భవిష్యత్‌కు ‘భరోసా’

1 Sep, 2015 23:41 IST|Sakshi

ఒక సుదీర్ఘ నిరీక్షణ ముగిసింది. చేజారిందనుకున్న ప్రాభవం మళ్లీ మన వశమైంది. శ్రీలంక గడ్డపై 22 ఏళ్ల తర్వాత భారత జట్టు టెస్టు సిరీస్ గెలిచింది. చివరిసారిగా 1993లో అజహరుద్దీన్ నేతృత్వంలో భారత జట్టు 1-0తో సిరీస్ గెలిచింది. ఆ తర్వాత సచిన్, ద్రవిడ్, లక్ష్మణ్, గంగూలీ లాంటి హేమాహేమీలంతా ఆ గడ్డపై సిరీస్ విజ యాన్ని అందుకోలేకపోయారు. ఈసారి ఆశ్చర్యకరంగా కొత్త కుర్రాళ్లతో నిండిన యువ భారత్ దాన్ని సాధించగలిగింది. గత నాలుగేళ్లుగా దిగ్గజాలు ఒక్కొక్కరూ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు చెబుతుండటంతో భారత క్రికెట్ సంధికాలంలో సాగింది. వారి స్థానంలో వచ్చిన యువ ఆటగాళ్లు ఇంకా పూర్తిగా కుదురుకోలేదు. కనుకే స్వదేశంలో టెస్టులు గెలవడమే కష్టంగా మారింది. ఇక విదేశాల్లో టెస్టు సిరీస్ విజయం గురించి చెప్పేదేముంది? ఈ లోటును కూడా కోహ్లి సారథ్యంలోని యువ భారత్ తీర్చింది.

 దిగ్గజాలు రిటైరైన తర్వాత కూడా వన్డేల్లో భారత జట్టు నిలకడగానే ఆడుతోంది. ధోని ఇంకా ఆ ఫార్మాట్‌లో కొనసాగుతూ ఉండటంతో పాటు కోహ్లి, రోహిత్ శర్మ లాంటి వాళ్లకు నాలుగేళ్లకు పైగా అనుభవం ఉండటంతో వన్డేలలో సీనియర్లు లేని లోటు తెలియలేదు. కానీ టెస్టు క్రికెట్‌లో మాత్రం ఇన్నాళ్లూ ఆ లోటు కనిపించింది. శ్రీలంకతో సిరీస్ ద్వారా ఆ లోటు పూర్తిగా తీరకపోయినా కొంతమేరకు భారత క్రికెట్‌లో ప్రత్యామ్నాయాలు కనిపించాయి. లోకేశ్ రాహుల్, శిఖర్ ధావన్, మురళీ విజయ్‌ల రూపంలో ముగ్గురు ఓపెనర్లు ఈ సిరీస్‌లో రాణించారు. గాయాల కారణంగా ధావన్, విజయ్ ఒక్కో టెస్టుకే పరిమితమైనా భారత్‌కు ఓపెనర్ లేని లోటు తెలియకుండా పుజారా మూడో టెస్టులో అద్భుతంగా ఆడాడు. రహానే, కోహ్లి కూడా సెంచరీలతో తమ విలువను పెంచుకున్నారు. రోహిత్ శర్మ విషయంలో విమర్శలు ఎదురైనా అతని బ్యాటింగ్ ఆర్డర్‌ను మార్చి లోయర్ ఆర్డర్‌లో ఆడించి ఫలితాన్ని పొందారు. కాబట్టి మొత్తం మీద భారత బ్యాటింగ్ లైనప్‌లో ఉన్న చిన్న చిన్న లోపాలు బయటపడ్డా... వాటిని అధిగమించే సత్తా కూడా ఈ యువ జట్టులో ఉందనే సందేశం ఈ సిరీస్ ద్వారా వచ్చింది.
 ఇక ఈ సిరీస్‌ను భారత్‌కు అందించింది మాత్రం బౌలర్లే. మూడు టెస్టుల్లోనూ  మూడు రకాల పిచ్‌లు ఎదురయ్యాయి. గాలెలో స్పిన్, సారా ఓవల్‌లో స్వింగ్, సింహళీస్ క్లబ్‌లో బౌన్స్ ఉన్న వికెట్లు భారత బౌలర్లకు పరీక్ష పెట్టాయి. దీనికి తగ్గ ట్టుగా మనవాళ్లు స్పందించారు. ఇషాంత్ శర్మ భారత పేస్ బౌలింగ్ లీడర్‌గా ఎది గాడు. అతను ముందుండి లంక టాపార్డర్ వెన్నువిరిచాడు. ప్రస్తుతం భారత్‌లో ఫాస్ట్ బౌలర్లలో అందరికంటే ఎక్కువగా వేగాన్ని నమ్ముకుంది ఉమేశ్ యాదవ్. పూర్తి స్థాయిలో అతను ఆకట్టుకోలేకపోయినా ఇషాంత్‌కు కావలసిన సహకారం అందిం చాడు. ఇక స్పిన్నర్ అశ్విన్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. భారత క్రికెట్ భవి ష్యత్ ఇక అశ్విన్‌పై ఆధారపడి ఉందనడ ం ఏ మాత్రం అతిశయోక్తి కాదు. వెటరన్ అమిత్ మిశ్రా కూడా తన ఎంపికకు న్యాయం చేశాడు. బౌలింగ్ బాగా చేయగల ఆల్ రౌండర్ ఒకరు జట్టులో ఉంటే టెస్టు విజయాలు సాధించడం సులభం అనే సంకేతం కూడా ఈ సిరీస్ ద్వారా వచ్చింది. స్టువర్ట్ బిన్నీ ఈ పాత్రలో విశేషంగా రాణించక పోయినా.. ప్రస్తుతం ఎవరూ లేనిచోట తనే గొప్ప ఆయుధంలా కనిపిస్తున్నాడు. అయితే సమీప భవిష్యత్తులో భారత్‌కు మంచి ఆల్‌రౌండర్ కచ్చితంగా కావాలి.

 ఇక కెప్టెన్‌గా కోహ్లికి ఇది మరచిపోలేని సిరీస్. ఈ ఏడాది ఆరంభంలో ఆస్ట్రేలియాలో తొలిసారి పూర్తి స్థాయి కెప్టెన్‌గా అతను బాధ్యతలు తీసుకున్నాడు. ఆ తర్వాత బంగ్లాదేశ్‌లోనూ ఓ టెస్టు ఆడాడు. కానీ ఇవేవీ తనని పూర్తిగా అంచనా వేసేందుకు పనికి రాలేదు. తొలిసారి కోహ్లి పూర్తి స్థాయిలో మూడు టెస్టుల సిరీస్ శ్రీలంకలో ఆడాడు. టెస్టు మ్యాచ్ గెలవాలంటే 20 వికెట్లు తీసే బౌలర్లు జట్టులో ఉండాలి. ఇది జగమెరిగిన సత్యం. ఐదుగురు బౌలర్లు ఉంటే 20 వికెట్లు తీయడం సులభమవుతంది. అయితే గతంలో ఏ భారత కెప్టెన్ కూడా ఎప్పుడూ ఐదుగురు బౌలర్ల సిద్ధాంతాన్ని ఎంచుకోలేదు. అడపాదడపా పిచ్ స్వభావాన్ని బట్టి ఐదుగురు బౌలర్లను ఆడినా సిసలైన ఆల్‌రౌండర్ లేకపోవడం వల్ల నలుగురు బౌలర్ల సిద్ధాంతాన్నే అనుసరించారు. కానీ కోహ్లి మాత్రం దీనికి భిన్నంగా వెళ్లాలనుకున్నాడు. ఐదుగురు బౌలర్లతోనే వెళతానంటూ దీనిపై విమర్శలు వచ్చినా వెరువకుండా తన నిర్ణయానికి కట్టుబడ్డాడు. ఒక రకంగా ఈ సిద్ధాంతం ఈసారి మంచి ఫలితాన్నిచ్చింది. కెప్టెన్‌గా తొలి సిరీస్ విజయం ఎవరికైనా గొప్ప సంతోషాన్నిస్తుంది. అందులోనూ ఎంతోమంది గొప్ప కెప్టెన్లు సాధించలేకపోయిన ఘనతను కోహ్లి సొంతం చేసుకున్నాడు. కాబట్టి కోహ్లి కూడా కచ్చితంగా ఇప్పుడు గాల్లో తేలుతూనే ఉంటాడు. అయితే కెప్టెన్‌గా మారాక తన వైఖరి కాస్త మొండిగా తయారయింది. దీనిని కొంత తగ్గించుకుని పట్టువిడుపుల ధోరణిని అలవాటు చేసుకోవాలి. ఎందుకంటే ఎంత గొప్ప ఫార్ములా అయినా కొన్ని సందర్భాల్లో పనికిరాదు.

 భారత్ సిరీస్ విజయం సాధించడం గొప్ప విషయమే. అయితే ఇదే సమయంలో ప్రత్యర్థిని కూడా గమనించాలి. గత రెండు దశాబ్దాలలో ఇంత బలహీనంగా శ్రీలంక జట్టు ఎప్పుడూ లేదు. అర్జున రణతుంగ, అరవింద డిసిల్వా, జయసూర్య, చమిందా వాస్, మురళీధరన్, మహేల జయవర్ధనే, కుమార సంగక్కర ఇలా ఎంతోమంది దిగ్గజాలు ఆ దేశ క్రికెట్ స్థాయిని పెంచారు. వీళ్లవల్లే రెండు దశాబ్దాలకు పైగా భారత్ జట్టు శ్రీలంకలో గెలవలేకపోయిందనేది కఠోరసత్యం. ఈ దిగ్గజాలెవరూ ఇప్పుడు ఆడటం లేదు. సంగక్కర కూడా ఈ సిరీస్‌లో రెండో టెస్టుతో పూర్తిగా అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు చెప్పాడు. శ్రీలంక జట్టులోనూ చాలా మంది కొత్త క్రికెటర్లు. ఏమాత్రం అనుభవం లేదు. అందుకే చాలా బలహీనంగా ఆ జట్టు కనిపిస్తోంది. ఇటు భారత జట్టులోని క్రికెటర్లు కూడా కొత్తవాళ్లే అయినా... లంక జట్టు కోహ్లి సేనతో పోలిస్తే బాగా బలహీనంగా ఉందనేది కూడా వాస్తవం. అయితే ఎలాంటి జట్టుపై గెలిచినా గెలుపు గెలుపే. నాలుగు టెస్టుల సిరీస్ ఆడేందుకు వచ్చే నెలలో భారత్ వస్తున్న దక్షిణాఫ్రికా జట్టుతో తలపడినప్పుడు ఇప్పటి విజయం బలుపా లేక వాపా అనే సంగతి తేలుతుంది. గతంలో స్పిన్ బలంతో భారత్ పైచేయి సాధించినా... ప్రస్తుతం సఫారీ జట్టు చాలా బలంగా ఉంది. ఆ సిరీస్ ముగిస్తే గానీ కోహ్లి అండ్ కో సత్తా ఏమిటనేది పూర్తిగా తేలదు. ఏమైనా ప్రస్తుత విజయంతో భవిష్యత్‌పై ఎంతో కొంత భరోసా వచ్చిందని మాత్రం చెప్పవచ్చు.
 

>
మరిన్ని వార్తలు