సింగ్, వాజపేయి ప్రచారానికి వెళ్లినప్పుడు వారి సభల్లో పాక్ అనుకూల నినాదాలు హోరెత్తాయి. కశ్మీర్ సమస్య విషయంలో పోరాడే పక్షాలు చాలా ఉన్నాయి. కశ్మీర్ భారత్‌లో అంతర్భాగంగా ఉండాలని కోరుకునే వారు కొందరైతే... అది స్వతంత్రంగా మనుగడ సాగించాలని విశ్వసించేవారు మరికొందరు. వీరిద్దరూ కాకుండా పాకిస్థాన్‌లో కలవాలని కోరుకునే శక్తులు కొన్ని ఉన్నాయి. వీరికి చెప్పుకోదగినంత బలం లేదు. ఆ సంగతి గత పదేళ్లుగా కశ్మీర్‌లో జరుగుతున్న ఎన్నికలే రుజువు చేస్తున్నాయి.

పాక్ అనుకూల జెండాలు ప్రదర్శించడం, ఆ దేశానికి అనుకూలంగా నినాదాలు చేయడం కేవలం సంచలనం కోసం మాత్రమే. ఇవేవీ పరిగణనలోకి తీసుకోకుండా ‘1990 తర్వాత దేశ సార్వభౌమత్వానికి ఏర్పడ్డ అతి పెద్ద సవాల’ని కాంగ్రెస్ అధికార ప్రతినిధి మనీష్ తివారీ మాట్లాడుతున్నారు. కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని యూపీఏ సర్కారు పాలించినప్పుడు సైతం ఇలాంటివి అడపా దడపా చోటుచేసుకున్నాయని ఆయన మరిచిపోతున్నారు.  

కశ్మీర్ సమస్యపై అందరికీ ఆమోదయోగ్యమైన పరిష్కారం కనుక్కొనాలని, అందుకు హుర్రియత్‌తోసహా అన్ని పక్షాలతో చర్చించాలని పీడీపీ-బీజేపీ కూటమి కనీస ఉమ్మడి కార్యక్రమం చెబుతున్నది. అందుకు సంబంధించి చేస్తున్న ప్రయత్నాలకు... ఇటు వేర్పాటువాద నేతలు నిర్వహించే ర్యాలీలు, అటు సైన్యం అతిగా వ్యవహరించడం విఘాతం కలిగిస్తాయి. 1990 తర్వాత లోయలో అవాంఛనీయ పరిణామాలు చోటుచేసుకోవడానికి కారణం అప్పట్లో విచక్షణా రహితంగా జరిగిన కాల్పులు, లాకప్‌డెత్‌లు వగైరాలే కారణమని మరువకూడదు. 2010లో జరిగిన మాఛిల్ ఎన్‌కౌంటర్ తర్వాత కూడా కశ్మీర్‌లో ఉద్రిక్తతలు ఏర్పడ్డాయి. ఈమధ్యే ఆ కేసులో ఇద్దరు అధికార్లతోసహా ఏడుగురు జవాన్లకు ఆర్మీ కోర్టు యావజ్జీవ శిక్ష విధించింది. ఇంతలోనే త్రాల్‌లో ఎన్‌కౌంటర్ ఘటన చోటు చేసుకుంది. చట్టబద్ధ పాలనకు విఘాతం కలిగేలా వ్యవహరిస్తే ఎంతటివారికైనా శిక్షలు తప్పవని సాధారణ పౌరుల్లో నమ్మకం ఏర్పడితే అది సామరస్యపూర్వక వాతావరణానికి ఎంతగానో దోహదపడుతుంది. త్రాల్ ఉదంతంలో లోతైన దర్యాప్తు జరిపించి బాధ్యులపై సాధ్యమైనంత త్వరగా చర్యలు తీసుకుంటే మళ్లీ సాధారణ పరిస్థితులు ఏర్పడతాయి.
 

>
మరిన్ని వార్తలు