నేపాల్‌ కన్నెర్ర

20 May, 2020 23:46 IST|Sakshi

మన దేశానికి సంబంధించినంతవరకూ ఇది సరిహద్దు వివాదాల సీజన్‌లా కనబడుతోంది. ఈనెల 5న సిక్కింలోవున్న నుకా లా ప్రాంతంలో భారత–చైనా సరిహద్దుల వద్ద గస్తీలో వున్న మన సైని కులతో చైనా సైనికులు ఘర్షణ పడ్డారు. అందులో భారత జవాన్లు నలుగురు, చైనా సైనికులు ఏడుగురు గాయపడ్డారు. చివరకు ఇరుపక్షాల సైనికాధికారులు చర్చించుకోవడంతో వివాదం సమసిపోయింది. తాజాగా ఇప్పుడు నేపాల్‌ పేచీ మొదలుపెట్టింది. లిపులేఖ్, కాలాపానీ, లింపియాధుర ప్రాంతాలు తన భూభాగంలోనివేనంటూ అది కొత్త మ్యాప్‌ను విడుదల చేసింది.

అంతేకాదు... ఆ దేశ ప్రధాని కేపీ శర్మ ఓలి బుధవారం కటువైన వ్యాఖ్యలు కూడా చేశారు. భారత్‌ రాజముద్రలో వుండే మూడు సింహాల ముందు ‘సత్యమేవ జయతే’ అని వుంటుందని, ఆ దేశం దానికి కట్టుబడి వుంటుందో, సింహమేవ జయతే అనుకుంటుందో చూడాలని ఆయన వ్యంగ్యంగా అన్నారు. కరోనా వైరస్‌ను గుర్తుకు తెచ్చేలా ‘చైనా వైరస్‌ కంటే, ఇటలీ వైరస్‌ కంటే ఇండియా వైరస్‌ ప్రమాదకరమైనదంటూ పరుషంగా మాట్లాడారు. ఈ పేచీ వెనక ‘ఎవరో’ వున్నారంటూ మన సైనిక దళాల ప్రధానాధికారి జనరల్‌ ఎంఎం నరవానె మొన్న శుక్రవారం చేసిన ప్రకటన నేపాల్‌కు తగ లవలసిన చోటే తగిలింది. త

మను పరోక్షంగా చైనా కీలుబొమ్మగా అభివర్ణించడం అది తట్టు కోలేకపోయింది. అందుకే గతంలో ఎన్నడూ లేనివిధంగా మన దేశాన్ని ఈ స్థాయిలో విమర్శించ డానికి పూనుకొంది. సరిహద్దు వివాదాన్ని చర్చల ద్వారా పరిష్కరించుకోవడానికి ప్రయత్నిస్తున్నా మని నేపాల్‌ విదేశాంగమంత్రి ప్రదీప్‌ కుమార్‌ గ్యావలి అనడం, ఆ తర్వాత లిపులేఖ్, కాలాపానీ, లింపియాధుర ప్రాంతాలను వెనక్కివ్వాలంటూ పార్లమెంటులో అధికార పక్షం తీర్మానం ప్రవేశ పెట్టడం గమనిస్తే అది లోగడ కంటే దూకుడు పెంచిందని సులభంగానే తెలుస్తుంది.

ముఖ్యంగా ఈనెల 11న రక్షణమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ ఉత్తరాఖండ్‌ మీదుగా లిపులేఖ్‌ వరకూ మానస సరోవర్‌ యాత్రకెళ్లేవారి సౌకర్యార్థం నిర్మించిన రహదారిని ప్రారంభించాక నేపాల్‌లో అసహనం కట్టలు తెంచుకుంది. లిపులేఖ్‌ సమీపంలోనే చైనా సరిహద్దు కూడా వుంటుంది. కనుక కొత్తగా నిర్మించిన ఈ రహదారి వ్యూహాత్మకంగా కూడా మన దేశానికి కీలకమైనది. అందుకే నేపాల్‌ పేచీ వెనక ‘ఎవరో’ వున్నారని జనరల్‌ నరవానె అన్నారు. ఈ రహదారి వల్ల నేపాల్‌కొచ్చే ఇబ్బంది మాటెలావున్నా యుద్ధ సమయాల్లో మన సైన్యాన్ని సులభంగా తరలించడానికి ఉపయోగపడుతుంది గనుక చైనాకు మాత్రం సమస్యాత్మకమే.

భారత్‌–నేపాల్‌ సరిహద్దు వివాదానికి 200 ఏళ్ల చరిత్ర వుంది. రెండు దేశాల మధ్యా 1816 మార్చి 4న సరిహద్దులకు సంబంధించి తొలిసారి సుగౌలీ ఒప్పందం కుదిరింది. అప్పటి బ్రిటిష్‌ పాలకులు భారత్‌ తరఫున సంతకాలు చేశారు. ఆ ప్రాంతంలో పారుతున్న మెచ్చి, మహాకాళి, నారాయణి నదీ తీరాలను గీటురాళ్లుగా తీసుకుని సరిహద్దుల్ని నిర్ణయించడం పెద్ద సమస్యగా మారింది. ఆ నదుల గమనం ఈ రెండు శతాబ్దాల్లో అనేకసార్లు మారడం వల్ల ఎవరు ఎవరి భూభాగంలోకి చొచ్చుకొచ్చారన్న విషయంలో అయోమయం ఏర్పడింది.

ఇది చాలదన్నట్టు రెండు దేశాల వద్దా అప్పటి మ్యాప్‌లు కూడా లేవు. మన పారా మిలిటరీ దళమైన సశస్త్ర సీమాబల్‌ జవాన్లు అక్కడి సరిహద్దుల్ని పహారా కాస్తారు. నేపాల్‌ వైపు నుంచి మొదటినుంచీ అలాంటి పహారా లేదు. దీన్ని ఉపయోగించుకుని భారత్‌ తమ 60,000 హెక్టార్ల భూమిని ఆక్రమించిందన్నది నేపాల్‌ ఆరోపణ. ఈ విషయంలో నేపాల్‌ జాతీయవాదులు చాన్నాళ్లుగా ఆందోళన చేస్తున్నారు. అయితే రెండు దేశాల ప్రభుత్వాల మధ్యా ఎప్పుడూ సత్సంబంధాలే వుండేవి గనుక ఇరు పక్షాలూ ఈ సమస్యపై బాహాబాహీకి దిగలేదు.

అయితే సరిహద్దుల్ని ఖరారు చేయడానికి ఉమ్మడిగా సాంకేతిక కమిటీని ఏర్పాటు చేసుకోవాలని రెండు దేశాలూ నిర్ణయించుకున్నాయి. దశాబ్దాలు గడుస్తున్నా అదింకా ఎటూ తేలకుండానే వుంది.  నేపాల్‌లో భారత్‌పై అంతకుముందునుంచీ వున్న అసంతృప్తి 2006లో అక్కడ హిందూ రాజరిక పాలన అంతమైనప్పటినుంచీ బలపడుతూ వచ్చింది. తమకు భారత్‌ సమాన స్థాయి ఇచ్చి గౌరవించడం లేదని నేపాల్‌ జాతీయవాదుల అభిప్రాయం. వాటిని పోగొట్టడానికి మనవైపుగా ఎప్పుడూ సరైన ప్రయత్నాలు జరగలేదనే చెప్పాలి. 

మనకు అత్యంత సన్నిహిత దేశంగా, మన కనుసన్నల్లో నడిచే దేశంగా వుండే నేపాల్‌ క్రమేపీ దూరమవుతున్న సంగతిని మన పాలకులు సకాలంలో పట్టించుకోలేదు. 1997లో అప్పటి ప్రధాని ఇందర్‌ కుమార్‌ గుజ్రాల్‌ ఆ దేశంలో పర్యటించాక 2014లో నరేంద్ర మోదీ ప్రధాని అయ్యేవరకూ మన ప్రధానులెవరూ ఆ దేశం వెళ్లలేదంటే ఆశ్చర్యం కలుగుతుంది. 1987లో ఆ దేశంతో ఒక ఒప్పందం కుదిరింది. ఇండో–నేపాల్‌ కమిషన్‌ ఏర్పాటు చేసుకోవాలని, ప్రతి రెండేళ్లకూ అది సమావేశమవుతూ పరస్పర ప్రయోజనాలకు తోడ్పడేవిధంగా నిర్ణయాలు తీసుకోవాలని ఆ ఒప్పందం సారాంశం.

కానీ 2014 వరకూ మన దేశం దాని జోలికే పోలేదు. నరేంద్ర మోదీ వచ్చాకైనా ఆ దేశంతో సంబంధాలు పెద్దగా మెరుగుపడలేదు. రెండేళ్లక్రితం శర్మ ఓలి ప్రధాని అయ్యాక తొలి విదేశీ పర్యటన కోసం మన దేశాన్నే ఎంచుకున్నారు. వివిధ రంగాల్లో ఒప్పందాలు కుదుర్చుకున్నారు. అది చిన్న దేశమే కావొచ్చు...దానితో కుదుర్చుకోదగ్గ భారీ వాణిజ్య ఒప్పందాలు వుండకపోవచ్చు. కానీ దానికీ, మనకీ పొరుగునున్న చైనాతో మనకు అనేకానేక సమస్యలున్నాయి. దాన్ని దృష్టిలో పెట్టుకుని నేపాల్‌ విషయంలో మన దేశం చొరవ ప్రదర్శించివుంటే బాగుండేది. తాజా వివాదంలో నేపాల్‌ వాదన సరికాదని మన దేశం ఇప్పటికే జవాబిచ్చింది. ఈ వివాదం ముదర
కుండా చూడటం, సామరస్యపూర్వక పరిష్కారాన్ని సాధించడానికి ప్రయత్నించడం అన్నివిధాలా శ్రేయస్కరం.

మరిన్ని వార్తలు